పుష్కరం.. ముహూర్తమే అయోమయం
రాజమండ్రి: గోదావరి పుష్కరాలు ఎప్పుడు ప్రారంభం అనే దానిపై వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వం ఒక ముహుర్తం ఆమోదించి ఏర్పాట్లు చేస్తుండగా...ఇద్దరు ప్రముఖ సిద్ధాంతులు వేర్వేరు ముహుర్తాలు నిర్ణయించడం విశేషం. ఈ మూడు ముహుర్తాలతో భక్తులలో అయోమయం నెలకొంది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతుల ముహూర్తం ప్రకారం పుష్కరాలు జూలై 14న ప్రారంభమవుతాయి. ప్రభుత్వం దీన్నే ఖరారు చేసి సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక రైళ్లు, బస్సులు అందుకు తగ్గట్టే నడపనున్నారు.
కాగా, రాజమండ్రికి చెందిన ప్రముఖ జ్యోతిష పండితులు, మహామహోపాధ్యాయ మధుర కృష్ణమూర్తిశాస్త్రి ఆదివారం ఉదయం 8.27 గంటలకు పుష్కరాలు ప్రారంభమయ్యాయని ప్రకటించారు. తొలి పంచాంగ సిద్ధాంతకర్త వరాహమిహిరుడి లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటే.. తాను చెప్పిన ముహూర్తానికే గురుడు సింహరాశిలోకి ప్రవేశించాడని, గోదావరి పుష్కరాలు ఆరంభమయ్యాయని అంటూ మధుర తన కుటుంబ సభ్యులతో రాజమండ్రి పుష్కరఘాట్‌లో ఆదివారం పుష్కర స్నానం ఆచరించారు.
వీరితో పాటు అక్షరకోటి గాయత్రీపీఠం వ్యవస్థాపకుడు సవితాల చక్రభాస్కరరావు, గాయత్రీ ప్రజ్ఞాపీఠం వ్యవస్థాపకుడు ద్రాక్షారపు రాధాకృష్ణమూర్తి, డాక్టర బిక్కిన రాంమనోహర్ తదితర ప్రముఖులు కూడా పుష్కర స్నానం చేశారు. ఇలాఉండగా...రాజమండ్రికి చెందిన శ్రీశైలం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ జూలై ఏడు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయంటున్నారు. సూర్య సిద్ధాంతం ఆధారంగా తాను ఈ ముహూర్త నిర్ణయం చేశానంటున్నారు. పుష్కర ప్రారంభంపై ఇలా భిన్న వాదనలు చేస్తూ, ఎవరి లెక్కలు వారు చెపుతూ ముహూర్తాలు పెట్టడంతో గోదావరి పుష్కరాలు ప్రారంభమెప్పుడు అన్నదానిపై అయోమయం నెలకొంది.
హెలికాప్టర్ సర్వీసులకు రెడీ
గోపాలపట్నం (విశాఖపట్నం): గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ప్రత్యేక బస్సులు, రైళ్లు ప్రకటించగా హెలికాప్టర్లూ అందుబాటులోకి రానున్నాయి. పవన్‌హన్స్ సంస్థ రాజమండ్రికి హెలికాప్టర్లను నడిపేందుకు సిద్ధమవుతోంది. దీనికి ఇప్పటికే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. రాజమండ్రి విమానాశ్రయం నుంచి విశాఖ విమానాశ్రయానికి, అలాగే రాజమండ్రి నుంచి విజయవాడ విమానాశ్రయానికి హెలికాప్టర్ సర్వీసులు అందించబోతున్నారు. జులై14 నుంచి 25 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికార వర్గాల భోగట్టా. వీటి చార్జీలు ఖరారు కావలసి ఉంది. రాజమండ్రికి వివిధ విమానాశ్రయాల నుంచి విమానాలు కూడా పుష్కర ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
‘అందాల గోదావరి’ ఫొటోల ఎంట్రీలకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల సందర్భంగా రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించేందుకు ‘అందాల గోదావరి’ ఫొటో ఎంట్రీలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈనెల తొమ్మిదో తేదీలోగా ట్విట్టర్ లేదా ప్రభుత్వ ప్రత్యేక వెబ్‌సైట్‌కు ఫోటోలను ఆప్‌లోడ్ చేయాలని కోరింది. ఎంపికైన ఫోటోలను ఎగ్జిన్‌బిషన్‌లో ఉంచుతారు.
ఆరుజిల్లాల్లో ‘సత్యసాయి’ సంస్థల సేవలు
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : వచ్చే నెల 14 నుంచి 25 వరకు జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణ లో నాలుగు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు జిల్లాల్లో సేవలు అందించనున్నట్టు శ్రీసత్యసాయి సేవాసంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌జీ చలం చెప్పారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఖండకుర్తి, ఆదిలాబాద్ జిల్లా బాసర, ఖమ్మం జిల్లా భద్రాచలం, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, ధర్మపురితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో సేవలందిస్తామన్నారు. పుష్కరాలు జరిగే కేంద్రాల్లో నిత్యం 4 వేల మంది సేవాదళ్ సభ్యులు పుష్కర ఘాట్‌లలో భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరచడం, మంచినీరు, పాలు, అన్నప్రసాదం పంపిణీ వంటి సేవలను అందిస్తారన్నారు.