
వినాయక చవితి పండుగ వేడుక ముగించుకొని, బై..బై. గణేశా అంటూ గణనాథుని నిమజ్జన కార్యక్రమం అలా ముగిసిందో లేదో మరో పండుగు సందడి మొదలైంది. అదే సరదాల దసరా పండుగ. దేశవ్యాప్తంగా దసరా పండుగను ఉత్సాహంగా జరుపుకోవడానికి రెడీ అయిపోతున్నారు. మరి ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజు వచ్చిందో తెలుసా? ముహూర్తం ఎపుడు? తెలుసుకుందాం రండి.
దసరా పండుగ, శుభ సమయం
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతీ ఏడాది దసరా పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అశ్వినీ మాసంలోని శుక్ల పక్షం, దశమి రోజున అక్టోబరు 12న విజయ దశమి వచ్చింది. 2వ తేదీనుంచి శరన్నవరాత్రులు ఆరంభం కానున్నాయి. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గా భవాని మహిషాసురుడిని సంహరించి ప్రజలకు శాంతిని చేకూర్చింది. అందుకే ఇది విజయదశమి అయిందని పెద్దలు చెబుతారు.
అలాగే శ్రీరామడు రావణుడిని తుదముట్టించడం ద్వారా అధర్మంపై ధర్మం గెలిచిన రోజు కనుక విజయ దశమి అయిందని మరో కథనంలో చెబుతారు. విజయదశమి నాడు రావణ దహనం చేసి సంబరాలు చేసుకుంటారు. దశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజు పాలపిట్ట కనిపిస్తే శుభసూచికంగా భావిస్తారు.
పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని, శమీ వృక్షంలో దాచిపెట్టిన ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న రోజుగా కూడా చెబుతారు. ఈ క్రమంలో జమ్మి చెట్టుకు పూజలు కూడా నిర్వహిస్తారు. దుర్గమ్మ ఎదుట జమ్మి చెట్టును పూజించి ఆ జమ్మి ఆకులను ఇంటికి తీసుకువెళ్లి అందరికీ పంచిపెట్టి అలాయ్ బలాయ్ తీసుకుంటారు. ఇంటి ఆడపడుచులకు కూడా ప్రేమగా పంచుతారు.
ముహూర్తం: గణేష్ చతుర్థి తరువాత అంతే ఉత్సాంగా నవరాత్రులు వేడుక చేసుకునేపండుగ దసరా పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రుల్లో వివిధ రూపాల్లో అత్యంత భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. పంచాంగం ప్రకారం, ఈ ఏడాది అశ్వినీ మాసం శుక్ల పక్ష తిథి అక్టోబర్ 12 వ తేదీన ఉదయం 10.58 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 13 వ తేదీన ఉదయం 9:08 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం పూజ సమయం మధ్యాహ్నం 1:17 నుండి 3:35 వరకు ఉండనుంది.