
అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ శ్రీరామ నవమి. ఈ రోజున శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం వేడుకలను ఉత్సాహంగా జరుపు కుంటారు. శ్రీరామనవమి అనగానే ముందుగా గుర్తొచ్చేవి చలిమిడి, వడపప్పు పానకం. వేడిని తగ్గించి, శరీరానికి చలువనిచ్చే ఆరోగ్యకరమైన వంటకాలతోపాటు, చక్కెర పొంగలి, పాయసం లాటివాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రత్యేక నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మండువేసవిలో వచ్చే పండుగ శ్రీరామనవమి ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వలన శరీరంలో ఉండే ఖనిజాలు (పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం) చెమట రూపంలో బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. బెల్లం పానకం తాగడం వలన తిరిగి ఈ ఖనిజాలను పొందవచ్చు. ఎండ తాపాన్ని తట్టుకునే శక్తిని బెల్లంలో ఉండే ఇనుము ఇస్తుంది. అంతేకాదు, వేసవిలో తగ్గుతూ పెరుగుతూ ఉండే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. అలాగే పెసరపప్ప కూడా శరీరానికి చలువనిస్తుంది.
చలిమిడి
కావాల్సినవి: బియ్యం, బెల్లం, కొబ్బరి తురుము, యాలకులు, నెయ్యి
తయారీ: నానబెట్టిన ఉంచుకున్న తడి బియ్యాన్ని వడగట్టుకుని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. బియ్యపిండిని ఒక గిన్నెలో తీసుకుని పచ్చికొబ్బరి తురుము, చక్కర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నెయ్యి, పాలు పోసి ముద్దలా కలపాలి. అంతే చలిమిడి రెడీ.
వడపప్పు
కావలసినవి: పెసరపప్పు – కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు– పది
తయారి: పెసరపప్పును కడిగి పప్పు మునిగేటట్లు నీటిని పోసి నాననివ్వాలి. రెండు గంటల పాటు నానిన తర్వాత నీటిని వడపోసి కొబ్బరి పలుకులు కలపాలి. దేవుడికి నైవేద్యంగా పెట్టే వడపప్పును ఇలాగే చేయాలి. రుచికోసం నానిన పెసరపప్పులో అరకప్పు మామిడి తురుము, చిటికెడు ఉప్పు కలిపిపోపు పెట్టుకోవచ్చు.
పానకం
కావలసినవి: బెల్లం – 100 గ్రా, మిరియాలు – పది ( పొడి చేయాలి), ఏలకులు - ఆరు (పొడిచేయాలి)
తయారి: బెల్లంలో ఒక గ్లాసు నీటినిపోసి కరగనివ్వాలి. ఒక గంట తర్వాత బెల్లం నీటిని పలుచని తెల్లని వస్త్రంతో వడపోయాలి. వడపోసిన బెల్లం నీటిలో మిరియాల పొడి, ఏలకుల పొడి కలిపితే పానకం రెడీ.
చక్కెర పొంగలి
కావలసినవి: బియ్యం -కప్పు, శనగపప్పు -గుప్పెడు, పాలు-మూడు కప్పులు, చక్కెర - ఒకటిన్నర కప్పు, ఏలకులు -పది, (పొడి చేయాలి), జీడిపప్పు, కిస్‌మిస్– ఒక్కొక్కటి పది, నెయ్యి-మూడు టీ స్పూన్లు
తయారి: ముందుగా బాణలిలో నెయ్యివేసి, జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి పక్కన ఉంచాలి. బియ్యం, శనగ పప్పు కడిగి అందులో పాలుపోసి, జీడిపప్పు వేయించగా మిగిలిన నేతిని కూడా బియ్యం -పాలలో వేసి ప్రెషర్ కుకర్‌లో ఉడికించాలి. కుకర్‌లో ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి పాయసం మిశ్రమంలో చక్కెర, ఏలకుల పొడి వేసి, చక్కెర కరిగే వరకు కలిపి జీడిపప్పు, కిస్‌మిస్‌తో గార్నిష్ చేసి మూత పెట్టాలి. పది నిమిషాలకు అన్నానికి తీపి బాగా పట్టి రుచిగా ఉంటుంది.