దీపాల పండుగ దీపావళి (Diwali 2024) కోసం ఉత్సాహంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా పిల్లా పాపా అంతా ఎదురు చూస్తున్నారు. దీపావళి దీప కాంతులు, బాణాసంచా వెలుగులతో పాటు, స్వీట్ల సందడి కూడా ఉంటుంది.మరి ఈ క్రమంలో టేస్టీగా, ఈజీగా, హెల్దీగా చేసుకునే రెండు హల్వాల గురించి తెలుసుకుందాం. ఒకటి మూంగ్ హల్వా, రెండు క్యారెట్–ఖర్జూరం హల్వా. మరి వీటికి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగో..ఇలా..!
మూంగ్ హల్వా
కావల్సిన పదార్థాలు
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
చాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి)
నీళ్లు – రెండు కప్పులు
నెయ్యి – అరకప్పు
గోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లు
పంచదార – ముప్పావు కప్పు
ఫుడ్ కలర్ – చిటికెడు
యాలకుల పొడి – పావు టీస్పూను
జీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లు
కిస్‌మిస్‌లు – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ
- స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి.
- తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.
- పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి.
- పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి.
- ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి.
- ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి.
స్టవ్‌మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్‌మిస్‌లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ.
క్యారెట్–ఖర్జూరం హల్వా
కావల్సిన పదార్థాలు
ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి)
క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులు
కొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి,
పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్
కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి)
తయారీ
- ముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్‌లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి.
- కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి.
- ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి.
- ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment