శ్రీరామ నవమి అనంగానే తాటాకు పందిళ్లు రాములోరి కళ్యాణ ఘట్టం. కొన్ని గ్రామాల్లో అయితే తిరునాళ్లు కూడా చేసుకుంటారు. ఈ రోజు కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిగిన వెంటనే పానకం, వడపప్పు పంచి పెడతారు. ఈ ప్రసాదాన్ని ఎవ్వరు మిస్ చేసుకోరు. ఆ టైం కల్లా వచ్చి ప్రసాదం అందుకుంటారు. వీధివీధుల్లో ఈ తంతు, కోలాహాలం కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీరామునికి నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం, వడపప్పు ప్రత్యేకమైనవి. ఎందుకు శ్రీరామనవమి రోజు పానకం ఇస్తారు? వడపప్పును నైవేద్యంగా నివేదిస్తారు? అంటే..
అందుకు ఆధ్యాత్మిక, శాస్త్రీయ దృక్కోణాలు రెండూ ఉన్నాయని పలువురు పండితులు చెబుతున్నారు. శ్రీరామచంద్రమూర్తికి బెల్లమన్నా, పానకం అన్నా ఇష్టమని, శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు . అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట. ఇక ఈ క్రమంలోనే స్వయంవరానికి వెళ్లిన శ్రీరామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే పానకాన్ని శ్రీరాముడి వారసత్వంగా స్వీకరించి ఆయనకు పానకంతో నివేదన చేస్తారు. ఆపై ప్రసాదంగా అందరికీ పంచుతారు.
ఆరోగ్య ప్రయోజనాలు..
ఇక శాస్త్రీయ కోణంలో చూసినట్లయితే ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనికి వస్తుంది. కాబట్టి బెల్లం పానకాన్ని స్వామి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచి పెడతారు. అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం మనలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది.
ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేగాదు రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియనూ వృద్ధి చేస్తుంది. ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పిబరే రామరసం! రామనామం పాలుమీగడలు, పంచదారతేనెల కంటే కూడా కడు తీయని రసం! నవమి వేడుకల నైవేద్యమైన పానకం కూడా రామనామమంత మధురంగా ఉంటుంది. ఇక వడపప్పు రుచి మనకు తెలిసిందే! ఈ రెండు నైవేద్యాలకూ అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment