నేటితో ముగియనున్న దసరా ఉత్సవాలు
పెరుగుతున్న భవానీ భక్తులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చివరి దశకు చేరాయి. తొమ్మిదోరోజు శుక్రవారం మహిషాసురమర్ధని రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక ఈ ఉత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగియనున్నాయి. ఈ ఏడాది ఉత్సవాల్లో మూలానక్షత్రం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది.
ముందస్తు అంచనాలకు అనుగుణంగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేసినప్పటికీ గత ఏడాదితో పోల్చుకుంటే భక్తుల సంఖ్య తగ్గింది. ఇప్పటికి దాదాపు 7 లక్షల నుంచి 7.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మహర్నవమి సందర్భంగా తరలి వచ్చిన భక్తులు నగరోత్సవంలో అమ్మవారిని దర్శించుకుని తరించారు.
పట్టువ్రస్తాలు సమర్పించిన టీటీడీ
కనకదుర్గమ్మకు టీటీడీ తరఫున శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ అధికారులకు, దుర్గమ్మ దేవస్థానం ఈవో కేఎస్ రామారావు, సిబ్బంది, అర్చకులు స్వాగతం పలికారు. మేళతాళాలతో సంప్రదాయ బద్ధంగా అమ్మవారి అంతరాలయానికి తోడ్కొని వెళ్లారు. మహిషాసురమర్థిని అలంకారంలో ఉన్న దుర్గమ్మకు పట్టు వ్రస్తాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ అధికారులకు ఈవో రామారావు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదం అందజేశారు.
నేడు తెప్పోత్సవం
దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయదశమి రోజు కనకదుర్గాదేవికి కృష్ణానదిలోని దుర్గాఘాట్‌లో సాయంత్రం 5 గంటలకు శ్రీగంగా, దుర్గ అమ్మవార్ల సమేత మల్లేశ్వరస్వామి తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కమనీయ దృశ్యాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా గుర్తించిన పది ప్రాంతాల్లో ఎల్‌ఈడీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చివరిరోజు అమ్మవారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment