రక్తమోడిన దేవరగట్టు | 95 injured in violent clashes during Banni Utsav in Andhra Kurnool | Sakshi
Sakshi News home page

రక్తమోడిన దేవరగట్టు

Published Mon, Oct 14 2024 5:58 AM | Last Updated on Mon, Oct 14 2024 5:58 AM

95 injured in violent clashes during Banni Utsav in Andhra Kurnool

కర్రల సమరంలో 95 మందికి గాయాలు 

20 మంది పరిస్థితి విషమం

హొళగుంద: మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో ఈ ఏడాది కూడా రక్తం చిమ్మింది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో విజయదశమి సందర్భంగా శనివారం అర్ధరాత్రి తర్వాత మొదలైన బన్ని ఉత్సవంలో సంప్రదాయ ఆచారమే గెలిచింది. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం విజయోత్సవంలో భాగంగా ఉత్కంఠ భరితంగా జరిగిన జైత్రయాత్ర (కర్రల సమరం)లో 95 మందికి గాయాలు కాగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

తలలు పగిలి, దివిటీలు తగిలి, కిందపడి చేతులు విరిగి.. ఇతర గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న వారికి స్థానిక హెల్త్‌ క్యాంప్‌లో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆదోని, ఆలూరు, గుంతకల్లు, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన వారికి హెల్త్‌ క్యాంప్‌లో  చికిత్స అందించారు. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర ఆదివారం ఉదయం వరకు సాగింది. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట భక్తులు డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి దివిటీలతో అర్ధరాత్రి 12.20 గంటలకు కొండపై ఉన్న స్వామివారి ఆలయానికి చేరుకున్నారు.  

కళ్యాణోత్సవం అనంతరం.. 
ఒంటి గంట వరకు నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకిని ఊరేగింపుగా కొండ దిగువకు వచ్చి మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టింపచేశారు. ఆ సమయంలో వారితో పాటు నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల చేతుల్లో ఉన్న రింగు కర్రలు తగిలి చాలామంది గాయపడ్డారు.

తలలు పగిలాయి. మొగలాయి ఆడుతున్న కొందరు కాగడాలతో దారి చేసుకుంటూ ముందుకు సాగారు. కొందరు అగ్గి కాగడాలను భక్తులపై విసిరి భయాందోళనకు గురి చేశారు. అనంతరం అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ముళ్లబండ, పదాలగట్టు, రక్షనడి, శమీ వృక్షం, బసవన్న గుడి మీదుగా ఉత్కంఠంగా ముందుకు సాగింది. స్వామి విగ్రహాలు సింహాసన కట్టకు చేర్చి జైత్రయాత్రను విజయవంతం చేసి భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ ఆధ్వర్యంలో ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరధ్వాజ, పత్తికొండ  ఆర్డీఓ భరత్‌నాయక్‌ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు. సోమవారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది. 

ఉత్సవానికి వస్తూ ముగ్గురు దుర్మరణం 
ఆలూరు రూరల్‌: బన్ని ఉత్సవాలను తిలకించేందుకు బైక్‌పై వస్తుండగా బైక్‌ అదుపు తప్పడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా మోకా తాలూకా తగ్గిన బూదేహళ్లి గ్రామానికి చెందిన హరీ‹Ùరెడ్డి (26), మల్లికార్జున (26), రవి (22) శనివారం బైక్‌పై దేవరగట్టుకు బయలుదేరారు. ఆలూరు మండలం కరిడిగుడ్డం సమీపంలో రాత్రి 10 గంటలకు బైక్‌ అదుపుతప్పి ముగ్గురూ కింద­పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆలూ­రు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. హరీ‹Ùరెడ్డి, మల్లికార్జున అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రవి (22)ని మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement