malleswara swamy
-
రక్తమోడిన దేవరగట్టు
హొళగుంద: మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో ఈ ఏడాది కూడా రక్తం చిమ్మింది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో విజయదశమి సందర్భంగా శనివారం అర్ధరాత్రి తర్వాత మొదలైన బన్ని ఉత్సవంలో సంప్రదాయ ఆచారమే గెలిచింది. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం విజయోత్సవంలో భాగంగా ఉత్కంఠ భరితంగా జరిగిన జైత్రయాత్ర (కర్రల సమరం)లో 95 మందికి గాయాలు కాగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తలలు పగిలి, దివిటీలు తగిలి, కిందపడి చేతులు విరిగి.. ఇతర గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న వారికి స్థానిక హెల్త్ క్యాంప్‌లో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆదోని, ఆలూరు, గుంతకల్లు, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన వారికి హెల్త్ క్యాంప్‌లో చికిత్స అందించారు. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర ఆదివారం ఉదయం వరకు సాగింది. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట భక్తులు డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి దివిటీలతో అర్ధరాత్రి 12.20 గంటలకు కొండపై ఉన్న స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం.. ఒంటి గంట వరకు నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకిని ఊరేగింపుగా కొండ దిగువకు వచ్చి మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టింపచేశారు. ఆ సమయంలో వారితో పాటు నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల చేతుల్లో ఉన్న రింగు కర్రలు తగిలి చాలామంది గాయపడ్డారు.తలలు పగిలాయి. మొగలాయి ఆడుతున్న కొందరు కాగడాలతో దారి చేసుకుంటూ ముందుకు సాగారు. కొందరు అగ్గి కాగడాలను భక్తులపై విసిరి భయాందోళనకు గురి చేశారు. అనంతరం అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ముళ్లబండ, పదాలగట్టు, రక్షనడి, శమీ వృక్షం, బసవన్న గుడి మీదుగా ఉత్కంఠంగా ముందుకు సాగింది. స్వామి విగ్రహాలు సింహాసన కట్టకు చేర్చి జైత్రయాత్రను విజయవంతం చేసి భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరధ్వాజ, పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు. సోమవారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది. ఉత్సవానికి వస్తూ ముగ్గురు దుర్మరణం ఆలూరు రూరల్: బన్ని ఉత్సవాలను తిలకించేందుకు బైక్‌పై వస్తుండగా బైక్ అదుపు తప్పడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా మోకా తాలూకా తగ్గిన బూదేహళ్లి గ్రామానికి చెందిన హరీ‹Ùరెడ్డి (26), మల్లికార్జున (26), రవి (22) శనివారం బైక్‌పై దేవరగట్టుకు బయలుదేరారు. ఆలూరు మండలం కరిడిగుడ్డం సమీపంలో రాత్రి 10 గంటలకు బైక్ అదుపుతప్పి ముగ్గురూ కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. హరీ‹Ùరెడ్డి, మల్లికార్జున అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రవి (22)ని మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. -
‘దేవరగట్టు’ రక్తసిక్తం
హొళగుంద/ఆలూరు రూరల్ (కర్నూలు): దేవరగట్టు రక్తసిక్తమయ్యింది. ఎప్పటిలానే సంప్రదాయం పైచేయి సాధించింది. కర్రలు కరాళనృత్యం చేయగా, 84 మందికి పైగా గాయపడ్డారు. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు ఓ చెట్టుపైకి ఎక్కిన భక్తుల్లో కొమ్మ విరిగిపడడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన కర్రలు, అగ్గి కాగడాలు, దివిటీలతో కొండ పైకి చేరిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల విగ్రహాలతో పాటు పల్లకీని మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టించారు. అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ఆద్యంతం ఒళ్లు జలదరించేలా ఉత్కంఠంగా సాగింది. చెట్టు కొమ్మ విరిగిపడి ముగ్గురు మృతి.. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు సత్యనారాయణ కట్టపై ఉన్న రావి చెట్టుపై కూర్చున్న కొమ్మ విరిగి పడడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆస్పరికి చెందిన మాల గణేష్ (18), బళ్లారి పట్టణం మిల్లార్‌పేటకు చెంది ఓపీడీలో పనిచేస్తున్న ప్రకాష్(30), ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాలకు చెందిన రామాంజనేయులు (45) ఈ ప్రమాదంలో మరణించారు. కర్రల సమరంలో 84 మందికి గాయాలు విజయదశమిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి దేవరగట్టులో జరిగిన బన్ని మహోత్సవంలో ఆదినుంచి వస్తున్న సంప్రదాయమే గెలిచింది. విజయోత్సవంలో భాగంగా జరిగిన జైత్రయాత్రలో గట్టుపై రక్తం చిందింది. ఉత్సవంలో 84 మందికి గాయాలు కాగా అందులో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర బుధవారం తెల్లవారుజాము వరకు జరిగింది. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో అడిషనల్ ఎస్పీతో పాటు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దేవరగట్టులో గురువారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం నిర్వహించనున్నారు. 27న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన, 28న మాళ మల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. -
Vijayawada: హంస వాహనంపై స్వామి వారు జల విహారం (ఫొటోలు)
-
దుర్గాఘాట్‌లో మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తుల తెప్పోత్సవం
విజయవాడ: గంగాపార్వతీ సమేత మిమల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తుల తెప్పోత్సవంలో భాగంగా స్వామి దుర్గాఘాట్‌లోని కృష్ణానదిలో హంసవాహనం జలవిహారం చేస్తున్నారు. మూడు మార్లు ఉత్సవవిగ్రహాలకు జలవిహారం చేయించనున్నారు. దుర్గాఘాట్ నుంచి ప్రారంభమైన తెప్పోత్సవాన్ని చూడటానికి భక్తులు విశేషంగా హాజరయ్యారు. హంసవాహనం పైనకేవలం 31 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల మధ్య తెప్పోత్సవం జరుగుతోంది. మూడేళ్ల తర్వాత భక్తులకు స్వామివారు నదీవిహారం చూసే భాగ్యాన్ని కల్పించారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో బాణా సంచా సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుర్గాఘాట్‌తో పాటు ప్రకాశం బ్యారేజ్ నుంచి తెప్పోత్సవాన్నిభక్తులు వీక్షించారు. -
దేవరగట్టు.. భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే...!
హొళగుంద: రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్న దసరా బన్ని ఉత్సవానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి పండుగను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం జైత్రయాత్ర కొనసాగనుంది. భక్తులు డిర్ర్..ర్ర్... గోపరక్... బహుపరాక్ అంటూ కర్రల సమరం నిర్వహించనున్నారు. వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రా ష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. ఉత్సవం జరుగుతుందిలా.. దేవరగట్టు పరిసర గ్రామాలు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి వర్గ వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. అనంతరం బాణసంచా పేల్చి కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టుకొని మేళతాళాలతో కాడప్ప మఠానికి చేరుకుంటారు. అక్కడున్న మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో మాతమాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవం జరిపిస్తారు. అనంతరం జెత్రయాత్ర కొనసాగుతుంది. మొగలాయిలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి, పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి చాలా మంది గాయపడ్తారు. గాయపడినవారికి స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. రక్త సంతర్పణ ఉత్సవ విగ్రహాలు రక్షపడికి చేరుకున్నాక.. అక్కడున్న రెండు రాతి గుండ్లకు కంచాభీరా వంశానికి చెందిన గొరువయ్య ఐదు చుక్కల రక్తాన్ని సమర్పిస్తాడు. కాలిపిక్కలో దబ్బణంతో ఒకవైపు నుంచి మరోవైపు లాగడంతో వచ్చే రక్తాన్ని రాతి గుండులకు విసురుతారు. ఉదయంలోపు అక్కడ రక్తపు మరకలు ఉండవని రాక్షసులు సేవిస్తారని భక్తుల నమ్మకం. భవిష్యవాణి శమీ వృక్షం నుంచి విగ్రహాలు బసవన్న గుడికి చేరుకోవడంతో పూజారి, ఆలయ ప్రధాన అర్చకుడు గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. ఆ సమయంలో అందరు ఒక్కసారిగా మొగలాయిని(కర్రలతో కొట్టుకోవడం) నిలిపి వేసి నిశ్శబ్దాన్ని పాటిస్తారు. రాబోయే కాలంలో వాణిజ్య పంటల ధరలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ స్థితులు తదితర పరిస్థితులను పూజారి వివరిస్తారు. అనంతరం పూజారి బహుపరాక్... గోపరాక్ అనగానే విగ్రహాలు సింహాసన కట్ట వైపు ఊరేగింపుగా బయలుదేరుతాయి. ఆ సమయంలో భక్తుల మధ్య జరిగే ఊరేగింపు మరింత భయంకరంగా ఉంటుంది. అప్పుడే చాలామంది భక్తులు గాయాలపాలవుతారు. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. భారీగా పోలీస్ బందోబస్తు బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆదోని, నంద్యాల, కర్నూలు, డోన్ తదితర ప్రాంతాలకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో కలిసి 800 మంది సివిల్ పోలీసులు, ప్రత్యేక బలగాలు, మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అలాగే 200 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించడానికి 120కు పైగా సీసీ, 4 డ్రోన్ కెమెరాలు వినియోగించనున్నారు. పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షంచనున్నారు. ఉత్సవ వివరాలు ► ఈ నెల 5వ తేదీ బుధవారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం ► బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జైత్రయాత్ర మొదలు ► 6వ తేదీ ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిపిస్తారు ► 7వ తేదీ నెరణికి గ్రామ పురోహితులు స్వామి వారికి అర్చనలు చేస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. ► 8న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి. ► 9న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే... పురాతన కాలంలో విష పురుగులు, జంతువుల బారి నుంచి రక్షణ పొందేందుకు దివిటీలు, కట్టెలతో భక్తులు కొండపైకి వెళ్లేవారు. మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు తమ చేతిలో ఉన్న కర్రలతో దేవుడి విగ్రహాలను తాకేందుకు పోటీ పడతారు. ఈ సమయంలో కర్రలు తగులుకుని శబ్దం వస్తుంది. నాటుసారా, మద్యం సేవించిన వారు చేతిలోని కర్రలు స్వాధీనంలో లేకుండా మరొకరికి తగిలి గాయాలవుతాయి. గతంలో కొందరు ఉద్దేశపూర్వకంగా గుంపులో కొట్టుకునేందుకు ప్రయత్నించే వారు. ఇది రక్తపాతానికి కారణమయ్యేది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. సంప్రదాయం ప్రకారం ఉత్సవం జరుపుకుంటున్నారు. 144 సెక్షన్ అమలు దేవరగట్టుతో పాటు పరిసర గ్రామాల్లో ఈ నెల 9వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పోలీసు నిబంధనలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలి. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే 200 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం. – అబ్దుల్‌జహీర్, ఎస్ఐ, హొళగుంద -
ఉగ్రదీప్తి... శరభమూర్తి
ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం చాలా ప్రసిద్ధమైనది.ఇక్కడ స్వామి అమ్మవార్లు ప్రత్యేక దేవస్థానాలలో కొలువు తీరి ఉన్నారు. మల్లేశ్వరస్వామిదేవాలయం విమానగోపురం ప్రాచీన తెలుగు శిల్పకళకు తార్కాణంగా నిలుస్తుంది. ఈ ఆలయ విమానం పడమటి వైపు అద్భుతమైన శిల్పం దర్శనమిస్తుంది. రెండు సింహపు శరీరాలు కంఠం వరకు విడివిడిగా అక్కడి నుండి కలిసి మధ్యలో నడుము నుండి మానవశరీరంతో ఉగ్రమైన సింహముఖంతో, రెండు రెక్కలతో రెండు వైపులా కూర్చున్న రాక్షసులతో మెడలో కపాల(పుర్రె) మాలతో ఆరు చేతులలో ఒక శిల్పం కనిపిస్తుంది. అది ఏ దేవుడి శిల్పం? అక్కడ ఎందుకు ఉంది? అనే ప్రశ్న భక్తుల మనసులో మెదులుతుంది. అది మరెవరి శిల్పమో కాదు. సాక్షాత్తూ శివరూపమే. శివుడు ధరించిన అనేక లీలా రూపాలలో ఇరవై ఐదు ప్రముఖమైనవి కాగా వాటిలో శరభమూర్తి రూపం ఒకటి. ఈ రూపం దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామి అవతారసమాప్తి కోసం వీరభద్రుడు ధరించింది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రతను తగ్గించక ప్రజలు భయపడుతుండటంతో శివుడు వీరభద్రుని పంపి ఉగ్రత్వాన్ని తగ్గించుకోమని చెబుతాడు. అయినా వినక శివనింద చేస్తాడు. అప్పుడు వీరభద్రస్వామి శరభావతారం ధరిస్తాడు. సూర్య చంద్ర అగ్నులే అయన కళ్లు. ఆయన నాలుక బడబానలం. కడుపు కాలాగ్ని. గోళ్లు ఇంద్రుని వజ్రాయుధం కంటే బలమైనవి. ఆయన రెండు రెక్కలలో కాళీ–దుర్గా అనే దేవతలు, ఆయన రెండు తొడలలో కాలుడు–మృత్యువులుంటారు. హృదయంలో భైరవుడుంటాడు. చండమారుతవేగంతో శత్రువులను చీల్చి చెండాడుతాడు. ఆరు చేతులతో కత్తి–డాలును, అంకుశం–హరిణాన్ని, పాశం–రక్తపాత్రను పట్టుకుని ఉంటాడు. శత్రుబాధలున్నవారు ఈయనను ప్రతిష్టించి పూజిస్తే ఆ బాధలు పోతాయి. యుద్ధంలో గెలుపు, ఋణ విముక్తి, అనారోగ్యం నుండి ఉపశమనం, సకలశుభాలు కలుగుతాయని శైవాగమాలు చెబుతున్నాయి. శర అంటే ఆత్మ. భ అంటే ప్రకాశం. ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు గనుక ఆయన శరభమూర్తి. ఈయనను శివాలయంలో విమానగోపురంపై గానీ, కోష్ఠ దేవతగా గాని ప్రతిష్టించి పూజించాలని ఆగమ శిల్పశాస్త్రాలు చెప్పాయి. మారీచం, మశూచి, రాచపుండు, క్షయవంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడే దేవత కనుక లోకక్షేమం కోసం ఈ శిల్పాన్ని అక్కడ ప్రతిష్టించి పూజిస్తున్నారు. ఈయనకే అష్టపాదమూర్తి, సింహఘ్నమూర్తి, శరభేశమూర్తి, శరభసాలువ పక్షిరాజం అనే పేర్లు కూడా ఉన్నాయి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
శివేన సహమోదతే..
ఎటుచూసినా భక్తి భావం, శివ తన్మయత్వంతో భక్త కోటి పారవశ్యం. హరోం హర అంటూ ఆ మహా దేవుడి నామస్మరణతో జిల్లాలోని శైవ క్షేత్రాలు మార్మోగాయి. మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పరమ శివుడి వైభవాన్ని తిలకించేందుకు భక్తులు శైవ క్షేత్రాల వద్ద బారులు తీరారు. ఈశ్వరుడిని దర్శించి అర్చనలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శివ పంచాక్షరీ జపాలు, ఉపవాసాలు,జాగరణతో భక్తి పరాధీనుడైన, భోళా శంకరడును భక్తి ప్రప్రత్తులతో సేవించి తరించారు. ఓం నమః శివాయ అన్న శివపంచాక్షరీ మంత్రం జిల్లా వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాది భక్తులు శివక్షేత్రాలను దర్శించుకుని అభిషేక ప్రియుడిని తనివితీరా దర్శించి... అభిషేకాలు గావించారు. హరహర మహాదేవ శంభోశంకర అంటూ స్వామిని అర్చించారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలైన కోటప్పకొండపైన త్రికోటేశ్వరుడు, అమరావతిలోని అమరేశ్వరుని, పెదకాకానిలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి, క్వారీ బాలకోటేశ్వరుడు, గోవాడ బాలకోటేశ్వరుడి ఆలయ ప్రాంగణాలు భక్తులతో పోటెత్తాయి. పలు చోట్ల విద్యుత్ ప్రభలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులతో పోటెత్తిన పెదకాకాని శివాలయం పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పెదకాకానిలోని శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం మంగళవారం భక్తులతో పోటెత్తింది. హరహరమహాదే వా... శంభోశంకర నామంతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భమరాంబ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక స్టేజీ పై శ్రీ దక్షిణామూర్తి సన్నివేశం ఏర్పాటు చేశారు. ఆలయంలో సుప్రభాత సేవ, మహా హారతులు, నిత్యౌపాసన, గ్రామ బలిహరణ, శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వ ఏకాదశ రుద్రాభిషకములు, మహానివేదన, ఆలయ బలిహరణ, లింగోద్భవ కాలమున స్వామివారికి ఏకాదశ ద్రవ్యములతో రుద్రాభిషేకం, గజవాహనంపై ఎదుర్కొలోత్సవం నిర్వహించారు. కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. భక్తులు పొంగళ్లు పొంగించిన అనంతరం శివనామం స్మరిస్తూ ప్రదక్షిణలు చేశారు. శ్రీభ్రమరాంబ అమ్మవారిని, శ్రీ మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తజనసంద్రంగా త్రికూటాద్రి నరసరావుపేటరూరల్ : మహాశివరాత్రి సందర్బంగా ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శివనామస్మరణతో మార్మోగింది. రాష్ట్రం నలుమూలలనుండి లక్షలాదిమంది తరలివచ్చి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున రెండుగంటలకు స్వామివారికి బిందితీర్థంతో అభిషేకాలు గావించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసారు. తెల్లారుజామునుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. మధ్యాహ్నానికి భక్తుల రద్దీ తక్కువగా కనిపించినా, సాయంత్రానికి భారీగా పెరిగింది. సాలంకయ్య అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు విరివిగా జరిగాయి, యాగశాలలో చండి, రుద్ర, గణపతి యాగాలు నిర్వహించారు. ధ్యాన శివుడు, నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు. నూతనంగా నిర్మించిన ప్రసాదం కౌంటర్ వద్ద భక్తుల రద్దీ కనిపించింది. మెట్లమార్గంలో పలువురు భక్తులు మెట్లపూజతో కొండకు చేరుకున్నారు. గొల్లభామ గుడి భక్తులతో నిండిపోయింది. పలు స్వచ్ఛంద సంస్థలు కొండమీద భక్తులకు ఉచితంగా ప్రసాదాలు, మంచినీరు అందజేశాయి. వీఐపీల తాకిడి సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ర్టమంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, జి.వి.ఆంజనేయులు, యేలూరి సాంబశివరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, అప్కో చైర్మన్ మురుగుడు హానుమంతురావులు త్రికోటేశ్వరుని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జె.వి.ఎస్.ప్రసాద్ త్రికోటేశ్వరున్ని దర్శించుకుని తిరునాళ్ళ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా రూరల్ ఎస్పీ రామకృష్ణ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. క్వారీ బాలకోటేశ్వరుడి ఆలయం కిటికట చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా క్వారీ బాలకోటేశ్వరస్వామి దర్శనానికి సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భక్తి శ్రద్దలతో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. వివిధ గ్రామాల భక్తులు సుమారు 12 భారీ విద్యుత్ ప్రభలను నిర్మించారు. గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్, పొన్నూరు శాసనసభ్యుడు డి.నరేంద్రకుమార్, డిఆర్వో కె.నాగబాబు, తెనాలి ఆర్డీవో కె.నరసింహ వచ్చి పూజలు నిర్వహించారు