హొళగుంద/ఆలూరు రూరల్ (కర్నూలు): దేవరగట్టు రక్తసిక్తమయ్యింది. ఎప్పటిలానే సంప్రదాయం పైచేయి సాధించింది. కర్రలు కరాళనృత్యం చేయగా, 84 మందికి పైగా గాయపడ్డారు. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు ఓ చెట్టుపైకి ఎక్కిన భక్తుల్లో కొమ్మ విరిగిపడడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన కర్రలు, అగ్గి కాగడాలు, దివిటీలతో కొండ పైకి చేరిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల విగ్రహాలతో పాటు పల్లకీని మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టించారు. అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ఆద్యంతం ఒళ్లు జలదరించేలా ఉత్కంఠంగా సాగింది.
చెట్టు కొమ్మ విరిగిపడి ముగ్గురు మృతి..
ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు సత్యనారాయణ కట్టపై ఉన్న రావి చెట్టుపై కూర్చున్న కొమ్మ విరిగి పడడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆస్పరికి చెందిన మాల గణేష్ (18), బళ్లారి పట్టణం మిల్లార్‌పేటకు చెంది ఓపీడీలో పనిచేస్తున్న ప్రకాష్(30), ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాలకు చెందిన రామాంజనేయులు (45) ఈ ప్రమాదంలో మరణించారు.
కర్రల సమరంలో 84 మందికి గాయాలు
విజయదశమిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి దేవరగట్టులో జరిగిన బన్ని మహోత్సవంలో ఆదినుంచి వస్తున్న సంప్రదాయమే గెలిచింది. విజయోత్సవంలో భాగంగా జరిగిన జైత్రయాత్రలో గట్టుపై రక్తం చిందింది. ఉత్సవంలో 84 మందికి గాయాలు కాగా అందులో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర బుధవారం తెల్లవారుజాము వరకు జరిగింది. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు తరలి వచ్చారు.
జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో అడిషనల్ ఎస్పీతో పాటు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దేవరగట్టులో గురువారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం నిర్వహించనున్నారు. 27న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన, 28న మాళ మల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment