kalyanostavam
-
‘దేవరగట్టు’ రక్తసిక్తం
హొళగుంద/ఆలూరు రూరల్ (కర్నూలు): దేవరగట్టు రక్తసిక్తమయ్యింది. ఎప్పటిలానే సంప్రదాయం పైచేయి సాధించింది. కర్రలు కరాళనృత్యం చేయగా, 84 మందికి పైగా గాయపడ్డారు. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు ఓ చెట్టుపైకి ఎక్కిన భక్తుల్లో కొమ్మ విరిగిపడడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన కర్రలు, అగ్గి కాగడాలు, దివిటీలతో కొండ పైకి చేరిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల విగ్రహాలతో పాటు పల్లకీని మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టించారు. అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ఆద్యంతం ఒళ్లు జలదరించేలా ఉత్కంఠంగా సాగింది. చెట్టు కొమ్మ విరిగిపడి ముగ్గురు మృతి.. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు సత్యనారాయణ కట్టపై ఉన్న రావి చెట్టుపై కూర్చున్న కొమ్మ విరిగి పడడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆస్పరికి చెందిన మాల గణేష్ (18), బళ్లారి పట్టణం మిల్లార్పేటకు చెంది ఓపీడీలో పనిచేస్తున్న ప్రకాష్(30), ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాలకు చెందిన రామాంజనేయులు (45) ఈ ప్రమాదంలో మరణించారు. కర్రల సమరంలో 84 మందికి గాయాలు విజయదశమిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి దేవరగట్టులో జరిగిన బన్ని మహోత్సవంలో ఆదినుంచి వస్తున్న సంప్రదాయమే గెలిచింది. విజయోత్సవంలో భాగంగా జరిగిన జైత్రయాత్రలో గట్టుపై రక్తం చిందింది. ఉత్సవంలో 84 మందికి గాయాలు కాగా అందులో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర బుధవారం తెల్లవారుజాము వరకు జరిగింది. బన్ని ఉత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో అడిషనల్ ఎస్పీతో పాటు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దేవరగట్టులో గురువారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం నిర్వహించనున్నారు. 27న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన, 28న మాళ మల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. -
మహానందిలో ముగిసిన కల్యాణోత్సవం
-
దేవరగట్టు.. భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే...!
హొళగుంద: రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్న దసరా బన్ని ఉత్సవానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి పండుగను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం జైత్రయాత్ర కొనసాగనుంది. భక్తులు డిర్ర్..ర్ర్... గోపరక్... బహుపరాక్ అంటూ కర్రల సమరం నిర్వహించనున్నారు. వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రా ష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. ఉత్సవం జరుగుతుందిలా.. దేవరగట్టు పరిసర గ్రామాలు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి వర్గ వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. అనంతరం బాణసంచా పేల్చి కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టుకొని మేళతాళాలతో కాడప్ప మఠానికి చేరుకుంటారు. అక్కడున్న మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో మాతమాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవం జరిపిస్తారు. అనంతరం జెత్రయాత్ర కొనసాగుతుంది. మొగలాయిలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి, పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి చాలా మంది గాయపడ్తారు. గాయపడినవారికి స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. రక్త సంతర్పణ ఉత్సవ విగ్రహాలు రక్షపడికి చేరుకున్నాక.. అక్కడున్న రెండు రాతి గుండ్లకు కంచాభీరా వంశానికి చెందిన గొరువయ్య ఐదు చుక్కల రక్తాన్ని సమర్పిస్తాడు. కాలిపిక్కలో దబ్బణంతో ఒకవైపు నుంచి మరోవైపు లాగడంతో వచ్చే రక్తాన్ని రాతి గుండులకు విసురుతారు. ఉదయంలోపు అక్కడ రక్తపు మరకలు ఉండవని రాక్షసులు సేవిస్తారని భక్తుల నమ్మకం. భవిష్యవాణి శమీ వృక్షం నుంచి విగ్రహాలు బసవన్న గుడికి చేరుకోవడంతో పూజారి, ఆలయ ప్రధాన అర్చకుడు గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. ఆ సమయంలో అందరు ఒక్కసారిగా మొగలాయిని(కర్రలతో కొట్టుకోవడం) నిలిపి వేసి నిశ్శబ్దాన్ని పాటిస్తారు. రాబోయే కాలంలో వాణిజ్య పంటల ధరలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ స్థితులు తదితర పరిస్థితులను పూజారి వివరిస్తారు. అనంతరం పూజారి బహుపరాక్... గోపరాక్ అనగానే విగ్రహాలు సింహాసన కట్ట వైపు ఊరేగింపుగా బయలుదేరుతాయి. ఆ సమయంలో భక్తుల మధ్య జరిగే ఊరేగింపు మరింత భయంకరంగా ఉంటుంది. అప్పుడే చాలామంది భక్తులు గాయాలపాలవుతారు. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. భారీగా పోలీస్ బందోబస్తు బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆదోని, నంద్యాల, కర్నూలు, డోన్ తదితర ప్రాంతాలకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో కలిసి 800 మంది సివిల్ పోలీసులు, ప్రత్యేక బలగాలు, మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అలాగే 200 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించడానికి 120కు పైగా సీసీ, 4 డ్రోన్ కెమెరాలు వినియోగించనున్నారు. పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షంచనున్నారు. ఉత్సవ వివరాలు ► ఈ నెల 5వ తేదీ బుధవారం రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం ► బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జైత్రయాత్ర మొదలు ► 6వ తేదీ ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి వినిపిస్తారు ► 7వ తేదీ నెరణికి గ్రామ పురోహితులు స్వామి వారికి అర్చనలు చేస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. ► 8న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన ఉంటాయి. ► 9న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే... పురాతన కాలంలో విష పురుగులు, జంతువుల బారి నుంచి రక్షణ పొందేందుకు దివిటీలు, కట్టెలతో భక్తులు కొండపైకి వెళ్లేవారు. మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు తమ చేతిలో ఉన్న కర్రలతో దేవుడి విగ్రహాలను తాకేందుకు పోటీ పడతారు. ఈ సమయంలో కర్రలు తగులుకుని శబ్దం వస్తుంది. నాటుసారా, మద్యం సేవించిన వారు చేతిలోని కర్రలు స్వాధీనంలో లేకుండా మరొకరికి తగిలి గాయాలవుతాయి. గతంలో కొందరు ఉద్దేశపూర్వకంగా గుంపులో కొట్టుకునేందుకు ప్రయత్నించే వారు. ఇది రక్తపాతానికి కారణమయ్యేది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. సంప్రదాయం ప్రకారం ఉత్సవం జరుపుకుంటున్నారు. 144 సెక్షన్ అమలు దేవరగట్టుతో పాటు పరిసర గ్రామాల్లో ఈ నెల 9వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పోలీసు నిబంధనలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలి. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే 200 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం. – అబ్దుల్జహీర్, ఎస్ఐ, హొళగుంద -
ఆన్లైన్లో శ్రీవారి కల్యాణోత్సవ సేవ
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం ఆన్లైన్ కల్యాణోత్సవ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రారంభించింది. మొదటిరోజు 118 మంది గృహస్తులు(ఇద్దరు) ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకుని ఈ సేవలో పాల్గొన్నారు. కోవిడ్ - 19 నిబంధనల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ ఏకాంతంగా కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. భక్తుల కోరిక మేరకు ఆన్లైన్ విధానంలో ఈ సేవను ప్రారంభించారు. ఆగస్టు 7వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉన్న కల్యాణోత్సవం టికెట్లను టీటీడీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రూ.1000 చెల్లించి ఆన్లైన్లో రశీదు తీసుకున్నవారు ఆన్లైన్ ద్వారానే కల్యాణోత్సవంలో పాల్గొనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. టిక్కెట్లు కలిగి విధిగా సంప్రదాయ దుస్తులు ధరించి ఆన్ లైన్ ద్వారా కళ్యాణోత్సవ సేవలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను అర్చకులు స్వామివారికి నివేదించారు. ఉత్తరీయం, రవిక, అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని పోస్టల్ ద్వారా భక్తుల చిరునామాకు పంపించే ఏర్పాట్లను టీటీడీ చేసింది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా గృహస్తులు తమ ఇళ్ల నుండి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. -
ఆన్లైన్లో శ్రీవారి కల్యాణోత్సవం టికెట్లు
సాక్షి, తిరుమల: కరోనా కారణంగా తిరుమలకు వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. మొదటిసారి ఆన్లైన్లో శ్రీవారి కల్యాణోత్సవాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పించనుంది. శుక్రవారం 11 గంటల నుండి ఆన్లైన్లో భక్తులకు టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆగస్టు 7వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉన్న కల్యాణోత్సవం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. రూ.1000 చెల్లించి ఆన్లైన్లో రశీదు తీసుకోవాలి అని టీటీడీ తెలిపింది. స్వామివారి కల్యాణోత్సవం ప్రతి రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని వెల్లడించింది. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలని టీటీడీ కోరింది. అర్చక స్వాముల సూచనల మేరకు తమ గోత్ర నామాలతో సంకల్పం చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరియం, రవిక, అక్షింతలు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా భక్తుల చిరునామాకు పంపనున్నట్లు టీటీడీ తెలిపింది. చదవండి: ‘దర్శనాల టికెట్ల సంఖ్య పెంచే ఆలోచన లేదు’ -
రేపు శ్రీసూర్యనారాయణ స్వామి కల్యాణం
అరసవల్లి : ప్రత్యక్షదైవం శ్రీసూర్యనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం మార్చి 8న అనివెట్టి మండపంలో జరగనుంది. ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉషాపద్మినీ, ఛాయాదేవేరులతో స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించనున్నారు. ఈ మేరకు ఆలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. రూ.216 చెల్లించి కల్యాణం టికెట్లు పొందవచ్చని ఆలయ ఈఓ శ్యామలాదేవి తెలిపారు. ఈ నెల 8, 9, 10, 11వ తేదీల్లో స్వామి వారి విగ్రహాన్ని సూర్యుని లేలేత కిరణాలు స్పృశించే అవకాశముందని పేర్కొన్నారు. కిరణ ఆదిత్యున్ని భక్తులు తిలకించేలా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. -
భద్రాద్రి రామయ్యకు వైభవంగా కల్యాణోత్సవం
ఖమ్మం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గురువారం నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గోదావరి నుంచి అర్చకులు, ఆస్ధాన విద్వాంసులు మంగళ వాయిద్యాల మధ్య తీసుకొచ్చిన గోదావరి జలాలతో స్వామివారి పాదాలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం రాములోరికి పూజలు నిర్వహించారు. వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు రామయ్యకు వైభవంగా నిత్యకల్యాణం జరిపించారు.