
సాక్షి, తిరుమల: కరోనా కారణంగా తిరుమలకు వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. మొదటిసారి ఆన్‌లైన్‌లో శ్రీవారి కల్యాణోత్సవాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పించనుంది. శుక్రవారం 11 గంటల నుండి ఆన్‌లైన్‌లో భక్తులకు టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆగస్టు 7వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉన్న కల్యాణోత్సవం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. రూ.1000 చెల్లించి ఆన్‌లైన్‌లో రశీదు తీసుకోవాలి అని టీటీడీ తెలిపింది. స్వామివారి కల్యాణోత్సవం ప్రతి రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని వెల్లడించింది. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలని టీటీడీ కోరింది. అర్చక స్వాముల సూచనల మేరకు తమ గోత్ర నామాలతో సంకల్పం చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరియం, రవిక, అక్షింతలు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా భక్తుల చిరునామాకు పంపనున్నట్లు టీటీడీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment