ఉగ్రదీప్తి... శరభమూర్తి | Story about durga malleswara swamy temple | Sakshi
Sakshi News home page

ఉగ్రదీప్తి... శరభమూర్తి

Published Sun, Sep 23 2018 1:39 AM | Last Updated on Sun, Sep 23 2018 1:39 AM

Story about durga malleswara swamy temple  - Sakshi

ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం చాలా ప్రసిద్ధమైనది.ఇక్కడ స్వామి అమ్మవార్లు ప్రత్యేక దేవస్థానాలలో కొలువు తీరి ఉన్నారు. మల్లేశ్వరస్వామిదేవాలయం విమానగోపురం ప్రాచీన తెలుగు శిల్పకళకు తార్కాణంగా నిలుస్తుంది. ఈ ఆలయ విమానం పడమటి వైపు అద్భుతమైన శిల్పం దర్శనమిస్తుంది. రెండు సింహపు శరీరాలు కంఠం వరకు విడివిడిగా అక్కడి నుండి కలిసి మధ్యలో నడుము నుండి మానవశరీరంతో ఉగ్రమైన సింహముఖంతో, రెండు రెక్కలతో రెండు వైపులా కూర్చున్న రాక్షసులతో మెడలో కపాల(పుర్రె) మాలతో ఆరు చేతులలో ఒక శిల్పం కనిపిస్తుంది.

అది ఏ దేవుడి శిల్పం? అక్కడ ఎందుకు ఉంది? అనే ప్రశ్న భక్తుల మనసులో మెదులుతుంది. అది మరెవరి శిల్పమో కాదు. సాక్షాత్తూ శివరూపమే. శివుడు ధరించిన అనేక లీలా రూపాలలో ఇరవై ఐదు ప్రముఖమైనవి కాగా వాటిలో శరభమూర్తి రూపం ఒకటి. ఈ రూపం దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామి అవతారసమాప్తి కోసం వీరభద్రుడు ధరించింది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రతను తగ్గించక ప్రజలు భయపడుతుండటంతో శివుడు వీరభద్రుని పంపి ఉగ్రత్వాన్ని తగ్గించుకోమని చెబుతాడు.

అయినా వినక శివనింద చేస్తాడు. అప్పుడు వీరభద్రస్వామి శరభావతారం ధరిస్తాడు. సూర్య చంద్ర అగ్నులే అయన కళ్లు. ఆయన నాలుక బడబానలం. కడుపు కాలాగ్ని. గోళ్లు ఇంద్రుని వజ్రాయుధం కంటే బలమైనవి. ఆయన రెండు రెక్కలలో కాళీ–దుర్గా అనే దేవతలు, ఆయన రెండు తొడలలో కాలుడు–మృత్యువులుంటారు. హృదయంలో భైరవుడుంటాడు. చండమారుతవేగంతో శత్రువులను చీల్చి చెండాడుతాడు. ఆరు చేతులతో కత్తి–డాలును, అంకుశం–హరిణాన్ని, పాశం–రక్తపాత్రను పట్టుకుని ఉంటాడు.

శత్రుబాధలున్నవారు ఈయనను ప్రతిష్టించి పూజిస్తే ఆ బాధలు పోతాయి. యుద్ధంలో గెలుపు, ఋణ విముక్తి, అనారోగ్యం నుండి ఉపశమనం, సకలశుభాలు కలుగుతాయని శైవాగమాలు చెబుతున్నాయి. శర అంటే ఆత్మ. భ అంటే ప్రకాశం. ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు గనుక ఆయన శరభమూర్తి. ఈయనను శివాలయంలో విమానగోపురంపై గానీ, కోష్ఠ దేవతగా గాని ప్రతిష్టించి పూజించాలని ఆగమ శిల్పశాస్త్రాలు చెప్పాయి. మారీచం, మశూచి, రాచపుండు, క్షయవంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడే దేవత కనుక లోకక్షేమం కోసం ఈ శిల్పాన్ని అక్కడ ప్రతిష్టించి పూజిస్తున్నారు. ఈయనకే అష్టపాదమూర్తి, సింహఘ్నమూర్తి, శరభేశమూర్తి, శరభసాలువ పక్షిరాజం అనే పేర్లు కూడా ఉన్నాయి.

– డాక్టర్‌ ఛాయా కామాక్షీదేవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement