kamakshi devi
-
విశ్వరూప వీరభద్రుడు
శివుడి జట నుంచి ఉద్భవించిన వీరభద్రస్వామి శ్రీశైలానికి క్షేత్రపాలకుడు. ఇక్కడ ఆయన అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. ఊరిబయట బయలు వీరభద్రస్వామిగా, ఆలయంలో జ్వాలా వీరభద్రుడిగా, పుష్కరిణికి దగ్గరలో ఆరామవీరభద్రుడిగా, ఘంటామఠం వద్ద జటావీరభద్రుడిగా కనిపించే ఈ స్వామి మల్లికార్జున స్వామివారి ముఖమండపంలో ఎడమవైపు విశ్వరూపంతో దర్శనమిస్తారు. శివలింగ చిహ్నలాంఛితమైన కిరీటాన్ని తలపై ధరించి సర్వాభరణాలంకృతుడై, మోకాలివరకూ వేలాడే కపాలమాలతో, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో గొడ్డలి అదేవిధంగా కుడివైపు పదిహేను చేతులతో, ఎడమవైపు పదిహేను చేతులతో అనేక ఆయుధాలను ధరించి ఈ స్వామి కనిపిస్తాడు. ఆయనకు కుడివైపు మేకతలతో దక్షుడు, ఎడమవైపు భద్రకాళి ఉంటారు. ముప్పై రెండు చేతుల వీరభద్రుని మయశిల్పగ్రంథం అఘోర వీరభద్రస్వామిగా కీర్తించింది. ఈ స్వామిని దర్శించుకోవడం వలన సకల కష్టాలు, శతృబాధలు తొలగి, సర్వ అభీష్టాలు నెరవేరుతాయని శైవాగమాలలో చివరిదైన వాతులాగమం చెప్పింది. తనను సేవించిన వారికి సకలైశ్వర్యాలను, సుఖాన్ని, భుక్తిని, ముక్తిని ఇస్తాడని మంత్రశాస్త్రగ్రంథాలు పేర్కొన్నాయి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
హరిహరమూర్తి
శివుడు వేరు, విష్ణువు వేరు అని అందరూ అనుకుంటారు కానీ వారిద్దరూ ఒక్కటే.వారిలో ఎటువంటి భేదాలూ లేవని భక్తులకు తెలియజెప్పడానికి శివుడు ధరించిన రూపమే హరిహరమూర్తి రూపం. పూర్వం దేవతలు లోకం అశాంతిగా ఉందని విష్ణువు వద్దకు వెళ్లారు. శాంతినిచ్చేవాడు శంకరుడే అని విష్ణువు వారికి తెలిపాడు. అందరూ కలిసి కైలాసం వెళ్లి చూస్తే అక్కడ శివదర్శనం కాలేదు. అప్పుడు దేవతలంతా ఒక వ్రతం ఆచరించారు. చివరగా విష్ణు హృదయంలోని అక్షయ లింగాన్ని కూడా ఆరాధించారు. చివరికి శివుడు వారికి హరిహరమూర్తి రూపంలో దర్శనమిచ్చాడు. తమిళనాడులోని తిరునెల్వేలి దగ్గర శంకరన్ కోవిల్ అనే ఊరిలో శంకరనారాయణ స్వామి ఆలయం ఉంది.అందులో ప్రధాన దైవం శంకరనారాయణమూర్తి. ఈ స్వామి విగ్రహంలో నిలువుగా కుడి సగం ఈశ్వరుడిగా, ఎడమసగం విష్ణురూపంగా ఉంటుంది. ఇక విగ్రహం రూపురేఖలు వర్ణిస్తే కుడివైపు జటాజూటం, చెవికి తాటంకం, మెడలో నాగరాజు, కుడిచేత అభయముద్రను, వెనుక చేతిలో గొడ్డలి, పులి చర్మం ధరించి చందనపు పూతతో శివుడు దర్శనమిస్తే, ఎడమవైపు రత్నకిరీటం, చెవికి మకరకుండలం, మెడలో బంగారుహారాలు, కుడిచేతిని నడుము వద్ద ఉంచుకుని కటిముద్రతో, వెనుక చేతిలో శంఖాన్ని పట్టుకుని, పట్టు పీతాంబరాలు ధరించి నీలవర్ణంలో విష్ణువు దర్శనమిస్తాడు. ఈ స్వామి దర్శనంతో భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ స్వామిని చూచిన భక్తులకు ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం తథ్యం అని శైవాగమాలు చెబుతున్నాయి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
చింతలను దూరం చేసే త్రివిక్రముడు
మహావిష్ణువు ధరించిన దశావతారాలలో ఐదవ అవతారం వామనావతారం. సకల లోకాలను రాక్షసుల బారినుండి రక్షించడానికి శ్రీమహావిష్ణువు వామనావతారం ధరించాడు. ఒక బాలవటువు రూపంలో బలిచక్రవర్తి యజ్ఞం చేసే ప్రదేశానికి వెళ్ళాడు. ఆ బాలుణ్ణి ఏం కావాలని అడిగితే తనకు మూడు అడుగుల ప్రదేశం చాలన్నాడు. అదెంత భాగ్యం అని ఇచ్చేశాడు. మరుక్షణంలో ఆ బాలుడు అమాంతం పెరిగిపోయాడు. భూమిని ఒక్క అడుగుతోనే ఆక్రమించాడు. రెండో అడుగుతో ఆకాశాన్ని స్వాధీనం చేసుకుని మూడోఅడుగు ఎక్కడ పెట్టాలని అడిగితే తన తలపై పెట్టమని చెప్పాడు బలిచక్రవర్తి. అలా మూడు అడుగులతో మూడులోకాలనూ ఆక్రమించినవాడే త్రివిక్రముడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అద్భుతమైన శిల్పసౌందర్యంతో అలరారే చింతల వెంకటరమణస్వామి దేవాలయం ఉంది. ఆ ఆలయంపై అనేక పురాణ ఘట్టాలను శిల్పరూపంలో మనం దర్శించవచ్చు. పైన వివరించిన త్రివిక్రమావతారం కథను తెలిపే అద్భుతశిల్పం అక్కడ ఉంది. ఈ శిల్పం విశేషమేమిటంటే సాధారణంగా ఎక్కడైనా త్రివిక్రముడి ఒక కాలిని భూమిపై, మరో కాలు ఆకాశంలో ఉండి బ్రహ్మతో కడగబడుతూ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మూడోకాలు బలి తలపై ఉంచడం కూడా స్పష్టంగా చూపించడం జరిగింది. ఇటువంటి శిల్పం బహుశా ఇదొక్కటే అని స్పష్టంగా చెప్పవచ్చు. కుడిచేతిలో అభయముద్ర చూపుతూ ఎడమచేతిని పాదంపై పట్టి ఉంచి, వెనుక చేతులలో కుడివైపు శంఖాన్ని, ఎడమవైపు చక్రాన్ని ధరించి బ్రహ్మతో కడగబడుతున్న పాదం కల త్రివిక్రముడి శిల్ప సందర్శనం చింతలను దూరం చేస్తుందని ప్రతీతి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
భక్తులను అనుగ్రహించే భ్రమరాంబా దేవి
శ్రీశైలం భూమండలానికి కేంద్రస్థానం. ఇది జ్యోతిర్లింగక్షేత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవది కూడా. ఇక్కడ సతీదేవి శరీరభాగాల్లో కంఠభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. మల్లికార్జున స్వామివార్కి పశ్చిమభాగంలో అమ్మవారు కొలువై ఉంది. ఈ విషయాన్ని స్కాందపురాణాంతర్గతమైన శ్రీశైలఖండం కూడా చెప్పింది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు తనకు సకల దేవ, యక్ష, గంధర్వ, పురుష, స్త్రీ, మృగ, జంతు జాలంతో మరణం కలుగరాదని బ్రహ్మతో వరం పొందాడు. వరగర్వంతో సకల లోకాలవారినీ హింసించసాగాడు. దీంతో అందరూ అమ్మవారిని శరణు వేడుకున్నారు. అప్పుడు అమ్మవారు భ్రమరరూపం ధరించి అరుణాసురుణ్ణి సంహరించి లోకాలను కాపాడింది. అరుణాసురసంహారం తరువాత భక్తుల విన్నపంతో శ్రీగిరిపై స్థిరంగా వెలిసింది. అమ్మవారి మూలమూర్తి స్థితరూపంలో నిలుచుని ఎనిమిది చేతులతో కుడివైపు చేతులలో త్రిశూలం, చురకత్తి, గద, ఖడ్గం వంటి ఆయుధాలు, ఎడమవైపు మహిషముఖాన్ని బంధించి, డాలు, రక్తపాత్ర, అమృతఫలం ధరించి ఎడమకాలిని మహిషం (దున్నపోతు) వీపుపై అదిమిపెట్టి త్రిశూలంతో కంఠభాగంలో పొడుస్తూ మహిషాసురమర్ధిని వలె కనిపిస్తుంది. అయితే అమ్మవారి ఈ ఉగ్రరూపాన్ని భక్తులు తట్టుకోవడం కష్టం కనుక సౌమ్యరూప అలంకరణతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రూపాన్ని విజయదశమి నాడు ఉత్సవమూర్తికి అలంకరించి భక్తులకు దర్శించుకునే వీలు కల్పిస్తారు. ఈ అమ్మవారిని తెలుగు ప్రాంతాలనుండే గాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుండి దర్శించడానికి వస్తారు. కన్నడ ప్రజలు భ్రమరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా, మల్లికార్జున స్వామిని అల్లుడుగా భావించి అమ్మవారికి చీర, సారె, పండ్లు, పూలు సాంగెం పెట్టే సంప్రదాయం నేటికీ ఉంది – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
ఆరోగ్య భోగాలనిచ్చే యోగ నరసింహ స్వామి
తిరుమల ఆలయాన్ని దర్శించిన ఎవరికైనా యోగ నరసింహస్వామి గురించి తెలిసే ఉంటుంది. స్వామివారి ఆలయానికి ఈశాన్య దిక్కున యోగ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. విమాన ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరిగి వెళుతున్నప్పుడు రామానుజులవారి సన్నిధి దాటి ముందుకు వెళుతుండగానే యోగ నరసింహ స్వామి వారి సన్నిధి కనిపిస్తుంది. ప్రత్యేకమైన ఆలయంలో స్వామి వారు పడమర వైపు తిరిగి వెంకటేశ్వరస్వామి వారిని చూస్తున్నట్లు ఉంటుంది. ఈ నరసింహస్వామి వారు పద్మపీఠంపై రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు. ఈ ఆసనాన్ని యోగాసనం అంటారు. యోగ రూపంలో దర్శనమిచ్చే దేవతలు ఈ ఆసనం లోనే ఉంటారు. రెండు మోకాళ్లకు యోగపట్టిక వేసి ఉంటుంది. స్వామివారి రెండు చేతులు ముందుకు చాచి రెండు మోకాళ్లపై ఉంటాయి. వెనుక చేతులలో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి ఉంటాడు ఈ స్వామి వారిని కేవల నరసింహమూర్తి, గిరిజ నరసింహమూర్తి అని కూడా అంటారు పర్వతాలపై, గుహలలో ఇటువంటి రూపం మనకు దర్శనమిస్తుంది వైఖానసాగమం ఈ మూర్తి స్ఫటికకాంతి గల శరీరంతో ఉంటాడని చెప్పింది. ఈ స్వామి వారిని దివ్యప్రబంధంలో ఆళ్వారులు అలగియ సింగర్(అందాల నరసింహుడు) అనే పేరుతో పిలిచారు. శ్రీమద్రామానుజులవారు ఈ స్వామిని ఇక్కడ ప్రతిష్టించారు.ఈ స్వామికి నిత్యకైంకర్యాలేవీ జరుగకపోయినా ప్రతి శనివారం తిరుమంజనం (దివ్యాభిషేకం) నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు,దివ్యప్రబంధపారాయణలు అందుకుంటాడు.ఈ స్వామికి ఉత్సవవిగ్రహం లేదు.కానీ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో సింహవాహనంపై ఊరేగే మలయప్పస్వామివారు మాత్ర ఈ యోగనరసింహస్వామివలె యోగాసనంతో దర్శనమిస్తారు. యోగనరసింహస్వామివారిని దర్శిస్తే శతృబాధలుండవనీ, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు కలుగుతాయని వైష్ణవాగమాలు చెబుతున్నాయి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
ఉగ్రదీప్తి... శరభమూర్తి
ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం చాలా ప్రసిద్ధమైనది.ఇక్కడ స్వామి అమ్మవార్లు ప్రత్యేక దేవస్థానాలలో కొలువు తీరి ఉన్నారు. మల్లేశ్వరస్వామిదేవాలయం విమానగోపురం ప్రాచీన తెలుగు శిల్పకళకు తార్కాణంగా నిలుస్తుంది. ఈ ఆలయ విమానం పడమటి వైపు అద్భుతమైన శిల్పం దర్శనమిస్తుంది. రెండు సింహపు శరీరాలు కంఠం వరకు విడివిడిగా అక్కడి నుండి కలిసి మధ్యలో నడుము నుండి మానవశరీరంతో ఉగ్రమైన సింహముఖంతో, రెండు రెక్కలతో రెండు వైపులా కూర్చున్న రాక్షసులతో మెడలో కపాల(పుర్రె) మాలతో ఆరు చేతులలో ఒక శిల్పం కనిపిస్తుంది. అది ఏ దేవుడి శిల్పం? అక్కడ ఎందుకు ఉంది? అనే ప్రశ్న భక్తుల మనసులో మెదులుతుంది. అది మరెవరి శిల్పమో కాదు. సాక్షాత్తూ శివరూపమే. శివుడు ధరించిన అనేక లీలా రూపాలలో ఇరవై ఐదు ప్రముఖమైనవి కాగా వాటిలో శరభమూర్తి రూపం ఒకటి. ఈ రూపం దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామి అవతారసమాప్తి కోసం వీరభద్రుడు ధరించింది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రతను తగ్గించక ప్రజలు భయపడుతుండటంతో శివుడు వీరభద్రుని పంపి ఉగ్రత్వాన్ని తగ్గించుకోమని చెబుతాడు. అయినా వినక శివనింద చేస్తాడు. అప్పుడు వీరభద్రస్వామి శరభావతారం ధరిస్తాడు. సూర్య చంద్ర అగ్నులే అయన కళ్లు. ఆయన నాలుక బడబానలం. కడుపు కాలాగ్ని. గోళ్లు ఇంద్రుని వజ్రాయుధం కంటే బలమైనవి. ఆయన రెండు రెక్కలలో కాళీ–దుర్గా అనే దేవతలు, ఆయన రెండు తొడలలో కాలుడు–మృత్యువులుంటారు. హృదయంలో భైరవుడుంటాడు. చండమారుతవేగంతో శత్రువులను చీల్చి చెండాడుతాడు. ఆరు చేతులతో కత్తి–డాలును, అంకుశం–హరిణాన్ని, పాశం–రక్తపాత్రను పట్టుకుని ఉంటాడు. శత్రుబాధలున్నవారు ఈయనను ప్రతిష్టించి పూజిస్తే ఆ బాధలు పోతాయి. యుద్ధంలో గెలుపు, ఋణ విముక్తి, అనారోగ్యం నుండి ఉపశమనం, సకలశుభాలు కలుగుతాయని శైవాగమాలు చెబుతున్నాయి. శర అంటే ఆత్మ. భ అంటే ప్రకాశం. ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు గనుక ఆయన శరభమూర్తి. ఈయనను శివాలయంలో విమానగోపురంపై గానీ, కోష్ఠ దేవతగా గాని ప్రతిష్టించి పూజించాలని ఆగమ శిల్పశాస్త్రాలు చెప్పాయి. మారీచం, మశూచి, రాచపుండు, క్షయవంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడే దేవత కనుక లోకక్షేమం కోసం ఈ శిల్పాన్ని అక్కడ ప్రతిష్టించి పూజిస్తున్నారు. ఈయనకే అష్టపాదమూర్తి, సింహఘ్నమూర్తి, శరభేశమూర్తి, శరభసాలువ పక్షిరాజం అనే పేర్లు కూడా ఉన్నాయి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
సభాపతి నటరాజమూర్తి
ఆయన నటరాజు. ఆయన నాట్యం తాండవం. మామూలు దృష్టితో చూస్తే అది నృత్యవిశేషంగా అనిపిస్తుంది. కానీ ఆ నాట్యభంగిమలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. అందుకే ఆయన కొలువుదీరిన చిదంబరం క్షేత్రానికి అంత విశిష్టత ఏర్పడింది. ఇది పంచభూతక్షేత్రాలలో చివరిది. ఆకాశలింగం అనే పేరుతో శూన్యాన్ని పూజిస్తారు. అక్కడ మూలరూపం శూన్యమే. శూన్యం నుండే సృష్టి మొదలైంది అనే తత్త్వానికి ప్రతినిధి స్వామివారు. ఆకాశం నుండి గాలి, గాలి నుండి నిప్పు, నిప్పు నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి ఓషధులు పుట్టాయని సృష్టి క్రమాన్ని వేదాలు చెబుతున్నాయి. మనకు ఇక్కడ దర్శనమిచ్చేది స్వామి వారి ఉత్సవమూర్తి. ఆయన అక్కడ కనకసభలో కొలువుదీరి దర్శనమిస్తాడు. ఆ కనకసభనే పొన్నంబలం అని పిలుస్తారు. ఆయనే అక్కడి సభాపతి. ముప్పై మూడు కోట్ల దేవతలు ఆయన కోసం భూమి పైకి దిగి వచ్చి ఆయన ఆలయం కప్పుపై ఆకులుగా మారిపోయారు. నేటికి ఆలయంపై వాటిని చూడవచ్చు. స్వామిరూపం నృత్యం చేస్తున్న రీతిగా కనిపిస్తుంది. కుడిచేత అభయముద్ర, ఎడమ చేయి ఏనుగు తొండం వలె ఉంచి, వెనుక చేతిలో డమరుకం మ్రోగిస్తూ, మరో చేతిలో అగ్ని పట్టుకుని కుడిపాదాన్ని కొంచెం వంచి, ఎడమ పాదాన్ని ఎడమచేతివలె ముందుకు తీసుకు వచ్చి, పాదం కింద రాక్షసుడిని తొక్కుతూ ఉన్నట్లుంటుంది. ఆయనకు రెండువైపులా పతంజలి, వ్యాఘ్రపాదులవారు ఆయనను నిరంతరం సేవిస్తుంటారు. ఆయనకు ఎడమవైపు శివకామసుందరీదేవి నిలుచుని పద్మం ధరించి దర్శనమిస్తుంది. రూపంలో పరమేశ్వరుని పంచకృత్యాలను మనం దర్శించాలి. సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం అనేవే పంచకృత్యాలు. ఆ చేతి డమరుక ధ్వనినుండి సంస్కృతభాషకు మూలమైన మాహేశ్వరసూత్రాలు ఆవిర్భవించాయి. అదే సృష్టి. ఆయన వంచిన పాదం స్థితికి ప్రతీక. ఆయన చేతిలోని అగ్ని సంహారం .చాచిన ఎడమకాలు తిరోధానం. ఆయన అభయహస్తం అనుగ్రహం. ఈ పంచకృత్యాలనే రహస్యాన్ని తెలుసుకుంటే చిదంబర రహస్యం తెలిసినట్టే. నటరాజస్వామివారి సప్తతాండవరూపాలు చాలా ప్రఖ్యాతి పొందాయి. ముఖ్యంగా ఊర్ధ్వ తాండవరూపం చాలా విశేషమైంది. పరమేశ్వరుడు నటరాజుగా అవతరించింది ఊర్ధ్వ తాండవ భంగిమలోనే. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
జ్ఞాననిధి పార్థసారథి
సాధారణంగా కృష్ణుడు అనగానే చేతిలో పిల్లనగ్రోవి ఊదుతూ జగత్తును సమ్మోహనపరుస్తూ కనిపిస్తాడు. అయితే వైఖానసాగమం, పాంచరాత్ర ఆగమం ఎనిమిది మంది కృష్ణ రూపాలను వివరించాయి. వాటిలో బాలకృష్ణుడు, నవనీత కృష్ణుడు, కాళీయ మర్దన కృష్ణుడు, గోవర్ధనధరుడు, మదన గోపాలమూర్తి, పార్థసారథి, త్రైలోక్య మోహనుడు, జగన్మోహనుడు మొదలైన రూపాలు విశేషమైనవి. శ్రీ కృష్ణుడి రూపాలలో విశిష్టమైనది మదన గోపాలుని రూపం. ఈ స్వామి 16 చేతులతో దర్శనమిస్తాడు. రెండు చేతులతో వేణువును ఊదుతూ, మరో రెండు చేతులతో శంఖ చక్రాలను, మిగిలిన చేతులలో పాశ అంకుశాలను, పద్మం చెరకుగడను ధరించి దర్శనమిచ్చే ఈ స్వామిని రాజగోపాలుడు అని కూడా పిలుస్తారు ఈ స్వామి దర్శనంతో సకల అభీష్టాలు నెరవేరుతాయి. మహాభారత యుద్ధంలో అర్జునుడికి మార్గదర్శకుడిగా రథసారధిగా శ్రీ కృష్ణుడు కనిపిస్తాడు ఈ స్వామి రూపం పార్థసారథిగా ప్రసిద్ధి పొందింది. ఈ స్వామి ఒక చేతితో చండ్రకోలును, మరో చేతితో శంఖాన్ని ధరించి దర్శనమిస్తాడు. ఈ స్వామి జ్ఞాన ప్రదాయకుడు. భగవద్గీతను అనుగ్రహించింది ఈయనే. జగన్మోహనస్వామి రూపం బృందావనంలో రత్న కిరీటాన్ని ధరించి గరుడుని భుజంపై కూర్చుని ఎడమవైపు లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని ఎనిమిది చేతులతో దర్శనమిస్తాడు. చెన్నై నగరంలో పార్ధసారధి స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది విశిష్టమైనది కూడా. ఇక్కడి స్వామి వారి రూపం సాధారణంగా కనిపించే కృష్ణ వంటిది కాదు. స్వామి వారు ఇక్కడ మీసాలతో దర్శనమిస్తారు. ఆగమ శిల్ప శాస్త్రాలలో ఎక్కడా కూడా దేవతలకు గడ్డం మీసం మొదలైనవి కనబడకపోగా ఇక్కడి స్వామి మీసాల కృష్ణుడిగా ప్రసిద్ధుడు. ఈ స్వామిని దర్శిస్తే అన్ని భయాలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
కామాక్షి దేవిగా వర్గల్ సరస్వతి
వర్గల్: శంభునికొండపై కొలువుదీరిన వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు అంగరంగవైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఐదోరోజు చదువుల తల్లి కామాక్షి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనులు ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.