శివుడు వేరు, విష్ణువు వేరు అని అందరూ అనుకుంటారు కానీ వారిద్దరూ ఒక్కటే.వారిలో ఎటువంటి భేదాలూ లేవని భక్తులకు తెలియజెప్పడానికి శివుడు ధరించిన రూపమే హరిహరమూర్తి రూపం. పూర్వం దేవతలు లోకం అశాంతిగా ఉందని విష్ణువు వద్దకు వెళ్లారు. శాంతినిచ్చేవాడు శంకరుడే అని విష్ణువు వారికి తెలిపాడు. అందరూ కలిసి కైలాసం వెళ్లి చూస్తే అక్కడ శివదర్శనం కాలేదు. అప్పుడు దేవతలంతా ఒక వ్రతం ఆచరించారు. చివరగా విష్ణు హృదయంలోని అక్షయ లింగాన్ని కూడా ఆరాధించారు.
చివరికి శివుడు వారికి హరిహరమూర్తి రూపంలో దర్శనమిచ్చాడు. తమిళనాడులోని తిరునెల్వేలి దగ్గర శంకరన్ కోవిల్ అనే ఊరిలో శంకరనారాయణ స్వామి ఆలయం ఉంది.అందులో ప్రధాన దైవం శంకరనారాయణమూర్తి. ఈ స్వామి విగ్రహంలో నిలువుగా కుడి సగం ఈశ్వరుడిగా, ఎడమసగం విష్ణురూపంగా ఉంటుంది.
ఇక విగ్రహం రూపురేఖలు వర్ణిస్తే కుడివైపు జటాజూటం, చెవికి తాటంకం, మెడలో నాగరాజు, కుడిచేత అభయముద్రను, వెనుక చేతిలో గొడ్డలి, పులి చర్మం ధరించి చందనపు పూతతో శివుడు దర్శనమిస్తే, ఎడమవైపు రత్నకిరీటం, చెవికి మకరకుండలం, మెడలో బంగారుహారాలు, కుడిచేతిని నడుము వద్ద ఉంచుకుని కటిముద్రతో, వెనుక చేతిలో శంఖాన్ని పట్టుకుని, పట్టు పీతాంబరాలు ధరించి నీలవర్ణంలో విష్ణువు దర్శనమిస్తాడు. ఈ స్వామి దర్శనంతో భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ స్వామిని చూచిన భక్తులకు ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం తథ్యం అని శైవాగమాలు చెబుతున్నాయి.
– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి
Comments
Please login to add a commentAdd a comment