సాక్షి, హైదరాబాద్: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలు ఒకే విగ్రహంగా ఉన్న అరుదైన శిల్పం వెలుగుచూసింది. చరిత్ర పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి 13వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహాన్ని గుర్తించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలోని శిథిల నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఇది బయటపడింది. ఆ ఆలయాన్ని పదిలం చేసుకునే కసరత్తులో భాగంగా స్థానికులు శుభ్రపరుస్తుండగా ఈ విగ్రహం కనిపించింది.
స్థానికుల సమాచారం మేరకు శివనాగిరెడ్డి అక్కడికి వెళ్లి దాన్ని పరిశీలించారు. ఒకే శరీరానికి మూడు తలలున్న ఆ విగ్రహం ఎంతో ప్రత్యేకమైందని, ఇప్పటివరకు హరి, హర, పితామహ రూపాలు ఒకే విగ్రహంలో ఉండటం అరుదని అన్నారు. ఈ విషయమై కొత్త తెలంగాణ చరిత్ర బృంద ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు జైశెట్టి రమణయ్యలను సంప్రదించగా, గతంలో ఈ రూపంలో విగ్రహం వెలుగుచూసిన దాఖలాలు లేవని వారు పేర్కొన్నట్టు నాగిరెడ్డి వెల్లడించారు. తొలితరం కాకతీయులు జైన ఆరాధకులని, రుద్రదేవుడి నుంచి శైవంపట్ల మొగ్గుచూపారని పేర్కొన్నారు.
గణపతిదేవుడి కాలంలో హరిని, హరుడిని విడిగా ఆరాధించేవారి మధ్య ఆధిపత్య పోరు పెరగకుండా ఉండేందుకు, అంతాసమానమనే భావన కల్పించేందుకు ఇలాంటి శిల్పాన్ని ఏర్పాటు చేయించి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామ చివరన ఉన్న పురాతన శివాలయం వద్ద 13వ శతాబ్దానికి చెందిన ఆసీన వీరభద్ర, భద్రకాళి, భైరవ, మహిషాసుర మర్ధిని, అగస్త్య మహాముని విగ్రహాలు వెలుగు చూశాయని ఆయన పేర్కొన్నారు. అరుదైన విగ్రహాలతో కూడిన మందిరాలను పరిరక్షించాలని హెరిటేజ్ తెలంగాణ అధికారులను ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment