సాక్షి, హైదరాబాద్: కాకతీయుల కాలానికి చెందిన వినాయకుడి అతి చిన్న రాతి విగ్రహం వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, పరడ గ్రామ శివార్లలో గుట్టమీద కొత్త రాతియుగం, ఇనుపయుగపు ఆనవాళ్లు, గుట్ట దిగువన తూర్పు వైపున్న బౌద్ధ స్థూప శిథిలాలను పరిశీలిస్తుండగా ఈ విగ్రహం లభించిందని పురావస్తు శాఖ విశ్రాంత అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు.
‘కాకతీయుల కాలం 13వ శతాబ్దానికి చెందిన ఈ రాతి విగ్రహం 4 సెంటీమీటర్ల ఎత్తు, 3 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. తలపైన కాకతీయ శైలి జటామకుటం, ఎడమ వైపు తిరిగి ఉన్న తొండం, చేతుల్లో దంతం, మోదకం, బొజ్జమీదుగా నాగయజ్ఞోపవీతం ఉన్న ఈ వినాయకుడు లలితాసన భంగిమలో కూర్చుని ఉన్నాడు. మెత్తడి రాతితో చెక్కిన ఈ విగ్రహం అప్పట్లో ఇళ్లలో పూజలందుకుని ఉంటుంది.
నాటి ఊరు కాలగర్భంలో కలిసిపోయాక విగ్రహం కూడా మట్టిలోనే ఉండిపోయింది. గతంలో కర్నూలు జిల్లా వీరాపురంలో క్రీ.శ.3వ శతాబ్దికి చెందిన ఇదే పరిమాణంలో ఉన్న మట్టి వినాయకుడి విగ్రహం, కీసరగుట్టలో 5వ శతాబ్దానికి చెందిన గణేశుడి రాతి శిల్పం బయటపడ్డాయి. ఇప్పుడు కాకతీయ కాలానికి చెందిన ఇప్పటివరకు వెలుగు చూసిన వాటిల్లో అతి చిన్న విగ్రహం గుర్తించాం’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఔత్సాహిక పరిశోధకులు రాగి మురళితో కలిసి జరిపిన అన్వేషణలో ఈ విగ్రహం కనిపించిందని, వినాయకచవితి ముందురోజే ఈ విగ్రహం వెలుగు చూడటం విశేషమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment