
నగరంలో నిత్యం కళాభిమానుల్ని పలుకరించే పలు ముఖ్యమైన కూడళ్లలో కనిపించే కళాత్మకత వెనుక ఆయన సృజన ఉంటుంది. నగరవాసులు, నగరేతరులైన కళాభిమానులు సందర్శించే పలు శిల్పాకృతుల వెనుక నగరం కళల రాజధాని కావాలనే కల సాకారం చేసుకోవాలనే తపన ఉంది. అలుపెరుగని ఆ తపన పేరు ఎంవీ.రమణారెడ్డి. దాదాపు మూడు దశాబ్దాల కళా ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నగర శిల్ప కళాకారునితో ముచ్చటించిన సందర్భంగా ఆయన పంచుకున్న జ్ఞాపకాల ప్రయాణం ఆయన మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో
జన్మతః సిద్దిపేట వాస్తవ్యుడైనా నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి స్కల్ప్చర్ (శిల్పకళ)లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచాడు.. ఆ తర్వాత నుంచి నా కళా ప్రయాణం నగరంతో మమేకమై సాగింది.
అడుగడుగునా.. ఆవిష్కరణ..
నగరానికి తలమానికమైన ఎయిర్‌పోర్ట్‌లోని నోవోటెల్ హోటల్‌తో మొదలుపెడితే.. నగరంలోని అనేక చోట్ల, ముఖ్య కూడళ్లలో కొలువుదీరిన కళాకృతులెన్నో రూపొందించాను. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం రూపకల్పనలో ప్రధాన ఆర్కిటెక్ట్‌గా పనిచేయడం ద్వారా అందిన ఎన్నో భావోద్వేగాలను మరచిపోలేని అనుభవం. అదే విధంగా ఢిల్లీ రిపబ్లిక్ వేడుకల్లో మన రాష్ట్రం తరపున శకటం రూపకల్పన మరో చిరస్మరణీయ జ్ఞాపకం. నగరం విశ్వనగరంగా మారనుందని ఆనాడే జోస్యం చెబుతూ.. విప్రో సర్కిల్లో ఏర్పాటైన తొలి అత్యాధునిక శిల్పాకృతి.. స్టేట్ గ్యాలరీలోని గాంధీజీ స్టీల్ వర్క్స్, రవీంద్రభారతిలోని శిల్పాకృతులు, మెట్రో రైల్ కోసం 30 అడుగుల స్టెయిన్ లెస్ స్టీల్ స్కల్ప్చర్ పైలాన్ కాన్సెప్ట్ డిజైన్, ‘శిల్పారామం’ కోసం 25 అడుగుల స్టెయిన్ లెస్ స్టీల్ శిల్పం.. అలాగే టీజీపీఎస్‌సీ లోగో కావచ్చు ప్రపంచ తెలుగు మహాసభల సదస్సు లోగో. వంటివెన్నో నా నగరం కోసం.. నా రాష్ట్రంలో నన్ను మమేకం చేశాయి.

కల సాకారం కావాలని..
ప్రస్తుతం నగరంలో కళలకు అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఇలా అన్ని వైపుల నుంచి మంచి సహకారం లభిస్తోంది. దీన్ని ఉపయోగించుకుని మరింత మంది కళాకారులు వెలుగులోకి రావాలి. ఆర్ట్ అనేది అభిరుచి మాత్రమే కాదు అద్భుతమైన కెరీర్ కూడా అనే నమ్మకం యువతలో రావాలి. నగరం కళాసాగరం కావాలి. అదే నా తపన.. ఆలోచన అందుకు అనుగుణంగానే నా కార్యాచరణ.
ఎన్నో హోదాలు.. పురస్కారాలు..
తెలంగాణ రాష్ట్రం నుంచి 2020లో న్యూఢిల్లీలో లలిత్ కళా అకాడమీ, మొదటి జనరల్ కౌన్సిల్ మెంబర్‌గా ఎంపికయ్యా. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి అధ్యక్షుడిగా 2015 నుంచి 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పాటు సొసైటీ సభ్యుల సంఖ్య పెంచడంలోనూ కృషిచేశా. తద్వారా సొసైటీని చురుకుగా మార్చగలిగాను. నేను అందించిన సేవలకు గానూ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘విశిష్ట పురస్కారం’ అందుకున్నా. నేనే స్వయంగా ‘బయో–డైవర్సిటీ ఈస్తటిక్స్’ యాన్ ఆర్టిస్టిక్ రిఫ్లెక్షన్ అనే పుస్తకం రచించగా.. నా గురించి ‘ఎంవి. రమణారెడ్డి.. పాత్ టూ ఆరి్టస్టిక్ బ్రిలియన్స్.. ఏ జర్నీ పేరిట నా ప్రయాణాన్ని రచయిత కోయిలీ ముఖర్జీ ఘోష్ లిఖించారు.