
వేసవిలో కంఫర్ట్‌గానూ,స్టైలిష్‌గానూ ఉండే ఔట్‌ఫిట్స్ జాబితాలో కూల్‌గా మన మదిని చుట్టేస్తుంది క్రోచెట్ లేస్ డ్రెస్సింగ్ స్టైల్. ఎప్పుడూ ఎవర్‌గ్రీన్ అనిపించుకునే ఈ క్రియేటివ్ వర్క్‌ని ఏ ఫ్యాబ్రిక్‌తోనైనా జత చేస్తే రిచ్ లుక్‌ని మన సొంతం చేస్తుంది.క్యాజువల్ లేదా పార్టీవేర్‌గా ఇట్టే మార్కులు కొట్టేస్తుంది.బ్రైడల్ వేర్‌గా యూనివర్సల్ సింబల్‌ని సొంతం చేసుకున్న ఈ అల్లికల అందం ఈ వేసవికి మగువల ముస్తాబులో రెక్కలకు రంగులు అద్దుకున్న రాయంచలా మరింతగా మెరిసిపోతుంది.
సంప్రదాయ హంగులు
క్రోచెట్ లేస్ అత్యంత సున్నితమైన, క్లిష్టమైన వర్క్. సంప్రదాయ అల్లిక కావడంతో ఈ వర్క్ ఎవర్‌గ్రీన్‌గా అందరి మన్ననలు అందుకుంటుంది. కాటన్, సిల్క్, చందేరీ, నెటెడ్... ఏ ఫ్యాబ్రిక్‌తో అయినా ఇట్టే జత కట్టే క్రోచెట్ లేస్‌లో సంప్రదాయ పద్ధతిలో హ్యాండ్‌మేడ్‌గానూ, అధునాతనంగా మిషనరీపైనా రూపు దిద్దుకుంటుంది.
ఇండో–వెస్ట్రన్‌గానూ..వెస్ట్రన్ గౌన్స్, టాప్స్, మిడీస్.. ఇండోవెస్ట్రన్ శైలులు క్రోచెట్ లేస్ మోడల్ డ్రెస్సుల ద్వారా మనం చూడచ్చు. కాటన్, సిల్క్‌దారాలతో తయారయ్యే ఈ అల్లికల ఫ్యాబ్రిక్‌లో పువ్వులు, తీగలు, లతల డిజైన్లు కనిపిస్తాయి. లేతరంగులు, ముఖ్యంగా తెలుపులో ఎక్కువగా కనిపించే ఈ డ్రెస్సులు సమ్మర్ స్పెషల్‌గానూ యువతను ఆకట్టుకుంటున్నాయి.

వెస్ట్రన్ బ్రైడ్స్ ధరించే పొడవాటి తెల్లని గౌన్లతో మనల్ని ఆకట్టుకుంటుంది క్రోచెట్ లేస్. మన సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకలలోనూ నవ వధువులు లేస్ డిజైనరీ దుస్తులు ధరించడం చూస్తే కదలాడుతుండే హంసలు కళ్ల ముందు నిలుస్తాయి. క్యాజువల్ వేర్‌గానూ, చీరలు, లెహంగాలు, కుర్తా, దుపట్టా.. వంటి డ్రెస్సులకు, క్రొచెట్ లేస్ అందమైన అలంకరణగా విరాజిల్లుతుంది. క్రోచెట్ లేస్‌తో అంచులు, డెకరేటివ్ ప్యాచ్ లేదా మొత్తం దుపట్టా, శారీగానూ ఆకట్టుకుంటుంది.
లేస్ ఆభరణాలు
ముచ్చటైన కంఠాభరణాలు, పర్సులు, హ్యాండ్ కఫ్స్, షూ డిజైన్స్‌లోనూ డిజైనర్లు లేస్‌తో క్రియేటివ్ డిజైన్స్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు. నాణ్యతను బట్టి వందల రూపాయల నుంచి డిజైన్‌ను బట్టి వేలల్లోనూ ఈ డిజైన్స్ ధర పలుకుతున్నాయి.