రాగ్య మృతదేహాన్ని నీళ్లలో పడేసిన ప్రాంతం ఇదే, ఇన్‌సెట్లో రాగ్యం
సాక్షి, నల్గొండ/హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సమీప బంధువు ఘాతుకానికి తెగబడ్డాడు. వరుసకు తమ్ముడైన వ్యక్తిని సుపారీ కిల్లర్స్‌తో హత్య చేయించి నాగార్జునసాగర్ వెనుక జలాల్లో మృతదేహాన్ని పడేశారు. ఈ ఘటన నేరేడుగొమ్ము మండలంలో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, హతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన లావుడ్య రాగ్య(30)కు పెద్దవూర మండలం ఊరబావితండాకు చెందిన రోజాతో 12సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా, రాగ్య హైదరాబాద్‌లోని మణికొండలో కారు డ్రైవర్‌గా పని చేస్తూ అక్కడే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజాకు బావ వరుస అయిన ఇబ్రహింపట్నంలోని ఎల్లాపూర్‌తండాకు చెందిన లక్పతితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
హత్యకు రూ.20లక్షల సుపారీ
తమ సఖ్యతకు రాగ్య అడ్డుగా ఉన్నాడని లక్పతి, రోజా భావించారు. దీంతో అతడి అడ్డుతొలగించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో లక్పతి నేరెడుగొమ్ము మండలం బుగ్గతండాకు చెందిన మాన్‌సింగ్, బాలోజీతో సుపారీ కుదుర్చుకున్నాడు. రాగ్యను హత్య చేస్తే రూ.20లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు.
ఫోన్ నంబర్ తీసుకుని.. పరిచయం పెంచుకుని..
సుపారీ కుదుర్చుకున్న మాన్‌సింగ్, బాలోజి వైజాక్ కాలనీలో చేపల బేరం చేస్తారు. వీరు బేరం నిమిత్తం తరచూ హైదరాబాద్‌కు వెళ్లే వారు. ఈ క్రమంలో లక్పతి వద్ద రాగ్య ఫోన్ నంబర్ తీసుకుని అతడితో పరిచయం పెంచుకున్నారు. అనంతరం ప్రథకం ప్రకారం ఆగస్టు 19న రాగ్యను హత్య చేసి మృతదేహానికి ఇనుప కడ్డీలు కట్టి కాచరాజుపల్లి సమీపంలో సాగర్ వెనుక జలాల్లో పడవేశారు.
చదవండి: బోర్కర్..మామూలోడు కాదు!.. పెద్ద బ్యాగ్రౌండే ఉంది
విషాదంలో రాగ్య తల్లిదండ్రులు, పక్కన రాగ్య (ఫైల్)
హైదరాబాద్‌లో కేసు నమోదు.. సెల్‌ఫోన్ ఆధారంగా..
రాగ్య రెండు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 21న హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాగ్య తరచూ ఫోన్‌లో మాన్‌సింగ్, బాలోజీతో సంభాషించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యోందంత వెలుగులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ పోలీసులు మాన్‌సింగ్, బాలోజీలను తీసుకుని కాచరాజుపల్లికి తీసుకువచ్చారు. కృష్ణా వెనుక జలాల్లో మృతదేహం కోసం గాలించగా సాయంత్రం వరకు లభ్యం కాలేదు.
ఈ క్రమంలో నిందితులను తమకు అప్పగించాలని అక్కడికి చేరుకున్న రాగ్య కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం రాళ్లు రువ్వడంతో రాగ్య బంధువులకు స్వల్పగాయాలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు సోమవారం రాగ్య మృతదేహాన్ని వెలికి తీసేందుకు గాలింపు చర్యలు చేపడతామని అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, రాగ్యను ఎక్కడ ఎలా హత్య చేశారు. హత్యోదంతంలో ఎంత మంది పాత్రధారులు? ఇందులో రాగ్య భార్య రోజా పాత్ర ఏ మేరకు ఉంది.? తదితర విషయాలు దర్యాప్తులో తేలుతాయని నేరేడుగొమ్ము పోలీసులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment