
మహావిష్ణువు ధరించిన దశావతారాలలో ఐదవ అవతారం వామనావతారం. సకల లోకాలను రాక్షసుల బారినుండి రక్షించడానికి శ్రీమహావిష్ణువు వామనావతారం ధరించాడు. ఒక బాలవటువు రూపంలో బలిచక్రవర్తి యజ్ఞం చేసే ప్రదేశానికి వెళ్ళాడు. ఆ బాలుణ్ణి ఏం కావాలని అడిగితే తనకు మూడు అడుగుల ప్రదేశం చాలన్నాడు. అదెంత భాగ్యం అని ఇచ్చేశాడు. మరుక్షణంలో ఆ బాలుడు అమాంతం పెరిగిపోయాడు. భూమిని ఒక్క అడుగుతోనే ఆక్రమించాడు.
రెండో అడుగుతో ఆకాశాన్ని స్వాధీనం చేసుకుని మూడోఅడుగు ఎక్కడ పెట్టాలని అడిగితే తన తలపై పెట్టమని చెప్పాడు బలిచక్రవర్తి. అలా మూడు అడుగులతో మూడులోకాలనూ ఆక్రమించినవాడే త్రివిక్రముడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అద్భుతమైన శిల్పసౌందర్యంతో అలరారే చింతల వెంకటరమణస్వామి దేవాలయం ఉంది. ఆ ఆలయంపై అనేక పురాణ ఘట్టాలను శిల్పరూపంలో మనం దర్శించవచ్చు.
పైన వివరించిన త్రివిక్రమావతారం కథను తెలిపే అద్భుతశిల్పం అక్కడ ఉంది. ఈ శిల్పం విశేషమేమిటంటే సాధారణంగా ఎక్కడైనా త్రివిక్రముడి ఒక కాలిని భూమిపై, మరో కాలు ఆకాశంలో ఉండి బ్రహ్మతో కడగబడుతూ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మూడోకాలు బలి తలపై ఉంచడం కూడా స్పష్టంగా చూపించడం జరిగింది. ఇటువంటి శిల్పం బహుశా ఇదొక్కటే అని స్పష్టంగా చెప్పవచ్చు. కుడిచేతిలో అభయముద్ర చూపుతూ ఎడమచేతిని పాదంపై పట్టి ఉంచి, వెనుక చేతులలో కుడివైపు శంఖాన్ని, ఎడమవైపు చక్రాన్ని ధరించి బ్రహ్మతో కడగబడుతున్న పాదం కల త్రివిక్రముడి శిల్ప సందర్శనం చింతలను దూరం చేస్తుందని ప్రతీతి.
– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి
Comments
Please login to add a commentAdd a comment