నారదుడు ఒకసారి హిమాలయాలకు చేరుకుని తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి నారదుడి ఘోరతపస్సు కొనసాగుతుండటంతో ఇంద్రుడికి భయంవేసి, నారదుడి తపస్సును ఎలాగైనా భంగం చేయాలనే ఆలోచనతో రంభ మేనక ఊర్వశి తదితర అప్సరసలందరినీ పంపాడు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు. కొన్నాళ్లు తపస్సు చేశాక, తన తపస్సు సిద్ధి పొందినట్లు అనిపించి, తపస్సును విరమించుకున్నాడు నారదుడు. బ్రహ్మ వద్దకు వెళ్లి, తన తపస్సు సిద్ధించిందని చెప్పి, అక్కడి నుంచి కైలాసానికి వెళ్లాడు. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘నా తపస్సు సిద్ధించింది. ఇక శివమాయ నన్నేమీ చేయలేదు’ అన్నాడు.
‘నాయనా! శివమాయను నేనే ఇంకా తెలుసుకోలేదు. కాస్త జాగ్రత్తగా ఉండు’ అని హెచ్చరించాడు శివుడు.శివుడి హెచ్చరికను లక్ష్యపెట్టకుండా, నారదుడు వైకుంఠానికి వెళ్లాడు. లక్ష్మీ సమేతుడైన విష్ణువుకు నమస్కరించి, ‘లక్ష్మీ జనార్దనులారా! నేను తపస్సిద్ధి పొందాను. నన్ను శివమాయ, విష్ణుమాయ ఏమీ చేయలేవు’ అన్నాడు.‘నారదా! మాయ ప్రకృతి నుంచి పుట్టింది. అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉంది. దానిని జయించడం ఎవరి వల్లా కాదు’ అని హెచ్చరించాడు విష్ణువు. నారదుడు విష్ణువు వద్ద సెలవు తీసుకుని, లోకసంచారానికి బయలుదేరాడు. కళ్యాణదుర్గం అనే నగరానికి చేరుకున్నాడు. నగరంలో ఏదో వేడుక జరుగుతున్నట్లుగా కోలాహలంగా ఉంది.
‘ఏమిటి విశేషం? ఈ సందడంతా దేనికి?’ అని తనకు తారసపడిన పురప్రజలను అడిగాడు నారదుడు. ‘రేపే మహారాజు కుమార్తె స్వయంవరం. అందుకే ఈ సందడి’ చెప్పారు వాళ్లు. నారదుడు నేరుగా రాజప్రాసాదానికి వెళ్లాడు. రాజు ఎదురేగి, నారదుడిని స్వాగత సత్కారాలు జరిపి, ఉన్నతాసనంపై ఆసీనుణ్ణి చేశాడు. పరిచారికలను పంపి, తన కుమార్తెను పిలిపించాడు. ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు. ‘మహర్షీ! ఈమె నా కుమార్తె రమాలక్ష్మి. రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను. మహావిష్ణువును తప్ప మరెవరినీ వరించనంటోంది’ అని చెప్పాడు. రాకుమార్తెను చూడగానే, నారదుడికి మాయ ఆవరించింది. ‘రాజా! నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి. నీ వంశం తరిస్తుంది’ అన్నాడు.
‘మునీశ్వరా! స్వయంవరంలో కన్య అభీష్టమే ప్రధానం కదా! రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి. మిమ్మల్నే కోరుకుంటుందేమో చూడండి’ అన్నాడు. ‘తప్పకుండా వస్తాను’ అని చెప్పి, నారదుడు తిన్నగా వైకుంఠానికి వెళ్లాడు. ‘రేపు కళ్యాణదుర్గ నగరంలో రాకుమార్తెకు స్వయంవరం జరగనుంది. ఆమె విష్ణువునే పెళ్లాడుతానంటోంది. నీ రూపు నాకు అనుగ్రహించావంటే, స్వయంవరంలో ఆమె నన్నే వరించగలదు’ అని విష్ణువుతో అన్నాడు. ‘నారదా! నువ్వు శివమాయలో పడ్డావు. కోరిక వదులుకుంటే గాని నీకు శాంతి దక్కదు. అయినా నీ కోరిక మేరకు రేపు నీకు నా రూపాన్ని అనుగ్రహిస్తున్నాను’ అన్నాడు విష్ణువు.నారదుడికి కోపం వచ్చింది.
‘శివమాయ, విష్ణుమాయ నన్నేమీ చేయలేవు’ అంటూ విసవిసా వెళ్లిపోయాడు. మర్నాడు స్వయంవరానికి వెళ్లాడు. ఎందరో రాజకుమారులు అక్కడికి అప్పటికే వచ్చి ఉన్నారు. రాకుమార్తె రమాలక్ష్మి వరమాలతో ఒక్కొక్కరినే పరికిస్తూ ముందుకు సాగుతోంది.సభా మధ్యంలోకి వచ్చేసరికి సమ్మోహనాకారంతో వెలిగిపోతున్న మహావిష్ణువు కనిపించాడు. ఆమె వరమాలను అతడి మెడలోనే వేసింది. మరుక్షణంలోనే రాకుమార్తెను గరుత్మంతునిపై ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. సభాసదులంతా నిశ్చేష్టులయ్యారు. ‘రాకుమార్త ఏదీ?’ అని నారదుడు అడుగుతుంటే, సభాసదులంతా అతణ్ణి చూసి గొల్లున నవ్వసాగారు. ‘ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు’ ఉక్రోషంగా అడిగాడు నారదుడు.
‘నీ శరీరం విష్ణవులాగా ఉన్నా, ముఖం కోతిలాగ, భల్లూకంలాగ ఉంది’ అన్నారు.ఆగ్రహించిన నారదుడు హుటాహుటిన వైకుంఠానికి వెళ్లి విష్ణువుపై నిప్పులు చెరిగాడు.‘నువ్వు నన్ను మోసం చేశావు. నా ముఖాన్ని కోతిలాగ, భల్లూకంలాగ చేశావు గనుక నువ్వు కూడా కోతులను, భల్లూకాలను ఆశ్రయిస్తావు’ అని శపించాడు.‘నిన్ను నేను మోసం చేయలేదు. శివమాయలో చిక్కుకుని నువ్వే మోసపోయావు’ అన్నాడు విష్ణువు. తన దురుసుతనానికి చింతించిన నారదుడు విష్ణువును క్షమాపణ వేడుకుని లోక సంచారానికి బయలుదేరాడు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment