లక్నో: ఉత్తర ప్రదేశ్ అయోధ్య రామాలయం కోసం భారీ రాతి శిలలు.. గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నాయి. ఆదివారం నేపాల్ నుంచి బయల్దేరిన ట్రక్కు.. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇవాళ(గురువారం ఫిబ్రవరి 2) అయోధ్యలో అడుగుపెట్టింది. పూజారులు, స్థానికులు దండలేసి.. ఆ పవిత్రమైన రాళ్లను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పజెప్పారు. వాటిని రామ్ సేవక్ పురంలో భద్రపరిచారు ట్రస్ట్ నిర్వాహకులు. మరి వీటికి ఎందుకంత ప్రత్యేకతో చూద్దాం..
ప్రధాన ఆలయంలోని శ్రీరామ, జానకీ విగ్రహాలను చెక్కేందుకు వీటిని ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు రాళ్లలో ఒకటి 30 టన్నులు, మరొకటి 15 టన్నుల వరకు బరువు ఉంటాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. నేపాల్‌లోని మయాగ్డి-ముస్తాంగ్ జిల్లాల గుండా ప్రవహించే కలి గండకి నది ఒడ్డున ఉన్న జలపాతం చెంత నుంచి ఈ రెండు భారీ శిలలను తెప్పించారు. అంతకు ముందు సీత జన్మస్థలంగా భావించే జనక్‌పూర్(నేపాల్)లో వీటికి ప్రత్యేక పూజలు జరిగాయి కూడా.
శాలిగ్రాముల ప్రత్యేకత ఏంటంటే..
సాలిగ్రామ (శాలిగ్రామ).. సాలిగ్రామ శిలలని కూడా పిలుస్తారు. నేపాల్ గంకీ రాష్ట్రంలో.. దామోదర్ కుండ్ నుంచి గండకీ నది ఉద్భవిస్తుంది. గండకీ నదికి ఉపనది అయిన కలి గండకీ ప్రవాహ తీరంలోనే ఇవి కనిపిస్తాయి. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 6వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఈ శిలలను విష్ణు మూర్తికి ప్రతీకలుగా భావిస్తారు. వాస్తవానికి.. ఇవి డెవోనియన్-క్రెటేషియస్ కాలానికి చెందిన అమ్మోనైట్ షెల్ శిలాజాలు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇవి ఇక్కడ ఉంటున్నాయి. హిందువులు ఈ శిలాజాలను పవిత్రమైనవిగా గౌరవిస్తారు. ఎందుకంటే..
మధ్వాచార్య, అస్తమూర్తి(వ్యాసదేవ) నుండి అందుకున్నాడని, అందుకు వాటిపై ఉండే విష్ణు చిహ్నాలు, ముఖ్యంగా శంఖాన్ని పోలి ఉండడమే కారణమని భావిస్తారు. అదీ కాకుండా.. జానకీ మాత జన్మించిన నేల కావడంతో ఈ శిలలకు ప్రత్యేకత సంతరించుకుంది. అక్కడ ఉన్న శిలలకు కోట్లాది ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఆ విగ్రహాలు కూడా..
ఉడుపి కృష్ణ మఠంలో కృష్ణ విగ్రహం, బృందావనంలోని రాధా రామన్ ఆలయం, తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం, గర్వాల్‌లోని బద్రినాథ్ ఆలయంలోని విగ్రహాలు సాలిగ్రామ్ శిలలతోనే తయారు చేసినట్లు తెలుస్తోంది. దేవీ భాగవతా పురాణా, బ్రహ్మవైవర్థ పురాణా, శివ పురాణాలలో సాలిగ్రామ శిలల ప్రస్తావన కూడా ఉంది.
కొన్ని నివేదికల ప్రకారం.. ఆదిశంకర రచనలలోనూ.. సాలిగ్రామ(శాలిగ్రామ) శిలల గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. తైత్తిరీయ ఉపనిషత్తులోని 1.6.1వ శ్లోకం, బ్రహ్మ సూత్రాలలోని 1.3.14 శ్లోకాలకు ఆదిశంకర తన విష్ణువు ఆరాధనలో శిల ఉపయోగించడం సుప్రసిద్ధ హిందూ ఆచారంగా ఉండేదని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇవేకాదు.. చాలాచోట్ల సాలిగ్రామ శిలలు కొన్ని నకిలీవి వాడుకలో ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment