తిరుమల ఆలయాన్ని దర్శించిన ఎవరికైనా యోగ నరసింహస్వామి గురించి తెలిసే ఉంటుంది. స్వామివారి ఆలయానికి ఈశాన్య దిక్కున యోగ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. విమాన ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరిగి వెళుతున్నప్పుడు రామానుజులవారి సన్నిధి దాటి ముందుకు వెళుతుండగానే యోగ నరసింహ స్వామి వారి సన్నిధి కనిపిస్తుంది. ప్రత్యేకమైన ఆలయంలో స్వామి వారు పడమర వైపు తిరిగి వెంకటేశ్వరస్వామి వారిని చూస్తున్నట్లు ఉంటుంది. ఈ నరసింహస్వామి వారు పద్మపీఠంపై రెండు కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు. ఈ ఆసనాన్ని యోగాసనం అంటారు. యోగ రూపంలో దర్శనమిచ్చే దేవతలు ఈ ఆసనం లోనే ఉంటారు.
రెండు మోకాళ్లకు యోగపట్టిక వేసి ఉంటుంది. స్వామివారి రెండు చేతులు ముందుకు చాచి రెండు మోకాళ్లపై ఉంటాయి. వెనుక చేతులలో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి ఉంటాడు ఈ స్వామి వారిని కేవల నరసింహమూర్తి, గిరిజ నరసింహమూర్తి అని కూడా అంటారు పర్వతాలపై, గుహలలో ఇటువంటి రూపం మనకు దర్శనమిస్తుంది వైఖానసాగమం ఈ మూర్తి స్ఫటికకాంతి గల శరీరంతో ఉంటాడని చెప్పింది. ఈ స్వామి వారిని దివ్యప్రబంధంలో ఆళ్వారులు అలగియ సింగర్(అందాల నరసింహుడు) అనే పేరుతో పిలిచారు.
శ్రీమద్రామానుజులవారు ఈ స్వామిని ఇక్కడ ప్రతిష్టించారు.ఈ స్వామికి నిత్యకైంకర్యాలేవీ జరుగకపోయినా ప్రతి శనివారం తిరుమంజనం (దివ్యాభిషేకం) నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు,దివ్యప్రబంధపారాయణలు అందుకుంటాడు.ఈ స్వామికి ఉత్సవవిగ్రహం లేదు.కానీ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో సింహవాహనంపై ఊరేగే మలయప్పస్వామివారు మాత్ర ఈ యోగనరసింహస్వామివలె యోగాసనంతో దర్శనమిస్తారు. యోగనరసింహస్వామివారిని దర్శిస్తే శతృబాధలుండవనీ, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు కలుగుతాయని వైష్ణవాగమాలు చెబుతున్నాయి.
– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి
Comments
Please login to add a commentAdd a comment