ఎటుచూసినా భక్తి భావం, శివ తన్మయత్వంతో భక్త కోటి పారవశ్యం. హరోం హర అంటూ ఆ మహా దేవుడి నామస్మరణతో జిల్లాలోని శైవ క్షేత్రాలు మార్మోగాయి. మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పరమ శివుడి వైభవాన్ని తిలకించేందుకు భక్తులు శైవ క్షేత్రాల వద్ద బారులు తీరారు. ఈశ్వరుడిని దర్శించి అర్చనలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శివ పంచాక్షరీ జపాలు, ఉపవాసాలు,జాగరణతో భక్తి పరాధీనుడైన, భోళా శంకరడును భక్తి ప్రప్రత్తులతో సేవించి తరించారు.
ఓం నమః శివాయ అన్న శివపంచాక్షరీ మంత్రం జిల్లా వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాది భక్తులు శివక్షేత్రాలను దర్శించుకుని అభిషేక ప్రియుడిని తనివితీరా దర్శించి... అభిషేకాలు గావించారు. హరహర మహాదేవ శంభోశంకర అంటూ స్వామిని అర్చించారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలైన కోటప్పకొండపైన త్రికోటేశ్వరుడు, అమరావతిలోని అమరేశ్వరుని, పెదకాకానిలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి, క్వారీ బాలకోటేశ్వరుడు, గోవాడ బాలకోటేశ్వరుడి ఆలయ ప్రాంగణాలు భక్తులతో పోటెత్తాయి. పలు చోట్ల విద్యుత్ ప్రభలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు.
భక్తులతో పోటెత్తిన పెదకాకాని శివాలయం
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పెదకాకానిలోని శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం మంగళవారం భక్తులతో పోటెత్తింది. హరహరమహాదే వా... శంభోశంకర నామంతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భమరాంబ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక స్టేజీ పై శ్రీ దక్షిణామూర్తి సన్నివేశం ఏర్పాటు చేశారు. ఆలయంలో సుప్రభాత సేవ, మహా హారతులు, నిత్యౌపాసన, గ్రామ బలిహరణ, శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వ ఏకాదశ రుద్రాభిషకములు, మహానివేదన, ఆలయ బలిహరణ, లింగోద్భవ కాలమున స్వామివారికి ఏకాదశ ద్రవ్యములతో రుద్రాభిషేకం, గజవాహనంపై ఎదుర్కొలోత్సవం నిర్వహించారు. కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. భక్తులు పొంగళ్లు పొంగించిన అనంతరం శివనామం స్మరిస్తూ ప్రదక్షిణలు చేశారు. శ్రీభ్రమరాంబ అమ్మవారిని, శ్రీ మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
భక్తజనసంద్రంగా త్రికూటాద్రి
నరసరావుపేటరూరల్ : మహాశివరాత్రి సందర్బంగా ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శివనామస్మరణతో మార్మోగింది. రాష్ట్రం నలుమూలలనుండి లక్షలాదిమంది తరలివచ్చి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున రెండుగంటలకు స్వామివారికి బిందితీర్థంతో అభిషేకాలు గావించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసారు. తెల్లారుజామునుంచే భక్తుల రాక మొదలైంది.
ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. మధ్యాహ్నానికి భక్తుల రద్దీ తక్కువగా కనిపించినా, సాయంత్రానికి భారీగా పెరిగింది. సాలంకయ్య అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు విరివిగా జరిగాయి, యాగశాలలో చండి, రుద్ర, గణపతి యాగాలు నిర్వహించారు. ధ్యాన శివుడు, నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు. నూతనంగా నిర్మించిన ప్రసాదం కౌంటర్ వద్ద భక్తుల రద్దీ కనిపించింది. మెట్లమార్గంలో పలువురు భక్తులు మెట్లపూజతో కొండకు చేరుకున్నారు. గొల్లభామ గుడి భక్తులతో నిండిపోయింది. పలు స్వచ్ఛంద సంస్థలు కొండమీద భక్తులకు ఉచితంగా ప్రసాదాలు, మంచినీరు అందజేశాయి.
వీఐపీల తాకిడి
సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ర్టమంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, జి.వి.ఆంజనేయులు, యేలూరి సాంబశివరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, అప్కో చైర్మన్ మురుగుడు హానుమంతురావులు త్రికోటేశ్వరుని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జె.వి.ఎస్.ప్రసాద్ త్రికోటేశ్వరున్ని దర్శించుకుని తిరునాళ్ళ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా రూరల్ ఎస్పీ రామకృష్ణ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.
క్వారీ బాలకోటేశ్వరుడి ఆలయం కిటికట
చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా క్వారీ బాలకోటేశ్వరస్వామి దర్శనానికి సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భక్తి శ్రద్దలతో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. వివిధ గ్రామాల భక్తులు సుమారు 12 భారీ విద్యుత్ ప్రభలను నిర్మించారు. గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్, పొన్నూరు శాసనసభ్యుడు డి.నరేంద్రకుమార్, డిఆర్‌వో కె.నాగబాబు, తెనాలి ఆర్డీవో కె.నరసింహ వచ్చి పూజలు నిర్వహించారు
శివేన సహమోదతే..
Published Wed, Feb 18 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement
Advertisement