devootes
-
దర్శనం కోసం వెళ్లారు.. వంకలో చిక్కుకుపోయారు
సాక్షి, మైదుకూరు: వైఎస్సార్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని భైరవకోన క్షేత్రానికి జీపులు, ట్రాక్టర్లలో వెళ్లిన భక్తులు ఆదివారం వర్షాల కారణంగా మోట్లకట్ట వంక వద్ద చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న మైదుకూరు డీఎస్పీ విజయకుమార్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 30 ట్రాక్టర్లు, 2 జీపుల్లో ఉన్నవారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చీకటిపడి సహాయక చర్యలకు ఆటంకం కలగడంతో మరో 3 జీపులు, 2 ట్రాక్టర్లలో భక్తులు వంక ఆవలవైపు ఉండిపోయారు. -
అన్ని దారులూ జిల్లావైపే..!
జిల్లాలోని గోదారి తీరం పులకించింది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు కరీంనగర్వైపే వస్తున్నారు. దీంతో ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల, మంథని పుష్కర ఘాట్లు శుక్రవారం కిక్కిరిసిపోయాయి. నాలుగు రోజుల రికార్డులను మించిన సంఖ్యలో శుక్రవారం ఆయా ఘాట్లలో భక్తులు స్నానమాచరించారు. దాదాపు 12 లక్షల మందికిగా పైగా జిల్లాలోని పుష్కర ఘాట్లను సందర్శించినట్లు అధికారుల అంచనా. - సాక్షి, ప్రతినిధి కరీంనగర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ధర్మపురి, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలు శుక్రవా రం జనసంద్రమయ్యాయి. ఒక్క ధర్మపురిలోనే 5.10 లక్షలమందికిపైగా స్నానం చేశారు. కాళేశ్వరంలోనూ 4.10 లక్షల మంది పుణ్యస్నానమాచరించారు. కోటిలింగాల, మంథనిలోనూ జనం పోటెత్తారు. కోటిలిం గాలలో లక్షమందికిపైగా పుణ్యస్నానమాచరించగా, మంథనిలోనూ సా యంత్రం 85 వేల మందికిపైగా పుష్కర స్నానం చేశారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో జిల్లాలోని పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయని జిల్లా పోలీసులు, అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరంలో ట్రాఫికర్... పుష్కరాల ప్రారంభంలో రెండు రోజుల పాటు భక్తు ల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మూడవ రోజు రద్దీ తగ్గింది. కానీ తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తరువాత రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రాత్రి 9 గంటల వరకు భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం నుంచి ప్రధాన ఘాట్ వరకు వెళ్లే రోడ్డు కిక్కిరిసిపోయింది. దీంతో భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. ఒకే రహదారి వెంట ఘాట్ వద్దకు వెళ్లే ఆటోలు, కాలినడకన భక్తు లు వెళ్లడంతో కొంత తోపులాట పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఆటోల రాకపోకలను నియంత్రించి మరో రహదారి గుండా పంపివేయడంతో స్వల్పంగా ట్రాఫిక్ సద్దుమణిగింది. ధర్మపురి... జనపురి పుష్కర భక్తులతో ధర్మపురి జనపురిగా మారింది. శుక్రవారం ఒక్కరోజే 5.10 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయన్న విషయమై కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్, ఎస్పీ జోయల్ డేవిస్‌లు వేర్వేరుగా పుష్కర ఘాట్లను కలియదిరిగి భక్తులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. భక్తులు ఉదయం 10 గంటల సమయంలో ఎక్కువ సంఖ్యలో రావడంతో రాయపట్నం నుంచి వచ్చే తోవలో ఉన్న వాహనాల పార్కింగ్ సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. అదనంగా పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు అదికారులు చర్యలు చేపట్టారు. భక్తులు సంఖ్య ఒక్కసారిగా ఎక్కువ కావడంతో ధర్మపురి గోదావరి పుష్కరఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో భక్తులు గోదావరి ప్రవాహం కోసం దూరంగా వెళ్లి పుష్కర స్నానాలు చేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా... గోదావరిఖని పుష్కరఘాట్ వద్ద శుక్రవారం 20 వేల మంది, గోలివాడ పుష్కరఘాట్ వద్ద 4వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. శుక్రవారం 36 డిగ్రీ ల ఉష్ణోగ్రత రామగుండం ప్రాంతంలో నమోదు కాగా, ఎండ తీవ్రతతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. పుష్కరఘాట్ వద్ద పిండ ప్రదానాలు చేసేం దుకు బ్రాహ్మణులకు, భక్తులకు టెంట్లు వేయకపోవడంతో వారు ఎండతీవ్రతతో ఇబ్బందులు పడ్డారు. కోటిలింగాలలో లక్ష స్నానాలు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పుష్కలంగా ఉన్న కోటిలింగాలలో శుక్రవారం ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. ఏకంగా లక్షమందికిపైగా పుష్కర స్నానమాచరించారు. దీంతో కోటిలింగాల ప్రాంతమంతా భక్తు ల తాకిడితో కిక్కిరిపోయింది. జిల్లాలోని మిగిలిన పుష్కర ఘాట్లలోనూ గత మూడురోజులతో పోలిస్తే భక్తుల సంఖ్య పెరిగింది. ఆయా ఘాట్లన్నింటిలో కలిపి సుమారు లక్షల మంది పుణ్య స్నానాలు చేసి పులకించిపోయారు. పుష్కరాల్లో పలువురు వీఐపీలు కాళేశ్వరంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్, ఐజీ ఎన్కే.సింగ్, మెదక్ జిల్లా తొగుట మహానంద సరస్వతి స్వామిజీ, హంపీ ఉపపీఠాధిపతి గోవిందానందస్వామి, జెన్కో డెరైక్టర్ రాధాకృష్ణ, హైకోర్టు రిజిస్ట్రార్ విద్యాధర్భట్, సీఎం కేసీఆర్ అన్న కూతురు రేగులపాటి రమ్య పుష్కరస్నానం చేశారు. మంథనిలో హైకోర్టు మాజీ జడ్జీ పీఎల్ఎన్.శర్మతో పాటు పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మపురిలో తొలి తెలంగాణ మహిళా పైలట్ స్వాతీరావు, తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేణుగోపాల్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, దర్శకుడు హరిశంకర్‌లు పుష్కర స్నానాలకు హాజరయ్యారు. గోదావరిఖని సమీపంలోని సుందిల్ల పుష్కరఘాట్ వద్ద సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్, డెరైక్టర్ ఎ.మనోహర్‌రావు, జనగామ గ్రామ శివారు గోదావరి నది వద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగమారుతిశర్మ పుష్కర స్నానాలు చేశారు. -
జోగుళాంబకు బంగారు ముక్కుపోగులు
అలంపూర్ : దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రంలో ఐదో శక్తిపీఠంగా వెలిసిన జోగుళాంబ అమ్మవారికి భక్తులు శనివారం బంగారు ముక్కుపోగులను బహుకరించారు. జిల్లాలోని వెల్దండ మండలం చదురుపల్లి గ్రామానికి చెందిన చిన్న అంజయ్య, పోలే అంజయ్య ఒక్కొక్కరు 5 గ్రాముల బరువు గల రెండు బంగారు ముక్కుపోగులను అమ్మవారికి బహుకరించారు. వారు బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయ ఈఓ నరహరి గురురాజకు వాటిని అందజేశారు. వీటి విలువ సుమారు రూ. 26 వేల వరకు ఉండవచ్చని తెలిపారు. -
భక్తవ శంకర లోక శుభంకర
శ్రీశైలం: తెలుగు సంవత్సరాది.. ఉగాది పర్వదినాన జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో పోటెత్తింది. భక్తవ శంకర..లోక శుభంకర నమోనమో అంటూ సుమారు మూడు లక్షలకుపైగా భక్తులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ నెల 18 నుంచి నిర్వహిస్తున్న ఉగాది మహోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి జరిపారు. అనంతరం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల రథోత్సవం రమణీయంగా సాగింది. స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సరప్రారంభం సందర్భంగా స్వామిఅమ్మవార్ల ఆలయాల్లో సుప్రభాత సేవ, మహా మంగళ హారతి, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగిస్తూ మేళతాళాల మధ్య ఆలయ ప్రాంగణం నుంచి రథశాల వద్దకు తీసుకువచ్చారు. పల్లకిలో వచ్చిన స్వామిఅమ్మవార్లను రథంలోనికి అధిష్టింపజేశారు. రథాంగబలిలో భాగంగా ఈవో సాగర్‌బాబు, ఈఈ రమేష్, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి, ఏఈఓ రాజశేఖర్, కేశవరావు, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, నాగభూషణం, శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ కడప అనిల్‌కుమార్, అర్చకులు, వేదపండితులు కూష్మాండబలిని సమర్పించారు. అనంతరం కన్నడ భక్తులు సిరిగిరి మల్లయ్య, మహాత్మ మల్లయ్య అని మల్లికార్జునస్వామిని కొనియాడుతూ ఓంకారనాద ధ్వనుల మధ్య రథశాల నుంచి రథోత్సవం బయలుదేరింది. రథం మీదికి అరటి పండ్లు, ఎండు ఖర్జూరం, కలకండలను విసిరి తమ భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత నంది మండపం నుంచి తిరిగి రథోత్సవం బయలుదేరి రథశాలకు చేరింది. జిల్లా ఎస్పీ రవికృష్ణ నేతృత్వంలో ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జగద్గురు స్వామీ అడ్డపల్లకి మహోత్సవం.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాన మాడా వీధిలో శ్రీశైల జగద్గురు సూర్యసింహాసన పీఠాధిపతి డాక్టర్ చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామీజీ అడ్డపల్లకిలో ఊరేగుతూ భక్తులకు శుభాశ్సీసులను తెలిపారు.ప్రధాన మాడా వీధి నుంచి అడ్డపల్లకిలో వచ్చిన ఆయనకు కృష్ణ దేవరాయగోపురం వద్ద ఏఈఓ రాజశేఖర్ ఆలయమర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం స్వామీజీ ఆలయప్రాంగణంలోని జగద్గురు పీఠానికి వెళ్లారు. మల్లన్న సేవలో కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ అనంతకుమార్‌సింగ్ శనివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ప్రధానాలయగోపురం వద్ద ఈవో సాగర్‌బాబు ఆలయమర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆలయప్రాంగణంలో వేదపండితులు ఆశీర్వచనాలు పలుకగా, అధికారులు.. స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను అందజేశారు. -
తెలుగింట నూతన శోభ
నెల్లూరు(బృందావనం): తెలుగువారి పండగ ఉగాదిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఆలయాలు సర్వాలంకారశోభితంగా కళకళలాడాయి. నూతన (మన్మథ నామ) సంవత్సరంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ఆలయాల్లోని తమ ఇష్టదైవాలను వేడుకునేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. దీంతో ఆలయాలు కిటకిటలాడాయి. సూర్యభగవానుడు మేషరాశిలోకి ప్రవేశించే శుభదినాన జరుపుకొనే ఉగాది పండగను పురస్కరించుకుని ఆలయాలు వేదపండితుల పంచాగశ్రవణం, అర్చకుల విశేషపూజలు, వేదఘోషతో మార్మోగాయి. ప్రతి ఇంట ఉగాది శోభ కనిపించింది. నూతన వత్సరం తొలిరోజు బంధుమిత్రులు, కుటుంబసమేతంగా ‘షడ్రుచుల ఉగాది పచ్చడి’ ఆరగింపుతో పాటు తీపివంటకాలతో గృహాలు కళకళలాడాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు థార్మిక, స్వచ్ఛంద, సాహిత్య, సాంస్కృతిక సంస్థలతోపాటు వాకర్స్అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు. -పాడిపంటలతో కళకళలాడాలి.. సుఖసంతోషాలతో జీవించాలి: - మేకపాటి రాజమోహన్‌రెడ్డి దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ప్రజలందరూ పాడిపంటలతో, సుఖసంతోషాలతో జీవించాలని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిని వేడుకున్నట్లు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ఉగాది పండగ సందర్భంగా స్థానిక కరెంటాఫీస్ సెంటర్ సమీపంలోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం ఆయన కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకుని విశేషపూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు వత్సరాది ఉగాది పండగనాడు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది అంతా సకాలంలో వర్షాలు కురియాలని, పంటలు విరివిగా పండాలని, ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భగవంతుడు చల్లంగా చూడాలని మొక్కుకున్నానని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. -
మారెమ్మవ్వా.. వరాలివ్వమ్మా!
గద్దెరాళ్ల(దేవనకొండ): జిల్లాలో ప్రసిద్ధి చెందిన గద్దెరాళ్ల మారెమ్మవ్వ దేవర ఉత్సవాలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి దాదాపు మూడు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల్లో పల్లెదొడ్డి బోనాల ఊరేగింపుకు ప్రత్యేకత ఉంది. జాతరకు ముందు గ్రామస్తులు ఐక్యంగా వారివారి ఇళ్ల నుంచి ఇంటికొక బోనం ప్రకారం దాదాపు 520 బోనాలను (కుండలు) నెత్తిన పెట్టుకొని దాదాపు 3 కి.మీ. దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు. అవ్వ ఆలయం ఎదుట ఆ బోనాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లెదొడ్డి బోనాలు ఆలయం ఆవరణలోనికి చేరుకునే సమయంలో ఉత్సవాలకు హాజరైన భక్తులందరూ అవ ఆలయం వెనుకభాగంలో ఉన్న కొండవైపు చూశారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిసారి అవ్వ రూపంలో ఒక గద్ధ ఆలయం వెనుకభాగంలో ఉన్న కొండపై కూర్చొంటుందని భక్తుల నమ్మకం. అయితే ఈ ఏడాది కూడా పల్లెదొడ్డి బోనాలు ఆలయ ఆవరణలోకి వచ్చిన వెంటనే ఒక గద్ద ఆలయం చుట్టూ తిరిగి అక్కడున్న కొండపై కాసేపు కూర్చొంది. అనంతరం వెళ్లిపోయింది. ఆ గద్ద కొండపై నుంచి వెళ్లిపోయే సమయంలో భక్తులు అవ్వఉత్సవాలను తిలకించేందుకు వచ్చిందంటూ మారెమ్మవ్వకు జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం సంప్రదాయ పద్ధతుల్లో 50 వేలకు పైగా వివిధ మూగజీవులను అవ్వ ఆలయం ముందు బలిచ్చారు. ఆ సమయంలో ఆలయ ఆవరణం భక్తుల సందడితో కిక్కిరిసింది. ఉత్సవాలకు హాజరైన భక్తులకు దేవదాయశాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణ అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డోన్ డీఎస్పీ పి.ఎన్.బాబు, పత్తికొండ సీఐ గంటా సుబ్బరావు ఆధ్వర్యంలో దాదాపు వంద మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యసిబ్బంది దాదాపు 15 మంది ఆరోగ్య కార్యకర్తలతో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. అవ్వను దర్శించుకున్న ప్రముఖులు గద్దెరాళ్ల మారెమ్మవ్వను మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు శ్రీనివాసులు, దేవనకొండ ఎంపీపీ రామచంద్రనాయుడు, ఆస్పరి, దేవనకొండ జెడ్పీటీసీ సభ్యులు బొజ్జమ్మ, సరస్వతి, ఉచ్చీరప్ప, మలకన్న, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కిట్టు, తపాల శ్రీనివాసనాయుడు, కందనాతి రంగ న్న, కబీర్, అంజి దర్శించుకున్నారు. జాతరలో దొంగల హల్చల్... బోనాలను సమర్పించే సమయంలో ఆలయ ఆవరణమంతా భక్తులతో కిక్కిరిసింది. దీంతో దొంగలు కొంతమంది చేతివాటం ప్రదర్శించారు. దీంతో బంగారు నగలు తదితర వాటిని పోగొట్టుకున్న మహిళలు బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగలు దోపిడీకి గురైన వారిలో దేవనకొండకు చెందిన మంగళి మహేశ్వరి ఒకరు. ఆమె ఒంటిపైనున్న రెండు తులాల బంగారు గొలుసు, మంగళసూత్రాన్ని దొంగలు అపహరించారు. అలాగే దాదాపు 20 మందికి పైగా మహిళలకు సంబంధించిన చిన్నచిన్న నెక్లెస్‌లు, పిక్‌ప్యాకెట్లు కూడా చోరీకి గురయ్యాయి. -
రెండో రోజు కిరణ స్వర్శ
-
శేషవాహనంపై ఊరేగిన ఖాద్రీశుడు
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు శుక్రవారం రాత్రి శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఉత్సవంలోనూ నారసింహుడు మాత్రమే తిరు వీధుల్లో విహరించేవారు. శేషవాహనంపై మాత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబరాలతో విశేషాలంకరణలో ఉన్న ఖాద్రీశుడు రాత్రి తొమ్మిది గంటలకు శేషవాహనంపై కొలువుదీరారు. స్వామివారి దివ్య మంగళరూపాన్ని భక్తులు దర్శించుకుని తరించారు. స్వామి వారు తిరు వీధులగుండా విహరించేందుకు ప్రధాన గోపురం వద్దకు రాగానే.. భక్తులు గోవింద నామస్మరణతో మార్మోగించారు. శేష వాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే నాగదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు అలయంలో నిత్యాన్నదానం చేశారు. ఆలయ ప్రాంగణంలోని అద్దె గదులు ఖాళీగా లేకపోవడంతో భక్తులు కటిక నేలపైనే నిద్రించారు. శేష వాహన ఉభయదారులుగా యాదాలం శ్రీనివాసులు, బాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. -
కాళింగ నర్తనోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం దిగువ అహోబిలంలో కాళింగ నర్తనోత్సవం కన్నుల పండువగా సాగింది. కృష్ణావతారంలో స్వామి యమునా నదిలో కాళింగ సర్పం శిరస్సుపై నాట్యమాడారు. ఆ ఘట్టాన్ని ప్రతిబింబిస్తూ కాళింగ నర్తనోత్సవాన్ని నిర్వహించారు. ఎగువ అహోబిలంలో భక్తుల గోవిందనామ స్మరణల మధ్య రథోత్సవం నిర్వహించారు. భక్తులు జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం దిగువ అహోబిలంలో కాళింగనర్తనోత్సవం ఘనంగా జరిగింది. కృష్ణావతారంలో స్వామి వారు యమునానదిలో కాళింగ అనే సర్పం శిరస్సుపై తన పాదంను ఉంచి నాట్యమాడారు. ఆ కృష్ణావతారాన్ని ప్రతిభింబిస్తూ కాళింగ నర్థనోత్సవాన్ని నిర్వహించారు. అహోబిలం తిరువీధులలో ఉత్సవం నిర్వహించిన అనంతరం పల్లకి అహోబిలం మఠంకు చేరుకుంది. మఠంలో 46వపీఠాధిపతి శ్రీవన్శఠగోప యతీంద్ర మహదేశికన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారులకు అభిషేకాన్ని వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య రమణీయంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు తొట్టి తిరుమంజనం కార్యక్రమం జరిపారు. కృష్ణావతారంలో యమునానదిపై స్వామి వారు పాదాలు పెట్టి నదిని పునీతం చేశారు. పునీతమైన యమునా నది నీళ్లు తీసుకోలేని వారి కోసం అహోబిలం బ్రహ్మోత్సవాల సమయంలో వెండి గంగాళంలో నీరు తీసుకొని గంగ, యమునా, సరస్వతి నదులను ఆవాహనం చేసి పుణ్యాహవాచనం జరిపిన తరువాత శుద్ధజలంలో ఉత్సవమూర్తు పాదాలను ఉంచారు. అనంతరం ఆనీటిని భక్తులకు తీర్థంలో రూపంలో అందచేశారు. తొట్టితిరుమంజనంలో పీఠాధిపతి పాల్గొని పూజలు నిర్వహించారు. తొట్టితిరుమంజనం తరువాత ప్రహ్లాదవరదస్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఎగువ అహోబిలంలో: ఎగువ అహోబిలంలో రథోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తులు జ్వాలానరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా రథం వరకు తీసుకవచ్చారు. రథోత్సవంలో వేదపండితులు వేదపారాయణం చదువుతుండగా ఉత్సవమూర్తులను రథంలో కొలువుదీర్చారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య రథం ముందుకు సాగింది. రథంను లాగి భక్తులు తన్మయత్వం పొందారు. రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఎగువ అహోబిల దేవాలయ ప్రాంగాణం భక్తులతో నిండిపోయింది. అహోబిలంలో నేడు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఎగువ అహోబిలంలో ఉత్సవం, ద్వాదశారథనం, గరుడోత్సవం, దిగువ అహోబిలంలో రథోత్సవం, ఉత్సవం ఉంటాయని దేవస్థాన మేనేజర్ రామానుజన్ తెలిపారు. -
వైభవంగా ప్రహ్లాదవరదుడి కల్యాణం
ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లి అమ్మవార్ల కల్యాణం వైభవంగా సాగింది. 108 దివ్యక్షేత్రాల్లో జరిగే బ్రహ్మోత్సవాల్లో కల్యాణోత్సవం జరిగేది ఒక్క అహోబిల క్షేత్రం మాత్రమే. అందుకే అహోబిలంలో జరిగే కల్యాణోత్సవాన్ని తిలకించడానికి వేలాదిగా భక్తులు హాజరయ్యారు. అహోబిలమఠం 46 పీఠాధిపతి శ్రీవన్శఠగోప యతీంద్రమహదేశికన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ దివ్య కల్యాణ క్రతువును నిర్వహించారు. టీటీడీ ఈవో సాంబశివరావు టీటీడీ తరఫున ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. తన కల్యాణోత్సవ సమయంలో వెంకటేశ్వరస్వామి అహోబిల నరసింహస్వామిని పూజించారని పురాణాలు చెపుతున్నాయి. వెంకటేశ్వరస్వామి ఇష్టదైవమైన నరసింహస్వామి కళ్యాణానికి టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. వేదపండితులు విశ్వక్షేణునికి మొదట పూజలు నిర్వహించారు. ఘంటానాదం, మంగళవాయిద్యాలు నడుమ స్వామివారికి, అమ్మవారికి కంకణధారణ కార్యక్రమం నిర్వహించారు. లోకరక్షణ కోసం రక్షబంధనంను సంప్రదాయబద్ధంగా జరిపారు. స్వామి వారికి,అమ్మవారికి మంగళనీరాజనం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.స్త్రీసూక్తం, పురుష సూక్త పారాయణం చేశారు. నిత్యహోమంను హోమద్రవ్యాలతో నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణ మధ్య మాంగళ్యధారణ కార్యక్రమం జరిపారు. పీఠాధిపతికి ఆలయ మర్యాదలు చేశారు. కల్యాణోత్సవాన్ని దేవ స్థాన అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, దేవస్థాన మేనేజర్ రామానుజన్‌లు పర్యవేక్షించారు.ఎఎస్పీ శశికుమార్, సీఐ ఓబులేసు, ఎస్సైలు సాయినాథ్, సోమ్లానాయక్‌లు బందోబస్తు నిర్వహించారు. -
అందాల నిలయం.. ప్రకృతి సోయగం
దట్టమైన అడవిలో కొండల మధ్య కృష్ణమ్మ హొయలు.. పక్షుల కిలకిలరావాలు.. జింకల పరుగులు.. పులుల గాండ్రిపులు.. ఎంతో అరుదైన ఔషధ వృక్షాలు.. ప్రకృతి ఒడిలో సేద తీరాలనిపించే చల్లనిగాలులు.. అబ్బురపరిచే రాతికొండలు, చె క్కిన శిల్పాల్లా భ్రమించే రాతిశిలలు.. భక్తిభావంగా నిలిచే పురాతన ఆలయాలు.. ఇలా ఎన్నెన్నో అందాలకు నల్లమల నెలవు. ఇంతటి అందమైన కృష్ణాతీరానికి పర్యాటక శోభ సంతరించుకోనుంది. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. కొల్లాపూర్: మహబూబ్‌నగర్, కర్నూల్ జిల్లా సరిహద్దులో నల్లమల కొండల మధ్య ప్రవహిస్తున్న కృష్ణాతీరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కారు చర్యలు ప్రారంభించింది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల నుంచి కృష్ణానది గుండా భక్తులు, పర్యాటకులు శ్రీశైలం చేరుకునేందుకు ప్రత్యేకబోట్లను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం సోమశిలకు ప్రత్యేకబోట్లు రప్పిస్తోంది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ స్వయంగా సోమశిలకు విచ్చేసి పర్యాటక ఏర్పాట్లను చర్చించనున్నారు. పర్యాటన ఇంకా ఖరారు కాకపోయినా..అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అందాల కొలువు సోమశిల గ్రామం నుంచి శ్రీశైలానికి కృష్ణానదీ గుండా మరబోట్లలో ప్రయాణం సాగించేందుకు 120 కి.మీ ఎనిమిది గంటల సమయం పడుతుంది. తీరం వెంట మత్స్యకారుల నివాసాలు, చెంచుగూడేలు మాత్రమే ఉంటాయి. కృష్ణమ్మ పరవళ్లు, తీరం వెంట నల్లమల అడవి ప్రకృతిసోయగాలు, పక్షుల అందాలు ప్రయాణిలను కనువిందు చేస్తాయి. నవంబర్ నెల నుంచి ఫిబ్రవరి మధ్యలో నల్లమల అడవిపచ్చగా కనువిందు చేస్తోంది. నదీ ప్రయాణాలు సాగించే వారు సోమశిలలోని చారిత్రక లలితాంబికా సోమేశ్వరాలయంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. సోమశిలకు సమీపంలో కృష్ణానది మధ్యన కర్నూలు జిల్లా భూభాగంలో గల సంగమేశ్వర ఆలయాన్ని చూడొచ్చు. ఈ ఆలయం ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు కృష్ణానదిలో మునిగి ఉంటుంది. సోమశిల నుంచి 15 కి.మీ దూరంలో చీమలతిప్ప దీవి వస్తుంది. సమీపంలో కొండపై అత్యంత పురాతనమైన ఆంకాలమ్మ కోట ఉంటుంది. కాళీమాత, ఆంజనేయస్వామి దేవతామూర్తులను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి 75 కి.మీ దూరంలో నీటిగంగ జలపాతం కొండలు కనిపిస్తాయి. అక్కడ శివుడి ఆలయం ఉంది. ఇక్కడి నుంచి కొండలపైకి ఎక్కి 45 నిమిషాల్లో శ్రీశైలం గుడివద్దకు చేరుకుంటారు. ప్రయాణం సాగించేందుకు వీలుగా కాలిబాట ఉంటుంది. నీటిగంగ కొండల నుంచి బోటులో ప్రయాణిస్తే శ్రీశైలానికి చేరుకునేందుకు రెండున్నర గంటల సమయం పడుతుంది. 15కి.మీ బోటులో ప్రయాణిస్తే అక్కమాంబ గుహలు కనిపిస్తాయి. అక్కడినుంచి నల్లమల కొండలో ఏడు కి.మీ కాలినడక వెళ్తే కదిరివనం చేరుకోవచ్చు. అక్కమాంబ గుహల నుంచి బోటులో 15కి.మీ దూరం ప్రయాణిస్తే శ్రీశైలంలోని పాతాళ గంగను చేరుకుంటాం. పర్యాటక ప్రాంతంగా.. నదీప్రయాణాలకు ప్రభుత్వం పర్యాటక బోట్లను ఏర్పాటుచేస్తే కృష్ణాతీర ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయి. పాపికొండలను తలపించే నల్లమల అందాలకు గుర్తింపు లభిస్తుంది. సోమశిల, అమరగిరి గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం శ్రీశైలానికి వెళ్లే పర్యాటకులు చేపలవేటకు వినియోగించే మరబోట్లకు రూ.ఐదువేల వరకు చెల్లిస్తున్నారు. ఈ బోట్లను ఏర్పాటుచేసే ఖర్చు పెద్దమొత్తంలో తగ్గుతుంది. రక్షణ పరమైన చిక్కులు కృష్ణానదిలో మరబోటుపై ప్రయాణిస్తే రక్షణ పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బోటు ప్రయాణమంతా దట్టమైన నల్లమల అడవి మధ్యలో సాగుతుంది. ఈప్రాంతం మావోయిస్టులకు గతంలో ప్రధానంగా కేంద్రంగా ఉండేది. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు ఇక్కడే ఆశ్రయం పొందిన సందర్భాలూ ఉన్నాయి. నదీప్రయాణం సమయంలో చాలాచోట్ల సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందవు. ప్రయాణ సమయంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రథమ చికిత్సలు చేయించుకునే వీలు కూడా ఉండదు. ప్రభుత్వం చొరవచూపితే కృష్ణాతీరం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. -
శివేన సహమోదతే..
ఎటుచూసినా భక్తి భావం, శివ తన్మయత్వంతో భక్త కోటి పారవశ్యం. హరోం హర అంటూ ఆ మహా దేవుడి నామస్మరణతో జిల్లాలోని శైవ క్షేత్రాలు మార్మోగాయి. మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పరమ శివుడి వైభవాన్ని తిలకించేందుకు భక్తులు శైవ క్షేత్రాల వద్ద బారులు తీరారు. ఈశ్వరుడిని దర్శించి అర్చనలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శివ పంచాక్షరీ జపాలు, ఉపవాసాలు,జాగరణతో భక్తి పరాధీనుడైన, భోళా శంకరడును భక్తి ప్రప్రత్తులతో సేవించి తరించారు. ఓం నమః శివాయ అన్న శివపంచాక్షరీ మంత్రం జిల్లా వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాది భక్తులు శివక్షేత్రాలను దర్శించుకుని అభిషేక ప్రియుడిని తనివితీరా దర్శించి... అభిషేకాలు గావించారు. హరహర మహాదేవ శంభోశంకర అంటూ స్వామిని అర్చించారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలైన కోటప్పకొండపైన త్రికోటేశ్వరుడు, అమరావతిలోని అమరేశ్వరుని, పెదకాకానిలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి, క్వారీ బాలకోటేశ్వరుడు, గోవాడ బాలకోటేశ్వరుడి ఆలయ ప్రాంగణాలు భక్తులతో పోటెత్తాయి. పలు చోట్ల విద్యుత్ ప్రభలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులతో పోటెత్తిన పెదకాకాని శివాలయం పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పెదకాకానిలోని శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం మంగళవారం భక్తులతో పోటెత్తింది. హరహరమహాదే వా... శంభోశంకర నామంతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భమరాంబ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక స్టేజీ పై శ్రీ దక్షిణామూర్తి సన్నివేశం ఏర్పాటు చేశారు. ఆలయంలో సుప్రభాత సేవ, మహా హారతులు, నిత్యౌపాసన, గ్రామ బలిహరణ, శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వ ఏకాదశ రుద్రాభిషకములు, మహానివేదన, ఆలయ బలిహరణ, లింగోద్భవ కాలమున స్వామివారికి ఏకాదశ ద్రవ్యములతో రుద్రాభిషేకం, గజవాహనంపై ఎదుర్కొలోత్సవం నిర్వహించారు. కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. భక్తులు పొంగళ్లు పొంగించిన అనంతరం శివనామం స్మరిస్తూ ప్రదక్షిణలు చేశారు. శ్రీభ్రమరాంబ అమ్మవారిని, శ్రీ మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తజనసంద్రంగా త్రికూటాద్రి నరసరావుపేటరూరల్ : మహాశివరాత్రి సందర్బంగా ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శివనామస్మరణతో మార్మోగింది. రాష్ట్రం నలుమూలలనుండి లక్షలాదిమంది తరలివచ్చి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున రెండుగంటలకు స్వామివారికి బిందితీర్థంతో అభిషేకాలు గావించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసారు. తెల్లారుజామునుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. మధ్యాహ్నానికి భక్తుల రద్దీ తక్కువగా కనిపించినా, సాయంత్రానికి భారీగా పెరిగింది. సాలంకయ్య అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు విరివిగా జరిగాయి, యాగశాలలో చండి, రుద్ర, గణపతి యాగాలు నిర్వహించారు. ధ్యాన శివుడు, నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు. నూతనంగా నిర్మించిన ప్రసాదం కౌంటర్ వద్ద భక్తుల రద్దీ కనిపించింది. మెట్లమార్గంలో పలువురు భక్తులు మెట్లపూజతో కొండకు చేరుకున్నారు. గొల్లభామ గుడి భక్తులతో నిండిపోయింది. పలు స్వచ్ఛంద సంస్థలు కొండమీద భక్తులకు ఉచితంగా ప్రసాదాలు, మంచినీరు అందజేశాయి. వీఐపీల తాకిడి సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ర్టమంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, జి.వి.ఆంజనేయులు, యేలూరి సాంబశివరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, అప్కో చైర్మన్ మురుగుడు హానుమంతురావులు త్రికోటేశ్వరుని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జె.వి.ఎస్.ప్రసాద్ త్రికోటేశ్వరున్ని దర్శించుకుని తిరునాళ్ళ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా రూరల్ ఎస్పీ రామకృష్ణ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. క్వారీ బాలకోటేశ్వరుడి ఆలయం కిటికట చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా క్వారీ బాలకోటేశ్వరస్వామి దర్శనానికి సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భక్తి శ్రద్దలతో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. వివిధ గ్రామాల భక్తులు సుమారు 12 భారీ విద్యుత్ ప్రభలను నిర్మించారు. గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్, పొన్నూరు శాసనసభ్యుడు డి.నరేంద్రకుమార్, డిఆర్వో కె.నాగబాబు, తెనాలి ఆర్డీవో కె.నరసింహ వచ్చి పూజలు నిర్వహించారు -
శివోహం
నెల్లూరు (రవాణా): మహాశివరాత్రి పర్వదినాన్ని జిల్లావాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో మార్మోగాయి. స్వామిని దర్శించుకునేందుకు ప్రధాన ఆలయాలకు భక్తులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. పాలాభిషేకాలు, మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు. నందివాహన సేవ, లింగోద్భవం నిర్వహించారు. భక్తులు ఉపవాసం ఉండి మహాదేవుడిని దర్శించుకున్నారు. జిల్లాలో ప్రధానంగా భైరవకోన, గండవరం, సోమశిల, మొగిలిచర్ల, ఘటికసిద్ధేశ్వరం, నెల్లూరు శివాలయం, రామతీర్థం, మైపాడు, వాకాడు, కామాక్షి సమేత సంఘమేశ్వర స్వామి ఆలయం, పెంచలకోన తదితర దేవాలయాల్లో విశేషంగా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలు ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. శివరాత్రి రోజున రాత్రంతా శివభజనలు చేస్తూ జాగరణ చేశారు. నవరాత్రి బ్రహ్మాత్సవాలు నిర్వహణకు దేవాదాయశాఖ, ఆలయ ధర్మకర్తల నేతృత్వంలో శివక్షేత్రాలు వేడుకులకు ప్రత్యేక సంతరించుకున్నారు. అయితే ఆలయాల్లో వీఐపీ తాకిడి ఎక్కువ కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి క్యూల్లో భక్తులు నిలచిపోయారు. -
స్వైన్ భయం..!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: శ్రీశైలానికి స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్ తగిలింది. మహాశివరాత్రి పండగ రోజు మంగళవారం కూడా పురవీధుల్లో భక్తుల రద్దీ పెద్దగా కనిపించలేదు. వచ్చినవారంతా వచ్చినట్టే తిరుగు ప్రయాణమయ్యారు. రద్దీ ప్రాంతంలో ఎక్కువసేపు ఉంటే ఎక్కడ స్వైన్ ఫ్లూ సోకుతుందన్న భయం ఒకవైపు... మరోవైపు రాత్రి సమయాల్లో బస చేసేందుకు అనువైన ఏర్పాట్లు కూడా లేకపోవడంతో దర్శనం ముగిసిన వెంటనే తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. దీంతో గతంతో పోలిస్తే తమ వ్యాపారం తగ్గిపోయిందని పలువురు స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. మొత్తం మీద స్వైన్ ఫ్లూ భయంతో శ్రీశైలంలో ఎక్కడ చూసినా అటు ఆలయ సిబ్బందితో పాటు ఇటు భక్తులు కూడా మాస్కులు ధరించి ఉండటం కనిపించింది. ఇచ్చింది మాములు మాస్కులే...! అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలల్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. అనేక మంది మరణించారు కూడా. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి ఇరు రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలోనే వస్తారు. ఈ స్వైన్ ఫ్లూ భయంతో శ్రీశైలంలో రోజంతా ఉండకుండా... దర్శనం ముగిసిన వెంటనే తమ ప్రాంతాలకు వెళ్లాలనే తొందర భక్తులో కనిపించింది. మరోవైపు ఆలయ సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి మాస్కులను పంపిణీ చేశారు. అయితే, ఇవి కేవలం మాములు మాస్కులు మాత్రమే. వాస్తవానికి స్వైన్ ఫ్లూ నుంచి రక్షణ పొందాలంటే మూడు లేయర్లు ఉన్న ఎన్-95 మాస్కులే సురక్షితం. ఈ మాస్కులను పెద్దగా ఆలయ అధికారులు పంపిణీ చేయలేదు. కేవలం మామూలు మాస్కులను పంపిణీ చేసి మమ అనిపించారు. అంతేకాకుండా... వచ్చిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో మాస్కులు ధరించి ఉండటం గమనిస్తే స్వైన్ ఫ్లూ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ‘గతంలో శివరాత్రి కచ్చితంగా శ్రీశైలంలో ఉండాలన్న భావన భక్తుల్లో కనిపించేది. రోజులు మారడంతో పాటు ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వారందరికీ వసతి సౌకర్యాలు లేకపోవడంతో దర్శనం చేసుకుని వెళితే సరిపోతుందిలే అన్న అభిప్రాయమే అధిక మందిలో వ్యక్తమవుతోంది. ఈ కారణం వల్లనే భక్తుల రద్దీ తగ్గింది’ అని ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ ఒకరు అభిప్రాయపడ్డారు. శివమాల దీక్ష విరమణ మారడమూ కారణమే...! వాస్తవానికి శివదీక్ష విరమణ గతంలో శివరాత్రి రోజే ఉండేది. అయితే, శివరాత్రి రోజు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గత ఏడాది నుంచి శివరాత్రి ముగిసిన రెండు రోజులకు పూర్ణాహుతి రోజు అంటే 19వ తేదీకి మార్చారు. ప్రధానంగా శివమాల భక్తుల రద్దీ తగ్గడానికి ఇది కూడా మరో కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిజినెస్ బేజార్...! గతంతో పోలిస్తే తమ వ్యాపారమూ బాగా తగ్గిపోయిందని అధిక మంది వ్యాపారాలు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన భక్తులు వచ్చినట్టే వెళ్లడం ఇందుకు కారణమని వారు అంటున్నారు. ‘గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల రద్దీ తగ్గింది. స్వైన్ ఫ్లూ ఫ్రబావమే ఇందుకు కారణం. మా వ్యాపారమూ కూడా తగ్గిపోయింది’ అని విభూది, ప్రసాదాలు, మాలల వ్యాపారం చేసే పుల్లయ్య అభిప్రాయపడ్డారు. ‘వచ్చిన వాళ్లు వచ్చినట్టే వెళ్లిపోతున్నారు. ఇక్కడే రాత్రి పూట బస చేయడం లేదు. గత ఏడాది చానా మంది వచ్చినారు’ అని జ్యూస్ వ్యాపారం తిరుమల ప్రసాద్ వివరించారు. -
వన్నె తెస్తా..
ఎస్ఏ సంపత్‌కుమార్ : ఏం.. తమ్ముడు బాగున్నావా.. నీ పేరేంటి..! నరేష్ : సార్.., నాపేరు నరేష్ ఎస్ఏ సపంత్‌కుమార్ : ఏ ఊరు మీది.. ఏం చేస్తుంటావ్ నరేష్ : మాది అలంపూర్ సార్.. క్యాంటీన్ నడుపుతుంటాను. ఎస్ఏ సంపత్‌కుమార్ : జోగుళాంబ ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? నరేష్ : ఇక్కడికొచ్చే యాత్రికులకు ప్రధానంగా బసచేయడానికి వసతి గదుల్లేవు. నీడపాటున సేదతీరడానికి వసతి లేదు. సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ఏ సంపత్‌కుమార్ : ఏం.. బీసన్ననాయుడు ఇంకా ఏమేం సమస్యలు ఉన్నాయి? బీసన్న నాయుడు: అలంపూర్-అలంపూర్ చౌరస్తా మధ్య డబుల్‌రోడ్డు పనులు చేశారు. ఇమాంపురం గ్రామం వద్ద డబుల్‌రోడ్డు పనులు చేయ లేదు. దీంతో ఇక్కడికొచ్చే భక్తులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ఏ సంపత్‌కుమార్ : మిగిలిన డబుల్‌రోడ్డు పనులకు రూ.3.16 కోట్లు వచ్చాయి. కదా..! బీసన్ననాయుడు : డబుల్ రోడ్డు పనులకు డబ్బులు వచ్చాయని చెబుతున్నారు.. పనులు మాత్రం చేయడం లేదు. మిగిలిన రోడ్డు బాగలేకపోవడంతో మూలమలుపుల వద్ద తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎస్ఏ. సంపత్‌కుమార్ : మురళి సమస్యలు ఏమైనా ఉన్నాయా? మురళి : సార్.. మా గ్రామాలను కలుపుతూ నదిలో బ్రిడ్జి కడుతున్నారు. కానీ అది పూర్తికాకపోవడంతో ఇబ్బందిగా ఉంది. ఎస్ఏ. సంపత్‌కుమార్ : అలంపూర్-ర్యాలంపాడు బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి కదా...? మురళి : 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఇక్కడికి వచ్చినప్పుడు హామీఇచ్చారు. 2009లో దాన్ని ప్రారంభించారు. పనులు ఆరేళ్లనుంచీ సాగుతూనే ఉన్నాయి. ఎస్ఏ. సంపత్‌కుమార్ : ఏం.. ఎంపీటీసీ సాబ్ మీ ఊరి సమస్యలు ఎంటీ..? కృష్ణయ్య : మా సమస్య అంతా బ్రిడ్జి లేకపోవడమే.. సుల్తానాపురం, ర్యాలంపాడు, జిల్లెలపాడు గ్రామస్తులం మండలానికి ఏ చిన్నపనికి రావాలన్నా.. కర్నూలు మీదుగా రావాలి. అధికారులు మా ఊరికి సరిగ్గా రావడం లేదు. మాగ్రామాల్లో రోడ్లు బాగులేవు, తాగునీళ్లు రావు, అడవిలో ఉన్నట్లుంది.. సార్! బ్రిడ్జి పనులు తొందతరగా పూర్తయ్యేలా చూడాలి. ఎస్ఎ. సంపత్‌కుమార్ : తప్పకుండా బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటాను. శ్రీనివాస్‌రెడ్డీ.. భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? శ్రీనివాస్‌రెడ్డి : అలంపూర్‌కు సరైన రవాణామార్గం లేక మారుముల ప్రాంతంగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా వచ్చినప్పుడు ఇదే విషయాన్ని విన్నవించాం. ఆయన స్పందించి బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించారు. బ్రిడ్జి పూర్తయితే మూడు పుణ్యక్షేత్రాలకు ఒకేదారిగా మారుతుంది. అలంపూర్ కేంద్ర బిందువుగా మారుతుంది. కనీసం ఆ పనులను మీరైనా పట్టించుకోండి..సార్! -
మన్యంకొండ జనసంద్రం
దేవరకద్ర రూరల్: మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం భక్తజనసందోహంతో పులకించిపోయింది. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో దేవస్థానం ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు కొనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. కొంతమంది దాసంగాలు పెట్టి మొక్కులు తీర్చుకోగా మరికొంత మంది తలనీలాలు సమర్పించారు. క్యూలైన్లలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అక్కడక్కడ తోపులాట జరిగింది. -
రామతీర్థంలో ఘనంగా శోభయాత్ర
రామతీర్ధం(నెల్లిమర్ల): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి శ్రీత్రిదండి రామానుజ చినజీయరుస్వామి శుక్రవారం రాత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పెద్ద ఎత్తున భక్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. శ్రీకాకుళంనుంచి వచ్చిన ఆయనకు దేవుని నెలివాడవద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, ఆలయ ఈఓ బాబూరావు, టీడీపీ అధికార ప్రతినిధి సువ్వాడ రవిశేఖర్, గ్రామసర్పంచ్ కోటపాటి పద్మలత, నేతలు తిరుపతిరావు, గురాన అసిరినాయుడు తదితరులు స్వాగతం పలికారు. అక్కడినుంచి పెద్ద ఎత్తున భక్తులతో శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జై శ్రీమన్నారాయణ నామస్మరణతో రామతీర్థం పురవీధులు మార్మోగాయి. ఈ శోభయాత్ర ఆలయం వరకు కొనసాగింది. అనంతరం అలయంవద్ద అర్చకులు పూర్ణకుంభంతో చినజీయరుస్వామికి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రదక్షిణ అనంతరం ఆయన శ్రీరాముడ్ని దర్శించుకుని ప్రత్యేకపూజలు జరిపించారు. అలాగే రామచంద్రప్రభువు సన్నిధిలో సువర్ణ శ్రీరామయంత్ర సమర్పణకార్యక్రమ సంకల్పం నిర్వహించారు. అనంతరం శని, ఆదివారాల్లో దేవస్థానంలో నిర్వహించే శ్రీరామ పాదుకా పట్టాభిషేకం, లక్షదీపారాధన కార్యక్రమాలకు అంకురారోపణం గావించారు. యాగశాలలో ప్రత్యేకంగా హోమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా చినజీయరుస్వామిని దర్శించుకునేందుకు పలుగ్రామాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు రామతీర్థం తరలివచ్చారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. -
దాతలను కాదని.. వసూళ్లపైనే శ్రద్ధ
శ్రీకూర్మం(గార) : శ్రీకూర్మనాథాలయంలో తాబేళ్ల పార్కు ఆదాయ వనరు కేంద్రంగా మారింది. తాబేళ్ల సంరక్షణకు అవసరమమైన నిధులు సమకూరుస్తామని పలువురు భక్తులు ముందుకొచ్చినా కాదని.. తాబేళ్లను చూపి వసూళ్ల పర్వం వైపే అధికారులు మొగ్గు చూపుతుండటం వెనుక ఆంతర్యం చిలక్కొట్టుడేనని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆలయంలో ఉన్న తాబేళ్ల సంరక్షణకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు పార్కు ఏర్పాటు చేశారు. అయితే ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆహారం అందక తాబేళ్లు శుష్కించిపోగా.. పార్కు పాడవడంతో కుక్కలు పార్కులో చొరబడి తాబేళ్లను చంపేసేవి. దీనిపై పత్రికల్లో వార్తలు రావడంతో తాబేళ్లను అడవిలో విడిచిపెట్టాలని అటవీ శాఖాధికారులు నిర్ణయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ కమలానంద భారతి స్వామి హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో తాబేళ్లను ఆలయంలోనే ఉంచి సంరక్షించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు 2011లో రూ. 4 లక్షలతో కృష్ణమ్ వందే జగద్గురుమ్ పేరిట ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సూచనలతో తాబేళ్ల పార్కు ఏర్పాటు చేశారు. అయితే పార్కులో ఉన్న సుమారు 200 తాబేళ్ల ఆహార ఖర్చులకు రూ.100 కేటాయించడంతో ఆహారం అందించలే కపోతున్న పరిస్థితులపై ‘సాక్షి’లో కథనం ప్రచురించింది. దాంతో స్పందించిన దేవస్థానం అధికారులు తాబేళ్ల పార్కు నిర్వహణకు శ్రీకాకుళానికి చెందిన గ్రీన్‌మెర్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పార్కు నిర్వహణకు ఆ సంస్థకు నెలకు రూ.24 వేలు ఇవ్వాలన్నది ఈ ఒప్పందం సారాంశం. కాగా ఈ మొత్తాన్ని తానే చెల్లిస్తానని అప్పట్లోనే కృష్ణమ్ వందే జగద్గురుమ్ సంస్థ నిర్వాహకుడు శ్రీనివాసరావు అధికారులకు తెలియజేశారు. ఆ ప్రతిపాదనను తిరస్కరించిన అధికారులు.. అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని భావించారో ఏమో గానీ.. తాబేళ్లను చూపి రోజువారీ వసూళ్లకు తెర తీశారు. మళ్లీ అడవి బాటలోకి? ఇదిలా ఉండగా తాబేళ్ల పేరిట వసూళ్లు చేయడం నేరమని అటవీ శాఖాధికారులు స్పష్టం చేయడంతో వాటిని ఆలయం నుంచి తరలించేందుకు దేవస్థానం అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది. సిబ్బంది, నిధుల కొరత సాకుతో వాటిని వదిలించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిసింది. శ్రీకూర్మనాథాలయంతోపాటు పాతాళ సిద్ధేశ్వర, ఆంజనేయ స్వామి ఆలయాల్లో మొత్తం 30 మంది సిబ్బంది ఉన్నారు. రూ. 30 లక్షల ఆదాయం వచ్చే ఆలయానికి ఈ సిబ్బంది ఎక్కువే. ఇక నిధుల కొరత సమస్య కాదు. తాబేళ్ల సంరక్షణకు దాతలే ముందుకొస్తునానరు. స్థానిక సర్పంచ్ బరాటం రామశేషు సైతం గతంలో ఆలయ అధికారులకు ఇదే విషయం చెప్పారు. మరోవైపు గోవుల సంరక్షణ కంటే తాబేళ్ల సంరక్షణ చాలా సులువు. తాబేళ్లు చాలా తక్కువ ఆహారం తీసుకుంటాయి. రెండు గోవుల కంటే వంద తాబేళ్ల పోషణ ఖర్చు తక్కువగానే ఉంటుంది. ఈ అంశాలను అధికారులు విస్మరిస్తున్నారు. కాగా తాబేళ్ల పేరిట వసూళ్లు చే స్తున్న విషయాన్ని జిల్లా అటవీ శాఖాధికారులు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దేవస్థానం ఖాతాలో తాబేళ్ల పేరిట నగదు జమ అయ్యి ఉంటే ఇబ్బందులు వస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. -
ఆలయాలు కిటకిట..
మంత్రాలయం: ప్రముఖ రాఘవేంద్రస్వామి మఠంలో భక్తజనులు పోటెత్తారు. శుక్రవారమూ భక్తుల రద్దీ కొనసాగింది. రాఘవేంద్రుల దర్శనార్థం తమిళనాడు, కర్ణాటక ప్రాంతం నుంచి భారీగా తరలివచ్చారు. మూలబృందావన దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. పరిమళ ప్రసాదం, పంచామృతాభిషేకం, అన్నపూర్ణ భోజనశాల, తుంగానదీ తీరం, మంచాలమ్మ దర్శన క్యూలైన్లు భక్తులతో రద్దీగా కనిపించాయి. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల రథోత్సవాలు, పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు మూలరాముల పూజలు, బృందావనం, మంచాలమ్మ అలంకరణలు భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఏఏవో మాదవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, సీఐ నాగేశ్వరావు, పీఆర్వో రాఘవేంద్రరావు, అసిస్టెంట్ పీఆర్వో వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
‘రాజన్న’ మూడోకన్ను
వేములవాడ అర్బన్ : పేదల దేవుడిగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. సోమ, శనివారాల్లో భక్తుల సంఖ్య ఒక్కోసారి లక్షల్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి పటిష్ట భద్రత కల్పించే దిశలో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ పరిసరాల్లో మంగళవారం 55 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టారు. వరల్డ్ సోర్స్ అసోసియేషన్ అనే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఆలయ లోపలిభాగంలో 16 సీసీ కెమెరాలు పనిచేస్తుండగా... మరింత భద్రత కోసం ఆలయం వెలుపల ప్రధాన ప్రదేశాలను ఎంపిక చేసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రెప్పవాల్చినా దొరికిపోయేలా వీటిని నెలకొల్పారు. గుడి ప్రధాన ఆహ్వాన ద్వారం, దానిముందే ఉన్న పోలీస్ కంట్రోల్ గదిపై, విచారణ కార్యాలయం, బద్దిపోచమ్మ ఆలయ సెంటర్, భీమేశ్వరాలయ సెంటర్, పార్వతీపురం, పార్కింగ్ స్థలం, రాజేశ్వరపురం, అంబేద్కర్‌చౌరస్తా, గుడి పడమర దిశలోని మహాద్వారం తదితర ప్రధాన ద్వారాల వద్ద మొత్తం 55 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ ఆలయంలోని ఎస్పీఎఫ్, స్థానిక పోలీస్స్టేషన్లలో ఉంటే కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానం చేయనున్నారు. గుర్తించడం సులువు హుండీ సొమ్ముకు కన్నం వేసిన ఘటనలు సీసీ కెమెరాల ద్వారా గతంలో బయటపడిన ఉదంతాలున్నాయి. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లుగా ఏకంగా స్వామి వారి ముందున్న హుండీలను చాకచక్యంగా తొలగించి అందులోని డబ్బులు కాజేశారు. ఇలా రాజన్న ప్రధాన ఆలయంలో ఎస్పీఎఫ్ సిబ్బంది, నాంపల్లి నర్సింహాస్వామి ఆలయంలో హోంగార్డులు దోచుకున్నారు. భక్తులు హుండీల్లో వేసిన కట్నాలూ, కానుకలతో నిండుగా కనిపిస్తున్న వైనాన్ని చూసిన వీరు హుండీలను తస్కరించేశారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డవడంతో నిందితులను గుర్తించడం సులువైంది. ఈ నేపథ్యంలో భద్రత రీత్యా సీసీ కెమెరాల ఏర్పాటు మరింత అనివార్యమైంది. ఇప్పటికే స్మార్ట్ పోలీస్ వ్యవస్థలో భాగంగా వేములవాడ పట్టణంలో నిఘా నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా ఇప్పుడు ఆలయ పరిసరాల్లోనూ భద్రత పెంచారు. ఆన్లైన్ లింకింగ్ నాంపల్లి నర్సింహాస్వామి దేవస్థానం, రాజన్న ఆలయం, అనుబంధ దేవాలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను అధికారులు చూసుకునేందుకు వీలుగా ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే నాంపల్లి నర్సింహా స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేశారు. దీంతో సంబంధితశాఖ అధికారులు ఎప్పుడుపడితే అప్పుడే సీసీ కెమెరా దృశ్యాలను చూసుకునే వీలున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదే విధంగా రాజన్న ఆలయం, అనుబంధ దేవాలయాలను సైతం ఆన్‌లైన్‌లోకి లింకప్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. భక్తుల రక్షణకు, ఆలయ భద్రతకు నిఘా పెంచడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పవిత్రం..కార్తీకం
పవిత్ర కార్తీకమాసం శుక్రవారం ప్రారంభమైంది. సకలశుభాలు కలగాలని, కోరిన కోర్కెలు తీరాలని పరమశివున్ని వేడుకుంటూ భక్తులు శివాలయాల్లో బారులు తీరారు. కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో దేవాదాయ,ధర్మాదాయశాఖ అధికారులు, ఆయా ఆలయాల నిర్వాహకులు భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. నెల్లూరులోని శ్రీభువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామివారి దేవస్థానంలో విశేష పూజలు జరిపారు. సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ఆకాశదీపం వెలిగిం చారు. శివభక్తులు శివదీక్షకు మాలధారణ చేపట్టారు. కావలి, వెంకటగిరి, గూడూరు శివాలయాల్లో భక్తులు కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేకపూజలు చేశారు. -
బై బై.. గణేశా!
తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణపయ్య నిమజ్జనానికి తరలివెళ్లాడు. శనివారం చివరిరోజు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీంతో మంటపాల వద్ద కోలాహలం నెలకొంది. విఘ్నాలు తొలగించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. వరాలు కురిపించాలని వరసిద్ధి వినాయకుడిని వేడుకున్నారు. పాడిపంటలు కలగాలని, పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని గౌరీతనయుడిని కోరుకున్నారు. మహబూబ్న గర్‌లో స్థానిక గడియారం చౌరస్తా నుంచి అటు పాత గ్రంథాలయం, ఇటు పాత బస్టాండు, రాయిచూర్ రోడ్డు, జడ్చర్ల హైవే తదితర ప్రాంతాలు నిమజ్జనానికి తరలివెళ్లే గణపతి విగ్రహాల ఊరేగింపులతో పులకించిపోయాయి. జిల్లాకేంద్రంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఎస్పీ డి.నాగేంద్రకుమార్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు వినాయకులకు వీడ్కోలు పలికారు. జిల్లాలోని కల్వకుర్తి, షాద్‌నగర్, గద్వాల, అలంపూర్, అచ్చంపేట, మక్తల్‌లో నిమజ్జనోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. -
శాకంబరీ నమోస్తుతే
వర్గల్: విద్యాధరిలో సరస్వతీ అమ్మవారి జన్మ నక్షత్రం మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సరస్వతి అమ్మవారు శుక్రవారం శాకంబరీ దేవి అలంకారంలో సాక్షాత్కరించారు. నేత్రపర్వంగా సాగిన మూలా మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న భక్తులు శాకంభరీ మాత దివ్య మంగళ రూపంతో దర్శనమివ్వడంతో అశేషజనం భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. చదువుల తల్లి జన్మ నక్షత్రం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 6 గంటలకు గణపతి పూజతో మూల మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు అనంతగిరి శర్మ, శశిధర శర్మ, బాల ఉమామహేశ్వర శర్మల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం క్వింటాళ్ల కొద్దీ కూరగాయలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. దేశం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించారు. ఆషాఢ మాసంలో శాకంభరీగా కొలువుదీరిన అమ్మవారిని స్తుతిస్తూ సప్తశతీ పారాయణాలు చేసారు. మరోవైపు వేద విద్యార్థులు లలితా సహస్ర పారాయణాలు జరిపారు. ఆలయ యాగ మండపంలో చండీహోమం నిర్వహించారు. ఓ వైపు శాకంబరీ దేవిగా అమ్మవారి దివ్యమంగళ రూపం, మరోవైపు విశేష అర్చనలు, యాగాది కార్యక్రమాలతో భక్తులు పరవశించిపోయారు. నేత్రపర్వంగా సాగిన మూల మహోత్సవ వేడుకలు తిలకించేందుకు స్థానిక జిల్లా భక్తులతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వర్గల్ క్షేత్రానికి తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తరించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ మేనేజర్ రఘుపవన్ పర్యవేక్షించారు. -
చదువుల తల్లికి వందనం
వర్గల్: రెండో శనివారం పాఠశాలలకు సెలవు.అదే రోజు చదువుల తల్లి విద్యా సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం..విశేషమైన ‘మూలా’ నక్షత్రం రోజు అమ్మ సన్నిధిలో పారాయణాది ప్రత్యేక పూజలు జరుగుతాయి. అదే రోజు చిన్నారులకు అక్షర అభ్యాసం జరిపించడం శుభ ప్రదమని తల్లిదండ్రులు విశ్వాసం. విశేషమైన ఈ ‘మూలా’ నక్షత్రం సెలవు రోజు కలిసి రావడంతో శనివారం రెండో బాసరగా పేరొందిన వర్గల్ విద్యాధరి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో ఉదయం 6కు గణపతి పూజతో ‘మూలా’ మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ వేద పండితులు అనంతగిరి శర్మ, బాలాంజనేయ శర్మల పర్యవేక్షణలో బ్రాహ్మణోత్తములు విద్యా సరస్వతి అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు ధరింపజేసి, పూల మాలలతో అందంగా అలంకరించారు. అనంతరం సప్తశతి పారాయణంతో అర్చించారు. ఆలయ యాగశాలలో చండీ హోమం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి దేశం సుభిక్షంగా వర్థిల్లాలని ప్రార్థిస్తూ వేద పాఠశాల విద్యార్థులతో లలితా సహస్ర పారాయణం చేశారు. ఈ మహోత్సవం సందర్భంగా అమ్మవారి వైభవం తిలకించి తరించేందుకు, తమ చిన్నారులతో అక్షరార్చన జరిపించేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తరించారు. కిటకిటలాడిన మండపం మూలా నక్షత్రం రోజున వర్గల్ అమ్మవారి సన్నిధిలో 500 మంది చిన్నారులకు అక్షర అభ్యాసాలు జరిగాయి. తరలి వచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులతో ఆలయ సారస్వత మండపం కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్షరాభ్యాసాలు కొనసాగాయి. భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా ఆలయ మేనేజర్ రఘుపవన్, ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. ప్రతి భక్తునికి భోజన మహా ప్రసాదం అందించారు. -
చిన్న శేషుడిపై శ్రీరాముడి చిద్విలాసం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్ : శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ నిర్వహించారు. గజరాజులు ఠీవీగా ముందుకు కదిలాయి. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. వాహన సేవ అనంతరం ఆలయంలోని కల్యాణ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చం దనం, పండ్ల రసాలతో స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. సాయంత్రం 5 గంటలకు కోదండరాముడికి ఊంజల్‌సేవ నిర్వహించారు. హంస వాహనంపై స్వామివారి వైభవం శనివారం రాత్రి కోదండరాముడు హంస వాహనం అధిరోహించి పురవీ దుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. కళాకారుల భజనలు, రామనామ స్మరణల మధ్య స్వామి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, శ్రీధర్, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహతి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు అన్నమచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకుడు ఎంవీ.సింహాచలశాస్త్రి బృందం నిర్వహించిన భక్త శబరి హరికథా పారాయణం ప్రేక్షకులను అలరించింది. -
వైభవం.. మాధవుడి రథోత్సవం
కోడుమూరు, న్యూస్‌లైన్: గోరంట్ల గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ మాధవస్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. అశేష భక్త జనుల గోవింద నామస్మరణ మధ్య రథంలో స్వామి అమ్మవార్లు విహరించారు. భక్తు లు తమ ఇలవేల్పును కనులారా వీక్షిం చాలన్న సంకల్పంతో రోడ్లు, మిద్దెలపైకి ఎక్కి రథోత్సవాన్ని తిలకించా రు. ఈ నెల 17న అంకురార్పణతో ప్రారంభమైన మాధవస్వామి ఉత్సవాలు 27 తేదీ వరకు కొనసాగుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బుట్టా రేణుక, పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణి రెడ్డి, కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్పీపీ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కోట్ల వంశీధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
సమస్యల కొలిమి
ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమన్న పేరు. భద్రాద్రి తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయంగా కీర్తి. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం. కానీ సదుపాయాల మాటకు వస్తే మాత్రం చెప్పడానికి ఏమీ ఉండదు. జిల్లాలోని రామతీర్థం క్షేత్రం దుస్థితి ఇది. స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడకు విచ్చేసే భక్తులకు తాగేందుకు కనీసం మంచినీరు ఉండదు. ఇళ్లకు తీసుకువెళ్లేందుకు ప్రసాదమూ దొరకదు. పోనీ కాసేపు రాముని సన్నిధిలో విశ్రాంతి తీసుకుందామనుకున్నా షెల్టర్లు కూడా లేవు. రామతీర్థం(నెల్లిమర్ల), న్యూస్‌లైన్: రామతీర్థం దేవాలయం వార్షికాదాయం కోటిన్నర పైమా టే. ఏటా ఇరవై లక్షలకు తగ్గకుండా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. కానీ అధికారులు మాత్రం భక్తుల సంఖ్యకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వసతి షెల్టర్ల విషయంలో అధికారులు ఘో ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా ఏ ఒక్కరూ పరిస్థితి మార్చడానికి చర్యలు తీసుకోవడం లేదు. సుమారు 500 ఏళ్ల కిందటి ఈ ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యం గా శివరాత్రి, శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. ఒక్క శివరాత్రి నాడే పదిలక్షల మంది భక్తు లు రామతీర్థం వస్తారు. ఏటా ఆలయానికి సుమారు కోటిన్నర రూపాయల ఆదా యం లభిస్తుంది. ఆలయానికి సంబంధించి 888 ఎకరాల పంట భూములున్నాయి. ఇన్ని ఉన్నా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కనీస స్థాయిలో కూడా భక్తులకు సౌకర్యాలు కల్పించలేక పోతున్నారని పలువురు ఆరోపిస్తున్నా రు. ఈ విషయంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భ క్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తు తం ఆలయానికి వచ్చే భక్తులకు ఆల యంలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కోవడానికి కుళాయిలు కూడా లేవు. గతం లో ఇక్కడున్న కుళాయిలు చాలాకా లం కిందటే పాడయ్యాయి. ఇప్పటివరకు వాటిని పట్టిం చుకున్న నాథుడే లేడు. దీంతో అందరూ కోనేరు వద్దకు వెళ్లాల్సి వస్తోం ది. అలాగే భక్తులకు తాగునీరు కూడా అందుబాటులో లేదు. గతంలో భక్తుల సౌకర్యార్థం ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి న మినరల్ వాటర్ ప్లాంటు కు సంబంధించి ఒకే ఒక్క కుళాయి ఏర్పాటు చేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అది కూడా నిరుపయోగంగా మారుతోంది. దీంతో భక్తులు ఆలయం వెలుపల విక్రయించే వాటర్ ప్యాకెట్లు కొనుక్కుని తాగాల్సి వస్తోంది. ఇక ప్రసాదం విషయానికొస్తే గత నాలుగేళ్లుగా ఇక్కడికొచ్చే భక్తులకు ప్రసాదం సక్రమంగా అందడం లేదు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ మాత్రమే ఇక్కడ పులిహోర ప్రసాదం దొరుకుతుంది. తర్వాత వచ్చే భక్తులకు తినేందుకు, ఇళ్లకు తీసుకెళ్లేందుకు రాముల వారి ప్రసాదమే దొరకదు. ఈ విషయంలో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే దేవస్థానానికి విచ్చేసే భక్తులకు మరుగుదొడ్లు, స్నానపు గదులు అందుబాటులో లేవు. గతంలో ఇక్కడ నిర్మిం చిన సామూహిక మురుగుదొడ్లు ఐదేళ్ల క్రితమే నిరుపయోగంగా మారాయి. దీంతో భక్తులు తీవ్రంగా ఇక్కట్లకు గురవుతున్నారు. అలాగే స్నానపు గదులు కూడా అందుబాటులో లేవు. దీంతో మహిళా భక్తులకు ఇబ్బంది కలుగుతోంది. కోనేటిలో స్నానాలు చేసినా దుస్తులు మా ర్చుకునేందుకు గదులు లేకపోవడంతో తం టాలు పడుతున్నారు. ప్రతి ఏటా కోట్ల లో ఆదాయం సమకూరుతున్నా.. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేస్తున్న సౌకర్యాలు కేవలం ధనికులు, వీఐపీలకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దే వాదాయ శాఖ అధికారులు కల్పించుకుని భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. -
విడిది సమస్య తలెత్తనివ్వం
సాక్షి, కర్నూలు: యేటా భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా విడిది సమస్య తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మహా శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో శనివారం ఆయన స్థానిక గంగా సదన్‌లో దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జునుల బ్రహ్మోత్సవాలు సమష్టి కృషితోనే విజయవంతం అయ్యాయన్నారు. వారం రోజుల్లో సుమారు 15 లక్షల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్వించుకున్నట్లు చెప్పారు. శివరాత్రి రోజున భక్తుల సంఖ్య 4 లక్షలకు చేరుకుందన్నారు. శివస్వాములకు శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో సామాన్య భక్తులకు దర్శనం సులభతరమైందన్నారు. తాత్కాలిక విడిది ఏర్పా టు చేసినా చాలా మంది శివస్వాములు ఆరుబయట పడుకోవాల్సి వచ్చిన మాట వాస్తవమేనన్నారు. వచ్చే ఏడాది ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని.. శాశ్వతంగా డార్మెంటరీలను నిర్మిస్తామన్నారు. అదేవిధంగా సాక్షిగణపతి నుంచి దేవస్థానం వరకు వాహనాల రద్దీ పెరగడంతో కాలినడక భక్తులు ఇక్కట్లకు లోనయ్యారన్నారు. ఈ దృష్ట్యా రోడ్డును విస్తరించి తిరుపతి తరహాలో రేకుల షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈవో ఆజాద్ మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్‌తో శ్రీశైలం రూపురేఖలు మారుస్తామన్నారు. 30 మంచినీటి ట్యాం కులను నిర్మించనుండటంతో తాగునీటి సమస్యకు పరిష్కా రం లభిస్తుందన్నారు. దేవస్థానం ప్రధాన రహదారిలోని 300 దుకాణాలను మరో ప్రాం తానికి తరలిస్తున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బీటీ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామన్నారు. ఉత్సవాల్లో 19 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించామని, ఎన్నడూ లేని వి ధంగా ఈ విడత నాణ్యతకు పెద్దపీట వేశామన్నారు. అనంతరం ఉత్సవాలను విజయవంతం చేసిన సిబ్బందిని కలెక్టర్, ఈవోలు సన్మానించారు. సమావేశంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆల్తూరి ఆదినారాయణరెడ్డి, జెడ్పీ సీఈవో సూర్యప్రకాశ్, ఆలయ ఏఈఓ రాజశేఖర్, జిల్లా వైద్యాధికారి నరసింహులు, డిప్యూటీ రవాణా కమిషనర్ శివరామ్‌ప్రసాద్, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభోత్సవం.. ప్రణవనాదం
మహాశివరాత్రి పర్వదినాన జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తులతో పోటెత్తింది. ఓంకార నాదంతో శ్రీగిరి మార్మోగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు మల్లన్నను దర్శించుకొని పునీతులయ్యారు. మల్లన్న ప్రభోత్సవం అత్యంత రమణీయంగా సాగింది. హరహర మహాదేవ..శంభోశంకర అంటూ భక్తులు నినదిస్తూ ఉత్సవంలో పాల్గొన్నారు. నందివాహనంపై ఆదిదంపతులు ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం పాగాలంకరణ, స్వామివార్ల కల్యాణాన్ని నిర్వహించారు. - న్యూస్‌లైన్, శ్రీశైలం -
పోటెత్తిన పొలతల
‘ఓం నమశ్శివాయః .. హరహర మహాదేవ.. శంభో శంకర..హరోం హరా’..అంటూ శైవ క్షేత్రాలన్నీ మార్మోగాయి. శివాలయాలు గల కొండకోనలు భక్తుల పంచాక్షరి మంత్రోచ్చాటనతో ప్రతిధ్వనించాయి. గురువారం తెల్లవారుజాము నుంచి జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. శివుడిని మనసారా దర్శించుకున్న భక్తులు జన్మ పావనమైందని పులకించారు. కడప కల్చరల్, న్యూస్‌లైన్: మహాశివరాత్రి పర్వదినాన్ని గురువారం జిల్లా అంతటా వైభవంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచే శివాలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. పలుచోట్ల భక్తులు స్వయంగా అభిషేకం చేశారు. గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలేగాక అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. సమీప ప్రాంతాల నుంచి బుధవారం రాత్రికే భక్తులు లక్షల సంఖ్యలో చేరుకున్నారు. శైవ క్షేత్రాల దారులన్నీ భక్తజన ప్రవాహాలుగా మారాయి. గురువారం ఉదయాన్నే స్వామిని దర్శించుకున్న పలువురు భక్తులు వెనుదిరగగా, కొండ కోనల్లోని శైవ క్షేత్రాల్లో జాగరణ చేయడం పుణ్యదాయకమని భావించిన భక్తులు అక్కడే ఉండిపోయారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి లింగోద్భవ పూజలు, మహన్యాసం తిలకించి పుణ్యం లభించిందని తృప్తి చెందారు. గురువారం మధ్యాహ్నం వరకు భక్తులు శైవ క్షేత్రాలకు తరలి వెళ్లారు. ధార్మిక సంఘాల ప్రతినిధులు అడుగడుగునా వారికి ఆహారం, నీటి పొట్లాలను ఉచితంగా అందజేశారు. పలు కూడళ్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదానాలు చేశారు. జిల్లా అధికారులు, పోలీసులు తమవంతుగా సమన్వయంతో వ్యవహరించడంతో భక్తులు సులభంగా దర్శనాలు చేసుకోగలిగారు. పెండ్లిమర్రి, న్యూస్‌లైన్ : రాయలసీమ జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన పొలతల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం జిల్లా నలుమూలల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. క్షేత్రంలో వెలసిన శ్రీ మల్లేశ్వరస్వామి, పార్వతిదేవి, సుబ్రమణ్యంస్వామి, వినాయకస్వామి, అక్కదేవతలు, పులిబండెన్న స్వాముల వారికి గురువారం తెల్లవారుజాము నుంచి భక్తులు కోనేర్లలో స్నానాలాచరించి క్యూ లైన్లలో వేచి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం మల్లేశ్వరస్వామికి వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకాలంకరణ, పూలాభిషేకం వంటి కార్యక్రమాలు చేపట్టారు. కన్నులపండువగా మల్లేశుని కల్యాణం.. : గురువారం ఉదయం 11గంటలకు పొలతల క్షేత్రంలో శ్రీ మల్లేశ్వరస్వామి, పార్వతి దేవి అమ్మవారికి ఆలయ ఇన్చార్జి ఈఓ కృష్ణా నాయక్, ఆలయ ఛెర్మైన్ విశ్వనాథరెడ్డిల ఆధ్వర్యంలో వేదపండితుల సమక్షంలో కల్యాణం కమనీయంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు. మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్పీ : జిల్లా ఎస్పీ జివిజి అశోక్‌కుమార్ పొలతల మల్లేశ్వరస్వామి, పార్వతిదేవి అమ్మవారిని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అలాగే కడప ఆర్డీఓ హరిత, మండల ప్రత్యేకాధికారులు రమణారెడ్డి, తహశీల్దార్ నిత్యానందరాజు, ఇతర అధికారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చల్లంగ చూడు సోమేశ్వరా.. సింహాద్రిపురం, న్యూస్‌లైన్ : సింహాద్రిపురం మండలం రావులకొలను సమీపంలోని భానుకోట సోమేశ్వర క్షేత్రంలో గురువారం శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులతో సందడి నెలకొంది. భక్తుల శివనామస్మరణతో భానుకోట క్షేత్రం హోరెత్తింది. భక్తులు స్వామి వారికి అభిషేక పూజలు, ప్రత్యేక పూజలు జరిపి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. ఆలయం మెట్ల ప్రాంగణంలో శివ లింగంపై జలం జాలువారుతూ నాగదేవత పడగ విప్పి నాట్యం చేస్తున్నట్లు రూపొందించిన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. అర్థరాత్రి శివపార్వతులను ఊరేగించిన అనంతరం ఆలయ పూజారులు దేవగుడి కృష్ణయ్య, బద్రినాథ్‌ల ఆధ్వర్యంలో వైభవంగా స్వామి వారికి కల్యాణం చేశారు. పులివెందుల జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భానుకోటలో మంచి సేవలు అందించారు. పూజలందుకోవయ్యా.. నిత్యపూజయ్యా.. సిద్దవటం, న్యూస్‌లైన్:లంకమల్ల అభయారణ్యంలో వెలసిన నిత్యపూజయ్యస్వామి కోన గురువారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామస్మరణలతో మార్మోగింది. పంచలింగాల గుడి వద్ద నుంచి కాలిబాటన నిత్యపూజయ్య నిజమైన దేవుడా, పంచలింగాలస్వామి అంటూ వృద్ధులు చిన్నపిల్లలను వెంటపెట్టుకుని కొండ పైకి వెళ్లారు. కొందరు భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకునేందుకు నీటిగుండంలో స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం అర్ధరాత్రి లింగోద్భవ కాలం, మహన్యాసపూర్వక, రుద్రాభిషేకం పూజలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచి భక్తుల సర్వదర్శనం, మూలవిరాట్‌కు అభిషేకాలు, అర్చనలు చేశారు. కొందరు మహిళా భక్తులు సంతానం కోసం వరపడి ముడుపులు కట్టారు. మరి కొందరు భక్తులు మొక్కుబడిగా కొబ్బరి కాయలను గుండంలో కాల్చి మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని కపర్థీశ్వరస్వామి, జ్యోతి సిద్ధవటేశ్వరస్వామి, నీలకంఠేశ్వరస్వామి ఆలయాల్లో శివరాత్రి మహోత్సవ పూజలు జరిగాయి. కరుణించరావా.. త్రేతేశ్వరా... అత్తిరాల (రాజంపేట రూరల్), న్యూస్‌లైన్: శివరాత్రి పర్వదినం సందర్భంగా అత్తిరాలలోని శ్రీకామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున 3గంటల సమయం నుంచే ఆలయ ప్రధాన అర్చకుడు కె.పద్మనాభశాస్త్రి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గురువారం రాత్రి శివరాత్రి జాగారం చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున అత్తిరాలకు చేరుకున్నారు. ఆర్డీఓ ఎం.విజయసునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
వైభవం.. రంగనాథ కల్యాణం
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి కల్యాణోత్సవం పులివెందలలో అంగరంగ వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం ఇక్కడి పూల అంగళ్ల సర్కిల్లో అర్చకుడు కృష్ణరాజేష్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి వారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు+. సతీసమేతుడైన రంగనాథుని ముగమోహన రూపాన్ని చూసి భక్తులు తరించిపోయారు. భక్తాదులు స్వామివారి కల్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శాశ్వత కల్యాణ ఉభయకర్త అనంతపురం జిల్లా కల్యాణదుర్గానికి చెందిన చల్లా నారాయణస్వామి దంపతుల ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని జరిపించారు. అనంతరం రాత్రి సతీసమేతుడైన స్వామివారు గజ వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. స్వామిని చూడగానే భక్తులు కాయకర్పూరాలు సమర్పించారు. పులివెందుల అస్లాం టెక్నో అకాడమీ డ్యాన్స్ మాస్టర్ అస్లాం ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. - న్యూస్‌లైన్, పులివెందుల టౌన్ -
వనజాతర
వనదేవతల జాతర ఆరంభమైంది. భక్తుల పూనకాలు, ఒగ్గుడోలు నృత్యాల మధ్య కుంకుమభరిణె రూపంలో ఉన్న సారలమ్మను కోయపూజారులు గద్దెపైకి తీసుకురావడంతో జాతరలో తొలిఘట్టం మొదలైంది. బంగారం మొక్కుల చెల్లింపు, ఒడిబియ్యం సమర్పణతో జాతర ప్రాంగణాలు కిటకిటలాడాయి. జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. గురువారం సమ్మక్క భక్తులకు దర్శనమివ్వనుంది. -
బ్రహ్మోత్సవాలు షురూ
మంగళవాయిద్యాలు... అర్చకుల వేదమంత్రోచ్ఛరణలతో నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆరురోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, ఏకాదశ రుద్రాభిషేకం, నీరాజన మంత్ర పుష్పములు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి యజ్ఞశాలను ప్రారంభించారు. - న్యూస్‌లైన్, నార్కట్‌పల్లి నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్ : మంగళవాయిద్యాలు.. అర్చకుల మంత్రోచ్ఛరణల నడు మ నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, ఏకాదశ రుద్రాభిషేకం, నీరాజన మంత్ర పుష్పాలు తదితర ప్రత్యేక పూజలను వేద పండితుడు అల్లవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి, దేవాలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రేగట్టే నర్సింహారెడ్డిలకు దేవస్థానం ఈఓ విజయరాజు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ముఖ్య అతిథులను దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఘనంగా సన్మానించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి : కోమటిరెడ్డి చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. కల్యాణ మండపాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కోటి రూపాయలతో కల్యాణ మండపం పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. దేవాలయానికి నిద్రచేసేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఘాట్‌రోడ్ మలుపులో 30 గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం వినాయక విగ్రహాన్ని, రాజగోపుర శిఖరాన్ని ప్రతిష్ఠించారు. అలాగే యజ్ఞశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి విజయరాజు, సర్పంచ్‌లు పుల్లెంల అచ్చాలు, కొండూరు శంకర్ దేవస్థానం మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నేతగాని కృష్ణ, మండల ప్రత్యేక అధికారి మదనాచారి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో గుర్రం సురేశ్, బెరైడ్డి కరుణాకర్‌రెడ్డి, నర్సింహాచారి, వడ్డె భూపాల్‌రెడ్డి, శిగ విష్ణు, బత్తుల ఊషయ్య, పల్లె వెంకట్‌రెడ్డి, పసునూరి శ్రీను, దోసపాటి విష్ణుమూర్తి, ప్రభాకర్‌రెడ్డి, వెంకటయ్య, దొడ్డి నర్సింహ, గాదరి రమేష్, నర్సింహ, సత్తయ్య, సైదులు, సుజాత, జహంగీర్, వీఆర్వో యాదయ్య పాల్గొన్నారు. ప్రొటోకాల్ పాటించని ఆలయ ఈఓ చెర్వుగట్టులోని రామలింగేశ్వరస్వామి ఆలయ ఈఓ విజయరాజు ప్రొటోకాల్ పాటించకుండా వ్యవహరిస్తున్నారని గ్రామ సర్పంచ్ మల్గు రమణబాలకృష్ణ ఆరోపించారు. గురువారం చెర్వుగట్టులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల్లో సర్పంచ్ పేరు పెట్టకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళా సర్పంచ్ అయినందునే తనను అవమాన పర్చినట్లు పేర్కొన్నారు. గతంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఈఓ పట్టించుకోవడంలేదన్నారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డిగూడెం పీఏసీఎస్ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, ఉపసర్పంచ్ నారాయణరెడ్డి, వేణు, అది చంద్రయ్య, చొల్లేటి కోటి, మేడి శంకర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. స్వామివారి పాదాల వద్ద ఆలయ నిర్మాణం రామలింగేశ్వర స్వామి పాదాల వద్ద త్వరలో కోటి రూపాయలతో దేవాలయాన్ని నిర్మించి అభివృద్ధి చేయనున్నట్లు మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో శ్రీపార్వతీజడల రామలింగేశ్వర స్వామి పాదాల వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. దేవాలయానికి వచ్చే భక్తులు స్వామి వారి పాదాలను దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండూరు శంకర్, ఉప సర్పంచ్ వడ్డె అండమ్మ, భూపాల్‌రెడ్డి, మారెడ్డి యాదగిరిరెడ్డి, సూర ముత్యాలు, రాములు, మరగోని సైదులు, ఎల్లెందులు లింగస్వామి, పాపులు, భిక్షం, మేడి శంకర్, శ్రీను, శంకరయ్య పాల్గొన్నారు. -
గోవిందా..!
జనం...జనం...దేవుని కడప వీధులన్నీ జనమయం. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన జనం. తేరును లాగి పుణ్యం పొందేందుకు.. రథంపై వెలిగే స్వామిని దర్శించుకొని తరించేందుకు వచ్చిన జనం.. జనసంద్రం మధ్య కడపరాయుని రథం గంభీరంగా కదిలింది. వైభవోపేతంగా నిర్వహించిన రథోత్సవాన్ని భక్తజనం తిలకించి పులకించిపోయారు. కడప కల్చరల్, న్యూస్‌లైన్: దేవుని కడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వా మి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన అంశమైన రథోత్సవం గురువారం కనులపండువగా జరిగింది. ఉదయం ఆరు గంటల నుంచి తేరుపై గల స్వామిని దర్శించుకునేందుకు భక్తులు దేవునికడప వీధుల్లో బారులు తీరారు. సాయంత్రం 3.50కి వేద పండితులు చిలకపటి తిరుమలాచార్యులు, స్థానిక అర్చక బృందంతో కలిసి తొలి పూజలు చేశారు. రథదాత ముత్యాల శేషయ్య హారతి, సర్కారు హారతుల అనంతరం కొబ్బరి కాయలు కొట్టి రథాన్ని కదిలించారు. ఆలయ నిర్వాహకులు మేళతాళాలతో సంప్రదాయంగా ఆహ్వానించగా దేవునికడప, పాతకడప యువకులు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ రథచక్రాల కింద సన్న (ఊత మొద్దు)లు వేసి, కర్రల ఆధారంతో చక్రాలను కదిలించారు. మహామేరు పర్వతమే కదిలినట్లుగా రథం గంభీరంగా ముందుకు సాగింది. తెల్లనిగుర్రాలు పూన్చిన రథాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే సారథిగా నడిపించినట్లు రథంపై బొమ్మలను ఏర్పాటు చేశారు. దేవునికడప, పాతకడప పెద్దలు అడుగడుగునా యువకులను ఉత్సాహపరుస్తూ రథం ముందుకు కదిలేందుకు సహకరించారు. భక్తిపారవశ్యం రథంపై ఉభయ దేవేరులతో కొలువుదీరిన దేవదేవుడిని భక్తులు మాడవీధుల్లో మిద్దెలు, మేడలపైకి ఎక్కి మరీ దర్శించుకున్నారు. రథం ఆగినప్పుడు అర్చకులు భక్తులకు మంగళ హారతులిచ్చారు. పలువురు భక్తులు రథం చక్రాల కింద గుమ్మడికాయలను ఉంచి పగిలాక ముక్కలను ప్రసాదంగా స్వీకరించి మొక్కులు తీర్చుకోగా, మరికొందరు మహిళా భక్తులు రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. యువకులు రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు. మాసాపేట నుంచి దేవునికడప వరకు రోడ్లకు ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేయడంతో కొనుగోలుదారులతో రోడ్లన్నీ కిటకిటలాడాయి. రథోత్సవంలో పోలీసుల దౌర్జన్యం కడప అర్బన్, న్యూస్‌లైన్ : దేవునికడప శ్రీ లక్ష్మివెంకటేశ్వరస్వామి రథోత్సవంలో పోలీసుల దౌర్జన్యం కనిపించింది. రథం వద్ద మహిళా భక్తులను పంపించేందుకు స్కౌట్ వారుగానీ, మహిళా కానిస్టేబుళ్లుగానీ విధులు నిర్వర్తించాలి. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు మహిళలను చేతులతో లాగిపడేయడం, వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం గమనించిన మీడియా ప్రతినిధులు ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఓ ఫొటోగ్రాఫర్‌కు చెందిన కెమెరాను లాక్కొని లెన్స్‌ను సైతం ధ్వంసంచేశారు. మీడియా ప్రతినిధులు స్పెషల్ పార్టీ పోలీసుల గురించి ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణను వివరణ కోరగా తాను విచారిస్తానన్నారు. ఈ సంఘటనపై ఎస్పీ అశోక్‌కుమార్ విచారణ జరిపి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోకపోతే పోలీసు ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ప్రమాదముంది. -
జోగుళాంబాయ నమః
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటై వెలసిన అలంపూర్ జోగుళాంబకు ఘటాభిషేకం మంగళవారం కన్నులవ పండువగా జరిగింది. విశేష పూజలందుకున్న అమ్మవారు భక్తులను కరుణించి నిజరూప దర్శనమిచ్చారు. బ్రహ్మాత్సవాల్లో భాగంగా జోగుళాంబకు, బాలబ్రహ్మేశ్వరునితో వైభవోపేతంగా కళ్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో వచ్చిన జనం పులకితులయ్యారు. అంతా జై జోగుళాంబా అంటూ ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. అలంపూర్, న్యూస్‌లైన్ : వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగం గా భక్తులకు జోగుళాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం మంగళవారం లభించింది. అశేష భక్త జనావళి చేత అమ్మ విశేష పూజలందుకుంది. భక్తులు తమ శిరస్సులపై కలశాలతో వచ్చి ఆమె ను అభిషేకించారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్ఛారణల మధ్య పంచామృతాలతో పూజలు చేశారు. అమ్మవారి ఆ లయంలో జనవరి 31వ తేదీ నుంచి ఐ దు రోజుల పాటు 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు పూర్ణాహుతి ,సహస్ర కలశ, పంచామృత , కనకాభిషేకాలు నిర్వహించారు. స్వామివారి, అమ్మవారి కళ్యాణోత్సవ ఘట్టం, ధ్వజ అవరోహణతో కార్యక్రమాలు పరిసమాప్తి చెందాయి. ఆగమ శాస్త్ర రీత్యా... సహస్ర కలశాలకు అధికారికంగా ఆల య ఈవో గురురాజ చేత అర్చక స్వా ములు ఆగమ సాంప్రదాయ రీతిలో పూజలు చేయించారు. నవ ఔషధులతో అర్చించారు. కలశాలకు హారతులు ఇ చ్చి అభిషేకం కోసం వాటిని మంగళవాయిద్యాలతో గర్భాలయానికి చేర్చారు. దీంతో అర్చక స్వాములు కవాట బంధ నం (గర్భాలయ తలుపులు మూసి)తో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు జోగుళాంబ నిజ రూప దర్శనం ఇచ్చింది. వారు పులకితులై జై జోగుళాంబా అంటూ జయధ్వానం చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, రక రకాల పూల మాల లతో, నిమ్మకాయాల దండలు, స్వర్ణాభరణాలు అలంకరించారు. ఆలయ అర్చక స్వాములు అమ్మవారికి దశ విధహార తులు సమర్పించారు. -
సైదన్న ఉర్సు ప్రారంభం
జాన్‌పహాడ్ (నేరేడుచర్ల), న్యూస్‌లైన్ :మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్‌పహాడ్ దర్గా ఉర్సు గురువారం గుసుల్ షరీఫ్ కార్యక్రమంతో ప్రారంభమైంది. మూడు రోజులు జరిగే ఈ ఉర్సులో మొదటి రోజు దర్గా పూజారి(ముజావర్) ఆధ్వర్యంలో సైదులుబాబా సమాధులకు పవిత్రస్నానం పూర్తి చేసి నూతన వస్త్రాలు(దట్టీలు) అలంకరించారు. పూలచద్దర్ కప్పి పవిత్ర గంధాన్ని సమాధులపై ఎక్కించారు. సమాధుల చుట్టూ కొవ్వొత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి, బాబాకు నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఫకీరులు ఖవ్వాలీ నిర్వహించారు. అనంతరం పూజా సామగ్రిని దర్గా నుంచి పూజారి(ముజావర్) ఇంటివరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు ట్రాక్టర్లు, బస్సులు, లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై జాన్‌పహాడ్ దర్గాకు చేరుకుంటున్నారు. వక్ఫ్‌బోర్డు అధికారులు భక్తులకు కల్పించే సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. ఉర్సు రెండో రోజైన శుక్రవారం వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి పవిత్ర గంధాన్ని తీసుకువచ్చి ఉదయం 9.30గంటలకు సందల్‌ఖానా నుంచి జాన్‌పహాడ్ పురవీధుల్లో ఊరేగించి నమాజ్ సమయానికి దర్గాకు తీసుకువస్తారు. మూడో రోజు దీపారాదన (చిరాగ్) ఫాతెహా ఇవ్వడంతో జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలు ముగుస్తాయి. ఉర్సుకు హాజరుకానున్న మంత్రి ఉత్తమ్ ఉర్సులో భాగంగా రెండో రోజు శుక్రవారం గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని దర్గా సూపరింటెండెంట్ మజారుద్దీన్, కాంట్రాక్టర్ ఎన్వీ సుబ్బారావు తెలిపారు. ఉర్సు సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హుజూర్నగర్ సీఐ పి. బలవంతయ్య తెలిపారు. భక్తులకు సేవలందించడానికి రెవెన్యూ, ఎక్సైజ్, ఆరోగ్య, అగ్నిమాపక, ఆర్టీసీశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు, పార్కింగ్ కోసం దామరచర్ల, నేరేడుచర్లరోడ్లలో పెట్రోలు బంక్‌ల పక్కన పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. -
మురిసిన ముక్కంటి
ఎమ్మిగనూరు/టౌన్, న్యూస్‌లైన్: శ్రీనీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు మహా రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. హరోంహర.. భక్తజన సంరక్షక నామస్మరణంతో పట్టణం మారుమ్రోగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణ.. మంగళ వాయిద్యాలు.. భక్తజనం హర్షధ్వానాల మధ్య రథోత్సవం వైభవోపేతంగా సాగింది. దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామి దర్శనంతో తన్మయత్వానికి లోనయ్యారు. ఉదయం స్వామి వారి ఆలయుంలో నీలకంఠడుకి పురోహితులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తేరుబజార్‌కు తీసుకొచ్చారు. అక్కడ స్వామి వారిని పీఠంపై అధిష్టింపజేసి హోమం నిర్వహించారు. పూర్ణకుంభంతో నైవేద్యం సవుర్పించి హోవుం చుట్టూ స్వామి వారిని ప్రదక్షిణ చేయించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తిని వుహారథంపై అధిష్టింపజేసి హారతిపట్టారు. అక్కడి నుంచి అశేష భక్తజన వాహిని నడుమ వుహారథం ముందుకు కదిలింది. రథాన్ని లాగి స్వామి కృపను పాత్రులయ్యేందుకు భక్తులు పోటీపడ్డారు. శ్రీవూర్కండేయుస్వామి ఆలయుం వద్దకు చేరుకున్న రథోత్సవం తిరిగి తేరుబజారు వరకు కొనసాగింది. ఉత్సవంలో జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పురోహితులు నిర్వహించిన విశిష్ట పూజా ఘట్టాలు, నందికోళ్ల సేవ , వుంగళ వారుుద్యాలు, గొరవయ్యల నృత్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రవూలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారుు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయు ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి నేతృత్వంలో ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి, ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటైంది. కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వుంత్రాలయుం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మంత్రాలయం ఎంపీపీ సీతారామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వై.రుద్రగౌడ్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బి.వి.జయనాగేశ్వరరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బి.టి.నాయుడు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
పార్వేట కోలాహలం
కదిరి, న్యూస్‌లైన్ : భక్తుల కోలాహలం నడుమ బుధవారం మునిసిపల్ పరిధిలోని కుటాగుళ్లలో పులి పార్వేట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏటా మకర సంక్రాంతి మరుసటి దినం కనుమ పండుగ రోజున ఈ పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. చెన్నరాయస్వామి ఒకప్పుడు ఆయుధం ధరించి వనవిహారార్థం వెళ్లేవారని, దృష్ట మృగాలను వేటాడి విజయ గర్వంతో తిరిగి వస్తారని, అందుకే పులి పార్వేట నిర్వహిస్తారని భక్తులు చెబుతుంటారు. ఇందులో భాగంగా కుటాగుళ్లలో ఉదయం చెన్నరాయ స్వామి ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం దేవరెద్దుతో పాటు అడవి నుండి పట్టుకొచ్చిన కుందేలును తప్పట్లు, మేళతాళాల మధ్య గ్రామంలో ఊరేగించారు. తర్వాత ఊరంతా చెరువు కట్టవద్దకు చేరుకుని ఆచారం ప్రకారం కుందేలును జనం మధ్య వదిలారు. అది ప్రాణభయంతో పరుగులు తీసింది. అయినా సరే భక్తాదులు దాని వెంటపడి ప్రాణంతో వున్న కుందేలు శరీర భాగాలను తలా ఓ ముక్క లాక్కున్నారు. ఆ సమయంలో కాసేపు యువకుల మధ్య తోపులాటలు జరిగాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన భక్తుల మధ్య కూడా కొంత తొక్కిసలాట జరిగింది. గతంలో కుందేలు స్థానంలో పులిని వదిలే వారని, అయితే మనుషులకు హాని కల్గిస్తుందని కుందేలును వదులుతున్నట్లు పెద్దలు చెప్పారు. -
కనుల పండువగా గోదాదేవి కల్యాణం
వల్లూరు, న్యూస్‌లైన్: పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి కల్యాణోత్సవం మంగళవారం కనుల పండువగా జరిగింది. ఆలయ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి సమక్షంలో వేద పండితులు అఖిల్ దీక్షితులు, సుమంత్ దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీ మహా విష్ణువు అంశ అయిన శ్రీ చెన్న కేశవునికి , శ్రీమహాలక్ష్మి అంశ అయిన గోదాదేవి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాంగల్య ధారణ కార్యక్రమాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు . స్వామి వారి తలంబ్రాల కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది. స్వామివారి తలంబ్రాలను వేదపండితులు భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టారు. ఈ సందర్భంగా కొండప్రాంతమంతా గోవిందనామ స్మరణతో మార్మోగింది. కాగా ఉదయం స్వామివారికి బిందె తీర్థ సేవను నిర్వహించారు. దనుర్మాస ప్రాతఃకాల పూజ నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కల్యాణోత్సవంలో మాజీ మేయర్ పుష్పగిరిలో జరిగిన గోదాదేవి కల్యాణంలో మాజీ మేయర్, వైఎస్ఆర్సీపీ కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త పీ రవీంద్రనాధరెడ్డి పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సేవాదళ్ అడ్‌హక్ కమిటీ సభ్యుడు ఇందిరెడ్డి శంకర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పార్టీ నేతలు ఈవీ. మహేశ్వరరెడ్డి, డీఎల్ శ్రీనివాసులురెడ్డి,డీఎల్ మురళీధర్‌రెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త రాజోలు వీరారెడ్డి దంపతులు కూడా కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. -
వైకుంఠ మోక్షం
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం వైకుంఠద్వార దర్శనం కోసం జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, ఆలయాలు భక్తజనంతో కిక్కిరిసి పోయాయి. కోటి యజ్ఞాల పుణ్యఫలం ఇచ్చే ఉత్తరద్వార దర్శానానికి భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచి సాయంత్రం వరకు ఆలయాల్లో ప్రత్యేక పూజాకార్యక్రమాలతో భక్తిభావం వెల్లివిరిసింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠద్వార దర్శనం కోసం జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, ఆలయాలు భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. కోటి యజ్ఞాల పుణ్యఫలం ఇచ్చే ఉత్తరద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్తరద్వారంలో శ్రీలక్ష్మీ సమేత అనంతపద్మనాభస్వామి, శ్రీసీతా సమేత శ్రీరామచంద్రస్వామివారలు భక్తులకు దర్శనమిచ్చారు. నారాయణమూర్తిని ఉత్తర ద్వారంలో దర్శించుకున్న భక్తులు కోటి దేవతలను దర్శించుకున్న పుణ్యాన్ని మూటకట్టుకున్నామన్న సంతృప్తి పొందారు. అంబారీసేవపై ఉత్సవమూర్తులను అంగరంగ వైభవంగా ప్రదక్షిణ చేయించారు. ధర్మపురిలో పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతి, పరిపూర్ణానంద ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు వైకుంఠద్వార దర్శనం మొదలైంది. కొండగట్టు అంజన్న సన్నిధానం భక్తజనసంద్రంగా మారింది. 50 వేల మంది భక్తులు స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. -
ఆపద్బాంధవా..!
అనంతపురం, న్యూస్‌లైన్ నెట్వర్క్ : ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో నిలబడిన భక్తులు.. శనివారం తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారం నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామిని కదిరి పరిసర మండలాలతో పాటు కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామి వారిని వైకుంఠ ద్వారం (ఉత్తర గోపురం) వద్దకు తీసుకురాగానే భక్తులు ‘గోవిందా..గోవింద’ అంటూ తన్మయత్వం పొందారు. 3 గంటల నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు అర్చకులు వైకుంఠ ద్వార ప్రవేశంలో ప్రత్యేకంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వైకుంఠ దర్శనభాగ్యం కల్పించారు. లక్ష మందికి పైగా భక్తులు హాజరైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సతీసమేతంగా తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. డీఎస్పీ దేవదానం ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. ఉరవకొండ మండల పరిధిలోని పెన్నహోబిలంలో ఉత్తర గోపురం నుంచి లక్ష్మీనరసింహస్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి మహా మంగళహారతి, దీక్షాహోమం, అర్చన చేపట్టారు. ముక్కోటి ఏకాదశి విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు భక్తులకు తెలియజేశారు. ఏర్పాట్లను ఈఓ బోయపాటి సుధారాణి పర్యవేక్షించారు. గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి మూలవిరాట్‌కు వేకువజామున నిత్యాభిషేకం చేసి బెంగళూరు నుంచి తెప్పించిన పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని పల్లకిపై తీసుకొచ్చి ఉత్తర ద్వారంలో కొలువుదీర్చగా.. భక్తాదులు దర్శించుకున్నారు. జిల్లా నుంచే కాకుండా కర్నూలు, బళ్లారి నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈఓ ఎంవీ సురేష్‌బాబు, అనువంశిక ధర్మకర్త కె.సుగుణమ్మ ఏర్పాటను పర్యవేక్షించారు. హిందూపురంలోని శ్రీపేట వెంకటరమణస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారంలోకి వెళ్లడానికి ముందు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏడు ద్వారాల నుంచి భక్తులు వెళ్లారు. ఇందుకోసం ఆలయానికి 900 అడుగుల దూరంలో క్యూకట్టారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారిని భక్తాదులు దర్శించుకున్నారు. కొత్తచెరువు మండలం చెన్నకేశవపురంలోని చెన్నకేశవస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఏడు ద్వారాల నుంచి వెళ్లి భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. -
ఘనంగా సుబ్రమణ్యస్వామికి పూజలు
ఆత్మకూరు, న్యూస్‌లైన్: మండల పరిధిలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆ దివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారం సందర్భంగా అర్చకులు సు బ్రమణ్యస్వామి, మంజునాథస్వామి, పా ర్వతీదేవిలను పట్టువస్త్రాలు, ఆభరణాలు పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. కార్తీకమాసం సందర్భంగా పలు ప్రాం తాల నుచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుబ్రమణ్య స్వాములును దర్శిం చుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు తులసి పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామినామం స్మరి స్తూ పూజలు చేశారు. భక్తులు మధ్యాహ్నం మహా మంగళ హారతిని దర్శిచుకున్నారు. వేలాదిగా భక్తులు తరలిరావడం తో భక్తులతో ఆలయం కిక్కిరిసింది. భక్తులకు అన్నదానం నిర్వహించారు. -
‘దశమి’ సంబరం
నెల్లూరు(వేదాయపాళెం),న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం విజయ దశమి సంబరాలు అంబరాన్నంటాయి. భక్తులు ఉదయం నుంచి ఆలయాలకు చేరుకుని పూజలు నిర్వహించారు. ఇళ్లు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. వాహనాలను శుభ్రం చేసి పూజలు చేశారు. నెల్లూరులోని పురమందిరం వద్ద ఉన్న జ్యోతి విఘ్నేశ్వరాలయంలో వందలాది వాహనాలు పూజలు అందుకున్నాయి. నవరాత్రులు ముగియడంతో టెంకాయలు కొట్టి, పూర్ణాహుతి సమర్పించే వారితో ఆలయాల్లో ఆధ్యాత్మికత శోభిల్లింది. నేడు కూడా దశమిపూజలు విజయదశమి పర్వదిన వేడుకలు జిల్లాలో సోమవారం కూడాజరగనున్నాయి. దశమి గడియలు ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమవడంతో అప్పటి నుంచి పూజలు మొదలుపెట్టారు. సోమవారం ఉదయం 11 గంటల వరకు దశమి గడియలు ఉండడంతో పూజలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం జిల్లాలోని ప్రధాన కూడళ్లు జనంతో రద్దీగా మారాయి. -
నేడు గణనాథుడి నిమజ్జనం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడికి బుధవారం భక్తులు వీడ్కోలు పలకనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలతో సహా పలుచోట్ల వినాయక నిమజ్జనం జరగనుంది. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఆరుగురు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, 2500 పోలీస్ కానిస్టేబుళ్లు, 600 మంది హోంగార్డులు, 38 మంది మహిళా పోలీసులు, 12 క్విక్ రియాక్షన్ టీమ్‌లు బందోబస్తులో పాల్గొంటాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, ముథోల్, ఇచ్చోడపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెటిపేట, చెన్నూర్, ఉట్నూర్ ప్రాంతాల్లోనూ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో 20 చోట్ల సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 15 మంది పోలీసు వీడియోగ్రాఫర్లను నియమించారు. ఆదిలాబాద్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉదయం 9.30గంటలకు స్థానిక శిశుమందిర్‌లో నెలకొల్పిన వినాయక ప్రతిమకు పూజలు చేస్తారు. అనంతరం సభ నిర్వహిస్తారు. కలెక్టర్ అహ్మద్ బాబు, ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. ఆదిలాబాద్‌లోని ప్రధాన వీధుల గుండా పెన్‌గంగ వరకు 200 విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర సాగుతుంది. పెన్‌గంగ వద్ద హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. క్రెయిన్ ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. గజ ఈతగాళ్లను నియమించారు. నిర్మల్‌లో స్థానిక బంగల్పేట్ వినాయక్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయనున్నారు. డీఎస్పీ శేష్‌కుమార్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. పెట్రోలింగ్ పార్టీలు, స్పెషల్ పార్టీలు కూడా బందోబస్తులో పాల్గొంటున్నాయి. ఉట్నూర్‌లో ఎల్లమ్మ చెరువులో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. మంచిర్యాలలో విశ్వనాథ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. డీఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హిందు ఉత్సవ సమితి ముక్రం చౌరస్తా వద్ద శోభాయాత్ర ర్యాలీకి స్వాగతం పలకనుంది. కాగజ్‌నగర్‌లో డీఎస్పీ సురేశ్‌బాబు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. కాగజ్నర్లోని పెద్దవాగులో వినాయకులను నిమజ్జనం చేయనున్నారు.