ఆదిలాబాద్, న్యూస్‌లైన్ :
నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడికి బుధవారం భక్తులు వీడ్కోలు పలకనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలతో సహా పలుచోట్ల వినాయక నిమజ్జనం జరగనుంది. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఆరుగురు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, 2500 పోలీస్ కానిస్టేబుళ్లు, 600 మంది హోంగార్డులు, 38 మంది మహిళా పోలీసులు, 12 క్విక్ రియాక్షన్ టీమ్‌లు బందోబస్తులో పాల్గొంటాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, ముథోల్, ఇచ్చోడపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెటిపేట, చెన్నూర్, ఉట్నూర్ ప్రాంతాల్లోనూ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో 20 చోట్ల సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 15 మంది పోలీసు వీడియోగ్రాఫర్లను నియమించారు. ఆదిలాబాద్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉదయం 9.30గంటలకు స్థానిక శిశుమందిర్‌లో నెలకొల్పిన వినాయక ప్రతిమకు పూజలు చేస్తారు. అనంతరం సభ నిర్వహిస్తారు. కలెక్టర్ అహ్మద్ బాబు, ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. ఆదిలాబాద్‌లోని ప్రధాన వీధుల గుండా పెన్‌గంగ వరకు 200 విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర సాగుతుంది. పెన్‌గంగ వద్ద హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు.
క్రెయిన్ ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. గజ ఈతగాళ్లను నియమించారు. నిర్మల్‌లో స్థానిక బంగల్‌పేట్ వినాయక్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయనున్నారు. డీఎస్పీ శేష్‌కుమార్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. పెట్రోలింగ్ పార్టీలు, స్పెషల్ పార్టీలు కూడా బందోబస్తులో పాల్గొంటున్నాయి. ఉట్నూర్‌లో ఎల్లమ్మ చెరువులో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. మంచిర్యాలలో విశ్వనాథ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. డీఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హిందు ఉత్సవ సమితి ముక్రం చౌరస్తా వద్ద శోభాయాత్ర ర్యాలీకి స్వాగతం పలకనుంది. కాగజ్‌నగర్‌లో డీఎస్పీ సురేశ్‌బాబు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. కాగజ్‌నర్‌లోని పెద్దవాగులో వినాయకులను నిమజ్జనం చేయనున్నారు.
నేడు గణనాథుడి నిమజ్జనం
Published Wed, Sep 18 2013 1:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
Advertisement
Advertisement