navaratrulu
-
శరన్నవరాత్రులు..తొలిరోజు బాలాత్రిపుర సుందరిగా..
త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ముఖ్యంగా వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఈ ఆశ్వయుజం. జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారాలను ధరించిన మాసం...ఇవాళ నుంచే దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి మహిళలు, భవాని భక్తులు, నియమ నిష్టలతో అమ్మవారిని ఆరాధించటం ప్రారంభిస్తారు. తొలిరోజు నుంచి మొదలు పెట్టి చివరి రోజు వరకు అమ్మవారిని వివిధ అలంకారాలతో కొలుచుకుంటారు. ఆ క్రమంలో తొలిరోజు అమ్మవారు ఏ రూపంలో భక్తులకు ధర్శనమివ్వనుంది, ఏ నైవేద్యం నివేదిస్తారో చూద్దామా..!అమ్మవారిని బుధవారం అక్టోబర్ 03న సుమహుర్తంలో నవరాత్రలు పూజలందుకోమని స్వాగతం పలుకుతూ కలశస్థాపన చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి అమ్మవారిని రోజుకో అవతారం రూపంలో అలంకరణ చేసి భక్తితో ఆరాధిస్తారు. ఇంట్లో పూజ చేసుకునే వాళ్లు ఎవరైనా కలశస్థాపన సమయం ఉదయం 4:16 ని॥ లకు ఒకవేళ ఆ సమయానికి చేయలేకపోతే, 8 గంటలలోపు కలశ స్థాపన చేయాలి. అప్పుడే ఆఖండ దీపం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజులు ఎవరీ శక్తిసామర్థ్యాల మేరకు వారు వివిధ స్తోత్ర పారాయణాదులతో అమ్మవారిని ఆరాధించి అనుగ్రహం పొందే ప్రయత్నం చేస్తుంటారుతొలిరోజు..తొలి రోజు ఆయా ప్రాంతాల వారీగా అమ్మవారిని అలంకరించి ఆరాధించడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను తొలిరోజు బాలా త్రిపురసుందరీగా అలంకారిస్తారు. ఈ అమ్మ దర్శనం కోసం లక్షలాది భక్తులు బారులు తీరి ఉంటారు. ఈ అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే..సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది. విద్యోపాసకులకు మొట్టమొదటగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెపుతున్నాయి. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి.నైవేద్యంగా కట్టుపొంగలి లేదా పులగం నివేదిస్తారు.మరి కొన్నిచోట్ల తొలిరోజు పాఢ్యమి తిథి పురస్కరించుకుని అమ్వవారిని శైలపుత్రిగా లేదా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఆరాధిస్తారు.శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్! వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్!!..నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది. -
తిరుమలలో నేత్రపర్వంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
-
ఎలా చూసినా సంక్షేమ పథకాలు సమర్థనీయమే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల సుడిగుండంలో ఉందని ఒక విమర్శ ఉంది. దీనికి కారణం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న∙సంక్షేమ పథకాలు అనీ, రాష్ట్రం దివాలా తీసే దిశలోకి ప్రయాణిస్తోందనీ అభిప్రాయాలూ వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్ అప్పు ప్రమాదపు అంచుకి చేరిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న అప్పులను ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతానికి ఆంధ్ర ప్రదేశ్ అప్పు మార్చ్ 2022 నాటికి 3.98 లక్షల కోట్ల రూపాయలు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 32.51 శాతంగా ఉంది. మరి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది ఎక్కువ ఏమి కాదు. ఉదాహరణకి, ఈ అప్పు పంజాబులో 53.3 శాతంగా, రాజస్థాన్‌లో 39.5 శాతంగా, బీహార్‌లో 38.7 శాతంగా, కేరళలో 37.2 శాతంగా, పశ్చిమ బెంగాల్లో 34.2 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ది ఏడవ స్థానం. ఈ అప్పు కేంద్రానికి 60 శాతంగా ఉంది. ఇది అభివృద్ధి చెందిన దేశాల అప్పుతో పోలిస్తే చాలా తక్కువే. కానీ ఎఫ్ఆర్బీఎమ్ చట్టంలో కేంద్రం 40 శాతం, రాష్ట్రాలు 20 శాతంగా... మొత్తం దేశం అప్పు 60 శాతం మించొద్దని పేర్కొన్నారు. ఈ అరవై శాతం పరిమితికి సైద్ధాంతిక ప్రాతి పదిక ఏమీ లేదు. పైగా ఎవరూ ఈ పరిమితిని పాటించలేక పోతున్నారన్నది కూడా వాస్తవం. ప్రభుత్వం చేసే అప్పులు ఎంత దాకా సుస్థిరమో చెప్పే మూడు సూత్రాలు ఆర్థిక శాస్త్రంలో ఉన్నాయి. అవి ఏమిటంటే: ఒకటి– రాష్ట్రం అప్పు మీద చెల్లించే వడ్డీ రేట్ల కంటే రాష్ట్ర ఆదాయ రేటు ఎక్కువగా ఉన్నన్నాళ్ళు ప్రభుత్వ అప్పు అనేది కొనసాగించవచ్చు అనేది. ఇక రెండవ సూత్రం– దీర్ఘ కాలిక అప్పును వడ్డీ రేటు పెట్టి డిస్కౌంట్ చేసిన తర్వాత ఆ అప్పు స్థిరంగా ఉంటే, అలాంటి అప్పు ఫరవాలేదు. మూడవది– వడ్డీ వాయిదాలు తీసివేసిన తరవాత మిగిలే ప్రాథమిక అప్పు కాలక్రమేణా స్థిరంగా ఉంటే, ఆ అప్పు కూడా ఫరవా లేదు. ఈ సూత్రాల ఆధారంగా చెప్పేది ఏమిటంటే... ఆంధ్ర ప్రదేశ్ అప్పు మొదటి రెండు టెస్టులు సునాయాసంగా పాస్ అయ్యి, మూడవ టెస్టు కొంచెం కష్టంగా పాస్ అవుతోంది. కానీ అప్పుల ఊబి అంచున ఉందన్న వాదనకు మాత్రం ఏమీ ఆధారం లేదు. కొందరు శ్రీలంకతోటి పోల్చి అలాంటి సంక్షోభం వస్తుందా అని అడుగుతున్నారు. అయితే విదేశీ అప్పు, అంతర్గత అప్పు రెండూ వేరు వేరు విషయాలు. కేంద్రం అప్పు, రాష్ట్రం అప్పు కూడా వేరు వేరు విషయాలే. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రమాదభరితంగా అప్పులు చేసింది అన్నదానికి సైద్ధాంతిక ఆధారాలు లేవు. అనేక సోషల్ మాధ్యమాలలో కొంతమంది మేధావులు చేసే ఆరోపణ ఏమిటంటే ఉచితాలు ఎక్కువగా ఇవ్వడం వలన ప్రభుత్వ ఖర్చు పెరిగి, అప్పుల భారం పెరిగిందని! ఇది చాలా అభ్యంతరకర వాదన. ఆధునిక సమాజంలో అన్ని వర్గాలకూ విద్య, వసతి, ఆరోగ్యం, జీవనోపాధి, ఇతర మౌలిక సదుపాయాలు అందించడం ప్రభుత్వాల బాధ్యత. వైస్సార్సీపీ ప్రభుత్వం ఏ కారణం వల్ల ఇచ్చినా అది సమర్థ నీయమే. ‘నవరత్నాలు’ అని చెప్పే సంక్షేమ పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకు గణనీయమైన ధన సహాయమే చేస్తోంది. విద్య మీద ఖర్చు 2019 –20లో రాష్ట్ర జీడీపీలో ఒకేసారి 2.71 శాతానికి పెంచారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంక్షేమం... ఎన్నడూ లేని విధంగా చివరి మూడేళ్లలో 2.24, 2.21, 2.11 శాతంగా ఉన్నాయి. ఇంకా ఆర్థిక సేవా విభాగ వ్యయం చివరి రెండేళ్లలో అత్యధికంగా 3.71, 3.55 శాతంగా ఉన్నాయి. ఆ విధంగా రాష్ట్రం మిలీనియం సస్టయినబుల్ గోల్స్ అందుకోవడా నికి ఇవి అవసరమే. మరో పక్క, మూల ధన వ్యయం చివరి మూడేళ్లలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జీఎస్డీపీ)లో 1.27, 1.87, 1.54 శాతాలతో కావాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ఆర్థిక పరిస్థితుల సుస్థిరత కోసం నిధుల్ని మూల ధన వ్యయానికి మరల్చడం అవసరం. అది చేయకపోతే రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు మందగించడం, దరిమిలా రాష్ట్ర ఆదాయం పెరగక పోవడం జరగవచ్చు. ఆదాయం పెరగక పొతే పథకాల అమలు ప్రమాదంలో పడవచ్చు. దీనికి సంక్షేమ పథకాలను తప్పు పట్టి ఎవరూ ఏమీ చెయ్యలేరు. పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి ఫలాలు అందరికీ చేరవు కాబట్టి ప్రభుత్వాలు అప్పు చేసైనా అల్పాదాయ వర్గాల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సి ఉంది. అప్పుల పెరుగుదలకు తగ్గ ఆదాయ సామర్థ్యం పెంచుకోవడం రాష్ట్రాలకు అవసరం. కానీ జీఎస్టీ విధానం తర్వాత రాష్ట్రాలు తమ స్వేచ్ఛను అనూహ్యంగా కోల్పోయాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం తన ఖర్చుల కోసం సెస్సులు విధించి, రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో మోసం చేస్తోంది. 15వ ఫైనాన్స్ కమిషన్, రిజర్వ్ బ్యాంకు వాళ్ళ నివేదికలలో కూడా దీని ప్రస్తావన ఉంది. గత ఏడేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ సగటు నిజ ఆర్థిక వృద్ధి రేటు 7.76గా ఉంది. ఇది దేశ జీడీపీ రేటు 5.08తో పోలిస్తే మెరుగ్గానే ఉంది. ఇక నామినల్ వడ్డీ రేటు 15 నుండి 18 శాతం మధ్య ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందనడం అవాస్తవం. రాష్ట్ర రెవెన్యూ ఆదాయం, రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో కూడా రాష్ట్ర పరిస్థితి బాగానే ఉంది. రాష్ట్ర ఆదాయ సామర్థ్యం గణనీయంగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి పన్ను విధింపు అధికారాలు పరిమితం చేయడం వల్ల పెరిగిన ఖర్చును ఆదాయం ద్వారా అందుకోలేక పోతోంది. కేంద్రం... రాష్ట్రాలకు సరైన గ్రాంట్లు ఆలస్యం చేయకుండా ఇవ్వడం, కేంద్ర–రాష్ట్ర పన్నుల జాబితాలను సవరణ చేసి రాష్ట్రాలకు అదనపు పన్నులు విధించుకునే అధికారాలు ఇవ్వడం ఇందుకు పరిష్కార మార్గాలు. – శివదుర్గా రావు, రీసర్చ్ స్కాలర్, – రమణ మూర్తి, ఆర్థిక శాస్త్ర ఆచార్యులు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం -
నవరత్నాలతో అన్ని రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి చెందుతుంది : తమ్మినేని
-
‘పోలవరం, సుజల స్రవంతితో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం’
సాక్షి, విశాఖపట్నం: సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నవరత్నాలతో అన్నిరంగాల్లో ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కోవిడ్ నియంత్రణలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్, సుజల స్రవంతి పథకం ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం కానుందని తమ్మినేని అన్నారు. -
ఉత్తమ లఘు చిత్రంగా ‘జయహో జన నాయకా’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2020కి ప్రకటించిన ‘నవరత్నాలు’ అభివృద్ధి పథకాలపై తీసిన లఘు చిత్రాల(షార్ట్ ఫిలిం)లో ‘జయహో జన నాయకా’ ఉత్తమ లఘుచిత్రంగా ఎంపికైంది. లఘు చిత్రాల ఫెస్టివల్‌కు మొత్తం 35 ఎంట్రీలొచ్చాయి. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగం అభివృద్ధి సంస్థ చైర్మన్ టీఎస్ విజయచందర్ అధ్యక్షతన బీఎన్వీ రామకృష్ణంరాజు, ఎంవీ రఘులు కమిటీ సభ్యులుగా లఘు చిత్రాలను పరిశీలించారు. ప్రథమ బహుమతికి ఒకటి, ద్వితీయ బహుమతికి రెండు, తృతీయ బహుమతికి మూడు చొప్పున మొత్తం ఆరు లఘు చిత్రాలను ఎంపిక చేశారు. వాటి నిర్మాతలకు త్వరలో నగదు బహుమతులతో పాటు ప్రశంస పత్రాలు ఇవ్వనున్నట్టు విజయచందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ బహుమతి: ‘జయహో జన నాయకా’.. నిర్మాత వజ్రగిరి నాగరాజు(విజయవాడ), బహుమతి రూ.లక్ష ద్వితీయ బహుమతి: ఈ కేటగిరీలో మొదటి లఘుచిత్రం ‘నవ రత్నాలు మ్యూజికల్ ప్రెజెంటేషన్’, నిర్మాత ఎస్బీఎస్ శ్రీనివాస్ పోలిశెట్టి(తూర్పుగోదావరి పెద్దాపురం), రూ.50 వేలు. రెండో లఘు చిత్రం ‘జగనన్న నవ రత్నాలు’.. నిర్మాత శివశ్రీ మీగడ(విశాఖ), రూ.50 వేలు తృతీయ బహుమతి: ఈ కేటగిరీలో మొదటి లఘుచిత్రం ‘బోర్న్ ఎగైన్’(మళ్లీ పుట్టాను).. నిర్మాత టీఎస్ లక్ష్మీనారాయణమూర్తి(కాకినాడ), రూ.25 వేలు. రెండో లఘుచిత్రం ‘రాజన్న రాజ్యంలో ఓ సీత కథ’.. నిర్మాత టి.వేణుగోపాల్‌కృష్ణ(పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు), రూ.25 వేలు. మూడో లఘు చిత్రం ‘పేదలందరికీ ఇళ్లు’.. నిర్మాత చండూర్ సుందరరామశర్మ(గుంటూరు), రూ.25 వేలు. -
మనం కట్టేవి ఇళ్లు కావు.. ఊళ్లు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలు పంపిణీతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 7 వరకూ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు.(చదవండి: ఏలూరు ఘటనపై సీఎం జగన్ సమీక్ష) కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. లబ్ధిదారులు ఎలా కావాలంటే.. అలా ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం తెలిపారు. ‘‘లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే.. ఇళ్లు కట్టించి ఇస్తాం. మెటీరియల్ ఇవ్వండి, లేబర్ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేస్తాం. లేదు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇళ్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలి. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలి. దీని కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలి. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమని’’ సీఎం స్పష్టం చేశారు. (చదవండి: బాబు గారి కపట నాటకం) ప్రతి లేఅవుట్‌ను ఒక యూనిట్‌గా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఆ లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సెంట్రింగ్ వంటి పనులకు అవసరమైన సామాగ్రిని అక్కడే సిద్ధం చేసుకోవాలని, దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణం చురుగ్గా ముందుకు సాగుతుందని సీఎం తెలిపారు. ఇటీవల వర్షాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా లే అవుట్లలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైన విధంగా డ్రైయిన్లు నిర్మాణం, ఇతరత్రా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం లేకుండా, సమస్యలు లేకుండా చూడాలని.. ప్రతి లే అవుట్‌పైనా సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయాలని, దీని తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మనం కట్టేవి ఇళ్లు కావు, ఊళ్లన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏ పని చేసినా కాలనీల అందాన్ని పెంచేలా చూడాలి. వీధి లైట్ల దగ్గర నుంచి అక్కడ ఏర్పాటు చేసే ప్రతి సదుపాయంపైనా దృష్టి పెట్టాలి. ప్రతి లే అవుట్లో నమూనా ఇంటిని (మోడల్ హౌజ్) నిర్మించాలని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ♦మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ♦3,65,987 ఇళ్లస్థలాలపై కోర్టు కేసులు ♦ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాల సేకరణ ♦రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాల పంపిణీ ♦కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయం ♦వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక ♦పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో డిసెంబర్ 25నే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం ♦175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభం ♦8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం ♦రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం ♦టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును భరించనున్న ప్రభుత్వం ♦300 చదరపు అడుగుల ఫ్లాట్లను కేవలం రూ.1 రూపాయికే ఇవ్వనున్న ప్రభుత్వం -
తొలిరత్నం రైతుభరోసా
సాక్షి, అమరావతి: ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్న అందరి ప్రభుత్వం కాబట్టే దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా అర కోటి మందికి పైగా రైతులకు.. రైతు భరోసా సొమ్ము నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో జమ అవుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. అలా జమ చేసిన సొమ్ము వారి పాత అప్పుల కింద బ్యాంకులు మినహాయించుకోలేని విధంగా ఇస్తున్నామని తెలిపారు. దాదాపుగా 50 లక్షల మంది రైతులకు సంవత్సరానికి రూ. 13,500 చొప్పున 5 సంవత్సరాలలో మొత్తం రూ. 67,500 నేరుగా వారి చేతుల్లో పెట్టబోతున్నామని తెలిపారు. నవరత్నాలలో మొట్టమొదటి పథకం రైతు భరోసా అని, నాలుగేళ్లలో ఒక్కో రైతుకు రూ. 12,500 చొప్పున మొత్తం రూ. 50 వేలు ఇస్తామని మొదట్లో చెప్పామని, కానీ ఇప్పుడు రైతుగా తోడుగా ఉండేందుకు మానవత్వంతో ఒక్కో రైతుకు రూ. 13,500 చొప్పున ఇస్తున్నామని వివరించారు. అంటే, మాట ఇచ్చిన దానికన్నా ఒక్కో రైతుకు రూ.17,500 అదనంగా అందుతోందన్నారు. కౌలు రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్నామని, కోటికి పైగా రైతు కుటుంబాలకు ఈ 18 నెలల కాలంలోనే దాదాపు రూ.13 వేల కోట్లు రైతు భరోసా కింద ఇచ్చామని తెలిపారు. వచ్చే జనవరిలో ఇచ్చే రూ.2 వేలు కూడా ఇందులో కలిపామని చెప్పారు. వ్యవసాయ రంగంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఆర్బీకేలతో అన్నదాతలకు సేవలు విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు అండగా నిలబడేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతు అవస్థ తెలిసిన వ్యక్తిని కాబట్టి, వారిని అన్ని విధాలుగా ఆదుకునే కార్యక్రమం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అండగా ప్రతి నియోజకవర్గంలోనూ వారికి వైఎస్సార్ జలకళ ద్వారా బోర్లు వేయించడమే కాకుండా మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. ఏటా 50 వేల బోర్లు వేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రూ. 4 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు చెల్లించకుండా పెట్టిన రూ. 8,655 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వమే చెల్లించింది. ధాన్యం సేకరణ బకాయిలు రూ. 960 కోట్లు. అవి కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకే ధాన్యం సేకరణ తర్వాత రెండు వారాల్లోనే చెల్లించాలని చెబుతున్నాం. ఇంకా గత ప్రభుత్వం పెట్టిన విత్తనాల సబ్సిడీ బకాయిలు రూ. 384 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద చెల్లించాల్సి ఉన్న రూ. 1,030 కోట్లు.. ఇవన్నీ మన రైతుల మీద ప్రేమతో మన ప్రభుత్వం చెల్లించింది. పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ రైతులకు పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను రూ. 1,800 కోట్లు వెచ్చించి అందిస్తున్న ప్రభుత్వం మనది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన రైతుల వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇందుకోసం 2019 ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికే రూ. 510 కోట్లు చెల్లించాం. బీమా ప్రీమియం పూర్తిగా చెల్లిస్తున్నాం.. బీమా ప్రీమియంను కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. 2019 ఖరీఫ్‌కు సంబంధించి రైతులు తమ వాటాగా కేవలం ఒక్క రూపాయి చెల్లించగా, రాష్ట్రంలో రైతులందరి తరఫున కట్టాల్సిన రూ. 506 కోట్లు, ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన రూ. 524 కోట్లు.. మొత్తం రూ. 1,030 కోట్లు బీమా ప్రీమియం చెల్లించగా, ఈ డిసెంబర్ 15న బీమా పరిహారం (క్లెయిమ్‌లు) రూ. 1,227 కోట్లు బీమా కంపెనీలు చెల్లించనున్నాయి. రైతుకు సాంకేతికంగా వెన్నుదన్ను 13 జిల్లాల్లో జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌లు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 147 ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లు (గ్రామీణ నియోజకవర్గాల్లో) ఏర్పాటు చేస్తాం. వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించిన వాటినే రైతులకు అందిస్తున్న ప్రభుత్వం మనది. వ్యవసాయ అనుబంధ రంగాలకూ పెద్దపీట.. కేవలం వ్యవసాయంతో మాత్రమే లాభసాటి కాదని చెప్పి, చేయూత కార్యక్రమం తీసుకువచ్చాం. అందులో భాగంగా డెయిరీకి ప్రోత్సాహం. అందు కోసం ఆవులు, గేదెలు 4.68 లక్షల యూనిట్లు కొనుగోలు చేయిస్తున్నాం. 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం. అమూల్ సంస్థతో అవగాహన కూడా కుదుర్చుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 9,899 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఏర్పాటు చేస్తున్నాం. అమూల్‌తో పాల ధర అధికం.. కడప, ప్రకాశం జిల్లాలలో చూస్తే లీటరు గేదె పాలను (6 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) హెరిటేజ్ సంస్థ రూ. 34కు, దొడ్ల డెయిరీ రూ. 32కు కొనుగోలు చేస్తుండగా, అమూల్ రూ. 39కి కొనుగోలు చేయబోతుంది. ఆ విధంగా రూ. 5 నుంచి రూ.7 ఎక్కువ ఇవ్వబోతుంది. గేదె పాలను ప్రకాశం జిల్లాలో లీటరు (10 శాతం ఫ్యాట్, 9 శాతం ఎస్ఎన్ఎఫ్) సంగం, హెరిటేజ్ సంస్థలు రూ. 58 లకు, జెర్సీ రూ.60 లకు కొనుగోలు చేస్తుండగా, అమూల్ రూ. 64.97కు కొనుగోలు చేయనుంది. ఆ విధంగా దాదాపు ఐదు నుంచి ఏడు రూపాయలు ఎక్కువగా చెల్లించబోతున్నది. ఇక ఆవు పాలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో లీటరుకు హెరిటేజ్ సంస్థ రూ. 23.12లు, సంగం డెయిరీ రూ. 25.20లు, జెర్సీ రూ.24.89 లు చెల్లిస్తుండగా.. అమూల్ రూ.28 చెల్లించనుంది. ఆ విధంగా దాదాపు రూ.3 నుంచి రూ.5 ఎక్కువ ధర రైతులకు రానుంది. గ్రామీణ వ్యవస్థలో రైతులకు ఎలా మేలు చేయాలనే ప్రభుత్వం ఉండాలి తప్ప, వారిని ఎలా పిండాలన్న ఆలోచన ఉండకూడదు. అందుకే ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను మార్చబోతున్నది. ఆక్వా రైతులకు భరోసా.. ఇంకా ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేయడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 720 కోట్ల భారం పడుతోంది. అయినా చిరునవ్వుతో ప్రభుత్వం భరిస్తోంది. ఆక్వా ఉత్పత్తులు గ్రామాల్లోని జనతా బజార్లలో దొరుకుతాయి. ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 35 చోట్ల ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నాం. ఆక్వా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం 2019–20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు, కోవిడ్ సమయంలో కూడా రైతులకు అండగా నిలబడుతూ మొక్కజొన్న, సజ్జ, జొన్న, పొగాకు, ఉల్లి, పసుపు, టమోటా, అరటి, బత్తాయి తదితర ఉత్పత్తులు 8,84,882 టన్నులు కొనుగోలు చేసి రూ. 3,491 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మనది. ఇంకా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కోసం మరో రూ. 666 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు మంచి ధరలు అందించాలన్న లక్ష్యంతో ఫలానా పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే ధరలు నిర్ణయించి రైతులకు తెలియజేస్తున్నాం. అవన్నీ ఆర్బీకేలలో ప్రదర్శిస్తున్నాం. తద్వారా మార్కెట్లో పోటీ వాతావరణం కల్పిస్తున్నాం. కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వమే పంటలను నేరుగా కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన పంటలకు అదనపు విలువ (వాల్యూ యాడిషన్) జోడించి, తిరిగి మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది. అందుకే సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రూ. 3 వేల కోట్లతో ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయి. గోదాములు, ఆర్బీకేలు, జనతా బజార్లు కనిపిస్తాయి. రెండో దశ ప్రాససింగ్ యూనిట్లు కూడా రాబోతున్నాయి. మొత్తం ఈ కార్యక్రమం కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. -
అమ్మవారి రూపాన్ని ధైర్యంగా చూడగలరా?!
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే పండుగ విజయదశమి. యావద్భారతం ఏటా ఎంతో వైభవంగా జరుపుకొనే ఉత్సవం. అయితే ఈసారి కరోనా కారణంగా పరిస్థితులు మారిపోయాయి. మునుపటి స్థాయిలో కాకపోయినా, కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూనే ప్రజలు పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు. కాగా, తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు నిర్వహించి, పదో రోజును విజయదశమి లేదా దసరాగా జరుపుకొంటారన్న విషయం తెలిసిందే. అయితే అన్నిచోట్లా ఈ ఉత్సవాలు ఒకేరకంగా నిర్వహించరు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లోని ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యమంతా ఈ పండుగ ఉత్సవాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా దసరా అంటే శక్తి ఆరాధనే. శక్తి స్వరూపిణిని అయిన అమ్మవారిని కొలిచే సందర్భమే. మహిషాసురుడిని వధించిన ఆ దుష్టసంహారిణికి జేజేలు పలుకుతూ, మమ్మల్ని కాపాడు తల్లీ అంటూ వేడే వేడుక. (చదవండి: శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు) మరి ఆ అమ్మవారికి ప్రతిరూపమైన మహిళలకు ఈదేశంలో ఏపాటి గౌరవం దక్కుతోంది? దుర్గామాత విశ్వరూపం గురించి తెలిసిన మనం, ప్రతి ఆడబిడ్డలోనూ అంతర్లీనంగా దాగి ఉండే ఆ ఆదిశక్తికి ఎంత విలువ ఇస్తున్నాం? ‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా’అంటూ స్త్రీలకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన కర్మభూమి మా జన్మస్థానం అని గర్వంగా చెప్పుకొనే వాళ్లలో లింగభేదాలకు అతీతంగా, ఎంతమంది మహిళను పురుషులతో సమాననంగా, ముఖ్యంగా సాటి మనిషిగా చూడగలుగుతున్నారు? ఆ దేవి అనుగ్రహం పొందేందుకు హారతులు పట్టి, పెద్ద ఎత్తున పండుగ చేస్తున్న వారిలో, కడుపులో ఉన్నది ఆడశిశువు అని తెలియగానే గర్భంలోనే అంతం చేస్తున్న వాళ్లు ఎందరు? అన్ని అవాంతరాలు దాటుకుని ఎలాగోలా భూమి మీద పడి, ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొని విద్యాసంస్థల్లో అడుగుపెడితే ప్రేమ పేరిట వేధించే పోకిరీలు, వాటిని అధిగమించి కార్యక్షేత్రంలోకి దిగితే అడుగడుగునా వివక్ష, ఇక గృహిణిగా అంతాతానై కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్న ఇల్లాలికి కనీస గౌరవం ఇవ్వకుండా చిన్నచూపు చూసేవిధంగా వ్యవహరించే తంతు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమేనని కొట్టిపారేసే మహానుభావులు ఎందరు? ఇక నెలల పసికందు నుంచి పండు ముసలిదాకా మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మృగాళ్ల పశువాంఛకు బలైపోతున్న ఆడవాళ్ల సంఖ్యకు లెక్కేలేదు. నేర గణాంక సంస్థల లెక్కల పరిగణనలోకి రాని అవ్యవస్థీకృత నేరాలు కోకొల్లలు. అనాదికాలం నుంచి నేటి ఆధునిక స్మార్ట్ యుగం దాకా.. హథ్రాస్ ఉదంతం వంటి ఎన్నెన్నో దారుణాలకు సాక్షీభూతంగా నిలిచిన సమాజం, ఏ న్యాయస్థానం ముందు దోషిగా నిలబడకపోవచ్చు. కానీ ఆ దుర్గాదేవి విజయాన్ని ఉత్సవంగా జరుపుకొనే ఈ పర్వదినంనాడు, ఆ అమ్మవారి ముందు ధైర్యంగా నిలబడి, ఆ తల్లి రూపాన్ని చూస్తూ మనస్ఫూర్తిగా ఆమె అనుగ్రహం కోరే ధైర్యం ఎంతమందికి ఉంటుంది! దసరా పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న నిజమైన స్ఫూర్తిని గ్రహించగలిగితే, ఇతరులకు చెడు చేయకుండా ఉండటం సహా బాధితుల పక్షాన పోరాడే గుణాన్ని ప్రతి ఒక్కరు పెంపొందించుకోవచ్చు. గతంలో ఎలా ఉన్నా సరే నేటి నుంచైనా పద్ధతి మార్చుకుని, మనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవీయత, అహంకారం వంటి దుర్గుణాలను అంతం చేయమంటూ ‘ఆయుధ పూజ’కు సంసిద్ధులమవుదాం!! -
కట్టె పొంగల్, ఆవ పులిహోర
శరన్నవరాత్రోత్సవం ముగిసింది. దుష్టరాక్షసులపై దుర్గమ్మ సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే విజయ దశమి వచ్చేసింది. కనీసం ఇవ్వాళ అయినా రోజూ తినే రకాలకు కాస్తంత భిన్నంగా ఆలోచించి, కొత్తరకం వంటలను మీరే మరింత రుచిగా శుచిగా వండి అమ్మకు తినిపించండి. అన్నట్లు ఇవేమీ కొత్త వంటలు కాదు... తయారీ మాత్రమే కొత్త. అదీ మీరు తయారు చేయడం ఇంకా కొత్త. మీకు చేతకాకపోతే అమ్మకు సాయం చేయండి చాలు... ఆనందంగా ఆరగిస్తుంది. మీరే అమ్మ స్థానంలో ఉన్నారా... మరీ మంచిది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ అయిన ఆ ఆదిపరాశక్తి... జగజ్జననికి ఘాటైన ఆవ పులిహోర, మిరియాలతో చేసిన నేతి దద్ధ్యోదనం, ఘుమ ఘుమలాడే కట్టె పొంగలి, కరకరలాడే జిలేబీ, కమ్మగా కరిగిపోయే పేణీలడ్డు, గొంతులోకి గుమ్ముగా జారిపోయే పేణీ పాయసం వండి ఆరగింపు పెట్టండి. మీరు పెట్టిన నైవేద్యాలన్నీ ఆనందంగా ఆరగించి విజయోస్తు అని దీవిస్తుంది. దద్ధ్యోదనం కావలసినవి: బియ్యం – రెండు కప్పులు; అల్లం – చిన్న ముక్క; పచ్చి మిర్చి – 10; ఎండు మిర్చి – 5; సెనగ పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; దానిమ్మ గింజలు – టేబుల్ స్పూను; చిన్న ద్రాక్ష లేదా కిస్మిస్ ద్రాక్ష – కప్పు; చెర్రీ ముక్కలు – టీ స్పూను; టూటీ ఫ్రూటీ ముక్కలు – టీ స్పూను; జీడి పప్పులు – 10; నెయ్యి – టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: ∙ముందుగా బియ్యం కడిగి నీళ్లు ఒంపేసి, ఐదు కప్పుల నీరు జత చేసి ఉడికించాలి∙ అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా దంచి పక్కన ఉంచాలి∙ బాణలిలో నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి∙ ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి, అందులో వేయించిన పోపు సామాను వేసి బాగా కలపాలి∙ తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలపాలి∙ చివరగా దానిమ్మ గింజలు, దానిమ్మ గింజలు చిన్న ద్రాక్ష లేదా కిస్మిస్ ద్రాక్ష, చెర్రీ ముక్కలు, టూటీ ఫ్రూటీ ముక్కలు, జీడి పప్పులు వేసి బాగా కలపాలి∙ పుల్లగా ఉండే నిమ్మకాయ ఊరగాయతో అందిస్తే ప్రసాదాన్ని కూడా అన్నంలా తినేస్తారు. కట్టె పొంగల్ కావలసినవి: బియ్యం – ముప్పావు కప్పు; పెసరపప్పు – పావు కప్పు; మిరియాల పొడి – టీ స్పూను; అల్లం తురుము – టీ స్పూను; పచ్చిమిర్చి – 4; జీలకర్ర – టీస్పూను; జీడిపప్పు – 10; కరివేపాకు – 2 రెమ్మలు; నెయ్యి – 5 టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత. తయారీ: ∙బియ్యం, పెసర పప్పులను శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి దించేయాలి∙ పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేయాలి∙ బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్ది సేపు వేయించాలి∙ జీడిపప్పు పలుకులు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి∙ కరివేపాకు, మిరియాల పొడి, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించి దించేయాలి∙ అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి కలియబెట్టాలి∙ చట్నీ, సాంబారుతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. ఆవ పులిహోర కావలసినవి: బియ్యం – కప్పు; చింతపండు – పెద్ద నిమ్మకాయంత; బెల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఆవాలు – టీ స్పూను; ఉప్పు – తగినంత; నువ్వుల నూనె – టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; పల్లీలు – గుప్పెడు; పచ్చి సెనగపప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; నువ్వు పప్పు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 5; పచ్చి మిర్చి – 5; పసుపు – అర టీ స్పూను; కరివేపాకు – 4 రెమ్మలు; ఇంగువ – చిటికెడు; నూనె – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి, వెంటనే పెద్ద పాత్రలోకి తిరగబోసి, టేబుల్ స్పూను నువ్వుల నూనె వేసి కలపాలి∙ చింతపండును నీళ్లలో నానబెట్టి గుజ్జు తీసి పక్కన ఉంచాలి∙ బాణలిలో ఆవాలు వేసి చిటపటలాడే వరకు వేయించి, తీసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి∙ బాణలిలో పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచాలి∙ బాణలిలో నూనె వేసి కాగాక, సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి వరసగా వేసి వేయించాలి. కరివేపాకు జత చేసి బాగా కలిపాక, నువ్వు పప్పు, ఇంగువ, పసుపు వేసి కొద్దిగా వేయించాలి∙ చింతపండు గుజ్జు (టేబుల్ స్పూను గుజ్జు పక్కన ఉంచి, మిగతా భాగం మాత్రమే ఉపయోగించాలి), బెల్లం తురుము వేసి బాగా కలిపి ఉడికించి దించేయాలి∙ పాత్రలో ఉన్న అన్నం మీద చింతపండు గుజ్జు, ఆవ పొడి వేసి కలపాలి. ఉడికించిన చింతపండు + పోపు మిశ్రమం, ఉప్పు వేసి కలియబెట్టాలి. సుమారు గంటసేపు బాగా ఊరిన తర్వాత వడ్డించాలి. పేణీ లడ్డు కావలసినవి: సెనగపిండి – కప్పు; పేణీ – కప్పు; పంచదార – ముప్పావు కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; డ్రై ఫ్రూట్ పొడి – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి, సన్నని మంట మీద వేడి చేసి,సెనగపిండి వేసి పచ్చి వాసన పోయి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపి చల్లారనివ్వాలి∙ మిక్సీలో పంచదార, పేణీలు వేసి రవ్వలా చే సి, ఈ మిశ్రమాన్ని సెనగపిండి ఉన్న పాత్రలో వేయాలి∙ డ్రైఫ్రూట్ పొడి జత చేయాలి∙ కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ లడ్డూ కట్టాలి. జిలేబీ కావలసినవి: మైదా పిండి – కప్పు; బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను; పెరుగు – కప్పు; నూనె – వేయించడానికి తగినంత; పంచదార – కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు; ఏలకుల పొడి – పావు టీస్పూను; మిఠాయి రంగు – రెండు చుక్కలు; రోజ్ వాటర్ – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి బాగా కలిపి ఒక రోజంతా నాననివ్వాలి∙ ఈ మిశ్రమాన్ని మూతకు రంధ్రం ఉన్న మ్యాగీ సీసాలో పోయాలి∙ ఒక పాత్రలో పంచదార, నీళ్లు, రోజ్ వాటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేసి, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి∙ బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. మంట మధ్యస్థంగా ఉంచాలి∙ పిండి ఉన్న సీసాను తీసుకుని జిలే బీ ఆకారం వచ్చేలా నూనెలో తిప్పాలి∙ బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి వెంటనే పంచదార పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి∙ వేడివేడిగా అందించాలి. కదంబం కావలసినవి: కందిపప్పు – పావు కప్పు; బెల్లం – 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – చిన్న కట్ట; చింతపండు గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు; సాంబారు పొడి – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; చిలగడదుంప ముక్కలు – అర కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 6 (పొడవుగా మధ్యకు చీల్చాలి); మునగకాడ ముక్కలు – కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; దొండకాయ ముక్కలు – పావు కప్పు; అరటికాయ ముక్కలు – పావు కప్పు; తీపి గుమ్మడికాయ ముక్కలు – కప్పు; సొరకాయ ముక్కలు – అర కప్పు; సెనగపిండి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; కారం – 2 టీ స్పూన్లు. పోపు కోసం: ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 10; సెనగపప్పు – టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా. తయారీ: ∙పప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి∙ ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, పచ్చి మిర్చి, చింతపండు గుజ్జు, నీళ్లు, ఉప్పు, పసుపు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి∙ మెత్తగా మెదిపిన పప్పు వేసి బాగా కలిపి, బెల్లం తురుము జత చేయాలి∙ సాంబారు పొడి, కారం వేసి కాసేపు ఉడికించాలి∙ కొద్దిగా నీళ్లలో సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న దప్పళంలో వేసి కలపాలి∙ ఈలోగా పక్కన చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సెనగపప్పు, మెంతులు, ఇంగువ వేసి వేయించి, మరుగుతున్న దప్పళంలో వేసి బాగా కలిపి కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి. పేణీ పాయసం కావలసినవి: పేణీలు – పావు కేజీ; పాలు – అర లీటరు; బెల్లం పొడి – పావు కేజీ; డ్రై ఫ్రూట్స్ పొడి – అర కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ∙పాలు ఒక గిన్నెలో పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి∙ బెల్లం పొడి జత చేసి ఐదు నిమిషాలు పాటు ఉడకవ్వాలి∙ డ్రై ఫ్రూట్ పొడి వేసి కలపాలి∙ ఒక పాత్రలో పేణీ వేసి అందులో పాలు బెల్లం మిశ్రమం వేయాలి∙ డ్రై ఫ్రూట్ పొడి వేసి, తేనె వేసి బాగా కలిపి అందించాలి. -
శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడవరోజు దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్బుత ఘట్టం మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీమహాలక్ష్మీ అమితరమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోకస్ధితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టిరూపమైన అమృత స్వరూపాణిగా శ్రీ దుర్గమ్మను మహాలక్ష్మిగా దర్శించవచ్చు. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుంది. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. (చదవండి: నవరాత్రులు.. నవ వర్ణాలు) దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మహాలక్ష్మి రూపంలో కనక దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రీ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే! శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే!! -
శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
సాక్షి, విజయవాడ: దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలలో ఆరో రోజు దుర్గదేవి అమ్మవారు శ్రీ లలితాత్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారు శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదాశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి తన భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతిదేవీ ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో, వాత్సల్య జితోష్ణలను చిందిస్తూ, చెరుకుగడను చేతపట్టుకుని శివుని వక్షస్ధలంపై కూర్చుని శ్రీ లలితాత్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. చదవండి: దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ ఇంద్రకీలాద్రి: ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్ ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్!! -
నవరాత్రులు.. నవ వర్ణాలు
(వెబ్ స్పెషల్): తెలుగు లోగిళ్లలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అమ్మవారి శరన్నవరాత్రులు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని 9రూపాలలో కొలుస్తారు. తొమ్మిది రకాల నైవేద్యాలు.. స్త్రోత్రాలు అలానే 9 రోజులకు నవ వర్ణాలు ప్రత్యేకం. మరి ఆ రంగలు.. వాటి ప్రత్యేకత ఏంటో చూడండి.. మొదటి రోజు.. పసుపుపచ్చ రంగు శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా కొలుస్తారు. శివుడి భార్యగా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారు కుడి చేతిలో త్రిశూలం.. ఎడమ చేతిలో తామర పువ్వుతో నంది మీద దర్శనమిస్తారు. ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. రెండవ రోజు.. ఆకుపచ్చ రంగు రెండవ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో కొలుస్తాం. ఈ రూపం విముక్తి, మొక్షం, శాంతి, శ్రేయస్సుకు ప్రతీక. చేతిలో జపమాల, కమండలం.. ఉత్త కాళ్లతో దర్శనమిచ్చే అమ్మవారు ఆనందం, ప్రశాంతతను ఇస్తుంది. నేడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. (చదవండి: కోవిడ్ నియమాలతో దసరా ఉత్సవాలు..) మూడవ రోజు.. బూడిద రంగు శివుడిని వివాహం చేసుకున్న తరువాత, పార్వతి తన నుదిటిన అర్ధచంద్రాన్ని అలంకరించింది. ఆమె అందం, ధైర్యానికి ప్రతీక. నేడు బూడిద రంగు దుస్తులు ధరిస్తే మేలు. నాల్గవ రోజు.. నారింజ రంగు నాల్గవ రోజు అమ్మవారిని కూష్మాండ రూపంలో కొలుస్తారు. ఇది విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీక. కూష్మాండం భూమిపై ఉన్న వృక్ష సంపదతో సంబంధం కలిగి ఉంటుంది. నేడు నారింజ వర్ణం దుస్తులు ధరిస్తే మంచింది. (చదవండి: పండుగ ప్రోత్సాహకాలు ఇవ్వలేం) ఐదవరోజు.. తెలుపు రంగు స్కంద మాతగా పూజలందుకుంటుంది తల్లి. బిడ్డకు ఆపద వాటిల్లితే ఆ తల్లి శక్తిగా ఎలా పరివర్తన చెందుతుందో తెలుపుతుంది. ఈ రోజు ధవళ వర్ణం దుస్తులు ధరిస్తే మేలు. ఆరవ రోజు.. ఎరుపు రంగు ఆరవ రోజు అమ్మవారిని కాత్యాయనిగా కొలుస్తారు. యోధురాలికి ప్రతీక. కనుక ఆరవ రోజు ఎరుపు వర్ణం దుస్తులు ధరిస్తారు. ఏడవ రోజు.. నీలం రంగు అమ్మవారిని అత్యంత భయంకరమైన రూపమైన కాళరాత్రిగా పూజిస్తారు. ఆ రోజు అమ్మవారు సుంభ, నిసుంభ రాక్షసులను చంపడానికి తన అందమైన చర్మాన్ని విడిచిపెట్టిందని ప్రతీక. అమ్మవారు ఆపదల నుంచి కాపాడుతుందని నమ్మకం. ఏడవ రోజు నీలం రంగు దుస్తులు ధరిస్తే మంచిది. (చదవండి: శుభ గడియలు షురూ) ఎనిమిదవ రోజు.. గులాబి రంగు మహాగౌరి తెలివితేటలు మరియు శాంతికి ప్రతీక. ఈ రోజు గులాబి రంగు దుస్తులు ధరిస్తే మేలు. ఇది ఆశావాదాన్ని సూచిస్తుంది. తొమ్మిదవ రోజు.. ఊదా రంగు చివరి రోజున సిద్ధి ధాత్రి అవతారంలో అమ్మవారు ఊదారంగు చీర కట్టుకుని పూజలందుకుంటారు. భక్తులు కూడా ఊదారంగు దుస్తులే వేసుకుంటే సర్వవిధాలా శ్రేష్టం. -
శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే
సాక్షి, విజయవాడ : శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ భక్తులకు స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై.. కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు. ఇలా నవరాత్రుల్లో కనకదుర్గమ్మ అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. అవేంటంటే... రెండో రోజు.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రెండవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. చదవండి: కోవిడ్ నియమాలతో దసరా ఉత్సవాలు.. మూడో రోజు.. దుర్గగుడిలో మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీమంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. చదవండి: అమ్మవారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు నాలుగో రోజు.. దసరా వేడుకల్లో అమ్మవారు నాలుగో రోజున శ్రీ లలితా త్రిపురసందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా... చిరుమందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చదవండి: స్వర్ణకవచాలంకృత రూపంలో దుర్గాదేవి అయిదవ రోజు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో అయిదో రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాదనలు ముమ్మరమవుతాయి. ఆరవ రోజు.. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాలు ప్రారంభమైన ఆరో రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం. ఏడోరోజు.. ఉత్సవాల్లో ఏడో రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్ట సంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎనిమిదవ రోజు.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వకంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. తొమ్మిదవ రోజు.. దసరా నవరాత్రి వేడుకల ముగింపు నాడు విజయదశమి రోజున అమ్మవారు రెండు అవతారాలలో దర్శనం దర్శనమివ్వనున్నారు. దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో తొమ్మిదో రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే... భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి. ఆఖరి అవతారంగా శ్రీ రాజరాజేశ్వరీ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపంను దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. -
పేదల సొంతింటి కల సాకారానికి శ్రీకారం
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. అందరికీ ఇళ్లు ఏర్పాటు చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ప్రతిపాదన లకు ఆమోదం లభించింది. నవరత్నాలు, పీఎం ఆవాస్ యోజన కింద తొలిదశలో రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 1,24,624 ఇళ్ల నిర్మాణానికి పేదలకు ఆర్థిక సహాయం చేసే ప్రతిపాదనలను ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.2.50 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్ వెలుపల పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాయి. ఇదే రీతిలో తరువాతి దశల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనేది ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో... రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు అన్నవారు లేకుండా అందరికీ సొంతిల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఇప్పటికే రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాలను ఉగాది పండుగ నాటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో కూడా పేదలకు సొంత గూడు ఉండాలనే ఉద్దేశంతో నవరత్నాల పథకాల కింద ఆర్థిక సహాయం అందజేసేలా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక(డీపీఆర్) రూపొందించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి నివేదించి, నిధులు సమీకరిద్దామని చెప్పారు. నవరత్నాల పథకాలు, పీఎం ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ దీనిపై కసరత్తు చేసింది. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో పేదలకు గృహ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంది. రాష్ట్రంలో మొదటి దశలో 85 ప్రాజెక్టుల కింద రూ.3 వేల కోట్లతో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించిన తరువాత ఆ నివేదిను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు సమర్పించారు. తొలిదశలో 1,24,624 ఇళ్లకు ఆమోదం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పట్టణాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులపై ఢిల్లీలో గురువారం నిర్వహించిన సెంట్రల్ శాంక్షన్ మానిటరింగ్ కమిటీ(సీఎస్ఎంసీ) సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించింది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు. పట్టణ గృహనిర్మాణ పథకం కింద రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 1,24,624 ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ ప్రకారం నవరత్నాల పథకాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునే పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,870 కోట్ల గ్రాంటును రాష్ట్రానికి కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. డిసెంబర్ నాటికి ఈ నిధులను రాష్ట్రానికి విడుదల చేయనుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కూడా కలిపి లబ్ధిదారులకు అందజేస్తుంది. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర పట్టణగృహ నిర్మాణ సంస్థ ఈ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తుంది.గృహ నిర్మాణాలను పరిశీలించి దశల వారీగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేస్తారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు పొందినవారు ఇళ్లు కట్టుకోడానికి ఇదే రీతిలో ఆర్థిక సహాయం చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. అందుకోసం ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. -
దాండియా వేడుకలకు ఆధార్ చెక్ చేశాకే ఎంట్రీ..
సాక్షి, హైదరాబాద్ : దసరా ఉత్సవాల్లోకి హిందూయేతర వర్గాలకు చెందిన వారు ప్రవేశించకుండా ప్రవేశ ద్వారాల్లో ఆధార్ కార్డులు చెక్ చేయాలని గర్బా, దాండియా నిర్వాహకులకు బజరంగ్దళ్ సూచించింది. వేడుకలు జరిగే ప్రాంతాల్లో ఇతర మతస్తులు పాల్గొనకుండా ఆయా ఎంట్రీ పాయింట్లలో ఆధార్ కార్డులు తనిఖీ చేయాలని, ఈ వేడుకలకు హిందువేతరులను బౌన్సర్లుగా నియమించుకోరాదని బజరంగ్దళ్ మీడియా కన్వీనర్ ఎస్ కైలాష్ కోరారు. గత కొన్నేళ్లుగా దసరా వేడుకల్లో హిందూయేతర వర్గాలకు చెందిన కొందరు యువకులు చొరబడి, దాండియా, గర్బాలో పాల్గొనే మహిళల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించిన ఘటనలు చోటుచేసుకున్నాయని, బాధితుల పక్షాన నిలిచిన పురుషులపైనా వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు. హిందూయేతర బౌన్సర్లను నిర్వాహకులు నియమించుకోవడంతో దుండగులు ఈ కార్యక్రమాల్లోకి వచ్చేందుకు దోహదపడుతోందని గుర్తించామని అన్నారు. దసరా వేడుకలు జరిగే వేదికల వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు ఉంటారని, ఇలాంటి ఉదంతాలు తమ దృష్టికి తీసుకువస్తే కార్యక్రమాలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అడ్డుకుంటామని చెప్పారు. -
అప్పన్నను దర్శించుకున్న శారద పీఠాధిపతి
సాక్షి, విశాఖపట్నం : శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి , స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీలు గురువారం సింహాచలంలోని వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి వెంకటేశ్వర్ రావు పీఠాధిపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిలిద్దరు కలిసి అర్చకుల సమక్షంలో నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణలో 57 రోజుల పర్యటన చేపట్టనున్నట్లు స్మాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు. అనంతరం దేవి శరన్ననవరాత్రులకు సంబంధించిన ఉత్సవాల బ్రౌచర్‌ను స్వరూపానందేంద్ర స్వామి విడుదల చేశారు. -
కళ్లెదుటే మేనిఫెస్టో
సాక్షి, అమరావతి : ‘మా ఎన్నికల మేనిఫెస్టో మాకు ఓ బైబిల్.. ఓ ఖురాన్.. ఓ భగవద్గీత..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచూ చెబుతుంటారు. శుక్రవారం జరిగిన శాసనసభాపక్షం సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. మేనిఫెస్టోకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామనేది మాటల్లో కాదు.. చేతల్లో కూడా చూపించాలనే తపన ఆయనలో ఉంది. అందుకే సచివాలయంలో తాను కూర్చునే అధికారిక ఛాంబర్‌కు వచ్చి పోయే దారిలో ఆయన ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాల్లోని అంశాలన్నింటినీ ఫ్రేములుగా కట్టించి గోడలకు ఆకర్షణీయంగా అలంకరింపజేశారు. అంతే కాదు, తన ఛాంబర్ లోపల ఎన్నికల మేనిఫెస్టో ప్రతికి సంబంధించిన పెద్ద బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు తానిచ్చిన వాగ్దానాలు, ప్రజా సంక్షేమం కోసం చేయాల్సిన పనులు తనకు ఎపుడూ గుర్తుండేలా, ఎప్పుడూ తనను హెచ్చరిస్తూ ఉండేలా జగన్ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. ఛాంబర్ లోపల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు చిత్ర పటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ఆయన నుంచి స్ఫూర్తిని పొందిన జగన్.. వైఎస్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం ముగ్ధులను చేసింది. కాగా, వైఎస్ జగన్ తొలిసారిగా తన ఛాంబర్లోకి ప్రవేశించగానే అక్కడ ఏర్పాటు చేసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. -
రైతుకు భరోసా
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని తన నిర్ణయాల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నవరత్నాలలో భాగమైన వైఎస్సార్ రైతు భరోసా అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాల తొలి సమీక్ష సమావేశం గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలోని క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రతి రైతు కుటుంబం చేతికి నేరుగా రూ. 12,500లు పెట్టుబడి సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 13,125 కోట్లు రైతులకు ప్రభుత్వం అందించనుంది. సమీక్ష సందర్భంగా రైతులకు ఏమేం చేయాలో అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రణాళికలో రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ తు.చ. తప్పకుండా అమలు చేయాలని, ఇందులో మరో మాటకు తావులేదని అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే రబీ నుంచే పెట్టుబడి సాయం రైతులకు అందించనున్నారు. ప్రభుత్వమే రైతుల తరఫున పంటల బీమా ప్రీమియాన్ని చెల్లిస్తుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రణాళికను అధికారులకు చూపిస్తూ ఇందులోని ప్రతి అంశాన్ని అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ వారిని ఆదేశించారు. సీజన్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర సలహాల కోసం ఇబ్బంది పడకూడదని, విత్తనాలు, ఎరువుల కోసం బారులు తీరాల్సిన దుస్థితి రాకుండా చూడాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలు, డీలర్లపై ఉక్కుపాదం మోపాలని, క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపడానికి కూడా వెనుకాడవద్దని చెప్పారు. ఈ సందర్భంగా విత్తన చట్టం తేవాలని కొందరు అధికారులు చేసిన సూచనపై మాట్లాడుతూ.. రాష్ట్ర శాసనసభ తొలి సమావేశాల్లోనే సమగ్ర బిల్లు తీసుకువచ్చి విత్తన చట్టం తెస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామ సచివాలయాలకు కీలక బాధ్యత.. అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలు వ్యవసాయరంగ అవసరాలకు ప్రధాన కేంద్రాలుగా ఉండేలా చూస్తామన్నారు. వీటి ద్వారా రైతులకు మంచి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందుబాటులోకి తీసుకెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులను అదుకోలేకపోతే ఆ ప్రభుత్వానికి అర్థం ఉండదన్నారు. ప్రభుత్వ సేవల పట్ల రైతుల్లో విశ్వసనీయత పెంచాలన్నారు. వ్యవసాయ శాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని, పథకాలను రైతులకు అందించడంలో ఎటువంటి అవినీతి జరిగినా ఉపేక్షించబోనని హెచ్చరించారు. అవినీతికి పాల్పడే వారిపై ఎవరూ క్షమించలేనటువంటి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారని, ఎట్టి పరిస్థితిలోనూ వారు మోసపోకూడదన్నారు. విత్తన నాణ్యత నియంత్రణ ప్రభుత్వమే తీసుకునేలా అధికారులు కార్యక్రమం రూపొందించాలన్నారు. పంటల బీమా ప్రీమియం చెల్లిస్తాం.. గత ఐదేళ్లుగా కునారిల్లుతున్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియాన్ని పూర్తిగా చెల్లిస్తుందని, రైతులపై ఎటువంటి భారం ఉండబోదని చెప్పారు. సకాలంలో రైతులకు పంట పరిహారం ఇప్పించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఒక సీజన్లో పంట నష్టపోతే రెండేళ్ల తర్వాత పరిహారం వస్తే రైతులకు ఏం మేలు జరిగినట్టని ప్రశ్నించారు. ఖరీఫ్‌లో పంట నష్టం జరిగితే ఆ తర్వాత వచ్చే రబీ నాటికి పరిహారం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని, అప్పుడే రైతుల్లో బీమాపై విశ్వాసం ఉంటుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే క్రమంలో ఏ పంటకు ఎంత ధర చెల్లిస్తున్నాం అనే విషయాన్ని ముందే చెప్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రైతులకు వడ్డీలేని రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ నుంచే రైతు భరోసా సాయం వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్ల పాటు రూ. 12,500 చొప్పున అందిస్తామన్న పెట్టుబడి సాయాన్ని ఈ ఏడాది రబీ నుంచే పెద్దఎత్తున అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభమయ్యే ఖరీఫ్ నుంచి ఈ సాయాన్ని అందించాల్సి ఉంది. దీనికి బదులుగా అక్టోబర్ 15 నుంచి పెట్టుబడి సాయం అందుతుంది. సుమారు రూ. 13,125 కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందించనున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలకు జమ అయ్యేలా చూడాలన్నారు. కౌలు రైతులకూ సాయం.. కౌలు రైతులకూ పెట్టుబడి సాయం అందించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. భూ యజమానులకు ఎటువంటి నష్టం లేకుండా కౌలు రైతులకు సాయం అందిస్తామన్నారు. 11 నెలల కాలానికి కౌలు రైతులకు స్టాంప్ పేపర్ తరహాలో కార్డు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ విషయంలో భూ యజమానుల భయాందోళనలను పొగొట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని, అవసరమైతే చట్టపరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలు సరైన రీతిలో అందేలా చర్యలు చేపట్టాలని, వారికి గుర్తింపు, ప్రభుత్వ భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రబీ నాటికి కౌలు రైతులను గుర్తిస్తే వారికి కూడా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద సుమారు రూ. 2,500 కోట్లను పెట్టుబడి సాయం కింద ఇవ్వొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రూ. 3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి.. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అందేలా చర్యలు తీసుకోవాలని, పండించిన పంటకు మద్దతు ధర లేదని ఏరైతూ ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ధరలలో తేడా వచ్చినప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా రూ. 3000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్లో పెడతామని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే విపత్తుల నిధి కోసం కేంద్రం ఇచ్చే రూ. 2 వేల కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 2 కోట్లతో కలసి మొత్తం రూ. 4 వేల కోట్లతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ వంటి వ్యవహారాలలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు పౌరసరఫరాల విభాగం వ్యవసాయ శాఖతో కలిసి మెలిసి పని చేయాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన రేషన్ బియ్యం ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న బియ్యం ప్రజలు తినలేక మళ్లీ మిల్లర్లలకే తక్కువ ధరకు అమ్మివేస్తున్నారని, అలాకాకుండా రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి మిల్లింగ్ చేయించి ఆ నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందిస్తే.. అటు రైతులకు, ఇటుపేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆ నాణ్యమైన బియ్యాన్ని బాగా ప్యాక్ చేసి దానితో పాటు మరో ఆరు రకాల నిత్యావసర వస్తువులను గ్రామ వాలంటీర్ల ద్వారా అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఆగస్టు 15కల్లా గ్రామ వాలంటీర్లు అందుబాటులోకి వస్తారు కాబట్టి.. సెప్టెంబర్ 1 నుంచి ఆ వస్తువుల పంపిణీ చేపట్టాలని సూచించారు. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు.. వ్యవసాయం, అనుబంధ రంగాలలోని వివిధ అంశాలను అధ్యయనం చేసేందుకు, రైతులకు దశ, దిశ నిర్దేశించేందుకు ఆయా రంగాల్లోని నిపుణులు, అధికారులతో వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రైతులకు మద్దతు ధర, పథకాల ప్రయోజనాలు పూర్తిగా అందడం, పంటలు వేసే ముందే ప్రభుత్వం నుంచి ఎంత మద్దతు ధర ఇవ్వాలి, తదితర వ్యవసాయరంగ సమస్యలపై సిఫార్సులు చేయడానికి ఆ వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కమిషన్ చేసే సూచనలు, సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. పరపతి విధానం మొదలు వ్యవసాయ సంక్షోభం వరకు పలు అంశాలను వ్యవసాయ కమిషన్ అధ్యయనం చేస్తుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో శీతల గిడ్డంగి, వేర్‌హౌస్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని స్థానిక ఉత్పత్తుల నిల్వకు ఒక శీతల గిడ్డంగి, ఒక వేర్ హౌస్, అవసరం మేరకు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. మూతపడిన సహకార రంగ చక్కెర మిల్లులను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ సంక్షోభంలో చిక్కి దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు కన్నుమూస్తే వారికి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియోను చెల్లించాలన్నారు. పామాయిల్ ధరలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్‌కి వ్యత్యాసం ఉందని, రాష్ట్రంలో ఇంకా యంత్ర సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు నాలుగు రూపాయల బోనస్ చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అది ఊహాజనిత పథకం... అన్నదాత సుఖీభవ పథకం ఎన్నికల ముందు తెచ్చిన ఉహాజనిత పథకమని సీఎం జగన్ అన్నారు. ఆ పథకాన్ని కొనసాగించవలసిన అవసరం లేదన్నారు. రైతులకు తమ ప్రభుత్వం మరెన్నో మేళ్ళు చేయడానికి దృఢసంకల్పంతో ఉందని వివరించారు. ప్రభుత్వం అందించే సేవల పట్ల ప్రజల్లో ఒక ముద్ర పడాలి, రైతుల్లో విశ్వసనీయత పెంచాలి, నాణ్యత ప్రమాణాలు పాటించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కడ అవినీతి జరిగినా ఎవ్వరినీ క్షమించంఅంటూ ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. మేనిఫెస్టో అమలుకు యంత్రాంగం.. ప్రభుత్వం చేపట్టే చర్యలన్నిటికీ పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టో ప్రభుత్వ పాలనకు ఒక దిక్సూచి వంటిదన్నారు. కర్నూల్లో ఏర్పాటు చేసే మెగా సీడ్ ప్రాజెక్ట్‌పై పునఃసమీక్ష చేయాలని, ప్రస్తుతానికి కార్యకలాపాలు నిలిపివేసి, ఇంకా మేలైన ఆలోచనలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో అమలు చేసిన అనేక పథకాలను పునఃసమీక్షించాల్సిందిగా ముఖ్య సలహాదారు అజయ్ కల్లంకు సూచించిన ముఖ్యమంత్రి, అనేక పథకాల నిధులు మళ్లింపు జరిగాయని వాటిపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ప్రకృతి సేద్యంపై త్వరలో పరిశీలన రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి సేద్యంపై సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాని తీరు తెన్నులను వివరించారు. వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ విషయాన్ని త్వరలో పరిశీలిద్దామని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.సమీక్షా సమావేశంలో ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, వ్యవసాయ శాఖ సలహాదారు విజయకుమార్, ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్‌రెడ్డి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కె.ధనుంజయ్‌రెడ్డి, ఇతర అధికారులు శామ్యూల్, చిరంజీవిచౌదురి తదితరులు పాల్గొన్నారు. రైతుల హర్షాతిరేకాలు.. అధికారం చేపట్టిన వారం రోజుల లోపే తన ఎన్నికల ప్రణాళికలోని వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టడం పట్ల రైతులు, రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెట్టుబడి సాయాన్ని ఏడాది ముందే అమలు చేయడం హర్షణీయమని పేర్కొన్నాయి. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న విత్తన చట్టాన్ని వచ్చే శాసనసభ సమావేశాల్లో తీసుకురావాలని విజ్ఞప్తి చేశాయి. రూ. 12,500లు రబీలోనే ఇవ్వడమే వైఎస్ జగన్ రైతు పక్షపాతి అని అనడానికి నిదర్శనంగా పేర్కొన్నాయి. ఇవీ ముఖ్య నిర్ణయాలు ►అక్టోబర్ 15 నుంచి రైతులకు రూ. 12,500 చొప్పున పెట్టుబడి సాయం ►పంటల బీమా ప్రీమియం చెల్లింపు, వడ్డీలేని రుణాలు ఇచ్చే ఏర్పాటు ►కౌలు రైతులకు సాయం, 11 నెలల కాలానికి ప్రత్యేక కార్డు ►రూ. 3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు ►విపత్తులు ఎదుర్కోవడానికి రూ. 4 వేల కోట్లతో నిధి ►రేషన్ బియ్యంతో పాటుమరో 6 రకాల వస్తువులు ►వ్యవసాయం దశ, దిశ నిర్దేశానికి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు ►అసెంబ్లీ నియోజకవర్గాల్లో శీతల గిడ్డంగులు, వేర్‌హౌస్‌లు -
వైఎస్ జగన్ సీఎం అయితే..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా ప్రకటించిన పార్టీ మేనిఫెస్టోపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. రాష్ట్ర ప్రగతి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను రాష్ట్ర ప్రజలు నిండు మనసుతో స్వాగతిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రకటించిన మేనిఫెస్టోపై వివిధ వర్గాల స్పందన ఇది.. జగన్ సీఎం అయితే నా కుటుంబానికి లక్షల్లో లబ్ధి ఆచంట: నా పేరు పుచ్చకాయల నాగార్జున. మాది పశ్చిమగోదావరి జిల్లా కొడమంచిలి. వైఎస్ జగన్ సీఎం అయితే నా కుటుంబానికి లక్షల్లో లబ్ధిచేకూరుతుంది. ఆటో డ్రైవర్‌నైన నాకు రూ.10 వేలు సాయంగా అందుతుంది. అమ్మఒడి పథకం కింద నా ఇద్దరు కుమార్తెలను స్కూల్‌కి పంపినందుకుగాను ఏటా రూ.15,000 ఇస్తారు. నా భార్యకు డ్వాక్రాలో రూ.50 వేలు అప్పు ఉంది. ఈ అప్పునకు సంబంధించిన నగదు మొత్తం నాలుగు విడతల్లోమా చేతికే అందుతుంది. అలాగే నా భార్యకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తారు. మా అమ్మకు రూ.3 వేలు పింఛన్ ఇస్తారు. జగన్ సీఎం అయితే ప్రతి ఇంటికీ లక్షల్లో లబ్ధి చేకూరుతుంది. ప్రతి వ్యక్తికీ తప్పకుండా సంక్షేమ పథకాలు అందుతాయి. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఐదేళ్లలో 6 లక్షలకు పైగా.. తాడిమర్రి: నా పేరు బీసాని నరసింహులు. మాది అనంతపురం జిల్లా తాడిమర్రి. వైఎస్ జగన్ సీఎం అయితే మా కష్టాలన్నీ తీరతాయి. మా అమ్మకు రూ.3 వేలు పింఛన్ ఇస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మకు లక్ష రూపాయల దాకా ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయిస్తారు. రైతు భరోసా కింద నాకు ఏటా మే నెలలోనే వ్యవసాయ ఖర్చులకోసం రూ.12,500 ఇస్తారు. పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఒక వేళ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే పరిహారం వస్తుంది. నేను నడుపుతున్న ఆటోకు రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. నా ఇద్దరు కుమారులను ఇంజినీరింగ్ చదివించుకునేందుకు ఏటా లక్షలు అప్పులు తేవాల్సిన అవసరం లేకుండానే ఫీజు రీయింబర్స్ అవుతుంది. నా భార్య డ్వాక్రా రుణం రూ.40 వేలు మా చేతికే ఇస్తారు. ఇది కాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాలుగు విడతలుగా రూ.75 వేలు చేతికి అందుతాయి. నా కూతురుని బడికి పంపితే అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వస్తాయి. పక్కా ఇల్లు కూడా కట్టుకుని సొంతింటి కల నెరవేర్చుకుంటాను. మొత్తం మీద జగనన్న సీఎం అయితే మా కుటుంబానికి ఐదేళ్లలో రూ.6 లక్షలకు పైగా లబ్ధి చేకూరుతుంది. నా కుటుంబానికి 5 లక్షల ప్రయోజనం కారంపూడి: నా పేరు మర్రెడ్డి సంజీవరెడ్డి. మాది గుంటూరు జిల్లాలోని కారంపూడి. వైఎస్ జగన్ సీఎం అయితే నా కుటుంబ కష్టాలు చాలా వరకు తీరతాయి. నేను నరాలకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాను. ఆరోగ్యశ్రీ వర్తించలేదు. అప్పుచేసి డాక్టర్‌కు చూపించుకుని మందులు తెచ్చి వాడుకుంటున్నాను. నాకు ఎకరం పొలం మాత్రమే ఉంది. కొడుకు చంద్రశేఖరరెడ్డి డిగ్రీ దాకా చదువుకున్నాడు. సరైన ఉద్యోగం లేదు. మనువడు రాకేష్‌రెడ్డి ఐదో తరగతి, మనవరాలు స్నేహారెడ్డి ఒకటో తరగతి చదువుతున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు, నా భార్య డ్వాక్రా రుణం రూ.50 వేలు నేరుగా మా చేతికే ఇస్తారు. మనవళ్లు ఇద్దరినీ బడికి పంపితే అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తారు. మేము పూరింట్లో ఉంటున్నాం. జగన్ వస్తే నా కుటుంబానికి పక్కా ఇల్లు కూడా వస్తుంది. మొత్తం మీద నా కుటుంబానికి సుమారు రూ.5 లక్షలకుపైగా ప్రయోజనం కలుగుతుంది. మా ఇంటిల్లిపాదికీ ప్రయోజనం కపిలేశ్వరపురం: నా పేరు పలివెల ప్రసన్నరాధ. మాది తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం. వైఎస్ జగన్ సీఎం అయితే మా ఇంటిల్లిపాదికీ ప్రయోజనం చేకూరుతుంది. దళిత కుటుంబమైన మాకు ఐదు కుంచాలు వ్యవసాయ భూమి ఉంది. నవరత్నాల వల్ల పలు విధాల లబ్ధి చేకూరనుంది. మా అత్త మరియమ్మకు రూ.3 వేలు పింఛన్ ఇస్తారు. డ్వాక్రా సంఘంలో నాకున్న రుణం మొత్తం రూ.45 వేలు నా చేతికే ఇస్తారు. రైతు భరోసా కింద ఏటా రూ.12,500 పెట్టుబడి సాయమందుతుంది. అదీగాక గిట్టుబాటు ధరను పంట సాగుకు ముందే ప్రకటించనుండటంతో సాగుపై ధైర్యం కలుగుతుంది. పంట నష్టపోతే పరిహారం కూడా ఇస్తారు. నా చిన్న కొడుకు డీఎడ్ చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్ చేయడమే కాకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తానని జగన్ భరోసా ఇచ్చారు. గ్రామ సచివాలయాలతో పది మందికి ఉద్యోగాలిస్తానని, ప్రతి 50 మందికి ఒక వలంటీర్‌ను నియమిస్తామని జగన్ చెప్పారు. నా పెద్ద కొడుకుతో దరఖాస్తు చేయిస్తా. ఇలా నవరత్నాలు మా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సొంతింటి కల నెరవేరుతుంది ప్రొద్దుటూరు టౌన్ : నా పేరు నాగరాజు. మాది వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు. వైఎస్ జగన్ సీఎం అయితే నా కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. బీటెక్ చదువుతున్న నా పెద్ద కుమారుడు, ఇంటర్ చదువుతున్న నా చిన్న కుమారుడి చదువులకు ఫీజు రీయింబర్స్ అవుతుంది. మేము చేనేతలం. నా భార్య డ్వాక్రాలో తీసుకున్న రూ.40 వేల రుణాన్ని నాలుగు విడతల్లో మాచేతికే ఇస్తానని వైఎస్ జగన్ చెప్పారు. నా భార్యకు 45 ఏళ్లు నిండటంతో బీసీ కార్పొరేషన్ ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తారు. మా అమ్మకు రూ.3 వేలు పింఛన్ కూడా ఇస్తారు. ఇల్లు లేని మాకు సొంతింటి కల నెరవేరుతుంది. పేదలమైన మాకు ఆరోగ్యశ్రీ పథకం ఎంతో ధైర్యాన్నిస్తోంది. వైఎస్సార్సీపీ వస్తే లక్షల్లో లబ్ధి నరసన్నపేట : నా పేరు రవికుమార్. మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. వైఎస్ జగన్ సీఎం అయితే మా కష్టాలన్నీ తీరతాయని నమ్ముతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. వారు 4, 6 తరగతులు చదువుతున్నారు. వారిని బడికి పంపుతున్నందుకు అమ్మఒడి పథకం ద్వారా రూ.15,000 వస్తుంది. మా నాన్న జల్లు రామకృష్ణకు నెలకు రూ.3 వేల పింఛన్ ఇస్తారు. రైతునైన నాకు ఏటా మే నెలలో రూ.12,500 పెట్టుబడి సాయం అందుతుంది. అలాగే పొలంలో ఉచితంగా బోరు వేస్తారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.75 వేలు సాయం అందుతుంది. డ్వాక్రాలో సభ్యురాలైన నా భార్య లావణ్యకు రూ.45 వేలు అప్పు ఉంది. నాలుగు విడతల్లో ఆ అప్పునకు సంబంధించిన నగదు మా చేతికే ఇస్తానని జగన్ చెప్పారు. సొంత ఇల్లు లేని నాకు పక్కా ఇంటిని నిర్మించి ఇస్తారు. ఇంకా వడ్డీలేని రుణాలు వస్తాయి. ఇలా దాదాపు రూ.5 లక్షలకు పైనే మాకు లబ్ధిచేకూరుతుంది. -
కలల గూడు అందించిన దేవుడు..
సాక్షి, నల్లజర్ల : పేదలకు సొంతిల్లు కల.. అప్పటివరకూ వారంతా అద్దె ఇళ్లల్లో జీవనం సాగిస్తూ చాలా ఇబ్బందులు పడ్డారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. రోజు వారీ కూలి పనులు చేసుకునే వారికి సొంతిల్లు అందని ద్రాక్షలా కనిపించింది. ఇటువంటి తరుణంలో వారి కలను నిజం చేశారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. నల్లజర్ల మండలంలోని దూబచర్ల గ్రామ జనాభా 12 వేలకు పైనే. 2007కు పదేళ్ల ముందు వరకు ఏ ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 18 ఎకరాలు భూమి కొనుగోలు చేసి 560 కుటుంబాలకు ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుంది. ఇప్పటికీ ఈ కాలనీవాసులు రాజన్నా.. నిను మరువలేమన్నా.. అంటూ స్మరించుకుంటున్నారు. నిత్య స్మరించుకుంటూ.. జిల్లాలో మొదటి పేదల కాలనీకి 2007 ఏప్రిల్ 29న వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. అనతికాలంలో ఇళ్ల నిర్మాణం కూడా చకచకా పూర్తయింది. వైఎస్సార్ వసంత్‌నగర్ కాలనీగా ఇళ్ల లబ్ధిదారులు పేరు పెట్టుకున్నారు. తర్వాత కాలంలో ఈ ప్రాంత దినదినాభివృద్ధి చెందింది. వసంతనగర్ కాలనీ ఎదురుగా దత్త సాయి మందిరం, ఎటుచూసినా లేఅవుట్లు, ఉపాధి లభించేలా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇదంతా వైఎస్సార్ చలవేనని ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల్లో కూడా వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం పేదలు, మధ్యతరగతి వర్గాలకు వరమని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. వైఎస్ హయాంలో దూబచర్లలో ఈ కాలనీతో పాటు కొత్తగూడెం,అయ్యవరం, ప్రకాశరావుపాలెం, పోతినీడుపాలెం, కమతంగుంట, జగన్నాథపురం, సుభద్రపాలెంలో 38 ఎకరాలు భూమి కొనుగోలు చేసి పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఆయా గ్రామాల్లో అప్పటినుంచి ఇప్పటివరకూ మరే నాయకుడు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాజన్న రాజ్యం సాధ్యమని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. ఆయన రుణం తీర్చుకోలేం చాలా కాలం రోడ్డు పక్క పూరిల్లు వేసుకుని పిల్లలతో చాలా ఇబ్బందులు పడ్డాం. వైఎస్ దయ వల్ల స్థలం ఇచ్చారు. పక్కా ఇల్లు కట్టుకున్నాం. బాధలు తప్పాయి. ఆయన రుణం ఎన్నటికీ తీర్చుకోలేం. జగన్ సీఎం అయితే పేదలకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. – సయ్యద్ జరీనా, వైఎస్సార్ కాలనీ, దూబచర్ల మంచి రోజులు రానున్నాయి పేదలకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో వైఎస్సార్ గృహ నిర్మాణం కూడా ఉంది. వైఎస్సార్ చలవతోనే మాకు గూడు దొరికింది. జగన్ సీఎం అయితే ఇల్లు లేని పేదలందరికీ గూడు కల్పిస్తారనే నమ్మకం మాకుంది. – సింగులూరి దుర్గ, వైఎస్సార్ కాలనీ, దూబచర్ల పేదలకు ఆసరాగా పథకం నవరత్నాల్లోని వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం బాగుంది. పేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఆ ఇంటిని లబ్ధిదారుని పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం, అత్యవసర పరిస్థితుల్లో ఇంటిపై బ్యాంకు రుణం తెచ్చుకునే వెసులుబాటు కల్పించడం చాలా మంచి నిర్ణయం. – గౌస్య, వైఎస్సార్ కాలనీ, దూబచర్ల అద్దె ఇళ్లల్లో చాలా ఇబ్బందులు పడ్డాం కూలిపనులు చేసుకునే తాము అద్దె ఇళ్లలో చా లా ఇబ్బందులు పడ్డాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దయ వల్ల సొంతిల్లు కట్టుకున్నాం. ఇబ్బందులు తప్పాయి. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ కూడా అధికారంలోకి వచ్చి పేదలందరికీ ఇళ్లు కట్టిస్తారని భావిస్తున్నాం. – మద్దిరాల కామాక్షి, వైఎస్సార్ కాలనీ, దూబచర్ల -
ఉచిత పంటల బీమా... అన్నదాతకు ధీమా..
సాక్షి, అమరావతి : కరవుపై యుద్ధం చేశానని, దుర్భిక్షంపై విజయం సాధించానని, రెయిన్ గన్లతో వర్షాభావ ప్రభావం లేకుండా చేశానని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు పాలనలో రైతుల దయనీయ స్థితిలో ఉన్నారు. రేయనక.. పగలనక.. కష్టమనక.. అప్పులనక.. ఒళ్లు హూనం చేసుకొని ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి ఏ తుపానో, అకాల వర్షమో, అనావృష్టో ఎదురైతే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. మేలుకు బదులు కీడు జరుగుతోంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి సాగు భారమై కాడి వదిలేసే దుస్థితి వస్తోంది. కౌలు రైతుల పరిస్థితైతే మరింత దయనీయం. దీన్నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పంటల బీమా పథకాలను ప్రారంభించినా వాటిపై అవగాహన లేక, డబ్బులు కట్టినా అవి రావన్న స్వీయానుభవంతో రైతులు సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో సుమారు 85 లక్షల పైగా రైతులున్నారు. 1972లో పంటల బీమా పథకం ప్రారంభమైతే ఇప్పటికీ ఇందులో చేరుతున్నవారి సంఖ్య 16 లక్షలకు మించకపోవడం గమనార్హం. ఉదాహరణకు ఎకరం వరికి ప్రభుత్వం నిర్ణయించిన రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) రూ.29,352 అనుకుంటే దానిపై మొత్తం చెల్లించాల్సిన ప్రీమియం 8 శాతం. (ఒక్కో ప్రాంతంలో 9 శాతం ఉండవచ్చు.) ఈ లెక్కన రూ.2,348 ప్రీమియంగా చెల్లించాలి. ఇందులో రైతులు ఎకరానికి 1.5 శాతం మొత్తాన్ని చెల్లిస్తే మిగతా 6.5 శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లిస్తాయి. ఇప్పుడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీతో రైతు తన వాటాగా చెల్లించాల్సిన 1.5 శాతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఫలితంగా రైతుపై భారం పడే అవకాశం ఉండదు. జగన్ హామీపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బీమాకు ఎందుకింత ప్రాధాన్యత? ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ గిట్టుబాటు లేక, ఆర్థిక ఇక్కట్లతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దశలో ఈ పథకానికి ప్రాధాన్యత వచ్చింది. 2016 ఖరీఫ్ నుంచి కేంద్రం– ప్రధాన మంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను అమలు చేస్తోంది. అన్ని ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకు దీన్ని వర్తింపజేస్తున్నారు. సాగు చేసిన పంటలకు అనుగుణంగా స్వల్ప మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన సందర్భాల్లో బీమా వర్తిస్తుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే రైతులకు పంటల బీమాను అనివార్యం చేశారు. ఏ పంటకు రుణం తీసుకుంటున్నారో ఆ పంటకు బ్యాంకులే ప్రీమియం మినహాయించి బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. బ్యాంకు నుంచి అప్పు తీసుకోని రైతులు, వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులు సైతం స్వయంగా ఫసల్ బీమా పథకంలో చేరే అవకాశముంది. కౌలు రైతులు వ్యవసాయ శాఖ, రెవెన్యూశాఖ జారీ చేసిన పంట సాగు ధ్రువపత్రం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను అధికారులకు అందజేసి బీమా చెల్లించవచ్చు. అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను, కరువు తదితర ప్రతికూల వాతావరణం వల్ల జరిగిన నష్టాన్ని పంటకోత ప్రయోగాల యూనిట్ దిగుబడుల అంచనా ప్రకారం చెల్లిస్తారు. పంట కోత తరువాత పొలంలో ఉంచిన పంటకు 14 రోజుల వరకు అకాల వర్షాలు, తుపాను వల్ల నష్టం వాటిల్లితే బీమా రక్షణ లభిస్తుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రధాని పంటల బీమా కింద ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియంను రైతులు చెల్లించాలి. అదే ఉద్యాన పంటల రైతులైతే 5 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లిస్తాయి. అయితే, రైతుల్లో అవగాహన లేకపోవడం, బీమా కంపెనీల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కువమంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. నాలుగో వంతు కూడా దాటని వైనం... 2016 ఖరీఫ్‌లో రాష్ట్రంలో ప్రధాని ఫసల్ బీమా, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ కింద 15,97,435 మంది రైతులు బీమా చేయించుకుంటే 2017 నాటికి ఆ సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో సుమారు 85 లక్షల మంది వరకు రైతులు ఉన్నారనుకుంటే కనీసం నాలుగో వంతు కూడా బీమా చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ప్రీమియం మొత్తాలను చెల్లించకపోవడం వల్లే రైతులకు సకాలంలో బీమా పరిహారాన్ని చెల్లించ లేకపోతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. జగన్ హామీతో అందరికీ మేలు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. నవరత్నాలలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసాను ప్రకటించారు. ఇందులో ఒక ముఖ్యమైన అంశం రైతులకు ఉచిత పంటల బీమా. దీనిప్రకారం రైతులు తమ వాటా కింద ప్రస్తుతం ఖరీఫ్‌లో చెల్లిస్తున్న 2 శాతం, రబీలో చెల్లించే 1.5 శాతం మొత్తాన్నీ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. విపత్తు సంభవించినప్పుడు రైతులకు బీమా కంపెనీల నుంచి క్లెయిమ్ వచ్చేలా చేస్తుంది. రాష్ట్రంలోని మొత్తం రైతాంగాన్ని ఆదుకుంటుంది. తద్వారా రాష్ట్రంలో దాదాపు 85 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. వైఎస్ జగన్ ప్రకటించిన ఈ ఉచిత బీమా పథకాన్ని రైతు ప్రముఖులు సైతం కొనియాడుతున్నారు. – ఎ.అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
ఉచిత బోరు.. రైతు కష్టాలు తీరు
‘బక్కిరెడ్డి బావి ఎండిపోయింది. మళ్లీ రెండు మూడు మట్లు తవ్వితేగాని నీళ్లు పడవు. బ్యాంకు నుంచి అప్పు తెచ్చి రెండు మట్లు తవ్వడానికి 24 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాడు. కానీ నీటి జాడ కనబడలేదు. దీంతో బక్కిరెడ్డి మానసికంగా బాగా కుంగిపోయాడు. బాకీ తీర్చే మార్గం కనిపించడం లేదు. ఓ రోజు పొద్దున్నే బ్యాంకుల వాళ్లు వచ్చి ఊరోళ్ల సమక్షంలో బక్కిరెడ్డి పొలాన్ని వేలం వేశారు. తరతరాలుగా వచ్చిన పొలాలు పోయాయని, పొలం పోయిన రైతుకు ఊళ్లో ఇక ఏమాత్రం గౌరవం ఉండదని భావించిన బక్కిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడు’... ఇదీ ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి రాసిన మూగవాని పిల్లన గ్రోవి నవల్లోని ఓ హృదయ విదారక దృశ్యం. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ సగటు రైతు బతుక్కి అద్దంపట్టే వర్ణన అది. ఇలా ఎందరో నిత్యం రాష్ట్రంలో కన్నుమూస్తున్నారు. ఒకప్పుడు వంద, రెండు వందల అడుగులు తవ్వితే పడే నీళ్లు ఈవేళ ఏడెనిమిది వందల అడుగులు దాటినా కనిపించడం లేదు. రాయలసీమలోనైతే ప్రత్యేకించి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలలో 12 వందలు, 14 వందల అడుగులు వేసినా నీరు పడక, పదేపదే బోర్లు వేసి చేతులు కాల్చుకుంటున్నారు రైతులు. చేసిన బాకీలు తీర్చక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యకృత్యం. ఈ దుస్థితిని తన ప్రజా సంకల్పయాత్రలో కళ్లారా చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ఓ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో లక్షలాది మంది రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలే కీలకం... ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 45 శాతం సాగు భూమి భూగర్భ జలాలతోనే సాగవుతోంది. 1998 నుంచి 2003 మధ్య కాలంలో సగటున భూగర్భజల మట్టం 2.5 మీటర్లు తగ్గింది. మోటబావులు, దిగుడు బావులు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బోరు బావులు వేసుకునే రైతుల కోసం ఓ వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది. ఒక వేళ బోరు విఫలమైతే బీమా పొందేలా ఆ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ అనుమతితోపాటు రూ.12వందల ప్రీమియం, జియలాజికల్ సర్వే కోసం మరో రూ.1000 (చిన్న సన్నకారు రైతులైతే రూ.500) చెల్లించి బోర్ వేసుకోవాలి, నీరు పడకపోతే ప్రభుత్వం నుంచి రూ.10 వేల రూపాయల బీమా లేదా బోరు వేయడానికి అయిన వాస్తవ ఖర్చును పొందవచ్చు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2006 జనవరి నాటికి 5,389 కొత్త బోరు బావులకు అనుమతి ఇచ్చారు. పోటీ పడి పక్కపక్కనే బోర్లు వేసుకోకుండా రైతు భాగస్వామ్య వ్యవస్థను తీసుకువచ్చారు. సంబంధిత బోరు బావి కింద ఎంత భూమి ఉండాలో నిర్ణయించి ఆ ప్రకారంగా రైతులందరూ నీళ్లను వినియోగించుకునే పద్ధతిని– ఉమ్మడి నీటి యాజమాన్య సంఘం– ప్రవేశపెట్టారు. భూ గర్భ జలాలను పెంపొందించే విధానాలను రైతులు ఆచరించేలా చేశారు. వేరుశనగ వంటి పంటల్లో సైతం తుంపర సేద్య పద్ధతిని ప్రవేశపెట్టి చిన్నసన్నకారురైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. కాలదోషం పట్టిన ప్రభుత్వ అంచనాల ప్రకారం బోరు వేయడానికి వ్యయం రూ.18,500ఖర్చు, వాస్తవానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయలవుతుంది. బోరు వేసే లోతును బట్టి ఈ ఖర్చు పెరుగుతుంది. బోరు విఫలమైతే రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. నాబార్డ్ లాంటి సంస్థలు వీటిని రీచార్జ్ చేసేందుకు సాయం అందిస్తున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ఉచిత బోర్ల పథకాన్ని ప్రకటించారు. డీజిల్ ధర పెరగడంతో అడుగు లోతుకి రూ.300 నుంచి రూ.400 చార్జ్ చేస్తున్నారు. ఈ లెక్కన కనీసం 300 అడుగుల లోతున బోరు వేయాలంటే సుమారు లక్షన్నర ఖర్చు వస్తుంది. భార్య పుస్తెలమ్మి బోరు వేస్తే... ఆ బోరులో నీళ్లు పడతాయో లేదో తెలియదు. పంట చేను తడుస్తుందనే భరోసా ఉండదు కానీ ఆ రైతు నట్టిల్లు మాత్రం కన్నీళ్లతో నానిపోతుంది. ఈ దుస్థితి నుంచి రైతుల్ని కాపాడేందుకు వైఎస్ జగన్ ప్రకటించిన ఉచిత బోర్ల పథకం ఉపయోగపడుతుంది. ఉచిత బోరు.. బడుగు రైతుకు భరోసా (ప్రతీకాత్మక చిత్రం) – ఎ. అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
‘ఓటమి భయంతోనే వరాలు’
సాక్షి, కృష్ణా: ఓటమి భయంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కురిపించడం హాస్యాస్పదమన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడంలో టీడీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమయిందని మండిపడ్డారు. పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి మోసానికి వడికట్టారని పార్థసారధి విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున బీసీలపై వరాల జల్లు కురిపిస్తూ కపట ప్రేమను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బీసీ కులానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనను టీటీడీ ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన దాడిలో కుట్రకోణం లేదని చెప్పడం విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించారు. -
నవరత్నాల ఎఫెక్ట్.. పింఛన్ పెంపు
సాక్షి, అమరావతి: మరో నెలలో ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని భావిస్తున్న తరుణంలో పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల నుంచే దీన్ని వర్తింపచేస్తామని శుక్రవారం జన్మభూమి ముగింపు సందర్భంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే తాము అధికారంలోకి రాగానే వృద్ధాప్య, వితంతువుల పింఛన్లను రూ.2,000కు పెంచుతానని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 2017 జూలై 8వ తేదీన గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సందర్భంగా ప్రకటించడం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా జరిగిన ఆ ప్లీనరీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పించన్ల పెంపు సహా తొమ్మిది (నవరత్నాలు) పథకాలను అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని, అవ్వా తాతలకు రూ.2,000 చొప్పున పింఛన్ ఇస్తామని, దివ్యాంగులకు రూ.3,000 చొప్పున పింఛను ఇస్తామంటూ ప్రతిపక్ష నేత హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రకటన చేసిన ఏడాదిన్నర తర్వాత.. ఎన్నికల షెడ్యూల్ మరో నెల రోజుల్లో వెలువడవచ్చని భావిస్తున్న సమయంలో పించన్ మొత్తాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. పేదలకు జగన్ ఇచ్చిన హామీపై ఏడాదిన్నరగా స్పందించకుండా చంద్రబాబు ఇప్పుడు హడావుడిగా నెలకు రూ.2 వేల చొప్పున పించను చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం ఒత్తిడికి లోనై కేవలం ఎన్నికల లబ్ధికోసమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నవరత్నాల్లో ఇచ్చిన పింఛన్ పెంపు హామీ వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ప్రతిపక్ష నేతకు పేదలు పెద్ద ఎత్తున వినతిపత్రాలు ఇస్తున్నట్లు గుర్తించిన చంద్రబాబు గత్యంతరం లేకనే తాజా ప్రకటన చేశారని పేర్కొంటున్నారు. పింఛను మొత్తం పెంపుపై ఏడాదిన్నరగా చర్చ జరుగుతున్నప్పటికీ ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఓటమి భయంతోనే చంద్రబాబు వైఎస్సార్ సీపీ ప్రకటించిన నవరత్నాల హామీని ఇప్పుడు ఎన్నికల ముందు ప్రకటించారని అధికార, రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికే పెండింగ్‌లో 14 లక్షలకుపైగా దరఖాస్తులు ఉండడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మందికి పింఛన్లు ఇవ్వకుండా ఎగ్గొడుతున్న సర్కారు తాజాగా ఈ మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటన చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పింఛనుదార్లకు నాలుగున్నరేళ్లుగా చుక్కలే... రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పింఛన్‌దార్లకు చుక్కలు చూపించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పింఛన్లు పొందుతున్న వారు సర్కారు ఆంక్షలు, కోతలతో అల్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే టీడీపీ నాయకులు, సానుభూతి పరులతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పించన్ పొందుతున్న వారిని సైతం అందుకు అర్హులో కాదో తేల్చాలంటూ జన్మభూమి కమిటీలకు అధికారం అప్పగించి వసూళ్లకు తెర తీశారనే విమర్శలున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికే రాష్ట్రంలో 43.11 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్లు పొందుతుండగా 2014 సెప్టెంబరు, అక్టోబరు నెలలో నిర్వహించిన జన్మభూమి కమిటీల తనిఖీలతో నానా అగచాట్లు పడ్డారు. జన్మభూమి కమిటీలు వీరిని కొత్త వారి తరహాలో అన్ని రకాలుగా వేధించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో జన్మభూమి కమిటీలు కొంతమంది పించన్లను రద్దు చేశాయి. మరికొందరు పేదలు తెలిసిన వారి కాళ్లావేళ్లా పడి హైకోర్టుకు వెళ్లి మరీ పింఛన్లు పునరుద్ధరించుకోవాల్సి వచ్చింది. తిష్ట వేసి జన్మభూమి కమిటీల వసూళ్లు.. ఎవరైనా లబ్ధిదారుడు వరుసగా మూడు నెలల పాటు పింఛను తీసుకోని పక్షంలో తాత్కాలికంగా రద్దుచేసే విధానాన్ని చంద్రబాబు సర్కారు కొత్తగా అమలు చేస్తోంది. పింఛన్లు పొందే వారిలో అధికశాతం నిరుపేదలే కావడంతో పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటారు. ఇలాంటి వారు పింఛను తీసుకునే అవకాశం కోల్పోతున్నారు. జన్మభూమి కమిటీలతో సిఫార్సు చేయించుకుని పింఛను పునరుద్ధరించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా రద్దయిన ఫించన్ డబ్బులను కోల్పోతున్నారు. దీనికితోడు పలుచోట్ల జన్మభూమి కమిటీ సభ్యులు గ్రామాల్లో పింఛన్ల పంపిణీ చేసే ప్రాంతంలో తిష్ట వేసి నిరుపేద లబ్ధిదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా ప్రతి నెలా రూ.10 – 14 కోట్ల దాకా పేదల నుంచి జన్మభూమి కమిటీ సభ్యులు లంచం రూపంలో దోపిడీ చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందడం గమనార్హం. లక్షల్లో దరఖాస్తులు.... రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఏ కార్యక్రమం కోసం గ్రామాలకు వెళ్లినా పించన్ కోసమే వినతులు వెల్లువెత్తుతున్నాయి. ‘పింఛను కోసం కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నాం. కొత్త పింఛను ఇప్పించండయ్యా!’ అన్న వేడుకోళ్లే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏటా జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నా తొలగించిన ఫించన్లు, కొత్త వాటి కోసం అందుతున్న దరఖాస్తులు లక్షల్లోనే ఉంటున్నాయి. నాలుగున్నర ఏళ్ల పాలన తర్వాత తాజాగా నిర్వహించిన 6వ విడత జన్మభూమి కార్యక్రమంలోనూ ప్రభుత్వానికి అందిన వినతిపత్రాల్లో పింఛన్ల కోసం అందిన దరఖాస్తులే అత్యధికంగా ఉండటం గమనార్హం. 2014 అక్టోబరు 2వ తేదీ నుంచి 2018 అక్టోబరు మధ్య కాలంలో పింఛన్లు మంజూరు చేయాలంటూ పేదల నుంచి అందిన 14,59,312 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. 13,26,206 మంది వృద్దులు, 94,499 మంది వితంతువులు, 38,607 మంది దివ్యాంగులు ఫించన్లు పింఛన్లు ఇప్పించాలని అభ్యర్థిస్తూ దరఖాస్తు చేసుకోగా కేవలం లక్షన్నర మందికి మాత్రమే తాజా జన్మభూమిలో కొత్తగా మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఇదే సమయంలో జన్మభూమి కార్యక్రమంలో 1.80 లక్షల మంది కొత్తగా పింఛన్లు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే పెండింగ్‌లో ఉన్న పించన్ దరఖాస్తులు యథాతథంగానే ఉన్నట్లు వెల్లడవుతోంది. ఐదు లక్షల మందికి కోత.. టీడీపీ 2014లో అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 43.11 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఫించన్ పొందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగున్నర ఏళ్లలో 19.38 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్టు చెబుతోంది. అంటే ప్రస్తుతం ఫించన్లు పొందే వారి సంఖ్య 62.49 లక్షలు అంతకన్నా ఎక్కువగా ఉండాలి. కానీ 2019 జనవరి లో ప్రభుత్వం మంజూరు చేసిన ఫించన్ల సంఖ్య 50.61 లక్షలే కావడం గమనార్హం. ఈ ప్రకారం చూస్తే దాదాపు 12 లక్షల మందికి పింఛన్ అందలేదని తేలుతోంది. అయితే ఈ నాలుగున్నరేళ్లలో 7.34 లక్షల మంది పింఛన్‌దారులు చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అలా చూసినా దాదాపు ఐదు లక్షల మందికి సర్కారు పించన్ ఎగ్గొడుతున్నట్లు స్పష్టమవుతోంది. రకరకాల సాకులతో పింఛనుదార్లును ఏరి వేసింది. వైఎస్ హయాంలో ఒకే ఏడాది 23 లక్షల మందికి కొత్త పింఛన్లు... చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఫింఛన్దారుల్లో ఎవరైనా చనిపోతేనే కొత్తవి మంజూరు చేయాలనే విధానాన్ని అమలు చేయడంతో ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా రూ.70 చొప్పున ఫించను ఇచ్చే సమయంలో ఈ విధానం అమల్లో ఉండటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే పింఛను మొత్తాన్ని రూ.200కి పెంచడంతోపాటు సంతృప్త స్థాయి పద్ధతిలో అర్హులందరికీ ఇవ్వాలని నిర్ణయించడంతో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఒక్క ఏడాదిలోనే 23 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. అయితే విభజన తర్వాత మరోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు మళ్లీ పాత పింఛనుదారుడు చనిపోతేనే కొత్త ఫించను మంజూరు అన్న విధానాన్నే కొనసాగించారు. 2014 నుంచి 2015 చివరి వరకు మరణించిన ఫించన్‌దారుల సంఖ్య ఆధారంగానే కొత్తవి మంజూరు చేసే విధానాన్ని కొనసాగించారు.