రైతుకు భరోసా | YS Jagan announces Rythu Bharosa input subsidy scheme for Andhra farmers | Sakshi
Sakshi News home page

రైతుకు భరోసా

Published Fri, Jun 7 2019 2:36 AM | Last Updated on Fri, Jun 7 2019 9:25 AM

YS Jagan announces Rythu Bharosa input subsidy scheme for Andhra farmers - Sakshi

సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని తన నిర్ణయాల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నవరత్నాలలో భాగమైన వైఎస్సార్‌ రైతు భరోసా అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాల తొలి సమీక్ష సమావేశం గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రతి రైతు కుటుంబం చేతికి నేరుగా రూ. 12,500లు పెట్టుబడి సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ. 13,125 కోట్లు రైతులకు ప్రభుత్వం అందించనుంది.

సమీక్ష సందర్భంగా రైతులకు ఏమేం చేయాలో అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రణాళికలో రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ తు.చ. తప్పకుండా అమలు చేయాలని, ఇందులో మరో మాటకు తావులేదని అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే రబీ నుంచే పెట్టుబడి సాయం రైతులకు అందించనున్నారు. ప్రభుత్వమే రైతుల తరఫున పంటల బీమా ప్రీమియాన్ని చెల్లిస్తుందని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ఎన్నికల ప్రణాళికను అధికారులకు చూపిస్తూ ఇందులోని ప్రతి అంశాన్ని అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌ వారిని ఆదేశించారు.

సీజన్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర సలహాల కోసం ఇబ్బంది పడకూడదని, విత్తనాలు, ఎరువుల కోసం బారులు తీరాల్సిన దుస్థితి రాకుండా చూడాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలు, డీలర్లపై ఉక్కుపాదం మోపాలని, క్రిమినల్‌ కేసులు పెట్టి జైలుకు పంపడానికి కూడా వెనుకాడవద్దని చెప్పారు. ఈ సందర్భంగా విత్తన చట్టం తేవాలని కొందరు అధికారులు చేసిన సూచనపై మాట్లాడుతూ.. రాష్ట్ర శాసనసభ తొలి సమావేశాల్లోనే సమగ్ర బిల్లు తీసుకువచ్చి విత్తన చట్టం తెస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  
   
గ్రామ సచివాలయాలకు కీలక బాధ్యత..
అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలు వ్యవసాయరంగ అవసరాలకు ప్రధాన కేంద్రాలుగా ఉండేలా చూస్తామన్నారు. వీటి ద్వారా రైతులకు మంచి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందుబాటులోకి తీసుకెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులను అదుకోలేకపోతే ఆ ప్రభుత్వానికి అర్థం ఉండదన్నారు. ప్రభుత్వ సేవల పట్ల రైతుల్లో విశ్వసనీయత పెంచాలన్నారు.

వ్యవసాయ శాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని, పథకాలను రైతులకు అందించడంలో ఎటువంటి అవినీతి జరిగినా ఉపేక్షించబోనని హెచ్చరించారు. అవినీతికి పాల్పడే వారిపై ఎవరూ క్షమించలేనటువంటి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారని, ఎట్టి పరిస్థితిలోనూ వారు మోసపోకూడదన్నారు. విత్తన నాణ్యత నియంత్రణ ప్రభుత్వమే తీసుకునేలా అధికారులు కార్యక్రమం రూపొందించాలన్నారు.  
 
పంటల బీమా ప్రీమియం చెల్లిస్తాం..
గత ఐదేళ్లుగా కునారిల్లుతున్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు. ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియాన్ని పూర్తిగా చెల్లిస్తుందని, రైతులపై ఎటువంటి భారం ఉండబోదని చెప్పారు. సకాలంలో రైతులకు పంట పరిహారం ఇప్పించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఒక సీజన్‌లో పంట నష్టపోతే రెండేళ్ల తర్వాత పరిహారం వస్తే రైతులకు ఏం మేలు జరిగినట్టని ప్రశ్నించారు.

ఖరీఫ్‌లో పంట నష్టం జరిగితే ఆ తర్వాత వచ్చే రబీ నాటికి పరిహారం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని, అప్పుడే రైతుల్లో బీమాపై విశ్వాసం ఉంటుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే క్రమంలో ఏ పంటకు ఎంత ధర చెల్లిస్తున్నాం అనే విషయాన్ని ముందే చెప్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రైతులకు వడ్డీలేని రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
అక్టోబర్‌ నుంచే రైతు భరోసా సాయం
వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్ల పాటు రూ. 12,500 చొప్పున అందిస్తామన్న పెట్టుబడి సాయాన్ని ఈ ఏడాది రబీ నుంచే పెద్దఎత్తున అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభమయ్యే ఖరీఫ్‌ నుంచి ఈ సాయాన్ని అందించాల్సి ఉంది. దీనికి బదులుగా అక్టోబర్‌ 15 నుంచి పెట్టుబడి సాయం అందుతుంది. సుమారు రూ. 13,125 కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందించనున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలకు జమ అయ్యేలా చూడాలన్నారు.  
 
కౌలు రైతులకూ సాయం..
కౌలు రైతులకూ పెట్టుబడి సాయం అందించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. భూ యజమానులకు ఎటువంటి నష్టం లేకుండా కౌలు రైతులకు సాయం అందిస్తామన్నారు. 11 నెలల కాలానికి కౌలు రైతులకు స్టాంప్‌ పేపర్‌ తరహాలో కార్డు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ విషయంలో భూ యజమానుల భయాందోళనలను పొగొట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని, అవసరమైతే చట్టపరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కౌలు రైతులకు కూడా ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలు సరైన రీతిలో అందేలా చర్యలు చేపట్టాలని, వారికి గుర్తింపు, ప్రభుత్వ భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రబీ నాటికి కౌలు రైతులను గుర్తిస్తే వారికి కూడా వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద సుమారు రూ. 2,500 కోట్లను పెట్టుబడి సాయం కింద ఇవ్వొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.  

 రూ. 3 వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధి..
రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందేలా చర్యలు తీసుకోవాలని, పండించిన పంటకు మద్దతు ధర లేదని ఏరైతూ ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారు. ధరలలో తేడా వచ్చినప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా రూ. 3000 కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధిని బడ్జెట్లో పెడతామని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే విపత్తుల నిధి కోసం కేంద్రం ఇచ్చే రూ. 2 వేల కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 2 కోట్లతో కలసి మొత్తం రూ. 4 వేల కోట్లతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ వంటి వ్యవహారాలలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు పౌరసరఫరాల విభాగం వ్యవసాయ శాఖతో కలిసి మెలిసి పని చేయాలని సూచించారు.

ప్రజలకు నాణ్యమైన రేషన్‌ బియ్యం ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు రేషన్‌ షాపుల ద్వారా ఇస్తున్న బియ్యం ప్రజలు తినలేక మళ్లీ మిల్లర్లలకే తక్కువ ధరకు అమ్మివేస్తున్నారని, అలాకాకుండా రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి మిల్లింగ్‌ చేయించి ఆ నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందిస్తే.. అటు రైతులకు, ఇటుపేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆ నాణ్యమైన బియ్యాన్ని బాగా ప్యాక్‌ చేసి దానితో పాటు మరో ఆరు రకాల నిత్యావసర వస్తువులను గ్రామ వాలంటీర్ల ద్వారా అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఆగస్టు 15కల్లా గ్రామ వాలంటీర్లు అందుబాటులోకి వస్తారు కాబట్టి.. సెప్టెంబర్‌ 1 నుంచి ఆ వస్తువుల పంపిణీ చేపట్టాలని సూచించారు.  
 
వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు..
వ్యవసాయం, అనుబంధ రంగాలలోని వివిధ అంశాలను అధ్యయనం చేసేందుకు, రైతులకు దశ, దిశ నిర్దేశించేందుకు ఆయా రంగాల్లోని నిపుణులు, అధికారులతో వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. రైతులకు మద్దతు ధర, పథకాల ప్రయోజనాలు పూర్తిగా అందడం, పంటలు వేసే ముందే ప్రభుత్వం నుంచి ఎంత మద్దతు ధర ఇవ్వాలి, తదితర వ్యవసాయరంగ సమస్యలపై సిఫార్సులు చేయడానికి ఆ వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కమిషన్‌ చేసే సూచనలు, సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. పరపతి విధానం మొదలు వ్యవసాయ సంక్షోభం వరకు పలు అంశాలను వ్యవసాయ కమిషన్‌ అధ్యయనం చేస్తుంది.
 
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో శీతల గిడ్డంగి, వేర్‌హౌస్‌
అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని స్థానిక ఉత్పత్తుల నిల్వకు ఒక శీతల గిడ్డంగి, ఒక వేర్‌ హౌస్, అవసరం మేరకు ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు నిర్మించాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. మూతపడిన సహకార రంగ చక్కెర మిల్లులను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ సంక్షోభంలో చిక్కి దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు కన్నుమూస్తే వారికి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియోను చెల్లించాలన్నారు. పామాయిల్‌ ధరలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్‌కి వ్యత్యాసం ఉందని, రాష్ట్రంలో ఇంకా యంత్ర సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు నాలుగు రూపాయల బోనస్‌ చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  
 
అది ఊహాజనిత పథకం...
అన్నదాత సుఖీభవ పథకం ఎన్నికల ముందు తెచ్చిన ఉహాజనిత పథకమని సీఎం జగన్‌ అన్నారు. ఆ పథకాన్ని కొనసాగించవలసిన అవసరం లేదన్నారు. రైతులకు తమ ప్రభుత్వం మరెన్నో మేళ్ళు చేయడానికి దృఢసంకల్పంతో ఉందని వివరించారు. ప్రభుత్వం అందించే సేవల పట్ల ప్రజల్లో ఒక ముద్ర పడాలి, రైతుల్లో విశ్వసనీయత పెంచాలి, నాణ్యత ప్రమాణాలు పాటించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కడ అవినీతి జరిగినా ఎవ్వరినీ క్షమించంఅంటూ ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.  
 
మేనిఫెస్టో అమలుకు యంత్రాంగం..

ప్రభుత్వం చేపట్టే చర్యలన్నిటికీ పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టో ప్రభుత్వ పాలనకు ఒక దిక్సూచి వంటిదన్నారు. కర్నూల్‌లో ఏర్పాటు చేసే మెగా సీడ్‌ ప్రాజెక్ట్‌పై పునఃసమీక్ష చేయాలని, ప్రస్తుతానికి కార్యకలాపాలు నిలిపివేసి, ఇంకా మేలైన ఆలోచనలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో అమలు చేసిన అనేక పథకాలను పునఃసమీక్షించాల్సిందిగా ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లంకు సూచించిన ముఖ్యమంత్రి, అనేక పథకాల నిధులు మళ్లింపు జరిగాయని వాటిపై కూడా దృష్టి పెట్టాలన్నారు.  
 
ప్రకృతి సేద్యంపై త్వరలో పరిశీలన

రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి సేద్యంపై సంబంధిత అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దాని తీరు తెన్నులను వివరించారు. వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ విషయాన్ని త్వరలో పరిశీలిద్దామని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.సమీక్షా సమావేశంలో ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లం, సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, వ్యవసాయ శాఖ సలహాదారు విజయకుమార్, ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కె.ధనుంజయ్‌రెడ్డి, ఇతర అధికారులు శామ్యూల్, చిరంజీవిచౌదురి తదితరులు పాల్గొన్నారు.
 
రైతుల హర్షాతిరేకాలు..

అధికారం చేపట్టిన వారం రోజుల లోపే తన ఎన్నికల ప్రణాళికలోని వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టడం పట్ల రైతులు, రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెట్టుబడి సాయాన్ని ఏడాది ముందే అమలు చేయడం హర్షణీయమని పేర్కొన్నాయి. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న విత్తన చట్టాన్ని వచ్చే శాసనసభ సమావేశాల్లో తీసుకురావాలని విజ్ఞప్తి చేశాయి. రూ. 12,500లు రబీలోనే ఇవ్వడమే వైఎస్‌ జగన్‌ రైతు పక్షపాతి అని అనడానికి నిదర్శనంగా పేర్కొన్నాయి.  
 
ఇవీ ముఖ్య నిర్ణయాలు
►అక్టోబర్‌ 15 నుంచి రైతులకు రూ. 12,500 చొప్పున పెట్టుబడి సాయం
►పంటల బీమా ప్రీమియం చెల్లింపు, వడ్డీలేని రుణాలు ఇచ్చే ఏర్పాటు
►కౌలు రైతులకు సాయం, 11 నెలల కాలానికి ప్రత్యేక కార్డు
►రూ. 3 వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధి ఏర్పాటు
►విపత్తులు ఎదుర్కోవడానికి రూ. 4 వేల కోట్లతో నిధి
►రేషన్‌ బియ్యంతో పాటుమరో 6 రకాల వస్తువులు
►వ్యవసాయం దశ, దిశ నిర్దేశానికి వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు
►అసెంబ్లీ నియోజకవర్గాల్లో శీతల గిడ్డంగులు, వేర్‌హౌస్‌లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement