నవరత్నాల ఎఫెక్ట్.. పింఛన్‌ పెంపు | YS Jagan Navaratnalu Effect On TDP Govt | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ నవరత్నాల ఎఫెక్ట్.. పింఛన్‌ పెంపు

Published Sat, Jan 12 2019 3:35 AM | Last Updated on Sat, Jan 12 2019 3:19 PM

YS Jagan Navaratnalu Effect On TDP Govt - Sakshi

సాక్షి, అమరావతి: మరో నెలలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడవచ్చని భావిస్తున్న తరుణంలో పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల నుంచే దీన్ని వర్తింపచేస్తామని శుక్రవారం జన్మభూమి ముగింపు సందర్భంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే తాము అధికారంలోకి రాగానే వృద్ధాప్య, వితంతువుల పింఛన్లను రూ.2,000కు పెంచుతానని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ 2017 జూలై 8వ తేదీన గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సందర్భంగా ప్రకటించడం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా జరిగిన ఆ ప్లీనరీలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పించన్ల పెంపు సహా తొమ్మిది (నవరత్నాలు) పథకాలను అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని, అవ్వా తాతలకు రూ.2,000 చొప్పున పింఛన్‌ ఇస్తామని, దివ్యాంగులకు రూ.3,000 చొప్పున పింఛను ఇస్తామంటూ ప్రతిపక్ష నేత హామీ ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌ ప్రకటన చేసిన ఏడాదిన్నర తర్వాత.. ఎన్నికల షెడ్యూల్‌ మరో నెల రోజుల్లో వెలువడవచ్చని భావిస్తున్న సమయంలో పించన్‌ మొత్తాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. పేదలకు జగన్‌ ఇచ్చిన హామీపై ఏడాదిన్నరగా స్పందించకుండా చంద్రబాబు ఇప్పుడు హడావుడిగా నెలకు రూ.2 వేల చొప్పున పించను చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం ఒత్తిడికి లోనై కేవలం ఎన్నికల లబ్ధికోసమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నవరత్నాల్లో ఇచ్చిన పింఛన్‌ పెంపు హామీ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సందర్భంగా ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ప్రతిపక్ష నేతకు పేదలు పెద్ద ఎత్తున వినతిపత్రాలు ఇస్తున్నట్లు గుర్తించిన చంద్రబాబు గత్యంతరం లేకనే తాజా ప్రకటన చేశారని పేర్కొంటున్నారు.

పింఛను మొత్తం పెంపుపై ఏడాదిన్నరగా చర్చ జరుగుతున్నప్పటికీ ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఓటమి భయంతోనే చంద్రబాబు వైఎస్సార్‌ సీపీ ప్రకటించిన నవరత్నాల హామీని ఇప్పుడు ఎన్నికల ముందు ప్రకటించారని అధికార, రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికే పెండింగ్‌లో 14 లక్షలకుపైగా దరఖాస్తులు ఉండడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మందికి పింఛన్లు ఇవ్వకుండా ఎగ్గొడుతున్న సర్కారు తాజాగా ఈ మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటన చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.   

పింఛనుదార్లకు నాలుగున్నరేళ్లుగా చుక్కలే... 
రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పింఛన్‌దార్లకు చుక్కలు చూపించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పింఛన్లు పొందుతున్న వారు సర్కారు ఆంక్షలు, కోతలతో అల్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే టీడీపీ నాయకులు, సానుభూతి పరులతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పించన్‌ పొందుతున్న వారిని సైతం అందుకు అర్హులో కాదో తేల్చాలంటూ జన్మభూమి కమిటీలకు అధికారం అప్పగించి వసూళ్లకు తెర తీశారనే విమర్శలున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికే రాష్ట్రంలో 43.11 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్లు పొందుతుండగా 2014 సెప్టెంబరు, అక్టోబరు నెలలో నిర్వహించిన జన్మభూమి కమిటీల తనిఖీలతో నానా అగచాట్లు పడ్డారు. జన్మభూమి కమిటీలు వీరిని కొత్త వారి తరహాలో అన్ని రకాలుగా వేధించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో జన్మభూమి కమిటీలు కొంతమంది పించన్లను రద్దు చేశాయి. మరికొందరు పేదలు తెలిసిన వారి కాళ్లావేళ్లా పడి 
హైకోర్టుకు వెళ్లి మరీ పింఛన్లు పునరుద్ధరించుకోవాల్సి వచ్చింది. 

తిష్ట వేసి జన్మభూమి కమిటీల వసూళ్లు..
ఎవరైనా లబ్ధిదారుడు వరుసగా మూడు నెలల పాటు పింఛను తీసుకోని పక్షంలో తాత్కాలికంగా రద్దుచేసే విధానాన్ని చంద్రబాబు సర్కారు కొత్తగా అమలు చేస్తోంది. పింఛన్లు పొందే వారిలో అధికశాతం నిరుపేదలే కావడంతో పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటారు. ఇలాంటి వారు పింఛను తీసుకునే అవకాశం కోల్పోతున్నారు. జన్మభూమి కమిటీలతో సిఫార్సు చేయించుకుని పింఛను పునరుద్ధరించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా రద్దయిన ఫించన్‌ డబ్బులను కోల్పోతున్నారు. దీనికితోడు పలుచోట్ల జన్మభూమి కమిటీ సభ్యులు గ్రామాల్లో పింఛన్ల పంపిణీ చేసే ప్రాంతంలో తిష్ట వేసి నిరుపేద లబ్ధిదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా ప్రతి నెలా రూ.10 – 14 కోట్ల దాకా పేదల నుంచి జన్మభూమి కమిటీ సభ్యులు లంచం రూపంలో దోపిడీ చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందడం గమనార్హం.

లక్షల్లో దరఖాస్తులు....
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఏ కార్యక్రమం కోసం గ్రామాలకు వెళ్లినా పించన్‌ కోసమే వినతులు వెల్లువెత్తుతున్నాయి. ‘పింఛను కోసం కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నాం. కొత్త పింఛను ఇప్పించండయ్యా!’ అన్న వేడుకోళ్లే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏటా జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నా తొలగించిన ఫించన్లు, కొత్త వాటి కోసం అందుతున్న దరఖాస్తులు లక్షల్లోనే ఉంటున్నాయి. నాలుగున్నర ఏళ్ల పాలన తర్వాత తాజాగా నిర్వహించిన 6వ విడత జన్మభూమి కార్యక్రమంలోనూ ప్రభుత్వానికి అందిన వినతిపత్రాల్లో పింఛన్ల కోసం అందిన దరఖాస్తులే అత్యధికంగా ఉండటం గమనార్హం. 

2014 అక్టోబరు 2వ తేదీ నుంచి 2018 అక్టోబరు మధ్య కాలంలో పింఛన్లు మంజూరు చేయాలంటూ పేదల నుంచి అందిన 14,59,312 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. 13,26,206 మంది వృద్దులు, 94,499 మంది వితంతువులు, 38,607 మంది దివ్యాంగులు ఫించన్లు పింఛన్లు ఇప్పించాలని అభ్యర్థిస్తూ దరఖాస్తు చేసుకోగా కేవలం లక్షన్నర మందికి మాత్రమే తాజా జన్మభూమిలో కొత్తగా మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఇదే సమయంలో జన్మభూమి కార్యక్రమంలో 1.80 లక్షల మంది కొత్తగా పింఛన్లు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే పెండింగ్‌లో ఉన్న పించన్‌ దరఖాస్తులు యథాతథంగానే ఉన్నట్లు వెల్లడవుతోంది. 

ఐదు లక్షల మందికి కోత..
టీడీపీ 2014లో అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 43.11 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఫించన్‌ పొందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగున్నర ఏళ్లలో 19.38 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్టు చెబుతోంది. అంటే ప్రస్తుతం ఫించన్లు పొందే వారి సంఖ్య 62.49 లక్షలు అంతకన్నా ఎక్కువగా ఉండాలి. కానీ 2019 జనవరి లో ప్రభుత్వం మంజూరు చేసిన ఫించన్ల సంఖ్య 50.61 లక్షలే కావడం గమనార్హం. ఈ ప్రకారం చూస్తే దాదాపు 12 లక్షల మందికి పింఛన్‌ అందలేదని తేలుతోంది. అయితే ఈ నాలుగున్నరేళ్లలో 7.34 లక్షల మంది పింఛన్‌దారులు చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అలా చూసినా దాదాపు ఐదు లక్షల మందికి సర్కారు పించన్‌ ఎగ్గొడుతున్నట్లు స్పష్టమవుతోంది. రకరకాల సాకులతో పింఛనుదార్లును ఏరి వేసింది. 

వైఎస్‌ హయాంలో ఒకే ఏడాది 23 లక్షల మందికి కొత్త పింఛన్లు...
చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఫింఛన్‌దారుల్లో ఎవరైనా చనిపోతేనే కొత్తవి మంజూరు చేయాలనే విధానాన్ని అమలు చేయడంతో ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా రూ.70 చొప్పున ఫించను ఇచ్చే సమయంలో ఈ విధానం అమల్లో ఉండటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే పింఛను మొత్తాన్ని రూ.200కి పెంచడంతోపాటు సంతృప్త స్థాయి పద్ధతిలో అర్హులందరికీ ఇవ్వాలని నిర్ణయించడంతో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఒక్క ఏడాదిలోనే 23 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. అయితే విభజన తర్వాత మరోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు మళ్లీ పాత పింఛనుదారుడు చనిపోతేనే కొత్త ఫించను మంజూరు అన్న విధానాన్నే కొనసాగించారు. 2014 నుంచి 2015 చివరి వరకు మరణించిన ఫించన్‌దారుల సంఖ్య ఆధారంగానే కొత్తవి మంజూరు చేసే విధానాన్ని కొనసాగించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement