సాక్షి, అమరావతి : ‘మా ఎన్నికల మేనిఫెస్టో మాకు ఓ బైబిల్.. ఓ ఖురాన్.. ఓ భగవద్గీత..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరచూ చెబుతుంటారు. శుక్రవారం జరిగిన శాసనసభాపక్షం సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. మేనిఫెస్టోకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామనేది మాటల్లో కాదు.. చేతల్లో కూడా చూపించాలనే తపన ఆయనలో ఉంది. అందుకే సచివాలయంలో తాను కూర్చునే అధికారిక ఛాంబర్‌కు వచ్చి పోయే దారిలో ఆయన ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాల్లోని అంశాలన్నింటినీ ఫ్రేములుగా కట్టించి గోడలకు ఆకర్షణీయంగా అలంకరింపజేశారు. అంతే కాదు, తన ఛాంబర్ లోపల ఎన్నికల మేనిఫెస్టో ప్రతికి సంబంధించిన పెద్ద బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు.
తాను ముఖ్యమంత్రిగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు తానిచ్చిన వాగ్దానాలు, ప్రజా సంక్షేమం కోసం చేయాల్సిన పనులు తనకు ఎపుడూ గుర్తుండేలా, ఎప్పుడూ తనను హెచ్చరిస్తూ ఉండేలా జగన్ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. ఛాంబర్ లోపల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు చిత్ర పటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ఆయన నుంచి స్ఫూర్తిని పొందిన జగన్.. వైఎస్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం ముగ్ధులను చేసింది. కాగా, వైఎస్ జగన్ తొలిసారిగా తన ఛాంబర్‌లోకి ప్రవేశించగానే అక్కడ ఏర్పాటు చేసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు.
Comments
Please login to add a commentAdd a comment