రాజకీయాల కోసం కాదు..ధర్మాన
గుంటూరు : రాజధాని కోసం సంతోషంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తే వాస్తవవేమోనని అనుకున్నాననీ, ఈ గ్రామాల్లో పర్యటిస్తుంటే అవన్నీ అవాస్తవాలని తెలుస్తోందని వైఎస్సార్‌సీపీ రాజధాని రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నాక ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాము భూములు ఇవ్వమనో.. వద్దనో చెప్పడానికి రాలేదని, రైతుల ఆవేదన, కష్టాలు తెలుసుకుని వారి తరఫున పోరాటం చేయడానికి వచ్చామని తెలిపారు. ఏపీ రాజధాని కోసం కేంద్రం కమిటీ వేసిందనీ, ఆ కమిటీ వ్యవసాయ భూములు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని సూచించిందనీ, ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఉందనీ చెప్పారు.
ఈ భూములు తీసుకుంటే రైతు కూలీలు, కౌలు రైతులు, గొర్రెల కాపరులు అందరూ ఇబ్బంది పడతారన్నారు. భూసమీకరణపై తొందరపాటు ఎందుకో అర్థం కావడంలేదన్నారు. ఈ ప్రభుత్వం పట్ల రైతుకు నమ్మకం పోవడానికి కారణం రుణమాఫీపై అనుసరిస్తున్న వైఖరేనని అందువల్లనే చంద్రబాబును ఎవ్వరూ నమ్మడం లేదన్నారు. ఇక్కడి రైతులకు తమ పార్టీ తోడుగా ఉంటుందనీ, అందుకే తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తమను పంపించారనీ, ఇక్కడి రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని తెలిపారు. రైతుల అభిప్రాయూలను పార్టీ అధినేతకు తెలియజేస్తామన్నారు.
మాజీ మంత్రి పార్ధసారథి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ అన్నీ వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటోందని ఆరోపించారు. అందులో రాజధాని కోసం ప్రతిపాదించిన గ్రామాలని వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతుల మనోభావాలు ఎలా ఉన్నాయి, భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా, లేదా, లేకుంటే ఎందుకు లేరు, భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటే ఏం కావాలనుకుంటున్నారు అనే అభిప్రాయాలను క్రోడికరించి పార్టీ అధినేతకు నివేదిస్తామనీ, ఇక్కడి రైతుల మనోభావాలకనుగుణంగానే నడుచుకుంటానీ తెలిపారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ ఈ ప్రాంత భూములు సారవంతమైనవనీ, మూడు పంటలు పండేవనీ, ఎటూ రాజధాని నిర్ణయం జరిగింది గాబట్టి, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే కమిటీని వేసినట్టు చెప్పారు. రైతుకు ఎన్ని కోట్లున్నా భూమిపై ఉండే మమకారం దానికి వెయ్యి రెట్లు అధికంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, మొహమ్మద్ ముస్తఫా, గొట్టిపాటి రవికుమార్, కోనరఘుపతి, పార్టీ రాష్ట్ర రైతు విభాగం నాయకులు నాగిరెడ్డి, తాడికొండ సమన్వయకర్త సురేష్‌బాబు, పురుషోత్తం, సేవాదళ్ కన్వీనర్ చిన్నపరెడ్డి, తాడేపల్లి మాజీ ఎంపీపీ వేమారెడ్డి, మంగళగిరి ఎంపీపీ రత్నకుమారి, గుంటూరు రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు పాల్గొన్నారు.
వర్షాల కారణంగా వాయిదా
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో తొలి విడతగా రెండ్రోజుల పాటు పర్యటించాలని వైఎస్సార్ సీపీ రైతుల హక్కుల కమిటి నిర్ణయించింది. అయితే వర్షాల కారణంగా శుక్రవారం జరగాల్సిన పర్యటన వాయిదా వేస్తున్నట్లు జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ తెలిపారు. తిరిగి కమిటీ ఈనెల 17వ తేదీన తుళ్లూరు మండలంలో పర్యటిస్తుందని తెలిపారు.