వైఎస్‌ జగన్‌ సీఎం అయితే..! | YSRCP President YS Jagan Mohan Reddy Release Manifesto 2019 | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోకు ప్రజా స్పందన..

Published Mon, Apr 8 2019 10:52 AM | Last Updated on Mon, Apr 8 2019 4:33 PM

YSRCP President YS Jagan Mohan Reddy Release Manifesto 2019  - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ప్రకటించిన పార్టీ మేనిఫెస్టోపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. రాష్ట్ర ప్రగతి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను రాష్ట్ర ప్రజలు నిండు మనసుతో స్వాగతిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రకటించిన మేనిఫెస్టోపై వివిధ వర్గాల స్పందన ఇది..
 

జగన్‌ సీఎం అయితే నా కుటుంబానికి లక్షల్లో లబ్ధి 
ఆచంట: నా పేరు పుచ్చకాయల నాగార్జున. మాది పశ్చిమగోదావరి జిల్లా కొడమంచిలి. వైఎస్‌ జగన్‌ సీఎం అయితే నా కుటుంబానికి లక్షల్లో లబ్ధిచేకూరుతుంది. ఆటో డ్రైవర్‌నైన నాకు రూ.10 వేలు సాయంగా అందుతుంది. అమ్మఒడి పథకం కింద నా ఇద్దరు కుమార్తెలను స్కూల్‌కి పంపినందుకుగాను ఏటా రూ.15,000 ఇస్తారు. నా భార్యకు డ్వాక్రాలో రూ.50 వేలు అప్పు ఉంది.

ఈ అప్పునకు సంబంధించిన నగదు మొత్తం నాలుగు విడతల్లోమా చేతికే అందుతుంది. అలాగే నా భార్యకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తారు. మా అమ్మకు రూ.3 వేలు పింఛన్‌ ఇస్తారు. జగన్‌ సీఎం అయితే ప్రతి ఇంటికీ లక్షల్లో లబ్ధి చేకూరుతుంది. ప్రతి వ్యక్తికీ తప్పకుండా సంక్షేమ పథకాలు అందుతాయి. అందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం.  

ఐదేళ్లలో 6 లక్షలకు పైగా.. 

తాడిమర్రి: నా పేరు బీసాని నరసింహులు. మాది అనంతపురం జిల్లా తాడిమర్రి. వైఎస్‌ జగన్‌ సీఎం అయితే మా కష్టాలన్నీ తీరతాయి. మా అమ్మకు రూ.3 వేలు పింఛన్‌ ఇస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మకు లక్ష రూపాయల దాకా ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయిస్తారు. రైతు భరోసా కింద నాకు ఏటా మే నెలలోనే వ్యవసాయ ఖర్చులకోసం రూ.12,500 ఇస్తారు.

పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఒక వేళ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే పరిహారం వస్తుంది. నేను నడుపుతున్న ఆటోకు రోడ్‌ ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదు. నా ఇద్దరు కుమారులను ఇంజినీరింగ్‌ చదివించుకునేందుకు ఏటా లక్షలు అప్పులు తేవాల్సిన అవసరం లేకుండానే ఫీజు రీయింబర్స్‌ అవుతుంది. నా భార్య డ్వాక్రా రుణం రూ.40 వేలు మా చేతికే ఇస్తారు.

ఇది కాకుండా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నాలుగు విడతలుగా రూ.75 వేలు చేతికి అందుతాయి. నా కూతురుని బడికి పంపితే అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వస్తాయి. పక్కా ఇల్లు కూడా కట్టుకుని సొంతింటి కల నెరవేర్చుకుంటాను. మొత్తం మీద జగనన్న సీఎం అయితే మా కుటుంబానికి ఐదేళ్లలో రూ.6 లక్షలకు పైగా లబ్ధి చేకూరుతుంది.  

నా కుటుంబానికి 5 లక్షల ప్రయోజనం

కారంపూడి: నా పేరు మర్రెడ్డి సంజీవరెడ్డి. మాది గుంటూరు జిల్లాలోని కారంపూడి. వైఎస్‌ జగన్‌ సీఎం అయితే నా కుటుంబ కష్టాలు చాలా వరకు తీరతాయి. నేను నరాలకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాను. ఆరోగ్యశ్రీ వర్తించలేదు. అప్పుచేసి డాక్టర్‌కు చూపించుకుని మందులు తెచ్చి వాడుకుంటున్నాను. నాకు ఎకరం పొలం మాత్రమే ఉంది. కొడుకు చంద్రశేఖరరెడ్డి డిగ్రీ దాకా చదువుకున్నాడు. సరైన ఉద్యోగం లేదు. మనువడు రాకేష్‌రెడ్డి ఐదో తరగతి, మనవరాలు స్నేహారెడ్డి ఒకటో తరగతి చదువుతున్నారు.

రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు, నా భార్య డ్వాక్రా రుణం రూ.50 వేలు నేరుగా మా చేతికే ఇస్తారు. మనవళ్లు ఇద్దరినీ బడికి పంపితే అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తారు. మేము పూరింట్లో ఉంటున్నాం. జగన్‌ వస్తే నా కుటుంబానికి పక్కా ఇల్లు కూడా వస్తుంది. మొత్తం మీద నా కుటుంబానికి సుమారు రూ.5 లక్షలకుపైగా ప్రయోజనం కలుగుతుంది. 

మా ఇంటిల్లిపాదికీ ప్రయోజనం

కపిలేశ్వరపురం:  నా పేరు పలివెల ప్రసన్నరాధ. మాది తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం. వైఎస్‌  జగన్‌ సీఎం అయితే మా ఇంటిల్లిపాదికీ ప్రయోజనం చేకూరుతుంది. దళిత కుటుంబమైన మాకు ఐదు కుంచాలు వ్యవసాయ భూమి ఉంది. నవరత్నాల వల్ల పలు విధాల లబ్ధి చేకూరనుంది. మా అత్త మరియమ్మకు రూ.3 వేలు పింఛన్‌ ఇస్తారు. డ్వాక్రా సంఘంలో నాకున్న రుణం మొత్తం రూ.45 వేలు నా చేతికే ఇస్తారు. రైతు భరోసా కింద ఏటా రూ.12,500 పెట్టుబడి సాయమందుతుంది.

అదీగాక గిట్టుబాటు ధరను పంట సాగుకు ముందే ప్రకటించనుండటంతో సాగుపై ధైర్యం కలుగుతుంది.  పంట నష్టపోతే పరిహారం కూడా ఇస్తారు. నా చిన్న కొడుకు డీఎడ్‌ చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్‌ చేయడమే కాకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తానని జగన్‌ భరోసా ఇచ్చారు. గ్రామ సచివాలయాలతో పది మందికి ఉద్యోగాలిస్తానని, ప్రతి 50 మందికి ఒక వలంటీర్‌ను నియమిస్తామని జగన్‌ చెప్పారు. నా పెద్ద కొడుకుతో దరఖాస్తు చేయిస్తా. ఇలా నవరత్నాలు మా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.  

సొంతింటి కల నెరవేరుతుంది

ప్రొద్దుటూరు టౌన్‌ : నా పేరు నాగరాజు. మాది వైఎస్సార్‌ జిల్లాలోని ప్రొద్దుటూరు. వైఎస్‌ జగన్‌ సీఎం అయితే నా కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. బీటెక్‌ చదువుతున్న నా పెద్ద కుమారుడు, ఇంటర్‌ చదువుతున్న నా చిన్న కుమారుడి చదువులకు ఫీజు రీయింబర్స్‌ అవుతుంది. మేము చేనేతలం. నా భార్య డ్వాక్రాలో తీసుకున్న రూ.40 వేల రుణాన్ని నాలుగు విడతల్లో మాచేతికే ఇస్తానని వైఎస్‌ జగన్‌ చెప్పారు.  నా భార్యకు 45 ఏళ్లు నిండటంతో బీసీ కార్పొరేషన్‌ ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తారు. మా అమ్మకు రూ.3 వేలు పింఛన్‌ కూడా ఇస్తారు. ఇల్లు లేని మాకు సొంతింటి కల నెరవేరుతుంది. పేదలమైన మాకు ఆరోగ్యశ్రీ పథకం ఎంతో ధైర్యాన్నిస్తోంది. 

వైఎస్సార్‌సీపీ వస్తే లక్షల్లో లబ్ధి 

నరసన్నపేట : నా పేరు రవికుమార్‌. మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. వైఎస్‌ జగన్‌ సీఎం అయితే మా కష్టాలన్నీ తీరతాయని నమ్ముతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. వారు 4, 6 తరగతులు చదువుతున్నారు. వారిని బడికి పంపుతున్నందుకు అమ్మఒడి పథకం ద్వారా రూ.15,000 వస్తుంది. మా నాన్న జల్లు రామకృష్ణకు నెలకు రూ.3 వేల పింఛన్‌ ఇస్తారు. రైతునైన నాకు ఏటా మే నెలలో రూ.12,500 పెట్టుబడి సాయం అందుతుంది. అలాగే పొలంలో ఉచితంగా బోరు వేస్తారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.75 వేలు సాయం అందుతుంది. డ్వాక్రాలో సభ్యురాలైన నా భార్య లావణ్యకు రూ.45 వేలు అప్పు ఉంది. నాలుగు విడతల్లో ఆ అప్పునకు సంబంధించిన నగదు మా చేతికే ఇస్తానని జగన్‌ చెప్పారు. సొంత ఇల్లు లేని నాకు పక్కా ఇంటిని నిర్మించి ఇస్తారు. ఇంకా వడ్డీలేని రుణాలు వస్తాయి. ఇలా దాదాపు రూ.5 లక్షలకు పైనే మాకు లబ్ధిచేకూరుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement