YSRCP Manifesto Committee
-
AP: 26 జిల్లాల ప్రతిపాదనలు సిద్ధం
విజయవాడ: ఏపీ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు 26 జిల్లాల ప్రతిపాదనల నివేదికను ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్... సీఎస్‌కు అందించారు. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిపారు. ఈలోపు 2021 జనాభా గణన ముందుకురావడంతో పునర్వ్యవస్థీకరణ ఆలస్యమైంది. కానీ, కరోనా నేపథ్యంలో జనాభా గణన ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అది మొదలయ్యేలోపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు పెరగనుంది. అరకు పార్లమెంట్ సెగ్మెంట్ భౌగోళిక రిత్యా చాలా విస్తారమైనది కావడంతో.. ఆ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవకాశం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధ్యయన కమిటీని నియమించింది. వివిధ అంశాలపై పలు శాఖల అధికారులతో నాలుగు సబ్ కమిటీలను, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీల్లోని అధికారులు పలుమార్లు సమావేశమై జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి? సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేవి? దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి? వంటి అనేక అంశాలపై కూలంకుషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు. -
ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి లోక్‌సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఎట్టకేలకు ఈ హామీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతోంది. రేపు లేదా ఎల్లుండి.. రెండురోజుల్లో నోటీఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలుంటే.. 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేదిశగా ప్రక్రియ ప్రారంభమైనట్టు స్పష్టమవుతోంది. అరకు పార్లమెంట్ సెగ్మెంట్ భౌగోళిక రిత్యా చాలా విస్తారమైనది కావడంతో.. ఆ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చిన్న చిన్న మార్పులు- చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలంటే..ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది కూడా. అందుకు అనుగుణంగా ఈ ప్రక్రియకు అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. -
నవరత్నాలు, అభివృద్ధి, ఆస్తుల కల్పన
సాక్షి, అమరావతి: నవరత్నాలు, వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని అంశాలతో పాటు అభివృద్ధి, ఆస్తుల కల్పనే లక్ష్యంగా 2021–22 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మౌలిక సదుపాయాలు కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు పారిశ్రామికీకరణ వేగవంతానికి బడ్జెట్లో పెట్టుబడి వ్యయానికి ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈసారి బడ్జెట్లో మహిళా సాధికారత, పిల్లల సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. వ్యవసాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు సవరణలపై ఆర్ధిక శాఖ అన్ని శాఖలకు మార్గదర్శకాలిచ్చింది. బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ మంగళవారం నుంచి ప్రాథమిక కసరత్తు ప్రారంభించారు. సంక్షేమ, అభివృద్ధి పనులకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. నిర్వహణ వ్యయం వీలైనంత మేర కట్టడి చేయడంలో భాగంగా రంగాల వారీగా సమీక్షించాలని నిర్ణయించింది. గంపగుత్త కేటాయింపులొద్దు ► వచ్చే బడ్జెట్లో శాఖల వారీగా గంపగుత్త కేటాయింపులకు స్వస్తి పలకాలి. ఏ శాఖలో.. ఏ రంగానికి, ఏ విభాగానికి ఎన్ని నిధులు అవసరమో ప్రత్యేక పద్దుల ద్వారా ప్రతిపాదనలు చేయాలని, అలాగే లింగ నిష్పత్తి మేరకు మహిళలకు కేటాయింపులు చేయాలని ఆర్థిక శాఖ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రభుత్వ లక్ష్యాలు.. ► గృహ నిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రహదారులు, రవాణా రంగాల్లో మౌలిక వసతుల కల్పన ► పారిశ్రామికీకరణ ద్వారా ఆర్ధిక వ్యవస్థను మెరుగు పరచాలి. ► కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర అభివృద్ధి పథకాలు, విదేశీ ఆర్ధిక సాయం పథకాలు తదితరాల కేటాయింపులకు ప్రాధాన్యం. ► నవరత్నాలు, మేనిఫెస్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలు, వ్యవసాయ బడ్జెట్‌కు ప్రాధాన్యం. -
మాటిచ్చామంటే.. నెరవేర్చాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే వాటిని అధిగమించి ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల పథకాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. ఈనెల 12వతేదీన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండాలి? ఏ రంగాలకు ప్రాధాన్యం కల్పించాలి? కేటాయింపులు ఎలా ఉండాలనే అంశాలపై ముఖ్యమంత్రి గురువారం ఆర్థికశాఖకు దిశా నిర్దేశం చేశారు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి ప్రాథమికంగా నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని స్థితికి దిగజార్చిందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధానంగా ఎన్నికలకు ముందు ఐదు నెలల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేని విధంగా దిగజారిందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొనటంతో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తీరాల్సిందేనని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నవరత్నాల అమలుకు బడ్జెట్లో పెద్ద పీట వేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెంచిన సామాజిక పింఛన్లకు సరిపడా నిధులు బడ్జెట్లో కేటాయించాలని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా, రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఎన్ని నిధులు అవసరమో అంత మేర బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని సూచించారు. అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిందేనని, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని ముఖమంత్రి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి సమీక్షించడంతోపాటు నవరత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బడ్జెట్ రూపకల్పన, ప్రాధాన్యతలపై రెండు మూడు దఫాలు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేని విధంగా దిగజారిందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొనటంతో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తీరాల్సిందేనని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నవరత్నాల అమలుకు బడ్జెట్లో పెద్ద పీట వేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెంచిన సామాజిక పింఛన్లకు సరిపడా నిధులు బడ్జెట్లో కేటాయించాలని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పాటు వైఎస్ఆర్ రైతు భరోసా, రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఎన్ని నిధులు అవసరమో అంత మేర బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని సూచించారు. అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిందేనని, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని ముఖమంత్రి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను సీఎం సమీక్షించడంతోపాటు నవరత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బడ్జెట్ రూపకల్పన, ప్రాధాన్యతలపై రెండు మూడు దఫాలు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అప్పులు తీసుకుని మళ్లించిన టీడీపీ సర్కారు... టీడీపీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్లో రూ.2.48 లక్షల కోట్ల మేరకు అప్పులు చేయగా, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో రూ.64 వేల కోట్ల వరకు అప్పులు చేశారని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులను వాటికోసం వెచ్చించకుండా ఇతర అవసరాలకు మళ్లించడంతో నిధుల కొరతతో సతమతమవుతున్నాయని వివరించారు. వివిధ రకాల పెండింగ్ బిల్లులు మొత్తం రూ.48 వేల కోట్ల వరకు ఉన్నట్లు ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. -
జగనన్నతో మా కుటుంబానికి కొండంత భరోసా..
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు తమ జీవితాల్లో వెలుగులు తెస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అవినీతి పాలనకు చరమగీతం పాడాలని కోరుకుంటున్నారు. జగనన్నతోనే రాజన్న ఆశయాలు నెరవేరతాయి. అమ్మఒడి పథకం ద్వారా మా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటంతో పాటు కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు వస్తుందని ఆనందం వెలిబుచ్చారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా దేశంలో ఏ ఆసుపత్రిలోనైనా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు, రైతులకు పంట మొదట్లోనే మద్దతు ధర ప్రకటించడం లాంటి పథకాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. ‘నవరత్నాలు’తో మా బతుకుల్లో వెలుగు ఉరవకొండ: నేను, నా భర్త రోజూ కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాం. కూలి డబ్బుతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. అయితే వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలతో మా కష్టాలన్నీ తీరతాయన్న నమ్మకం కలుగుతోంది. మా అత్తకు మూడు వేల రూపాయల పింఛన్ ఇస్తారు. అనారోగ్యంతో ఉన్న ఆమెకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తారు. డ్వాక్రాలో నాకు రూ.60 వేల అప్పు ఉంది. ఈ అప్పునంతా నాలుగు దఫాల్లో నా చేతికే ఇస్తారు. నా పిల్లల్ని బడికి పంపితే ఏటా రూ.15 వేలు ఇస్తారు. మాకు పక్కా ఇల్లు కూడా కట్టించి.. ఆ ఇంటిని నా పేర్న రిజిస్టర్ చేస్తారు. మాకు ఎప్పుడన్నా డబ్బులు అవసరమైతే ఆ ఇంటి కాగితాల్ని బ్యాంకులో కుదువపెట్టి రుణం తీసుకునే వెసులుబాటు కలిగిస్తానని చెప్పారు. జగన్ సీఎం అయితే మా కుటుంబానికి లక్షల్లో లబ్ధి చేకూరుతుంది. మా కష్టాలన్నీ తీరతాయి. – కురుబ లక్ష్మీదేవి, ఉరవకొండ, అనంతపురం జిల్లా జగనన్నతోనే మా దశ తిరుగుతుంది ఉలవపాడు: నేను ఉలవపాడు బస్టాండ్ సెంటర్లో పూలబండి పెట్టుకుని పూలు అమ్ముకుంటాను. జగన్ సీఎం అయితే నాకు పింఛన్ రూ.3 వేలు ఇస్తారు. మా అమ్మాయికి 45 ఏళ్లు దాటాయి. దాంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అందించే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగు విడతలుగా రూ.75 వేలు వస్తాయి. ఎంబీఏ చదివిన నా మనువడు శివశంకర్ నిరుద్యోగిగా ఉన్నాడు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలన్నీ ఒకేసారి భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టం చేస్తానని మాట ఇచ్చాడు. దీంతో నా మనుమడికి తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందని నమ్ముతున్నాం. ఇంకో మనుమడు సాయికిరణ్, మనుమరాలు కామాక్షి చదువులకు ఫీజు రీయింబర్స్ అవుతుంది. సొంతిల్లు లేని మాకు జగన్ ఇల్లు కట్టిస్తానన్నారు. తోపుడు బండ్లు ఉన్న వారికి వడ్డీ లేకుండా రూ.10 వేలు సాయం అందిస్తామని ప్రకటించారు. జగన్ ఇచ్చిన హామీల వల్ల మా కుటుంబ దశ మారుతుందని ఆశిస్తున్నాం. – అరవ నాగరత్నమ్మ, ఉలవపాడు, ప్రకాశం జిల్లా మా కుటుంబానికి కొండంత భరోసా నెల్లిమర్ల: వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే నవరత్నాలను అమలు చేస్తానని చెప్పారు. వీటి ద్వారా మా కుటుంబానికి లక్షల్లో లబ్ధి చేకూరుతుంది. మా నాన్నకు రూ.3 వేలు పింఛన్ ఇస్తారు. కుటుంబంలోని అందరికీ ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుంది. మా పాపను బడికి పంపినందుకు గాను అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు ఇస్తారు. నా భార్య డ్వాక్రా సభ్యురాలు. ఆమెకు సున్నా వడ్డీతో రుణం అందుతుంది. అంతేగాకుండా మాకు పక్కా ఇల్లు కట్టిస్తారు. ఇలా మా కుటుంబానికి లక్షల్లో ప్రయోజనం కలుగుతుంది. – బొందిలి రవీంద్రకుమార్సింగ్, నెల్లిమర్ల, విజయనగరం మా కష్టాలన్నీ తీరతాయి కోట: వైఎస్ జగన్ సీఎం అయితే మా కష్టాలన్నీ తీరతాయి. రైతునైన నాకు నవరత్నాల్లోని వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు వస్తాయి. పంట నష్టపోతే పరిహారం కూడా ఇస్తామని జగన్ చెప్పారు. అంతేకాదు వడ్డీలేని రుణం ఇస్తారు. మాకు పొలంలో బోరు వేయడం ద్వారా లక్ష వరకూ ప్రయోజనం కలుగుతుంది. మా అమ్మ అంకమ్మకు రూ.3 వేలు పింఛన్ ఇస్తారు. వ్యాధి ఏదైనా చికిత్స ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తుంది. నా భార్యకు డ్వాక్రా అప్పు రూ.70 వేలు ఉంది. ఆ మొత్తాన్ని నాలుగు దఫాల్లో మా చేతికే ఇస్తారు. బడికి వెళుతున్న మా ఇద్దరు పిల్లలకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వస్తాయి. మా పిల్లల ఉన్నత చదువులకు ఎంత ఖర్చయినా ఫీజు రీయింబర్స్ అవుతుంది. వైఎస్ జగన్ సీఎం అయితే మా కష్టాలన్నీ తీరతాయి. – దార్ల కోటేశ్వరరావు, మద్దాలి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మా కుటుంబానికి ఎంతో ప్రయోజనం బుట్టాయగూడెం: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా కుటుంబానికి ఎంతో మేలు చేకూరుతుంది. నా కుమారుడిని బడికి పంపినందుకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు ఇస్తారు. నాకు డ్వాక్రాలో రూ.80 వేల అప్పు ఉంది. ఈ అప్పునకు సంబంధించిన నగదు మొత్తం నాలుగు విడతల్లో నా చేతికే ఇస్తారు. గిరిజన మహిళనైన నాకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఇస్తారు. ఆరోగ్యశ్రీ పథకం మా గిరిజనుల పాలిట వరం. ఎప్పుడూ విషజ్వరాలతో తల్లడిల్లుతున్న మా గిరిజన ప్రాంతాలకు ఈ పథకం ఆసరాగా ఉంటుంది. – తెల్లం రమణ, తూర్పురేగులకుంట గిరిజన గ్రామం, పశ్చిమగోదావరి జిల్లా -
సేంద్రియ ధ్రువీకరణ నిబంధనల సడలింపు
సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ నిబంధనల అమలులో చిన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఏడాది పాటు సడలింపు లభించింది. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలను స్వయంగా పండించే చిన్న రైతులతోపాటు (రూ. 12 లక్షల లోపు వార్షిక టర్నోవర్ కలిగి ఉండే) రైతు ఉత్పత్తిదారుల కంపెనీల(ఎఫ్.పి.ఓ.లు)కు ఈ సడలిపం వర్తిస్తుంది. ఈ మేరకు సేంద్రియ సర్టిఫికేషన్ నియమ నిబంధనల అమలు గడువును, ఉత్పత్తులపై విధిగా ‘జైవిక్ భారత్’ లోగో ముద్రించాలన్న నిబంధనల గడువును 2020 ఏప్రిల్ 1 వరకు పొడిగిస్తూ భారతీయ ఆహారభద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ.) తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దేశంలో అమ్ముడయ్యే సేంద్రియ ఆహారోత్పత్తులన్నీ సర్టిఫికేషన్ నిబంధనలకు లోబడి ఉండాలని ఎఫ్.ఎస్.ఎ.ఐ. నిర్దేశిస్తోంది. అంటే.. జాతీయ సేంద్రియ ఉత్పత్తుల పథకం (ఎన్.పి.ఓ.పి.) కింద గానీ, లేదా రైతు బృందాల (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం ఫర్ ఇండియా– పీజీఎస్ ఇండియా)తో కూడిన వ్యవస్థ ద్వారా గానీ సేంద్రియ సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. చిన్నా పెద్దా సేంద్రియ రైతులు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు, చిన్న రైతుల నుంచి సేంద్రియ ఉత్పత్తులను సేకరించి చిల్లర వర్తకులకు అందించే వ్యాపార సంస్థల(అగ్రిగేటర్లత)కు కూడా సడలింపు వర్తిస్తుంది. సేంద్రియ సర్టిఫికేషన్ నియమ నిబంధనలను అమలు ప్రక్రియ తొలి దశలో ఉన్నందున రాష్ట్ర స్థాయి ఆహార భద్రతా అధికారులు కేసులు పెట్టకుండా 2020 ఏప్రిల్ 1 వరకు సడలింపు ఇవ్వాలని ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. ఆదేశించింది. ముఖ్యంగా స్వయంగా పంటలు పండించే చిన్న సేంద్రియ రైతులు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలకు సడలింపు ఇవ్వాలని పేర్కొంది. సేంద్రియ పంటలను సాగు చేసే చిన్న రైతులు గానీ, ఏడాదికి రూ. 12 లక్షల కన్నా తక్కువ వార్షిక వ్యాపారం చేసే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్.పి.ఓ.) గానీ నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడానికి సేంద్రియ సర్టిఫికేషన్ పొందాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలని ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. పేర్కొంది. అయితే, నేరుగా వినియోగదారులకు కాకుండా ఇతర కంపెనీలకు, సంస్థల (అగ్రిగేటర్స్ లేదా ఇంటర్మీడియరీస్)కు తమ ఉత్పత్తులను అమ్ముకోవాలనుకుంటే సర్టిఫికేషన్ పొందాల్సిన అవసరం ఉంటుంది. ఆ గడువునే ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. ఇప్పుడు 2020 ఏప్రిల్ 1 వరకు పొడిగించింది. అగ్రిగేటర్స్‌కూ ఊరట సేంద్రియ ఉత్పత్తులను తక్కువ మొత్తంలో పండించే చిన్న రైతులు, ఎఫ్.పి.ఓ.లు తమంతట తామే ‘నేరుగా వినియోగదారులకు సరుకును అమ్ముకోవటం’లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందువల్ల వీరి నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను సేకరించి అమ్ముకునే ఇతర కంపెనీలు, సంస్థల (అగ్రిగేటర్స్ లేదా ఇంటర్మీడియరీస్)కు కూడా సేంద్రియ సర్టిఫికేషన్ నిబంధనల నుంచి సడలింపు ఇస్తూ ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వార్షిక వ్యాపారం రూ. 50 లక్షల లోపు ఉండే అగ్రిగేటర్స్ లేదా ఇంటర్మీడియరీస్ సంస్థలు కూడా సేంద్రియ ధ్రువీకరణ పొందాల్సిన అవసరం లేదని ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. స్పష్టం చేసింది. ‘కొద్ది విస్తీర్ణంలో సేంద్రియ పంటలు పండించే చిన్న రైతులతోపాటు చిన్న ఎఫ్.పి.ఓ. సంస్థలు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీరు ఇప్పటి వరకు సేంద్రియ ధృవీకరణ తీసుకోలేదు. తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడంలో వీళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి విజ్ఞాపనల మేరకు పిజిఎస్–ఇండియా సేంద్రియ ధృవీకరణ ప్రక్రియను చిన్న రైతులకు మరింత సానుకూలంగా మార్చుతున్నాం’ అని ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. తెలిపింది. అయితే, ఈ వెసులుబాటు సేంద్రియ ఆహారోత్పత్తులను విక్రయించే రిటైల్ కంపెనీలకు వర్తించదని ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. స్పష్టం చేసింది. సేంద్రియ రైతులు పండించే ఆహారోత్పత్తుల్లో రసాయనాల అవశేషాల మోతాదు చట్ట నిబంధనలకు లోబడే ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆహార భద్రతా అధికారులకు ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. సూచించింది. మన దేశంలో సేంద్రియ ఆహారోత్పత్తి, విక్రయాలను క్రమబద్ధం చేసే ప్రక్రియ 2017 డిసెంబర్లో ప్రారంభమైంది. 2018 జూలై 1 నాటికల్లా కొత్త సర్టిఫికేషన్ నిబంధనలను పాటించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆహార వ్యాపారులు, సేంద్రియ ఉత్పత్తిదారులు / ఆహార శుద్ధి పరిశ్రమదారులు 2018 సెప్టెంబర్ 30 లోగా సంబంధిత లైసెన్సులు పొందాలి. 2019 ఏప్రిల్ 1 నాటికి సేంద్రియ ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘జైవిక్ భారత్’ ముద్రను అచ్చువేయాలని ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. గతంలో నిర్దేశించిన సంగతి తెలిసిందే. -
వైఎస్ జగన్ సీఎం అయితే..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా ప్రకటించిన పార్టీ మేనిఫెస్టోపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. రాష్ట్ర ప్రగతి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికను రాష్ట్ర ప్రజలు నిండు మనసుతో స్వాగతిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రకటించిన మేనిఫెస్టోపై వివిధ వర్గాల స్పందన ఇది.. జగన్ సీఎం అయితే నా కుటుంబానికి లక్షల్లో లబ్ధి ఆచంట: నా పేరు పుచ్చకాయల నాగార్జున. మాది పశ్చిమగోదావరి జిల్లా కొడమంచిలి. వైఎస్ జగన్ సీఎం అయితే నా కుటుంబానికి లక్షల్లో లబ్ధిచేకూరుతుంది. ఆటో డ్రైవర్‌నైన నాకు రూ.10 వేలు సాయంగా అందుతుంది. అమ్మఒడి పథకం కింద నా ఇద్దరు కుమార్తెలను స్కూల్‌కి పంపినందుకుగాను ఏటా రూ.15,000 ఇస్తారు. నా భార్యకు డ్వాక్రాలో రూ.50 వేలు అప్పు ఉంది. ఈ అప్పునకు సంబంధించిన నగదు మొత్తం నాలుగు విడతల్లోమా చేతికే అందుతుంది. అలాగే నా భార్యకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తారు. మా అమ్మకు రూ.3 వేలు పింఛన్ ఇస్తారు. జగన్ సీఎం అయితే ప్రతి ఇంటికీ లక్షల్లో లబ్ధి చేకూరుతుంది. ప్రతి వ్యక్తికీ తప్పకుండా సంక్షేమ పథకాలు అందుతాయి. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఐదేళ్లలో 6 లక్షలకు పైగా.. తాడిమర్రి: నా పేరు బీసాని నరసింహులు. మాది అనంతపురం జిల్లా తాడిమర్రి. వైఎస్ జగన్ సీఎం అయితే మా కష్టాలన్నీ తీరతాయి. మా అమ్మకు రూ.3 వేలు పింఛన్ ఇస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మకు లక్ష రూపాయల దాకా ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయిస్తారు. రైతు భరోసా కింద నాకు ఏటా మే నెలలోనే వ్యవసాయ ఖర్చులకోసం రూ.12,500 ఇస్తారు. పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఒక వేళ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే పరిహారం వస్తుంది. నేను నడుపుతున్న ఆటోకు రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. నా ఇద్దరు కుమారులను ఇంజినీరింగ్ చదివించుకునేందుకు ఏటా లక్షలు అప్పులు తేవాల్సిన అవసరం లేకుండానే ఫీజు రీయింబర్స్ అవుతుంది. నా భార్య డ్వాక్రా రుణం రూ.40 వేలు మా చేతికే ఇస్తారు. ఇది కాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాలుగు విడతలుగా రూ.75 వేలు చేతికి అందుతాయి. నా కూతురుని బడికి పంపితే అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వస్తాయి. పక్కా ఇల్లు కూడా కట్టుకుని సొంతింటి కల నెరవేర్చుకుంటాను. మొత్తం మీద జగనన్న సీఎం అయితే మా కుటుంబానికి ఐదేళ్లలో రూ.6 లక్షలకు పైగా లబ్ధి చేకూరుతుంది. నా కుటుంబానికి 5 లక్షల ప్రయోజనం కారంపూడి: నా పేరు మర్రెడ్డి సంజీవరెడ్డి. మాది గుంటూరు జిల్లాలోని కారంపూడి. వైఎస్ జగన్ సీఎం అయితే నా కుటుంబ కష్టాలు చాలా వరకు తీరతాయి. నేను నరాలకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాను. ఆరోగ్యశ్రీ వర్తించలేదు. అప్పుచేసి డాక్టర్‌కు చూపించుకుని మందులు తెచ్చి వాడుకుంటున్నాను. నాకు ఎకరం పొలం మాత్రమే ఉంది. కొడుకు చంద్రశేఖరరెడ్డి డిగ్రీ దాకా చదువుకున్నాడు. సరైన ఉద్యోగం లేదు. మనువడు రాకేష్‌రెడ్డి ఐదో తరగతి, మనవరాలు స్నేహారెడ్డి ఒకటో తరగతి చదువుతున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు, నా భార్య డ్వాక్రా రుణం రూ.50 వేలు నేరుగా మా చేతికే ఇస్తారు. మనవళ్లు ఇద్దరినీ బడికి పంపితే అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తారు. మేము పూరింట్లో ఉంటున్నాం. జగన్ వస్తే నా కుటుంబానికి పక్కా ఇల్లు కూడా వస్తుంది. మొత్తం మీద నా కుటుంబానికి సుమారు రూ.5 లక్షలకుపైగా ప్రయోజనం కలుగుతుంది. మా ఇంటిల్లిపాదికీ ప్రయోజనం కపిలేశ్వరపురం: నా పేరు పలివెల ప్రసన్నరాధ. మాది తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం. వైఎస్ జగన్ సీఎం అయితే మా ఇంటిల్లిపాదికీ ప్రయోజనం చేకూరుతుంది. దళిత కుటుంబమైన మాకు ఐదు కుంచాలు వ్యవసాయ భూమి ఉంది. నవరత్నాల వల్ల పలు విధాల లబ్ధి చేకూరనుంది. మా అత్త మరియమ్మకు రూ.3 వేలు పింఛన్ ఇస్తారు. డ్వాక్రా సంఘంలో నాకున్న రుణం మొత్తం రూ.45 వేలు నా చేతికే ఇస్తారు. రైతు భరోసా కింద ఏటా రూ.12,500 పెట్టుబడి సాయమందుతుంది. అదీగాక గిట్టుబాటు ధరను పంట సాగుకు ముందే ప్రకటించనుండటంతో సాగుపై ధైర్యం కలుగుతుంది. పంట నష్టపోతే పరిహారం కూడా ఇస్తారు. నా చిన్న కొడుకు డీఎడ్ చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్ చేయడమే కాకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తానని జగన్ భరోసా ఇచ్చారు. గ్రామ సచివాలయాలతో పది మందికి ఉద్యోగాలిస్తానని, ప్రతి 50 మందికి ఒక వలంటీర్‌ను నియమిస్తామని జగన్ చెప్పారు. నా పెద్ద కొడుకుతో దరఖాస్తు చేయిస్తా. ఇలా నవరత్నాలు మా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సొంతింటి కల నెరవేరుతుంది ప్రొద్దుటూరు టౌన్ : నా పేరు నాగరాజు. మాది వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు. వైఎస్ జగన్ సీఎం అయితే నా కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. బీటెక్ చదువుతున్న నా పెద్ద కుమారుడు, ఇంటర్ చదువుతున్న నా చిన్న కుమారుడి చదువులకు ఫీజు రీయింబర్స్ అవుతుంది. మేము చేనేతలం. నా భార్య డ్వాక్రాలో తీసుకున్న రూ.40 వేల రుణాన్ని నాలుగు విడతల్లో మాచేతికే ఇస్తానని వైఎస్ జగన్ చెప్పారు. నా భార్యకు 45 ఏళ్లు నిండటంతో బీసీ కార్పొరేషన్ ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తారు. మా అమ్మకు రూ.3 వేలు పింఛన్ కూడా ఇస్తారు. ఇల్లు లేని మాకు సొంతింటి కల నెరవేరుతుంది. పేదలమైన మాకు ఆరోగ్యశ్రీ పథకం ఎంతో ధైర్యాన్నిస్తోంది. వైఎస్సార్సీపీ వస్తే లక్షల్లో లబ్ధి నరసన్నపేట : నా పేరు రవికుమార్. మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. వైఎస్ జగన్ సీఎం అయితే మా కష్టాలన్నీ తీరతాయని నమ్ముతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. వారు 4, 6 తరగతులు చదువుతున్నారు. వారిని బడికి పంపుతున్నందుకు అమ్మఒడి పథకం ద్వారా రూ.15,000 వస్తుంది. మా నాన్న జల్లు రామకృష్ణకు నెలకు రూ.3 వేల పింఛన్ ఇస్తారు. రైతునైన నాకు ఏటా మే నెలలో రూ.12,500 పెట్టుబడి సాయం అందుతుంది. అలాగే పొలంలో ఉచితంగా బోరు వేస్తారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.75 వేలు సాయం అందుతుంది. డ్వాక్రాలో సభ్యురాలైన నా భార్య లావణ్యకు రూ.45 వేలు అప్పు ఉంది. నాలుగు విడతల్లో ఆ అప్పునకు సంబంధించిన నగదు మా చేతికే ఇస్తానని జగన్ చెప్పారు. సొంత ఇల్లు లేని నాకు పక్కా ఇంటిని నిర్మించి ఇస్తారు. ఇంకా వడ్డీలేని రుణాలు వస్తాయి. ఇలా దాదాపు రూ.5 లక్షలకు పైనే మాకు లబ్ధిచేకూరుతుంది. -
హామీలను నిజాయితీగా ఇద్దాం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: ‘మన పార్టీ తరపున ప్రకటించబోయే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పర్చే అన్ని హామీలను నిజాయితీగా ఇద్దామని, రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం ప్రతిబింబించేలా మేనిఫెస్టో రూపొందిద్దాం’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. వాగ్దానాల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఏ పార్టీతోనూ పోటీ లేదని, ప్రజలకు ఎలా మేలు చేయాలన్న ఆలోచనతోనే ముందుకెళదామని జగన్ అన్నారు. మేనిఫెస్టోను రూపొందించేటప్పటపుడు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాను ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ చేసిన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. మేనిఫెస్టో సంక్షిప్తంగా అందరికీ అర్థం అయ్యేలా ఉండాలన్నారు. కౌలు రైతులకు న్యాయం చేసేలా మన పథకాలు ఉండాలని కూడా ఆయన కమిటీ సభ్యులతో అన్నారు. చేసిన ప్రతి వాగ్దానాన్ని నిజాయితీతో నూటికి నూరు శాతం అమలు చేద్దామని జగన్ స్పష్టం చేశారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు కమిటీ సభ్యులు 31 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి సమావేశ వివరాలను మీడియాకు వివరించారు. రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగంలో దాదాపు 70 శాతం వరకు ఉన్న కౌలు రైతులకు అండగా ఉండేందుకు తగిన సహాయం చేసేలా ఎన్నికల ప్రణాళికలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో నాలుగు అంశాల ఆధారంగా చర్చ జరిగిందని ఉమ్మారెడ్డి వివరించారు. ‘నవరత్నాలు’లో ప్రకటించిన పథకాలను మరింత మెరుగుపర్చి తీర్చిదిద్దడం, సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వచ్చిన అంశాలు, సమస్యలు, ఆయనకు వివిధ వర్గాల నుంచి వచ్చిన అర్జీలు, సభలు, సమావేశాల్లో చర్చించిన అంశాలతో పాటు గత నెల 26న విజయవాడలో జరిగిన సమావేశం తర్వాత ప్రజల నుంచి వచ్చిన దాదాపు 300 వినతి పత్రాల్లోని అంశాలను సమావేశంలో చర్చించామన్నారు. అన్నిటినీ క్రోడీకరించి చాలా బ్రీఫ్‌గా పాయింటెడ్‌గా మేనిఫెస్టో రూపొందించనున్నామని ఉమ్మారెడ్డి చెప్పారు. అంతేకాకుండా అవి వందకు వంద శాతం ఒక షెడ్యూల్ ప్రకారం అమలు చేయనున్నామని తెలిపారు. అదే విధంగా హామీలు అమలు చేయాలంటే ఎంత ఖర్చవుతుంది? ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? తదితర అంశాలు పరిశీలించడంతో పాటు అవన్నీ నెరవేర్చేలా ప్రణాళిక రూపొందించాలని పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి సూచించారని, ఆ మేరకు అన్నింటినీ సమీక్షిస్తామని వివరించారు. భూ యజమానులు– కౌలు రైతులకు నష్టం లేకుండా ఫార్ములా దేశంలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడిన రంగం వ్యవసాయం అని, ఇందులో కౌలు రైతులదే ప్రధాన భూమిక అని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, సబ్సిడీ విత్తనాలతో పాటు పరిహారం ఇచ్చే విషయంలో భూ యజమాని, కౌలు రైతు ఇరువురికీ నష్టం కలగకుండా ఒక ఫార్ములా తయారు చేయాలని పార్టీ అధ్యక్షలు జగన్ నిర్ధేశించారని తెలిపారు. అందుకే కౌలుదారీ చట్టంలో ఏముంది? అన్నది కూడా సమీక్షించనున్నామన్నారు. ఇంకా ప్రతికూల పరిస్థితుల్లో రైతులను ఎలా ఆదుకోవాలన్న దానిపైనా అన్ని కోణాల్లో చర్చించనున్నట్లు చెప్పారు. సీడ్ యాక్ట్, పెస్టిసైడ్ యాక్ట్ ఇప్పటికే ఉన్నాయని, వాటి మేరకు తప్పు చేసిన వారిని శిక్షించాల్సి ఉంటుందని, వాటిని మేనిఫెస్టో కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను కూడా పరిశీలించబోతున్నామన్నారు. వీటి ఆధారంగా రైతులకు గిట్టుబాటు ధరల కల్పన, ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి, ధరల స్థిరీకరణ నిధి అన్నింటిపై సమగ్ర డాక్యుమెంటరీ తయారు చేస్తున్నట్లు ఉమ్మారెడ్డి వివరించారు. అదే విధంగా పథకాల అమలుతో ప్రభుత్వంపై పడే భారం తదితర అంశాలను చర్చిస్తామని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఇకపై తరచూ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని, ఆ ప్రక్రియలో భాగంగా ఈ నెల 12న విజయవాడలో భేటీ కానున్నామని ఉమ్మారెడ్డి ప్రకటించారు. ఆ లోపు కూడా ప్రతి రోజూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటామని, ఎవరైనా సూచనలు, వినతి పత్రాలు ఇవ్వొచ్చని సూచించారు. వ్యవసాయం, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బీసీ గర్జన సదస్సులో చేసిన ప్రకటన, ఆ సభలో ఇచ్చిన హామీలను కూడా పరిగణించబోతున్నామన్నారు. -
వైఎస్సార్సీపీ అధికారంలోకొస్తుంది.. అమరావతే రాజధాని
సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అమరావతే రాజధానిగా ఉంటుంది’.. అని పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఉమ్మారెడ్ది వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. దీనిని పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)లో కూడా పొందుపరుస్తామని వెల్లడించారు. ఈ విషయంలో తమ పార్టీకి నష్టం కలిగించేలా.. ప్రజలను గందరగోళ పరిచేలా కొంతమంది వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. మెరుగైన రాజధానిని నిర్మించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్ సంక్షేమ పథకాలనే తాము స్ఫూర్తిగా తీసుకుంటున్నామని, వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని చిత్తశుద్ధితో అమలుచేసేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ విజయవాడ కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ మంగళవారం తొలిసారి భేటీ అయింది. అనంతరం సమావేశ వివరాలను ఉమ్మారెడ్డి మీడియాకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో అనేక వర్గాల సమస్యలు, భౌగోళిక పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారని.. ఈ నేపథ్యంలో ఆయన అనేక వాగ్దానాలు చేశారని, వాటన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. ప్రతీ పేదకు ‘నవరత్నం’ పేదల ముఖంలో చెరిగిపోని చిరునవ్వులుండాలన్న ఉద్దేశ్యంతో వైఎస్ జగన్ నవరత్నాలను ప్రకటించారని, అన్ని వర్గాల ప్రయోజనాన్ని కాంక్షించే విధంగా ఇందులో పథకాలు పేర్కొన్నారని, వీటన్నింటినీ మేనిఫెస్టోలో పేర్కొంటామని ఉమ్మారెడ్డి తెలిపారు. ప్రతి హామీ నూటికి నూరుపాళ్లు అమలయ్యేలా చూడటమే పార్టీ లక్ష్యమంటూ.. వాటిని మేనిఫెస్టోలో పెట్టాలని తమ పార్టీ అధ్యక్షుడు జగన్ సూచించినట్లు ఆయన చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి పలు రకాల అనుబంధ విభాగాలున్నాయని.. వీటితో వచ్చే నెల 3 నుంచి మేనిఫెస్టో కమిటీ సభ్యులు ఆయా జిల్లాల్లో భేటీ అవుతారని ఉమ్మారెడ్డి తెలిపారు. అదే విధంగా విజయవాడ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటుచేస్తున్నామని, మేనిఫెస్టో కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు.. ఇలా అనేక వర్గాల వారు తమ సమస్యలను ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు ప్రత్యేక సెల్‌కు చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. దూర ప్రాంతాల వాళ్లు krishnaysrcpoffice@gmail. com అనే మెయిల్‌కు తమ సూచనలు, సమస్యలను పంపవచ్చన్నారు. వాటిని మేనిఫెస్టో కమిటీ పరిగణలోనికి తీసుకుంటుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు, రాజధాని భూబాధితులకు జరిగిన అన్యాయాలనూ మేనిఫెస్టోలో పెడతామన్నారు. మేనిఫెస్టోలో హోదాకు చోటు విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, పాడి పరిశ్రమ అంశాలపై సబ్ కమిటీని ఏర్పాటుచేసి సమాచారం సేకరిస్తామన్నారు. మహిళా సంక్షేమం, వారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగుల సంక్షేమంపై సమగ్రంగా చర్చించి, తుదిరూపం ఇవ్వాలనుకుంటున్నట్టు ఉమ్మారెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కే పార్థసారథి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పీడిక రాజన్నదొర, షేక్ అంజద్‌బాషా, పాముల పుష్పశ్రీవాణి, ఆదిమూలపు సురేష్, తమ్మినేని సీతారాం, జంగా కృష్ణమూర్తి, ఆళ్ళూరు సాంబశివారెడ్డి, కురసాల కన్నబాబు, షేక్ మహ్మద్ ఇక్బాల్, ముదునూరు ప్రసాద్‌రాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్, ఎంవీఎస్ నాగిరెడ్డి, సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, నందిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్యం, ఉపాధికి పెద్దపీట విద్య, ఉపాధి రంగాలు తమ పార్టీకి అత్యంత ప్రాధాన్యమని ఆయన తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ కల్గించిన ప్రయోజనాలను స్ఫూర్తిగా తీసుకుని, ఈ పథకాన్ని బలోపేతం చేయాలని చూస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా చదువు పూర్తయిన వారికి వృత్తి నైపుణ్యం అందించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టరేట్‌ను పెట్టాలని భావిస్తున్నామన్నారు. అలాగే, పేదలకు అత్యంత ప్రధానమైన వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలుచేసిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలను మరింత మెరుగుగా ప్రజలకు అందించే అంశంపై చర్చించి, దాన్ని మేనిఫెస్టోలో పెడతామన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, మాజీ సైనికోద్యోగుల సమస్యలు కూడా సమీక్షిస్తున్నామన్నారు. కాగా, ప్రస్తుత ప్రభుత్వం తన వాళ్లకే ఇళ్లిచ్చి పేదలకు అన్యాయం చేస్తోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడికి ఇల్లు అందేలా చూస్తామని చెప్పారు. అంతేకాక, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, ప్రవాస భారతీయుల సమస్యలూ పరిగణలోనికి తీసుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ విధంగా మెరుగుపర్చుకోవాలి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా పెంచుకునే దిశగా కూడా మేనిఫెస్టో కమిటీ దృష్టి పెట్టిందని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. -
ఉమ్మరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు
-
వైఎస్సార్సీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు..
హైదరాబాద్: త్వరలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ తమ కార్యాచరణను మరింత ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా మేనిఫెస్టో కమిటీని తాజాగా ప్రకటించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 31 మందితో కూడిన మేనిఫెస్టో కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్సార్సీపీ మేనిఫెస్టో కమిటీని విడుదల చేశారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు.. 1. మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి 2. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3. ధర్మాన ప్రసాదరావు 4. బొత్స సత్యనారాయణ 5. కొలుసు పార్థసారథి 6. పిల్లి సుభాష్ చంద్రబోస్ 7. బుగ్గన రాజేంద్రనాథ్ 8. మోపిదేవి వెంకటర రమణ 9. కొడాని నాని 10. రాజన్న దొర 11.అంజద్ భాషా 12.పుష్ప శ్రీవాణి 13. ఆదిమూలపు సురేశ్ 14. దువ్వూరి కృష్ణ 15. సాంబశివారెడ్డి 16. కురసాల కన్నబాబు 17. ఇక్బాల్ 18. వెల్లంపల్లి శ్రీనివాస్ 19. ముదునూరి ప్రసాదరాజు 20. మేరుగ నాగార్జున 21. మర్రి రాజశేఖర్ 22. నాగిరెడ్డి 23. సంజీవ్ కుమార్ 24.రంగయ్య 25. కిష్టప్ప 26. సుచరిత 27.నందిగం సురేష్ 28.జంగా కృష్ణమూర్తి 29.తమ్మినేని సీతారాం 30. సజ్జల రామకృష్ణారెడ్డి