సేంద్రియ ధ్రువీకరణ నిబంధనల సడలింపు | Article On Organic Farming In Sakshi | Sakshi
Sakshi News home page

సేంద్రియ ధ్రువీకరణ నిబంధనల సడలింపు

Published Tue, Apr 9 2019 9:13 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Article On Organic Farming In Sakshi

సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ నిబంధనల అమలులో చిన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఏడాది పాటు సడలింపు లభించింది. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలను స్వయంగా పండించే చిన్న రైతులతోపాటు (రూ. 12 లక్షల లోపు వార్షిక టర్నోవర్‌ కలిగి ఉండే) రైతు ఉత్పత్తిదారుల కంపెనీల(ఎఫ్‌.పి.ఓ.లు)కు ఈ సడలిపం వర్తిస్తుంది. ఈ మేరకు సేంద్రియ సర్టిఫికేషన్‌ నియమ నిబంధనల అమలు గడువును, ఉత్పత్తులపై విధిగా ‘జైవిక్‌ భారత్‌’ లోగో ముద్రించాలన్న నిబంధనల గడువును 2020 ఏప్రిల్‌ 1 వరకు పొడిగిస్తూ భారతీయ ఆహారభద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ.) తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
 
దేశంలో అమ్ముడయ్యే సేంద్రియ ఆహారోత్పత్తులన్నీ సర్టిఫికేషన్‌ నిబంధనలకు లోబడి ఉండాలని ఎఫ్‌.ఎస్‌.ఎ.ఐ. నిర్దేశిస్తోంది. అంటే.. జాతీయ సేంద్రియ ఉత్పత్తుల పథకం (ఎన్‌.పి.ఓ.పి.) కింద గానీ, లేదా రైతు బృందాల (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం ఫర్‌ ఇండియా– పీజీఎస్‌ ఇండియా)తో కూడిన వ్యవస్థ ద్వారా గానీ సేంద్రియ సర్టిఫికేషన్‌ పొందాల్సి ఉంటుంది. చిన్నా పెద్దా సేంద్రియ రైతులు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు, చిన్న రైతుల నుంచి సేంద్రియ ఉత్పత్తులను సేకరించి చిల్లర వర్తకులకు అందించే వ్యాపార సంస్థల(అగ్రిగేటర్లత)కు కూడా సడలింపు వర్తిస్తుంది. సేంద్రియ సర్టిఫికేషన్‌ నియమ నిబంధనలను అమలు ప్రక్రియ తొలి దశలో ఉన్నందున రాష్ట్ర స్థాయి ఆహార భద్రతా అధికారులు కేసులు పెట్టకుండా 2020 ఏప్రిల్‌ 1 వరకు సడలింపు ఇవ్వాలని ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. ఆదేశించింది. ముఖ్యంగా స్వయంగా పంటలు పండించే చిన్న సేంద్రియ రైతులు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలకు సడలింపు ఇవ్వాలని పేర్కొంది.

సేంద్రియ పంటలను సాగు చేసే చిన్న రైతులు గానీ, ఏడాదికి రూ. 12 లక్షల కన్నా తక్కువ వార్షిక వ్యాపారం చేసే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌.పి.ఓ.) గానీ నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడానికి సేంద్రియ సర్టిఫికేషన్‌ పొందాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలని ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. పేర్కొంది. అయితే, నేరుగా వినియోగదారులకు కాకుండా ఇతర కంపెనీలకు, సంస్థల (అగ్రిగేటర్స్‌ లేదా ఇంటర్‌మీడియరీస్‌)కు తమ ఉత్పత్తులను అమ్ముకోవాలనుకుంటే సర్టిఫికేషన్‌ పొందాల్సిన అవసరం ఉంటుంది. ఆ గడువునే ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. ఇప్పుడు 2020 ఏప్రిల్‌ 1 వరకు పొడిగించింది.

అగ్రిగేటర్స్‌కూ ఊరట
సేంద్రియ ఉత్పత్తులను తక్కువ మొత్తంలో పండించే చిన్న రైతులు, ఎఫ్‌.పి.ఓ.లు తమంతట తామే ‘నేరుగా వినియోగదారులకు సరుకును అమ్ముకోవటం’లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందువల్ల వీరి నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను సేకరించి అమ్ముకునే ఇతర కంపెనీలు, సంస్థల (అగ్రిగేటర్స్‌ లేదా ఇంటర్‌మీడియరీస్‌)కు కూడా సేంద్రియ సర్టిఫికేషన్‌ నిబంధనల నుంచి సడలింపు ఇస్తూ ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వార్షిక వ్యాపారం రూ. 50 లక్షల లోపు ఉండే అగ్రిగేటర్స్‌ లేదా ఇంటర్‌మీడియరీస్‌ సంస్థలు కూడా సేంద్రియ ధ్రువీకరణ పొందాల్సిన అవసరం లేదని ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. స్పష్టం చేసింది.

 ‘కొద్ది విస్తీర్ణంలో సేంద్రియ పంటలు పండించే చిన్న రైతులతోపాటు చిన్న ఎఫ్‌.పి.ఓ. సంస్థలు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీరు ఇప్పటి వరకు సేంద్రియ ధృవీకరణ తీసుకోలేదు. తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడంలో వీళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి విజ్ఞాపనల మేరకు పిజిఎస్‌–ఇండియా సేంద్రియ ధృవీకరణ ప్రక్రియను చిన్న రైతులకు మరింత సానుకూలంగా మార్చుతున్నాం’ అని ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. తెలిపింది.

అయితే, ఈ వెసులుబాటు సేంద్రియ ఆహారోత్పత్తులను విక్రయించే రిటైల్‌ కంపెనీలకు వర్తించదని ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. స్పష్టం చేసింది. సేంద్రియ రైతులు పండించే ఆహారోత్పత్తుల్లో రసాయనాల అవశేషాల మోతాదు చట్ట నిబంధనలకు లోబడే ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆహార భద్రతా అధికారులకు ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. సూచించింది.  మన దేశంలో సేంద్రియ ఆహారోత్పత్తి, విక్రయాలను క్రమబద్ధం చేసే ప్రక్రియ 2017 డిసెంబర్‌లో ప్రారంభమైంది. 2018 జూలై 1 నాటికల్లా కొత్త సర్టిఫికేషన్‌ నిబంధనలను పాటించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆహార వ్యాపారులు, సేంద్రియ ఉత్పత్తిదారులు / ఆహార శుద్ధి పరిశ్రమదారులు 2018 సెప్టెంబర్‌ 30 లోగా సంబంధిత లైసెన్సులు పొందాలి. 2019 ఏప్రిల్‌ 1 నాటికి సేంద్రియ ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘జైవిక్‌ భారత్‌’ ముద్రను అచ్చువేయాలని ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. గతంలో నిర్దేశించిన సంగతి తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement