
సాక్షి, అమరావతి: నవరత్నాలు, వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని అంశాలతో పాటు అభివృద్ధి, ఆస్తుల కల్పనే లక్ష్యంగా 2021–22 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మౌలిక సదుపాయాలు కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు పారిశ్రామికీకరణ వేగవంతానికి బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయానికి ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈసారి బడ్జెట్‌లో మహిళా సాధికారత, పిల్లల సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. వ్యవసాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు సవరణలపై ఆర్ధిక శాఖ అన్ని శాఖలకు మార్గదర్శకాలిచ్చింది. బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ మంగళవారం నుంచి ప్రాథమిక కసరత్తు ప్రారంభించారు. సంక్షేమ, అభివృద్ధి పనులకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. నిర్వహణ వ్యయం వీలైనంత మేర కట్టడి చేయడంలో భాగంగా రంగాల వారీగా సమీక్షించాలని నిర్ణయించింది.
గంపగుత్త కేటాయింపులొద్దు
► వచ్చే బడ్జెట్‌లో శాఖల వారీగా గంపగుత్త కేటాయింపులకు స్వస్తి పలకాలి. ఏ శాఖలో.. ఏ రంగానికి, ఏ విభాగానికి ఎన్ని నిధులు అవసరమో ప్రత్యేక పద్దుల ద్వారా ప్రతిపాదనలు చేయాలని, అలాగే లింగ నిష్పత్తి మేరకు మహిళలకు కేటాయింపులు చేయాలని ఆర్థిక శాఖ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
ప్రభుత్వ లక్ష్యాలు..
► గృహ నిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రహదారులు, రవాణా రంగాల్లో మౌలిక వసతుల కల్పన
► పారిశ్రామికీకరణ ద్వారా ఆర్ధిక వ్యవస్థను మెరుగు పరచాలి.
► కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర అభివృద్ధి పథకాలు, విదేశీ ఆర్ధిక సాయం పథకాలు తదితరాల కేటాయింపులకు ప్రాధాన్యం.
► నవరత్నాలు, మేనిఫెస్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలు, వ్యవసాయ బడ్జెట్‌కు ప్రాధాన్యం.