కట్టె పొంగల్‌, ఆవ పులిహోర | Dussehra Festival Special Dishes | Sakshi
Sakshi News home page

అమ్మకు ఆరగింపు

Published Sun, Oct 25 2020 8:02 AM | Last Updated on Sun, Oct 25 2020 8:21 AM

Dussehra Festival Special Dishes - Sakshi

శరన్నవరాత్రోత్సవం ముగిసింది. దుష్టరాక్షసులపై దుర్గమ్మ సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే విజయ దశమి వచ్చేసింది. కనీసం ఇవ్వాళ అయినా రోజూ తినే రకాలకు కాస్తంత భిన్నంగా ఆలోచించి, కొత్తరకం వంటలను మీరే మరింత రుచిగా శుచిగా వండి అమ్మకు తినిపించండి. అన్నట్లు ఇవేమీ కొత్త వంటలు కాదు... తయారీ మాత్రమే కొత్త. అదీ మీరు తయారు చేయడం ఇంకా కొత్త. మీకు చేతకాకపోతే అమ్మకు సాయం చేయండి చాలు... ఆనందంగా ఆరగిస్తుంది. మీరే అమ్మ స్థానంలో ఉన్నారా... మరీ మంచిది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ అయిన ఆ ఆదిపరాశక్తి... జగజ్జననికి ఘాటైన ఆవ పులిహోర, మిరియాలతో చేసిన నేతి దద్ధ్యోదనం, ఘుమ ఘుమలాడే కట్టె పొంగలి, కరకరలాడే జిలేబీ, కమ్మగా కరిగిపోయే పేణీలడ్డు, గొంతులోకి గుమ్ముగా జారిపోయే పేణీ పాయసం వండి ఆరగింపు పెట్టండి. మీరు పెట్టిన నైవేద్యాలన్నీ ఆనందంగా ఆరగించి విజయోస్తు అని దీవిస్తుంది. 

దద్ధ్యోదనం
కావలసినవి: బియ్యం – రెండు కప్పులు; అల్లం – చిన్న ముక్క; పచ్చి మిర్చి – 10; ఎండు మిర్చి – 5; సెనగ పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; దానిమ్మ గింజలు – టేబుల్‌ స్పూను; చిన్న ద్రాక్ష లేదా కిస్‌మిస్‌ ద్రాక్ష – కప్పు; చెర్రీ ముక్కలు – టీ స్పూను; టూటీ ఫ్రూటీ ముక్కలు – టీ స్పూను; జీడి పప్పులు – 10; నెయ్యి – టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత
తయారీ: ∙ముందుగా బియ్యం కడిగి నీళ్లు ఒంపేసి, ఐదు కప్పుల నీరు జత చేసి ఉడికించాలి∙ అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా దంచి పక్కన ఉంచాలి∙ బాణలిలో నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి∙ ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి, అందులో వేయించిన పోపు సామాను వేసి బాగా కలపాలి∙ తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలపాలి∙ చివరగా దానిమ్మ గింజలు, దానిమ్మ గింజలు చిన్న ద్రాక్ష లేదా కిస్‌మిస్‌ ద్రాక్ష, చెర్రీ ముక్కలు, టూటీ ఫ్రూటీ ముక్కలు, జీడి పప్పులు వేసి బాగా కలపాలి∙ పుల్లగా ఉండే నిమ్మకాయ ఊరగాయతో అందిస్తే ప్రసాదాన్ని కూడా అన్నంలా తినేస్తారు.

కట్టె పొంగల్‌
కావలసినవి: బియ్యం – ముప్పావు కప్పు; పెసరపప్పు – పావు కప్పు; మిరియాల పొడి – టీ స్పూను; అల్లం తురుము – టీ స్పూను; పచ్చిమిర్చి – 4; జీలకర్ర – టీస్పూను; జీడిపప్పు – 10; కరివేపాకు – 2 రెమ్మలు; నెయ్యి – 5 టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత.
తయారీ: ∙బియ్యం, పెసర పప్పులను శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి దించేయాలి∙ పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేయాలి∙ బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్ది సేపు వేయించాలి∙ జీడిపప్పు పలుకులు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి∙ కరివేపాకు, మిరియాల పొడి, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించి దించేయాలి∙ అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి కలియబెట్టాలి∙ చట్నీ, సాంబారుతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.


ఆవ పులిహోర

కావలసినవి: బియ్యం – కప్పు; చింతపండు – పెద్ద నిమ్మకాయంత; బెల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఆవాలు – టీ స్పూను; ఉప్పు – తగినంత; నువ్వుల నూనె – టేబుల్‌ స్పూను; ఆవాలు – టీ స్పూను; పల్లీలు – గుప్పెడు; పచ్చి సెనగపప్పు – టేబుల్‌ స్పూను; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; నువ్వు పప్పు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 5; పచ్చి మిర్చి – 5; పసుపు – అర టీ స్పూను; కరివేపాకు – 4 రెమ్మలు; ఇంగువ – చిటికెడు; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు.
తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి రెండు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి, వెంటనే పెద్ద పాత్రలోకి తిరగబోసి, టేబుల్‌ స్పూను నువ్వుల నూనె వేసి కలపాలి∙ చింతపండును నీళ్లలో నానబెట్టి గుజ్జు తీసి పక్కన ఉంచాలి∙ బాణలిలో ఆవాలు వేసి చిటపటలాడే వరకు వేయించి, తీసి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి∙ బాణలిలో పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచాలి∙ బాణలిలో నూనె వేసి కాగాక, సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి వరసగా వేసి వేయించాలి. కరివేపాకు జత చేసి బాగా కలిపాక, నువ్వు పప్పు,  ఇంగువ, పసుపు వేసి కొద్దిగా వేయించాలి∙ చింతపండు గుజ్జు (టేబుల్‌ స్పూను గుజ్జు పక్కన ఉంచి, మిగతా భాగం మాత్రమే ఉపయోగించాలి), బెల్లం తురుము వేసి బాగా కలిపి ఉడికించి దించేయాలి∙ పాత్రలో ఉన్న అన్నం మీద చింతపండు గుజ్జు, ఆవ పొడి వేసి కలపాలి. ఉడికించిన చింతపండు + పోపు మిశ్రమం, ఉప్పు వేసి కలియబెట్టాలి. సుమారు గంటసేపు బాగా ఊరిన తర్వాత వడ్డించాలి.


పేణీ లడ్డు
కావలసినవి: సెనగపిండి – కప్పు; పేణీ – కప్పు; పంచదార – ముప్పావు కప్పు; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; డ్రై ఫ్రూట్‌ పొడి – 2 టేబుల్‌ స్పూన్లు.
తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి, సన్నని మంట మీద వేడి చేసి,సెనగపిండి వేసి పచ్చి వాసన పోయి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపి చల్లారనివ్వాలి∙ మిక్సీలో పంచదార, పేణీలు వేసి రవ్వలా చే సి, ఈ మిశ్రమాన్ని సెనగపిండి ఉన్న పాత్రలో వేయాలి∙ డ్రైఫ్రూట్‌ పొడి జత చేయాలి∙ కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ లడ్డూ కట్టాలి.

జిలేబీ
కావలసినవి: మైదా పిండి – కప్పు; బేకింగ్‌ పౌడర్‌ – అర టీ స్పూను; పెరుగు – కప్పు; నూనె – వేయించడానికి తగినంత; పంచదార – కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు; ఏలకుల పొడి – పావు టీస్పూను; మిఠాయి రంగు – రెండు చుక్కలు; రోజ్‌ వాటర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు.
తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్‌ పౌడర్, పెరుగు వేసి బాగా కలిపి ఒక రోజంతా నాననివ్వాలి∙ ఈ మిశ్రమాన్ని మూతకు రంధ్రం ఉన్న మ్యాగీ సీసాలో పోయాలి∙ ఒక పాత్రలో పంచదార, నీళ్లు, రోజ్‌ వాటర్‌ వేసి స్టౌ మీద ఉంచి పంచదార తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేసి, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి∙ బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. మంట మధ్యస్థంగా ఉంచాలి∙ పిండి ఉన్న సీసాను తీసుకుని జిలే బీ ఆకారం వచ్చేలా నూనెలో తిప్పాలి∙ బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి వెంటనే పంచదార పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి∙ వేడివేడిగా అందించాలి.

కదంబం
కావలసినవి: కందిపప్పు – పావు కప్పు; బెల్లం – 3 టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర – చిన్న కట్ట; చింతపండు గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్లు; సాంబారు పొడి – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; చిలగడదుంప ముక్కలు – అర కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 6 (పొడవుగా మధ్యకు చీల్చాలి); మునగకాడ ముక్కలు – కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; దొండకాయ ముక్కలు – పావు కప్పు; అరటికాయ ముక్కలు – పావు కప్పు; తీపి గుమ్మడికాయ ముక్కలు – కప్పు; 
సొరకాయ ముక్కలు – అర కప్పు; సెనగపిండి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; కారం – 2 టీ స్పూన్లు.
పోపు కోసం: ఆవాలు  – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 10; సెనగపప్పు – టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా.
తయారీ: ∙పప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్‌ వచ్చాక దించి, చల్లారాక మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి∙ ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, పచ్చి మిర్చి, చింతపండు గుజ్జు, నీళ్లు, ఉప్పు, పసుపు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి∙ మెత్తగా మెదిపిన పప్పు వేసి బాగా కలిపి, బెల్లం తురుము జత చేయాలి∙ సాంబారు పొడి, కారం వేసి కాసేపు ఉడికించాలి∙ కొద్దిగా నీళ్లలో సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న దప్పళంలో వేసి కలపాలి∙ ఈలోగా పక్కన చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సెనగపప్పు, మెంతులు, ఇంగువ వేసి వేయించి, మరుగుతున్న దప్పళంలో వేసి బాగా కలిపి కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి.

పేణీ పాయసం
కావలసినవి: పేణీలు – పావు కేజీ; పాలు – అర లీటరు; బెల్లం పొడి – పావు కేజీ; డ్రై ఫ్రూట్స్‌ పొడి – అర కప్పు; తేనె – ఒక టేబుల్‌ స్పూను.
తయారీ: ∙పాలు ఒక గిన్నెలో పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి∙ బెల్లం పొడి జత చేసి ఐదు నిమిషాలు పాటు ఉడకవ్వాలి∙ డ్రై ఫ్రూట్‌ పొడి వేసి కలపాలి∙ ఒక పాత్రలో పేణీ వేసి అందులో పాలు బెల్లం మిశ్రమం వేయాలి∙ డ్రై ఫ్రూట్‌ పొడి వేసి, తేనె వేసి బాగా కలిపి అందించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement