సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి
ఎమ్మిగనూరు/రూరల్: అమలు సాధ్యమవ్వని హామీలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు.... ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నేత ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రశ్నించారు. నాలుగేళ్లు బీజేపీతో దోస్తి కట్టిన సీఎం... విభజన చట్టం హామీలను పట్టించుకోకుండా నేడు కేంద్ర ప్రభుత్నాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు... ఏంటీ డ్రామాలు అని ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక కుర్ని కల్యాణ మంఠపంలో నియోజకవర్గ ఇంచార్జ్ కే జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బూత్‌కమిటీ కన్వీనర్ల సమావేశం జరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రుద్రగౌడ్, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారని, రూ.16వేల కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.53వేల కోట్లకు పెంచి దోపిడీకి తెగడ్డారని ఆరోపించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు మూటగట్టుకునేందుకు ప్రధాని మోడీతో ప్రత్యేకప్యాకేజీకి ఒప్పందం కుదుర్చుకున్నారని, ప్రజా వ్యతిరేకతను గుర్తించి ప్రత్యేక హోదా అంటూ డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. రాష్ట్ర స్థాయిలోనే కాదు... గ్రామ స్థాయిలోనూ జన్మభూమి కమిటీలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయన్నారు. నీరు–చెట్టు, ఇసుక అమ్మకాలు పేరుతో ప్రజాధనాన్ని దోచుకొంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం మభ్యపెట్టే చర్యలు విడనాడాలని, లేని పక్షంలో ప్రజల తిరుగుబాటు చవిచూస్తారని హెచ్చరించారు.
నవరత్నాల ప్రయోజనాలు వివరించండి
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాల ప్రయోజనాలను బూత్ కమిటీ సభ్యులు వివరించాలని చెన్నకేశవరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి సామాజికవర్గానికి, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేవిధంగా అధినేత నవరత్నాల పథకాలు రూపొందించారనే విషయాన్ని ప్రజలకు విశదీకరించాలని చెప్పారు. 45సంవత్సరాలకే రూ.2000ఫించన్, అన్నిరోగాలకు ఆరోగ్యశ్రీ తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్ కమిటీ కన్వీనర్లదేనని చెప్పారు. పల్లెల్లో కొందరు పోలీసుల సహకారంతో టీడీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని, ఫలితం చవిచూస్తారని హెచ్చరించారు. టీడీపీ దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదని, అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment