ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల సుడిగుండంలో ఉందని ఒక విమర్శ ఉంది. దీనికి కారణం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న∙సంక్షేమ పథకాలు అనీ, రాష్ట్రం దివాలా తీసే దిశలోకి ప్రయాణిస్తోందనీ అభిప్రాయాలూ వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్ అప్పు ప్రమాదపు అంచుకి చేరిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్న అప్పులను ఎలా అర్థం చేసుకోవాలి?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతానికి ఆంధ్ర ప్రదేశ్ అప్పు మార్చ్ 2022 నాటికి 3.98 లక్షల కోట్ల రూపాయలు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 32.51 శాతంగా ఉంది. మరి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది ఎక్కువ ఏమి కాదు. ఉదాహరణకి, ఈ అప్పు పంజాబులో 53.3 శాతంగా, రాజస్థాన్‌లో 39.5 శాతంగా, బీహార్‌లో 38.7 శాతంగా, కేరళలో 37.2 శాతంగా, పశ్చిమ బెంగాల్‌లో 34.2 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ది ఏడవ స్థానం. ఈ అప్పు కేంద్రానికి 60 శాతంగా ఉంది. ఇది అభివృద్ధి చెందిన దేశాల అప్పుతో పోలిస్తే చాలా తక్కువే. కానీ ఎఫ్‌ఆర్‌బీఎమ్ చట్టంలో కేంద్రం 40 శాతం, రాష్ట్రాలు 20 శాతంగా... మొత్తం దేశం అప్పు 60 శాతం మించొద్దని పేర్కొన్నారు. ఈ అరవై శాతం పరిమితికి సైద్ధాంతిక ప్రాతి పదిక ఏమీ లేదు. పైగా ఎవరూ ఈ పరిమితిని పాటించలేక పోతున్నారన్నది కూడా వాస్తవం.
ప్రభుత్వం చేసే అప్పులు ఎంత దాకా సుస్థిరమో చెప్పే మూడు సూత్రాలు ఆర్థిక శాస్త్రంలో ఉన్నాయి. అవి ఏమిటంటే: ఒకటి– రాష్ట్రం అప్పు మీద చెల్లించే వడ్డీ రేట్ల కంటే రాష్ట్ర ఆదాయ రేటు ఎక్కువగా ఉన్నన్నాళ్ళు ప్రభుత్వ అప్పు అనేది కొనసాగించవచ్చు అనేది. ఇక రెండవ సూత్రం– దీర్ఘ కాలిక అప్పును వడ్డీ రేటు పెట్టి డిస్కౌంట్ చేసిన తర్వాత ఆ అప్పు స్థిరంగా ఉంటే, అలాంటి అప్పు ఫరవాలేదు. మూడవది– వడ్డీ వాయిదాలు తీసివేసిన తరవాత మిగిలే ప్రాథమిక అప్పు కాలక్రమేణా స్థిరంగా ఉంటే, ఆ అప్పు కూడా ఫరవా లేదు.
ఈ సూత్రాల ఆధారంగా చెప్పేది ఏమిటంటే... ఆంధ్ర ప్రదేశ్ అప్పు మొదటి రెండు టెస్టులు సునాయాసంగా పాస్ అయ్యి, మూడవ టెస్టు కొంచెం కష్టంగా పాస్ అవుతోంది. కానీ అప్పుల ఊబి అంచున ఉందన్న వాదనకు మాత్రం ఏమీ ఆధారం లేదు. కొందరు శ్రీలంకతోటి పోల్చి అలాంటి సంక్షోభం వస్తుందా అని అడుగుతున్నారు. అయితే విదేశీ అప్పు, అంతర్గత అప్పు రెండూ వేరు వేరు విషయాలు. కేంద్రం అప్పు, రాష్ట్రం అప్పు కూడా వేరు వేరు విషయాలే. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రమాదభరితంగా అప్పులు చేసింది అన్నదానికి సైద్ధాంతిక ఆధారాలు లేవు.
అనేక సోషల్ మాధ్యమాలలో కొంతమంది మేధావులు చేసే ఆరోపణ ఏమిటంటే ఉచితాలు ఎక్కువగా ఇవ్వడం వలన ప్రభుత్వ ఖర్చు పెరిగి, అప్పుల భారం పెరిగిందని! ఇది చాలా అభ్యంతరకర వాదన. ఆధునిక సమాజంలో అన్ని వర్గాలకూ విద్య, వసతి, ఆరోగ్యం, జీవనోపాధి, ఇతర మౌలిక సదుపాయాలు అందించడం ప్రభుత్వాల బాధ్యత. వైస్సార్‌సీపీ ప్రభుత్వం ఏ కారణం వల్ల ఇచ్చినా అది సమర్థ నీయమే.
‘నవరత్నాలు’ అని చెప్పే సంక్షేమ పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకు గణనీయమైన ధన సహాయమే చేస్తోంది. విద్య మీద ఖర్చు 2019 –20లో రాష్ట్ర జీడీపీలో ఒకేసారి 2.71 శాతానికి పెంచారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంక్షేమం... ఎన్నడూ లేని విధంగా చివరి మూడేళ్లలో 2.24, 2.21, 2.11 శాతంగా ఉన్నాయి. ఇంకా ఆర్థిక సేవా విభాగ వ్యయం చివరి రెండేళ్లలో అత్యధికంగా 3.71, 3.55 శాతంగా ఉన్నాయి. ఆ విధంగా రాష్ట్రం మిలీనియం సస్టయినబుల్ గోల్స్ అందుకోవడా నికి ఇవి అవసరమే. మరో పక్క, మూల ధన వ్యయం చివరి మూడేళ్లలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జీఎస్‌డీపీ)లో 1.27, 1.87, 1.54 శాతాలతో కావాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ఆర్థిక పరిస్థితుల సుస్థిరత కోసం నిధుల్ని మూల ధన వ్యయానికి మరల్చడం అవసరం. అది చేయకపోతే రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు మందగించడం, దరిమిలా రాష్ట్ర ఆదాయం పెరగక పోవడం జరగవచ్చు. ఆదాయం పెరగక పొతే పథకాల అమలు ప్రమాదంలో పడవచ్చు. దీనికి సంక్షేమ పథకాలను తప్పు పట్టి ఎవరూ ఏమీ చెయ్యలేరు.
పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి ఫలాలు అందరికీ చేరవు కాబట్టి ప్రభుత్వాలు అప్పు చేసైనా అల్పాదాయ వర్గాల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సి ఉంది. అప్పుల పెరుగుదలకు తగ్గ ఆదాయ సామర్థ్యం పెంచుకోవడం రాష్ట్రాలకు అవసరం. కానీ జీఎస్టీ విధానం తర్వాత రాష్ట్రాలు తమ స్వేచ్ఛను అనూహ్యంగా కోల్పోయాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం తన ఖర్చుల కోసం సెస్సులు విధించి, రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో మోసం చేస్తోంది. 15వ ఫైనాన్స్ కమిషన్, రిజర్వ్ బ్యాంకు వాళ్ళ నివేదికలలో కూడా దీని ప్రస్తావన ఉంది.
గత ఏడేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ సగటు నిజ ఆర్థిక వృద్ధి రేటు 7.76గా ఉంది. ఇది దేశ జీడీపీ రేటు 5.08తో పోలిస్తే మెరుగ్గానే ఉంది. ఇక నామినల్ వడ్డీ రేటు 15 నుండి 18 శాతం మధ్య ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందనడం అవాస్తవం. రాష్ట్ర రెవెన్యూ ఆదాయం, రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో కూడా రాష్ట్ర పరిస్థితి బాగానే ఉంది. రాష్ట్ర ఆదాయ సామర్థ్యం గణనీయంగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి పన్ను విధింపు అధికారాలు పరిమితం చేయడం వల్ల పెరిగిన ఖర్చును ఆదాయం ద్వారా అందుకోలేక పోతోంది. కేంద్రం... రాష్ట్రాలకు సరైన గ్రాంట్లు ఆలస్యం చేయకుండా ఇవ్వడం, కేంద్ర–రాష్ట్ర పన్నుల జాబితాలను సవరణ చేసి రాష్ట్రాలకు అదనపు పన్నులు విధించుకునే అధికారాలు ఇవ్వడం ఇందుకు పరిష్కార మార్గాలు.
– శివదుర్గా రావు, రీసర్చ్ స్కాలర్,
– రమణ మూర్తి, ఆర్థిక శాస్త్ర ఆచార్యులు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
Comments
Please login to add a commentAdd a comment