
సాక్షి, హైదరాబాద్ : దసరా ఉత్సవాల్లోకి హిందూయేతర వర్గాలకు చెందిన వారు ప్రవేశించకుండా ప్రవేశ ద్వారాల్లో ఆధార్ కార్డులు చెక్ చేయాలని గర్బా, దాండియా నిర్వాహకులకు బజరంగ్‌దళ్ సూచించింది. వేడుకలు జరిగే ప్రాంతాల్లో ఇతర మతస్తులు పాల్గొనకుండా ఆయా ఎంట్రీ పాయింట్లలో ఆధార్ కార్డులు తనిఖీ చేయాలని, ఈ వేడుకలకు హిందువేతరులను బౌన్సర్లుగా నియమించుకోరాదని బజరంగ్‌దళ్ మీడియా కన్వీనర్ ఎస్ కైలాష్ కోరారు.
గత కొన్నేళ్లుగా దసరా వేడుకల్లో హిందూయేతర వర్గాలకు చెందిన కొందరు యువకులు చొరబడి, దాండియా, గర్బాలో పాల్గొనే మహిళల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించిన ఘటనలు చోటుచేసుకున్నాయని, బాధితుల పక్షాన నిలిచిన పురుషులపైనా వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు. హిందూయేతర బౌన్సర్లను నిర్వాహకులు నియమించుకోవడంతో దుండగులు ఈ కార్యక్రమాల్లోకి వచ్చేందుకు దోహదపడుతోందని గుర్తించామని అన్నారు. దసరా వేడుకలు జరిగే వేదికల వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు ఉంటారని, ఇలాంటి ఉదంతాలు తమ దృష్టికి తీసుకువస్తే కార్యక్రమాలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అడ్డుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment