శరన్నవరాత్రులు..తొలిరోజు బాలాత్రిపుర సుందరిగా.. | Dussehra 2024: Bala Tripurasundari Devi Alankaram On 1st Day Of Navratri | Sakshi
Sakshi News home page

శరన్నవరాత్రులు..తొలిరోజు బాలాత్రిపుర సుందరిగా..

Published Wed, Oct 2 2024 4:50 PM | Last Updated on Thu, Oct 3 2024 6:26 AM

Dussehra 2024: Bala Tripurasundari Devi Alankaram On 1st Day Of Navratri

త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ముఖ్యంగా వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఈ ఆశ్వయుజం. జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారాలను ధరించిన మాసం...ఇవాళ నుంచే దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి మహిళలు, భవాని భక్తులు, నియమ నిష్టలతో అమ్మవారిని ఆరాధించటం ప్రారంభిస్తారు. తొలిరోజు నుంచి మొదలు పెట్టి చివరి రోజు వరకు అమ్మవారిని వివిధ అలంకారాలతో కొలుచుకుంటారు. ఆ క్రమంలో తొలిరోజు అమ్మవారు ఏ రూపంలో భక్తులకు ధర్శనమివ్వనుంది, ఏ నైవేద్యం నివేదిస్తారో చూద్దామా..!

అమ్మవారిని బుధవారం అక్టోబర్‌ 03న సుమహుర్తంలో నవరాత్రలు పూజలందుకోమని స్వాగతం పలుకుతూ కలశస్థాపన చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి అమ్మవారిని రోజుకో అవతారం రూపంలో అలంకరణ చేసి భక్తితో ఆరాధిస్తారు. ఇంట్లో పూజ చేసుకునే వాళ్లు ఎవరైనా కలశస్థాపన సమయం ఉదయం 4:16 ని॥ లకు ఒకవేళ ఆ సమయానికి చేయలేకపోతే, 8 గంటలలోపు కలశ స్థాపన చేయాలి. అప్పుడే ఆఖండ దీపం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజులు ఎవరీ శక్తిసామర్థ్యాల మేరకు వారు వివిధ స్తోత్ర పారాయణాదులతో అమ్మవారిని ఆరాధించి అనుగ్రహం పొందే ప్రయత్నం చేస్తుంటారు

తొలిరోజు..
తొలి రోజు ఆయా ప్రాంతాల వారీగా అమ్మవారిని అలంకరించి ఆరాధించడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను తొలిరోజు బాలా త్రిపురసుందరీగా అలంకారిస్తారు. ఈ అమ్మ దర్శనం కోసం లక్షలాది భక్తులు బారులు తీరి ఉంటారు. ఈ అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే..

సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది. విద్యోపాసకులకు మొట్టమొదటగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. 

ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెపుతున్నాయి. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి.నైవేద్యంగా కట్టుపొంగలి లేదా పులగం నివేదిస్తారు.


మరి కొన్నిచోట్ల తొలిరోజు పాఢ్యమి తిథి పురస్కరించుకుని అమ్వవారిని శైలపుత్రిగా లేదా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఆరాధిస్తారు.


శ్లోకం:  వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!
     వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్‌!!..

నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement