శరన్నవరాత్రులు..ఆరో రోజు మహాలక్ష్మీగా అలంకారం.. | Dussehra 2024: Navaratri On Sixth Day MahaLakshmi Alankaram | Sakshi
Sakshi News home page

శరన్నవరాత్రులు..ఆరో రోజు మహాలక్ష్మీగా అలంకారం..

Published Mon, Oct 7 2024 5:33 PM | Last Updated on Tue, Oct 8 2024 1:13 PM

Dussehra 2024: Navaratri On Sixth Day MahaLakshmi Alankaram

శరన్నవరాత్రుల్లో ఊరు, వాడ, అమ్మవారి ఆరాధనలతో ఒక్కసారిగా ఆధ్యాత్మిక ప్రదేశాలు మారిపోతాయి. అప్పుడే నవరాత్రుల వేడుకులు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఈ ఆరో రోజు అమ్మవారు 'శ్రీ మహాలక్ష్మీ దేవి'గా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి స్వరూపంలో ఇరువైపులా గజ రాజులు ఉండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయ ముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, మరొక హస్తంతో కనకధార కురిపిస్తూ.. తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతులలో ఈమె మధ్య శక్తి.

మంగళ ప్రదాయిని
ఆదిపరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమిత పరాక్రమంతో మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషాసురమర్దినిగా పూజలందుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మీగా భక్తులు పూజిస్తారు.

శ్లోకం: "యాదేవి సర్వ భూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా"! అని స్తుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. అలాగే..

"నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే 
శంఖ చక్ర గదా హస్తే! మహాలక్ష్మి నమోస్తుతే" 

అంటూ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. అలాగే ఈ రోజు అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.

మరోవైపు ఆరోరోజు పలుచోట్ల దుర్గమ్మని కాత్యాయనీ దేవిగా ఆరాధిస్తారు. ఈమెను హృదయపూర్వకంగా ఆరాధిస్తే అన్ని రోగాలు, దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు కాత్యాయని దేవి ఆరాధన చేయడం వలన వివాహం కానీ యువతులు కోరుకున్న వరుడిని పొందుతారని పురాణ వచనం.

దుర్గామాత ఆరో రూపమే కాత్యాయని.  కాత్యాయన మహర్షి పార్వతీమాత తన కుమర్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చి కూతురుగా జన్మించింది. అందువల్లే దుర్గామాతకు కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. ఆమెనే ఈ కాత్యాయని దేవి. ఈమెను మొట్టమొదటగా కాత్యాయన మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.

నైవేద్యం: పరమాన్నం, అప్పాలు, బూరెలు

(చదవండి: దసరాలో తప్పక చూడాల్సిన ప్యాలెస్‌ ఇది..!)
 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement