
సాక్షి, కృష్ణా: ఓటమి భయంతోనే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కురిపించడం హాస్యాస్పదమన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడంలో టీడీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమయిందని మండిపడ్డారు.
పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి మోసానికి వడికట్టారని పార్థసారధి విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున బీసీలపై వరాల జల్లు కురిపిస్తూ కపట ప్రేమను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బీసీ కులానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనను టీటీడీ ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన దాడిలో కుట్రకోణం లేదని చెప్పడం విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించారు.