బాబోయ్‌ మహమ్మారి! | Ap govt put the wine shops church,school,widest extensive | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ మహమ్మారి!

Published Sun, Jan 6 2019 2:39 AM | Last Updated on Sun, Jan 6 2019 8:47 PM

Ap govt put the wine shops church,school,widest extensive - Sakshi

ఎవరైనా ఉన్నట్లుండి తిరిగి రాని లోకాలకు వెళితే ఏమంటాం? ఏ జబ్బు బారిన పడో మృతి చెందితే ఏమంటాం? మహమ్మారి మింగేసిందంటాం..ఇంకా దెయ్యం మింగిందంటాం. ఎన్నో మహమ్మారులు, దయ్యాలు మనుషుల్ని మింగేస్తున్నా, మనందరం చూస్తూనే ఉన్నాం కానీ అడ్డుకోము.. ప్రభుత్వాలూ అడ్డుకోవు.. పైగా కొన్ని మహమ్మారిలను ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయి. అందులో మద్యం అనే మహమ్మారిని పేద జనాల పైకి వదిలింది  ఈ ప్రభుత్వమే. ఈ మహమ్మారి రాష్ట్రంలో వేలాది పేదల కుటుంబాలను కకావికలు చేసింది.. చేస్తోంది. ఒళ్లు, ఇల్లు గుల్ల చేసి.. పీల్చి పిప్పి చేస్తోంది. ఈ మహమ్మారి ఆవహించినోళ్లు పెళ్లాం, పిల్లలని కూడా చూడకుండా చితకబాది డబ్బులు లాక్కెళ్లడం మామూలు విషయం. అడ్డుచెబితే కడతేర్చడానికి కూడా వెనుకాడనీయదు ఈ మహమ్మారి.ఈ మహమ్మారిని వదిలించండి మహాప్రభో అని లక్షలాది మందిపేద మహిళలు ఊరూ వాడా నెత్తీ నోరు బాదుకుంటున్నారు. 

అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌:బిహార్, గుజరాత్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో మద్య నిషేధం అమల్లో ఉంది. మద్యనిషేధాన్ని అమలు చేస్తూ బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌సత్ఫలితాలు సాధిస్తున్నారు. బెల్టు షాపుల నిషేధంపైనాలుగో సంతకం చేసిన చంద్రబాబు.. మూడేళ్లలోఏనాడైనా బెల్టుషాపుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారా? అంటే లేదనే సమాధానం వస్తుంది. ఈ నాలుగున్నరేళ్లలో గతం కంటే 50 శాతం బెల్టు షాపులు పెరిగాయి.మద్యపానం వల్ల ఎదురవుతున్న దుష్ఫలితాల్నివివరించేందుకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాకఒక్క పైసా ఖర్చు చేసిన దాఖలాల్లేవు. రాష్ట్రంలో ఎక్కడా డీ–అడిక్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మద్యంద్వారా వచ్చే ఆదాయం కోసం రహదారుల స్థాయితగ్గించి.. ప్రజల ప్రాణాల కన్నా మద్యం ఆదాయానికే చంద్రబాబు సర్కారు ప్రాధాన్యమిస్తోందన్న విమర్శలున్నాయి.

చంద్రబాబు అధికారంలోకొచ్చేసరికి రూ.11,569 వేల కోట్ల మేర అమ్మకాలుంటే.. ప్రస్తుతం రూ.17 వేల కోట్లకు పైగా ఎగబాకాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగిన దాడులు, బలాత్కారాలు అన్నీ మద్యం మత్తులో జరిగినవే కావడం గమనార్హం. ఇప్పుడున్న మద్యం దుకాణాలు,బార్లు చాలవన్నట్టు పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లలో బార్లు ఏర్పాటు చేసి రెడీ టూ డ్రింక్‌ పేరిట అమ్మకాలు సాగిస్తున్నారు. 
 

బీరు హెల్త్‌ డ్రింకట.. 
రాష్ట్రంలో తాగునీరు దొరకని గ్రామాలున్నాయిగానీ.. మద్యం దొరకని గ్రామాల్లేవు. చంద్రబాబు సర్కారు ఊరూరా, వీధి వీధినా మద్యం షాపుల్ని ఏర్పాటు చేసింది. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో బార్ల సంఖ్య పెంచి ప్రతి సగానికి సగం మందిని తాగుబోతుల్ని చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల పొడవునా పాలు, నీళ్లు దొరకడం లేదుగానీ.. మద్యం మాత్రం అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా దొరుకుతోంది. బీరును హెల్త్‌ డ్రింక్‌గా ప్రమోట్‌ చేస్తామని ఏకంగా అబ్కారీ మంత్రి ప్రకటించారంటే జనంతో మద్యం తాగించేందుకు ఈ పాలకులు ఎంతగా ఆరాట పడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మద్యం ఆదాయం కోసం పాకులాడుతూ ఆవాస ప్రాంతాలు, నివాస గృహాలు, గుడిపక్కన, బడిపక్కన.. చివరకు తినుబండారాలు అమ్మే దుకాణాల్లో సైతం బెల్టు షాపులను ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేయిస్తున్నారు. అధికారంలోకి రాగానే బెల్టు షాపుల్ని రద్దు చేస్తామని.. ప్రమాణ స్వీకారం రోజే నాలుగో సంతకం చేసిన సీఎం చంద్రబాబు బెల్టు షాపులపై సమీక్ష కూడా చేయలేదంటే ఎంతగా వీటిని ప్రోత్సహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మద్యం ఆదాయం పెంచుకునేందుకు మాత్రం సమీక్షలు చేసి.. ప్రజల్లో భక్తిభావం పెరిగి, స్వామిమాలలు ధరించడం వల్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయని సీఎం చంద్రబాబు గతంలో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా 1995లో చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. ఆ సమయంలోనే బెల్టు షాపులు వాడవాడలా వెలిశాయి.  

వైఎస్‌ హయాంలో ‘బెల్టు’ తీశారు 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకొచ్చాక గుంటూరు జిల్లా కొల్లిపరలో పల్లెబాట నిర్వహించారు. ఆ సమయంలో మహిళలు బెల్టు షాపుల వల్ల తామెదుర్కొంటున్న ఇబ్బందుల్ని వైఎస్‌కు ఏకరవు పెట్టారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్‌ అధికారులు బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపారు. బెల్టు షాపులు ఏర్పాటు చేసి పదే పదే పట్టుబడితే పీడీ యాక్టు పెడతామని హెచ్చరించడంతో మద్యం సిండికేట్లు బెల్టు షాపుల ఏర్పాటులో వెనక్కు తగ్గారు.  

మా కష్టం మాటలతో చెప్పలేం..
నా భర్త నెల్లి సత్యనారాయణ ఆకివీడులో ఓ రైస్‌ మిల్లు కార్మికుడు. మాకు ఇద్దరు పిల్లలు. అయితే నా భర్త మద్యానికి బానిసయ్యాడు. అదే మా కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. గతేడాది జూలైలో డ్యూటీ దిగాక పూటుగా మద్యం తాగి సైకిల్‌పై వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన నా భర్తను భీమవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి.. మెరుగైన చికిత్స కోసం ఆపై ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లాం. అయినా ప్రాణాలు కాపాడుకోలేకపోయాం. చికిత్స పొందుతూ మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయాడు. రెక్కాడితేగానీ డొక్కాడని పేద బతుకుల్లో మద్యం చిచ్చు పెడుతోంది. కుటుంబ సభ్యుల్ని మానసికంగా, ఆర్థికంగా నలిపేసి చివరకు ప్రాణాల్ని హరించేస్తోంది. మాకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తే.. ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. 
 –  నెల్లి అప్పాయమ్మ, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా  

మా బతుకులు ఇంత దయనీయంగా మారడానికి మద్యమే కారణం 
ప్రజల మాన, ప్రాణాల్ని, ఆరోగ్యాన్ని మద్యం మహమ్మారి కబళించివేస్తుందని తెలిసినా టార్గెట్‌ ఇచ్చి మరీ మద్యం అమ్మకాలు జరుపుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? వీధుల్లో, ఇళ్ల మధ్య, గుడి పక్కన, బడిపక్కన మద్యం అమ్మకాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే పనులు ఎవరు చేసినా చట్ట ప్రకారం శిక్షార్హులే. మరి ప్రజల ప్రాణాలు తోడేస్తున్న మద్యాన్ని అమ్ముతున్న ఈ ప్రభుత్వాన్ని ఎవరు శిక్షించాలి? నా తండ్రి మద్యం వల్లే చనిపోయాడు.. మద్యమే గనక లేకుంటే మా బతుకులు బాగుండేవి. నాన్న మరణంతో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో నన్ను నా మేనమామకిచ్చి వివాహం చేశారు. ఆయనకు మతిస్థిమితం లేకపోవడంతో నా తల్లి అప్పాయమ్మ దగ్గరే జీవనం గడుపుతున్నా. మా బతుకులు ఇంత దయనీయంగా మారడానికి మద్యమే కారణం.  
– స్వాతి, అప్పాయమ్మ కుమార్తె, ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా 




మద్యపాన నిషేధంతోనే గ్రామాల్లో వెలుగు రేఖలు 
మద్యపాన నిషేధం అమలైతేనే గ్రామాల్లో ప్రజల జీవన విధానం మెరుగు పడుతుంది. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువ శాతం మంది మద్యం బారిన పడి వ్యసనాన్ని మానుకోలేక జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ముఖ్యంగా 1990వ దశకంలో నాటి గ్రామీణ వాతావరణంలో 90 శాతం మంది పురుషులు మద్యంకు బానిసలుగా ఉండి కుటుంబాలను రోడ్డున పడేసేవారు. ఈ క్రమంలో కూలీ పనులు చేసి వచ్చిన రూపాయిని కూడ మద్యంకే ధారపోయటంతో పాటు అనేక మంది మృత్యువాత పడిన ఘటనలు నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మను చలింపజేశాయి. అదే ఆమె సారా వ్యతిరేక పోరాటానికి నాంది పలికేలా చేసింది. రోశమ్మ పోరాటం ఫలితంగా గ్రామంలో వైన్‌ షాపు ఏర్పాటు చేయనప్పటికీ మహిళల స్ఫూర్తికి విరుద్ధంగా మూడు బెల్ట్‌షాపులున్నాయి.

మద్యం వ్యతిరేక ఉద్యమకారిణిగా అందరికీ సుపరిచితురాలు. 1991లో స్థానిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసిన కొలిక మీరయ్య గ్రామస్తులతో చర్చించి మద్యం వల్ల జరిగే అనార్ధాలను వివరించారు. మధ్యం వల్ల జరుగుతున్న అనార్ధాలపై అవగాహన పొందిన రోశమ్మ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు మహిళలు, యువకులు 1991వ ఏప్రిల్‌ 20 వ తేదీన కల్లు, సారాయి దుకాణాలపై దాడులు జరిపి సారా రవాణా వాహనాలను అడ్డుకున్నారు అలా దూబగుంటలో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. వీరికి పలువురు నాయకులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు పలికాయి.  
- కలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామానికి చెందిన వర్ధినేని రోశమ్మ

మద్యాన్ని నిషేధించే వారికే ఓటెయ్యాలి 
మద్యపాన నిషేధం చాలా అవసరం. రాష్ట్రంలో అదే జరిగితే లక్షలాది పేద కుటుంబాలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం డబ్బు కోసం నిషేధం విధించటం లేదు. అప్పట్లో మేము సారా వ్యతిరేక ఉద్యమం బలంగా నిర్వహించి కనీసం కొంత సమయం అయినా నిషేధం తీసుకురాగలిగాం. తర్వాతి ప్రభుత్వాలు దీనిని పట్టించుకోలేదు. ఇప్పటి మహిళలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చేలా పోరాటం చేయాలి.మద్యపాన నిషేధం చేసే రాజకీయ పార్టీలకే మహిళలందరూ ఓటెయ్యాలి.   
– కొపర్తి కొండమ్మ, దూబగుంట రోశమ్మ సన్నిహితురాలు, తూర్పు దూబగుంట, నెల్లూరు జిల్లా 

నా ముగ్గురు బిడ్డల్నీ  మద్యం మింగేసిందయ్యా.. 
నాకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. నా భర్త మెట్టె సుబ్బారావు 20 ఏళ్ల కిందటే మృతి చెందినా కూలి పనులు, పాచి పనులు చేసుకుంటూ నా ఐదుగురు బిడ్డల(నలుగురు మగ పిల్లలు, ఓ ఆడపిల్ల)ను పెంచి పెద్ద చేశాను. నా పెద్ద కుమారుడు ముసలయ్య భవన నిర్మాణ కార్మికుడు. సోమరాజు, రామకృష్ణ, కిషోర్‌లు భవనాలకు రంగులు వేసే పనులు చేస్తూ.. రోజుకు రూ.500 చొప్పున సంపాదించేవారు. నా పిల్లలకు పెళ్లిళ్లు చేద్దామనుకున్న దశలో మద్యం మహమ్మారి మా కుటుంబంలో చిచ్చు రేపింది. పెయింట్‌ పనిచేసే నా ముగ్గురు బిడ్డలూ మద్యానికి అలవాటుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వీధికో బెల్టుషాపు వెలసింది. దీంతో 24 గంటలు మద్యం అందుబాటులోకి రావడంతో బానిసయ్యారు. నేను ఎంత మొత్తుకున్నా వినేవారు కాదు. పనులకు వెళ్లేటప్పుడు కూడా కొంచెం తాగి వెళ్లేవారు. పని ముగించుకున్నాక పూటుగా తాగొచ్చేవారు. అసలు మద్యం లేనిదే బతకలేని స్థితికొచ్చారు. లివరు, కిడ్నీలు పాడయిపోయి ఒకే ఏడాది ముగ్గురూ చనిపోయారు. ఎన్నో కష్టాలుపడి వాళ్లను పెంచి పెద్ద చేశాను. చేతికి అందివచ్చారు.. ఇక నాకు ఏలోటూ రాకుండా చూసుకుంటారని కలలుగన్నాను. ఇంతలోనే నా బిడ్డల్ని మద్యం మహమ్మారి కబళించింది. ఇప్పుడు నేను వంట పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్నాను. మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోయిన నా బిడ్డల్ని నాకు తెచ్చివ్వగలరా? నా బిడ్డల ఉసురు పోసుకుని నాకు కడుపుకోత మిగిల్చిన ఈ మద్యాన్ని అమ్మకుండా చేయండయ్యా.. అలా ఎవరు చేస్తారో వారికి కోటి దండాలు పెడతా. 
– మెట్టె బూరమ్మ, చర్చిపేట, నిడదవోలు, పశ్చిమగోదావరి జిల్లా  

జగన్‌ భరోసాతో  మహిళల హర్షం
ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి జాతీయ ప్లీనరీలో ‘నవరత్నాల్లాంటి’ హామీలిచ్చారు. వాటిలో ఒకటి..దశలవారీ మద్య నిషేధం. దీనిపై మహిళల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.మద్య నిషేధం తమ కుటుంబాల్లో సంతోషాన్నినింపుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన పాదయాత్రలో మద్యం మహమ్మారి బారినపడి ఛిన్నాభిన్నమైన కుటుంబాల కష్టాల్ని కళ్లారా చూసిన వైఎస్‌ జగన్‌.. అధికారంలోకి రాగానే మద్యపానాన్ని మూడు దశల్లో నిషేధిస్తామని హామీ ఇచ్చారు. మద్యపానం వల్ల ఎదురవుతున్న దుష్ఫలితాల్ని జగన్‌ ఏడేళ్ల నుంచి చూస్తున్నారు. 2012లో కల్తీ సారా తాగి కృష్ణా జిల్లా మైలవరం తండాలో 12 మంది మృత్యువాత పడ్డారు. కల్తీ సారా బాధితకుటుంబాలను పరామర్శించేందుకు అప్పట్లో ఆయన మైలవరం ప్రాంతంలో పర్యటించారు.ఈ సందర్భంగా స్థానికులు.. ఇళ్ల మధ్యే మద్యం దుకాణం ఉండటంతో చిన్న పిల్లలు సైతంవ్యసనపరులవుతున్నారంటూ ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో 2015లోకల్తీ మద్యం బారిన పడి మరణించిన కుటుంబాలను ఓదార్చిన సమయంలోనూ..మద్యం మహమ్మారి తమ వారిని పొట్టన పెట్టుకుని కుటుంబాల్లో విషాదాన్ని నింపిందంటూ బాధితులు చేసిన ఆర్తనాదాలకు వైఎస్‌ జగన్‌ చలించిపోయారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement