సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2020కి ప్రకటించిన ‘నవరత్నాలు’ అభివృద్ధి పథకాలపై తీసిన లఘు చిత్రాల(షార్ట్ ఫిలిం)లో ‘జయహో జన నాయకా’ ఉత్తమ లఘుచిత్రంగా ఎంపికైంది. లఘు చిత్రాల ఫెస్టివల్‌కు మొత్తం 35 ఎంట్రీలొచ్చాయి. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగం అభివృద్ధి సంస్థ చైర్మన్ టీఎస్ విజయచందర్ అధ్యక్షతన బీఎన్‌వీ రామకృష్ణంరాజు, ఎంవీ రఘులు కమిటీ సభ్యులుగా లఘు చిత్రాలను పరిశీలించారు. ప్రథమ బహుమతికి ఒకటి, ద్వితీయ బహుమతికి రెండు, తృతీయ బహుమతికి మూడు చొప్పున మొత్తం ఆరు లఘు చిత్రాలను ఎంపిక చేశారు. వాటి నిర్మాతలకు త్వరలో నగదు బహుమతులతో పాటు ప్రశంస పత్రాలు ఇవ్వనున్నట్టు విజయచందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రథమ బహుమతి: ‘జయహో జన నాయకా’.. నిర్మాత వజ్రగిరి నాగరాజు(విజయవాడ), బహుమతి రూ.లక్ష
ద్వితీయ బహుమతి: ఈ కేటగిరీలో మొదటి లఘుచిత్రం ‘నవ రత్నాలు మ్యూజికల్ ప్రెజెంటేషన్’, నిర్మాత ఎస్‌బీఎస్ శ్రీనివాస్ పోలిశెట్టి(తూర్పుగోదావరి పెద్దాపురం), రూ.50 వేలు. రెండో లఘు చిత్రం ‘జగనన్న నవ రత్నాలు’.. నిర్మాత శివశ్రీ మీగడ(విశాఖ), రూ.50 వేలు
తృతీయ బహుమతి: ఈ కేటగిరీలో మొదటి లఘుచిత్రం ‘బోర్న్ ఎగైన్’(మళ్లీ పుట్టాను).. నిర్మాత టీఎస్ లక్ష్మీనారాయణమూర్తి(కాకినాడ), రూ.25 వేలు. రెండో లఘుచిత్రం ‘రాజన్న రాజ్యంలో ఓ సీత కథ’.. నిర్మాత టి.వేణుగోపాల్‌కృష్ణ(పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు), రూ.25 వేలు. మూడో లఘు చిత్రం ‘పేదలందరికీ ఇళ్లు’.. నిర్మాత చండూర్ సుందరరామశర్మ(గుంటూరు), రూ.25 వేలు.
Comments
Please login to add a commentAdd a comment