విజయనగరం టౌన్: చిన్నప్పటి నుంచి చిత్రరంగంలో అడుగుపెట్టాలనే ఆకాంక్షే ఆ యువకుడిని షార్ట్ ఫిలిమ్స్‌లో ఉన్నతశిఖరాలు అధిరోహించేలా చేసింది. ఏ కాంటెస్ట్‌లో పాల్గొన్నా గెలుపొందిన మొదటి మూడు చిత్రాలు ఆయన రచన, సంగీత దర్శకత్వం చేసినవే కావడం విశేషం. ఇప్పటివరకూ షార్ట్ ఫిలి మ్స్‌లో వందలాది అవార్డులు అందుకున్న విజయనగరం యువకుడు పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్‌రాజా) ఎప్పటికైనా షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కా ర్ అవార్డ్ తీసుకోవడమే లక్ష్యమని చెబుతున్నాడు.
విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్ రాజా) సత్యవతి, చంద్రశేఖర్ రాజుల తొలిసంతానం. బీఏ వరకూ మహారాజా కళాశాలలో చదివి, సంగీతం పట్ల మక్కువతో మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో గాత్రం, వయోలిన్, భరతనాట్యం, వీణ తదితర అంశాలలో తర్ఫీదు పొందాడు. షాలోమ్స్ మ్యూజిక్ సెంటర్‌లో గిటార్ తదితర ఇన్‌నుస్ట్రుమెంట్స్‌పై సాధన చేశాడు. రచనలు చేయడం అలవాటు. 2012 నుంచి ఇప్పటివరకూ తెలుగు , కన్నడ, హిందీ, తమిళ్, ఆంగ్ల భాషల్లో సుమారు 250కి పైగా లఘుచిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. 2017లో ఒకే ఏడాదిలో ఆయన సంగీతం సమకర్చిన లఘుచిత్రాలకు వరుసగా ఏడుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు.
2007లో చెన్నైలో ఏఆర్ రెహమాన్ నిర్వహించిన హూలలల్లా మ్యూజిక్ బ్యాండ్‌హంట్‌లో షాలోమ్ తరఫున టాప్ 18లో నిలిచాడు. తానా ఇంటర్నేషనల్ తెలుగు ఫిలిం ఫెస్టివల్–2017 అవార్డు దక్కింది. 2020లో రాంగోపాల్ వర్మ నిర్వహించిన స్పార్క్ ఓటీటీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో తొమ్మిదివేల చిత్రాలలో పీవీఆర్ సంగీత దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు టాప్ 18లో నిలిచాయి. టాప్ 5లో నిలిచిన రెండు చిత్రాలు ఉత్తమ చిత్రాల అవార్డులు సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా 2020లో సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్‌లో ఎంఆర్ ప్రొడక్షన్స్ అంతరార్థం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు.
షార్ట్ ఫిలిం మాస్ట్రోగా పేరు సంపాదించుకున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్ధ వైష్ణో మీడియా నిర్మించిన ఆర్య–3 లఘుచిత్రంతో పీవీఆర్ రాజా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. పేపర్ బాయ్ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో విటమిన్ షీ ఓటీటీ చిత్రానికి సంగీత దర్శకత్వం అందించాడు. ప్రముఖ డ్యాన్సర్ యశ్వంత్ మాస్టర్ తొలివీడియో ఆల్బం దిల్ అంత అదిరే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఎల్‌బీ శ్రీరామ్ స్వీయ నిర్మాణంలో పదికి పైగా లఘు చిత్రాలకు సంగీతం సమకూర్చారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సంగీతం పట్ల మక్కువతో షార్ట్ ఫిలిమ్స్ వైపు అడుగులు వేశాను. బేగంపేటలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రద్ధ స్కూల్ ఆఫ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ పాఠశాలలో పిల్లలకు సంగీతం నేర్పించడం మరిచిపోలేని అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయేలా చిత్రాలను తీస్తాను. సంగీతంలో నేను రచించే పుస్తకం ప్రతి ఇంట్లో ఉండే పెద్ద బాలశిక్షలా ఉండిపోవాలని కోరుకుంటున్నాను.
– పెనుమత్స వెంకటరామరాజు (పీవీఆర్ రాజా), సంగీత దర్శకుడు, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment