– శ్రీశైలంలో వచ్చేనెల 1న దసరా ఉత్సవాలకు అంకురార్పణ
– 11వ తేదీ వరకు ప్రత్యేక పూజలు, వాహనసేవలు
– ఆహ్వాన పత్రికలను విడుదల చేసిన ఈఓ
శ్రీశైలం: పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీమల్లికార్జునస్వామివార్లు, పద్దెనిమిది మహా శక్తుల్లో ఒకరైన శ్రీభ్రమరాంబాదేవి నిలయమైన శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబర్ 1 నుంచి శ్రీదేవీశరన్నవరాత్రోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పరిపాలనాభవనంలో ఈఓ నారాయణభరత్ గుప్త దసరా ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వానపత్రికలను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీ నుంచి 11 వరకు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. 1న ఆశ్వీయుజ శుద్ధ పాఢ్యమి శనివారం ఉదయం 9.15గంటలకు ఆమ్మవారి ఆలయప్రాంగణంలో యాగశాల ప్రవేశం, తదితర పూజలు, అలాగే 9.45గంటలకు స్వామివార్ల ఆలయప్రాంగణంలో యాగశాల ప్రవేశం, తదితర పూజలు అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. శ్రీభ్రమరాంబాదేవిని శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఒక్కొక్క అలంకారంలో అలంకరించి గ్రామోత్సవం నిర్వహిస్తారన్నారు. అలాగే శ్రీ ్ర భమరాంబామల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులను రోజుకోవాహనంపై ఊరేగిస్తారన్నారు.
2 నుంచి 10 వరకు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు:
ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2 నుంచి 110 వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేషకుంకుమార్చనలు ఉంటాయన్నారు. అలాగే స్వామివార్లకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు, పారాయణలు చేస్తారు.
11న విజయదశమి:
వచ్చేనెల 11వ తేదీన విజయదశమి సందర్భంగా శ్రీభ్రమరాంబాదేవికి ప్రత్యేకపూజలను నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 7గంటలకు మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానాలు, విశేష కుంకుమార్చనలు, యాగాంగ హవనములు, చండీ, రుద్ర హోమాలు, జయాధిహోమాలను చేస్తారు. అనంతరం 8.30 గంటలకు చండీయాగ పూర్ణాహుతి, 9గంటలకు రుద్రయాగ పూర్ణాహుతి అనంతరం కలశోద్వాసన, వసంతోత్సవం, అవృధం, మహదాశీర్వచనాలు ఉంటాయన్నారు.
10న రాష్ట్ర ప్రభుత్వంచే పట్టువస్త్రాల సమర్పణ
ఉత్సవాల్లో భాగంగాశ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకు 10వ తేదీన సోమవారం రాష్ట్ర ప్రభుత్వంచే పట్టువస్త్రాలను సమర్పిస్తారని ఈఓ తెలిపారు. ప్రతి ఏటా సంప్రదాయానుసారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున విజయదశమి ముందు రోజున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.
ఉత్సవాల్లో అమ్మవారి అలంకారం, స్వామి అమ్మవార్ల వాహనసేవల వివరాలు
తేదీ అమ్మవారి అలంకారం స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు
అక్టోబర్ 1న శైలపుత్రి, భంగివాహనం
2న బ్రహ్మచారిణి, మయూరవాహనం
3న చంద్రఘంట రావణవాహనం
4న కూష్మాండ దుర్గ కైలాసవాహనం
5న స్కందమాత శేషవాహనం
6న కాత్యాయని పుష్పపల్లకీ
7న కాళరాత్రి గజవాహనం
8న మహాగౌరి నందివాహనం
9న సిద్ధిదాయినీ హంసవాహనం
10న రాజరాజేశ్వరి అశ్వవాహనం
11న భ్రమరాంబాదేవి (నిజాలంకరణ) నందివాహనం ( ఆలయ ఉత్సవం)