సాక్షి, నల్లజర్ల : పేదలకు సొంతిల్లు కల.. అప్పటివరకూ వారంతా అద్దె ఇళ్లల్లో జీవనం సాగిస్తూ చాలా ఇబ్బందులు పడ్డారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. రోజు వారీ కూలి పనులు చేసుకునే వారికి సొంతిల్లు అందని ద్రాక్షలా కనిపించింది. ఇటువంటి తరుణంలో వారి కలను నిజం చేశారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. నల్లజర్ల మండలంలోని దూబచర్ల గ్రామ జనాభా 12 వేలకు పైనే. 2007కు పదేళ్ల ముందు వరకు ఏ ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 18 ఎకరాలు భూమి కొనుగోలు చేసి 560 కుటుంబాలకు ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుంది. ఇప్పటికీ ఈ కాలనీవాసులు రాజన్నా.. నిను మరువలేమన్నా.. అంటూ స్మరించుకుంటున్నారు.
నిత్య స్మరించుకుంటూ..
జిల్లాలో మొదటి పేదల కాలనీకి 2007 ఏప్రిల్ 29న వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. అనతికాలంలో ఇళ్ల నిర్మాణం కూడా చకచకా పూర్తయింది. వైఎస్సార్ వసంత్‌నగర్ కాలనీగా ఇళ్ల లబ్ధిదారులు పేరు పెట్టుకున్నారు. తర్వాత కాలంలో ఈ ప్రాంత దినదినాభివృద్ధి చెందింది. వసంతనగర్ కాలనీ ఎదురుగా దత్త సాయి మందిరం, ఎటుచూసినా లేఅవుట్లు, ఉపాధి లభించేలా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇదంతా వైఎస్సార్ చలవేనని ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల్లో కూడా వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం పేదలు, మధ్యతరగతి వర్గాలకు వరమని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. వైఎస్ హయాంలో దూబచర్లలో ఈ కాలనీతో పాటు కొత్తగూడెం,అయ్యవరం, ప్రకాశరావుపాలెం, పోతినీడుపాలెం, కమతంగుంట, జగన్నాథపురం, సుభద్రపాలెంలో 38 ఎకరాలు భూమి కొనుగోలు చేసి పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఆయా గ్రామాల్లో అప్పటినుంచి ఇప్పటివరకూ మరే నాయకుడు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాజన్న రాజ్యం సాధ్యమని ఈ ప్రాంతవాసులు అంటున్నారు.
ఆయన రుణం తీర్చుకోలేం
చాలా కాలం రోడ్డు పక్క పూరిల్లు వేసుకుని పిల్లలతో చాలా ఇబ్బందులు పడ్డాం. వైఎస్ దయ వల్ల స్థలం ఇచ్చారు. పక్కా ఇల్లు కట్టుకున్నాం. బాధలు తప్పాయి. ఆయన రుణం ఎన్నటికీ తీర్చుకోలేం. జగన్ సీఎం అయితే పేదలకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం.
– సయ్యద్ జరీనా, వైఎస్సార్ కాలనీ, దూబచర్ల
మంచి రోజులు రానున్నాయి
పేదలకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో వైఎస్సార్ గృహ నిర్మాణం కూడా ఉంది. వైఎస్సార్ చలవతోనే మాకు గూడు దొరికింది. జగన్ సీఎం అయితే ఇల్లు లేని పేదలందరికీ గూడు కల్పిస్తారనే నమ్మకం మాకుంది.
– సింగులూరి దుర్గ, వైఎస్సార్ కాలనీ, దూబచర్ల
పేదలకు ఆసరాగా పథకం
నవరత్నాల్లోని వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం బాగుంది. పేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఆ ఇంటిని లబ్ధిదారుని పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం, అత్యవసర పరిస్థితుల్లో ఇంటిపై బ్యాంకు రుణం తెచ్చుకునే వెసులుబాటు కల్పించడం చాలా మంచి నిర్ణయం.
– గౌస్య, వైఎస్సార్ కాలనీ, దూబచర్ల
అద్దె ఇళ్లల్లో చాలా ఇబ్బందులు పడ్డాం
కూలిపనులు చేసుకునే తాము అద్దె ఇళ్లలో చా లా ఇబ్బందులు పడ్డాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దయ వల్ల సొంతిల్లు కట్టుకున్నాం. ఇబ్బందులు తప్పాయి. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ కూడా అధికారంలోకి వచ్చి పేదలందరికీ ఇళ్లు కట్టిస్తారని భావిస్తున్నాం.
– మద్దిరాల కామాక్షి, వైఎస్సార్ కాలనీ, దూబచర్ల
Comments
Please login to add a commentAdd a comment