సాక్షి, అమరావతి : ‘జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం’.. ఇదీ యావత్ ఆంధ్రా ప్రజానీకం నినాదం.. ‘మార్పు రావాలి..మార్పు మంచికే’.. ఇదీ ప్రస్తుతం రాష్ట్రం జపిస్తున్న మంత్రం.. ‘2004లో రాజన్న... 2019లో జగనన్న...’ ఇదీ ప్రజా సంకల్పం.. వెరసి సరికొత్త రాజకీయ విప్లవం దిశగా రాష్ట్రం సమాయత్తమవుతోంది.. చంద్రబాబు అవినీతి, అరాచక పాలనకు తెరదించే నిశ్శబ్ద విప్లవంలో.. 'నేను సైతం’ అంటూ.. ప్రతి ఓటరు కదం తొక్కుతున్నారు.. రాష్ట్రంలో చారిత్రక ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది.
అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగింది. నేడు ఓటరు తన నిర్ణయం చెప్పబోతున్నాడు. ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏపీ కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఇలాంటి చారిత్రక సందర్భంలో.. ఐదేళ్ల చంద్రబాబు అవినీతి, అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు.. ఇప్పటికే ఓ స్థిర నిర్ణయానికి వచ్చేశారు. ‘నేను విన్నాను.. నేనున్నాను’ అంటూ.. ప్రజల్లోనే ఉంటున్న జగన్ నిబద్ధతను గుర్తించారు. ఎన్నికల కోసం కాదు.. ప్రజల కోసమే పథకాలు అన్న ఆయన నిజాయితీని ప్రశంసిస్తున్నారు. అందుకే ‘జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం. రాజకీయాలను మేలిమలుపు తిప్పుదాం’ అని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఘంటాపథంగా చెబుతున్నారు.
- వడ్డాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి
మార్పు కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పూర్తి విచక్షణతో ఎన్నికల్లో తీర్పు చెప్పేందుకు సిద్ధమయ్యారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం.. అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు ఆషామాషీగా రాలేదు. చంద్రబాబు పాలనా వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజలు.. గత 9ఏళ్లుగా జగన్ తమతోనే ఉండటాన్ని గమనించారు. వైఎస్ జగన్ దృఢచిత్తం, సంక్షేమం పట్ల చిత్తశుద్ది, అభివృద్ధి పట్ల నిబద్ధత ప్రజల్ని ఆలోచింపజేసింది. 2014లో చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇస్తే.. అప్పుడే జగన్ అధికారంలోకి వచ్చేవారన్నది తటస్థులు సైతం అంగీకరిస్తున్న వాస్తవం.
600లకు పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఆ హామీలు అమలు చేయకపోవడంతో.. జగన్ నిబద్ధతకు మరింత గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా గత ఐదేళ్లుగా జగన్ చేసిన ప్రజాపోరాటాలు ప్రజల్ని ఆలోచింపజేశాయి. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరమని జగన్ మొదటి నుంచీ చెబుతూ.. దానికోసం పోరాడుతూ వచ్చారు. హోదా కోసం పోరాడుతుంటే.. చంద్రబాబు అవహేళన చేసినా, అరెస్టులు చేసినా సరే వెనుకాడలేదు. హోదాకోసం జాతీయ పార్టీలు, టీఆర్‌ఎస్‌తోసహా అందరి మద్దతు కూడగట్టడం జగన్ విజయమని ప్రజలు కొనియాడుతున్నారు.
మరోవైపు కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు 14నెలలపాటు 3,648 కిలోమీటర్ల మేర జగన్ చేసిన పాదయాత్ర చరిత్ర సృష్టించింది. ప్రజల కోసం జగన్ ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటారని అందరూ గుర్తించారు. ‘జగన్ కుట్రలు చేసి రాలేదు. అమాంతంగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. ప్రజల మధ్యనే ఉంటున్నారు. ప్రజల కోసం అంతగా కష్టపడుతున్న నాయకుడికి ఓ అవకాశం ఇవ్వడం మన ధర్మం. అందుకే ఈసారి జగన్‌కే మా ఓటు’ అని విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన అప్పలసూరి అనే ఆటో డ్రైవర్ చెప్పారు.
అందరి కుట్రలను ఎదుర్కొన్న ఒకే ఒక్కడు
జగన్ రాజకీయ పరిణతి రాష్ట్ర ప్రజల మనసులను గెలుచుకుంది. అందరూ ఒక్కటై కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నా.. జగన్ సంయమనం కోల్పోలేదు. తనపై వ్యక్తిగతంగా బురదజల్లుతున్నా.. ఆయన మాత్రం ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. విధానాల మీదే మాట్లాడుతున్నారు. జగన్‌ను దొంగ దెబ్బ తీసేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, వామపక్షాలు, బీఎస్సీ పార్టీలతో లోపాయికారీ అవగాహన కుదుర్చుకున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్‌తో అవగాహన, చివరికి కేఏపాల్ ప్రజాశాంతి పార్టీని కూడా చంద్రబాబు తన కుటిల రాజకీయంలో పావుగా మలచుకున్న తీరును ప్రజలు దుయ్యబడుతున్నారు. దేవెగౌడ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా ...ఇలా అందర్నీ రాష్ట్రానికి రప్పించి మరీ చంద్రబాబు, జగన్‌పై విమర్శలు చేయించారు. ఒక్క జగన్‌ను దెబ్బతీయడం కోసం ఇంతమంది ఒక్కటవ్వడం ఏమిటి? అంటూ సగటు ఓటరు ప్రశ్నిస్తున్నారు. ‘జగన్ ఒక్కడిని ఓడించేందుకు ఇంతమంది ఒక్కటవుతున్నారు. అంటే ఆయన శక్తివంతుడనే కదా! ఆయన్ను గెలిపిస్తే.. ఆ శక్తిసామర్థ్యం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈసారి జగన్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం..’ అని విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సత్యన్నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.
మార్పు ఎప్పుడూ మంచికే...!
2004లో రాజన్న... 2019లో జగనన్న.. మార్పు ఎప్పుడూ మంచికేనంటూ ఓటరు నినదిస్తున్నారు. 2004నాటి తీర్పు ఫలితాలను గుర్తుచేసుకుంటూ.. ‘మార్పు’ దిశగా నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆనాటి ప్రజా నిర్ణయం.. రాష్ట్ర దశాదిశనే సమూలంగా మార్చేసింది. కనీసం ఊహకు కూడా అందని ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో పేదల ఇళ్లల్లో ఆనందం పూసింది. పారిశ్రామిక ప్రగతితో రాష్ట్రం పరుగులు పెట్టింది.
జలయజ్ఞంతో రైతుల కళ్లలో సంతోషం కనిపించింది. అందుకే 2009లో మళ్లీ వైఎస్‌ను ప్రజలు ఆశీర్వదించారు. ప్రస్తుతం రాష్ట్రం 2004కు ముందటి దుర్భర పరిస్థితిలోకి కూరుకుపోయింది. చంద్రబాబు పాలనలో అవినీతి, అరాచకత్వం రాజ్యమేలుతోంది. టీడీపీ ఎల్లో మీడియా మాత్రం బాబు భజనతో ప్రజల్ని మోసం చేస్తోంది. ‘అనుభవజ్ఞుడు అని అవకాశం ఇస్తే.. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించారు. టీడీపీ నేతల అవినీతికి అంతే లేకుండాపోయింది. మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఊహించడానికే భయమేస్తోంది. అందుకే ఈసారి మార్పు కోరుకుంటున్నాం’ అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వర ప్రసాద్ అనే ఉపాధ్యాయుడు అభిప్రాయపడ్డారు.
ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసమే జగన్ పథకాలు
- ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు హామీలు ఇచ్చే నేటి తరం నాయకులకు వైఎస్ జగన్ పూర్తిగా భిన్నం. ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసమే విధానాలు.. అంటూ ఆయన నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, ప్రగతి కోసం తానేం చేయాలనుకుంటున్నారో.. రెండేళ్ల క్రితమే 2017లో విజయవాడలో జరిగిన ప్లీనరీలోనే జగన్ ప్రకటించారు. పాదయాత్రగా ప్రజల వద్దకు వస్తున్నానని కూడా వెల్లడించారు.
- ప్రజల నుంచి వచ్చే వినతులను బట్టి మరిన్ని అంశాలు చేరుస్తామన్నారు. ‘ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది కదా... ఇంత ముందుగా మన పథకాలను ప్రకటిస్తే వాటిని చంద్రబాబు కాపీ కొట్టి అమలు చేసేస్తే ఎలా’ అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. దీనిపై జగన్ ఇచ్చిన సమాధానం ఆయనలోని రాజనీతిజ్ఞతకు అద్దంపట్టింది. ‘ఓట్ల కోసం కాదు మనం పథకాలను ప్రకటించింది.. ప్రజల కోసం.. ఒక వేళ వాటిని చంద్రబాబు కాపీ కొట్టి అమలు చేస్తే మంచిదే.
- ప్రజలకు మంచి జరగడమే నాకు కావాలి’ అని అనడం జగన్‌కు మాత్రమే సాధ్యం. ‘పాదయాత్రలో ప్రజలను కలిసి వారి సమస్యలను గుర్తిస్తాను. ఆమేరకు నవరత్నాలకు మరిన్ని పథకాలు చేరుస్తాను’ అని నాడు స్పష్టం చేశారు. ‘మనం చెప్పింది చంద్రబాబు అమలు చేస్తే..మనం అంతకంటే ఎక్కువ చేద్దాం.. మనం రూ.2వేలు పింఛన్ ఇస్తామని చెప్పాం. ఒక వేళ చంద్రబాబు రూ.2వేలు ఇస్తే...మనం రూ.3వేలు ఇద్దాం..అంతిమంగా పేదలకు మంచి జరగాలి..’ అంటూ.. ప్రజల సంక్షేమం పట్ల జగన్ చిత్తశుద్ధిని చాటుకోబట్టే ప్రజలు నేడు ఆయన నిజాయితీని కొనియాడుతున్నారు.
- ‘చంద్రబాబు అది ఇచ్చారు.. ఇది ఇచ్చారు.. అంటున్నారు. నాలుగున్నరేళ్లు ఎందుకు ఏమీ ఇవ్వలేదు. జగన్ నవరత్నాలు ప్రకటించాకే.. చంద్రబాబు హడావుడిగా అది కూడా ఎన్నికల ముందు తాయిలాలు ఇస్తున్నారు. నాలుగున్నరేళ్లు పట్టించుకోకుండా.. ఎన్నికల ముందే మేము గుర్తుకొచ్చామా? చంద్రబాబును నమ్మేదే లేదు’ అని విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన రాజయ్య అనే కొబ్బరి బోండాల వ్యాపారి తేల్చి చెప్పారు.
- ఆయన మాటల్లో యావత్ రాష్ట్ర ప్రజానీకం అభిప్రాయం ప్రతిబింబిస్తోంది. ఎవరు నిజాయితీగా మాట ఇచ్చారు. ఎవరు ఎన్నికల కోసం కనికట్టు చేస్తున్నారన్నది అందరికీ తెలిసివచ్చింది. ‘ఈరోజుల్లో అందరికీ అన్నీ తెలుసు. జగన్ చెప్పబట్టే చంద్రబాబు ఇప్పటికిప్పుడు సొమ్ములు జమ చేశా అంటున్నారు.. జగన్‌ను గెలిస్తే ఇంకా ఎంతో మంచి చేస్తారు’ అని విజయవాడ ఆటోనగర్‌కు చెందిన రాములమ్మ అనే డ్వాక్రా మహిళ చెప్పడం ప్రజల అవగాహనకు నిదర్శనం.
జగన్ విజన్‌పై నమ్మకం
‘అవకాశం ఇవ్వకుండా.. అనుభవం లేదని ఎన్నాళ్లంటాం. ఐదేళ్లుగా జగన్ ఎంతగా ప్రజల్లో ఉంటున్నారో చూశాం. ఓసారి అవకాశం ఇవ్వడం మన ధర్మం’అని విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన రాధాకృష్ణ
అనే వ్యాపారస్తుడు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా, రైల్వే జోన్, రిజర్వేషన్లు వంటి విధాన నిర్ణయాల్లోనూ.. వ్యవసాయం, సంక్షేమపథకాల విషయంలోనూ.. వైఎస్ జగన్ స్పష్టమైన దృక్పథంతో ఉన్నారు. అసెంబ్లీలోనూ, బయటా ఆయన వివిధ అంశాలపై సాధికారికంగా మాట్లాడిన తీరును ప్రజలు గుర్తించారు.
రాష్ట్ర సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన జగన్.. తమకు మేలు చేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు.
కుట్రలు, మోసాలు చేసే చంద్రబాబు అనుభవం కంటే.. నిజాయితీతోమేలు చేసే జగన్ నిబద్ధతకే ఈసారిపట్టం కట్టాలని ప్రజలు నిర్ణయించారు. జగన్ చెప్పినదాంట్లో స్పష్టత ఉంది. ఓ అవకాశం ఇస్తే తానేమిటో నిరూపించుకుంటారన్న నమ్మకం ఉంది’ అని రాజమండ్రికి చెందిన మల్లేశ్వరరావు రిటైర్డ్ తహశీల్దార్ అభిప్రాయపడ్డారు.
రాదారులన్నీ జన గోదారులయ్యాయి.. సభా కూడళ్లన్నీ జన సంద్రాలయ్యాయి.. అన్ని దారులూ అటు వైపే వెళ్లాయి.. అందరి చూపులూ అతని పైకే మళ్లాయి.. ఎండనకా.. వాననకా ఏళ్ల తరబడి జనం జపం.. కష్టాలు భరిస్తూ.. బాధిత జనం కన్నీళ్లు తుడుస్తూ.. మీ కష్టం నేను విన్నాను.. మీకు అండగా నేనున్నానంటూ భరోసా.. నాయకుడంటే అతనే.. ది రియల్ లీడర్.. ఇలాంటి నేతే కావాలి.. ఇలాంటి నేతే రావాలి.. అందరి నోటా అదే మాట.. నిజం చేయాలి ఈ పూట..
నాటి ఓదార్పు యాత్ర మొదలు.. ఇప్పటి ఎన్నికల ప్రచారం వరకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టాలను కళ్లారా చూశారు. అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.
ఇంట్లో మనిషిలా అక్కా.. అన్నా.. చెల్లెమ్మా.. అమ్మా.. అవ్వా.. తాతా.. అంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఆత్మీయతను పంచారు. ఆయన ఇచ్చిన ధైర్యం అన్ని వర్గాల వారికీ ఊరట కలిగించింది. జగన్‌తో కష్టం చెప్పుకుంటే చాలు అనుకుంటూ తండోపతండాలుగా తరలి వచ్చారు.
సభలైతేనేం.. సమావేశాలైతేనేం.. ధర్నాలైతేనేం.. దీక్షలైతేనేం.. జనమే జనం. పాదయాత్ర ఆద్యంతం జనప్రవాహం పరవళ్లు తొక్కింది. వంతెనలు ప్రకంపించాయి.. నగరాలు పోటెత్తాయి.. కనుచూపు మేర జనమే జనం.. 124 పాదయాత్ర సభలు, 68 ఎన్నికల సభలు.. తుదకు అందరి లక్ష్యం ఒక్కటే.. ‘అతనే నాయకుడవ్వాలి.. మనందరి కష్టాలు తీరాలి.’ ఈ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, యువతీ యువకుల అడుగులు పోలింగ్ కేంద్రాల దిశగా పడుతున్నాయి.
జగన్‌కు జై కొడుతున్న యువత
రాష్ట్ర యువత జగన్ వెంట కదంతొక్కుతోంది. జగన్ నాయకత్వంతోనే నవ శకానికి నాంది అని యువత నమ్ముతోంది. నిజాయితీ, నిబద్ధత, పోరాడేతత్వం, తెగింపు...ఇవన్నీ యువతను ఆకట్టుకునే అంశాలు.
జగన్‌లో ఈ లక్షణాలు పుష్కలంగా ఉండటంతో ఆయనవైపు యువత మొగ్గుచూపుతోంది. ఆనాడు సోనియాగాంధీని ఎదిరించడం మొదలు ప్రత్యేకహోదా కోసం ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడిన తీరుకు వారంతా ఆకర్షితులవుతున్నారు.
సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉండే విద్యార్థులు, యువత టీడీపీ ఎల్లో మీడియా కుట్రలను గుర్తించారు. ప్రత్యేకహోదా సాధించి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పిన జగన్ విధానం.. యువతలో నమ్మకాన్ని కల్పించింది. అభివృద్ధి వైపుగా రాష్ట్రం దశాదిశా మార్చే నిజమైన దార్శనికుడు జగన్ మాత్రమేనని యువతీ యువకుల్లో, విద్యార్థుల్లో ఏకాభిప్రాయం వినిపిస్తోంది. అందుకే యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీ క్యాంపస్‌లలో జగన్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తోంది.
‘నేను ఏ పార్టీకి అభిమానిని కాను. ప్రత్యేకహోదాపై జగన్ స్టాండ్ బాగుంది. ఆయన మాట ఇస్తే నిలబడతారన్న నమ్మకం ఉంది. అందుకోసం ఎవరినైనా ఢీకొనే తెగింపు కూడా ఉంది. అందుకే ఈసారి జగన్‌కు ఛాన్స్ ఇద్దామనుకుంటున్నాం. మా స్నేహితులమంతా విద్యార్థులను కలుస్తూ.. ఈసారి ఫ్యాన్‌కు ఓటేద్దాం అని చెబుతున్నాం. మా క్యాంపస్‌లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్’అని గుంటూరుకు చెందిన లిఖిత అనే విద్యార్థిని చెప్పడం విశేషం.
గెలుపు ఖాయం చేసిన మేనిఫెస్టో
ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రగతి పట్ల జగన్ దార్శనికతకు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో అద్దంపట్టింది. రైతులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, యువత.. ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి జగన్ ఆచరణ సాధ్యమైన విధానాలను ప్రకటించారు.
ప్రధానంగా విద్యా, వైద్య రంగాలకు
సంబంధించి ఆయన తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. వివిధ సామాజికవర్గాల అభ్యున్నతి, నీటిపారుదల, పారిశ్రామిక ప్రగతి తదితర అంశాల్లో దీర్ఘకాలిక వ్యూహంతో శాశ్వత పరిష్కారం చూపారు. సరళంగా, క్లుప్తంగా రెండు పేజీల్లో విడుదల చేసిన మేనిఫెస్టోను అమలు చేసిన తరువాతే మళ్లీ ఓట్లు అడుగుతామని చెప్పడం ద్వారా జగన్ తన చిత్తశుద్దిని చాటుకున్నారు. అప్పటికే వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్ర ప్రజలు.. మేనిఫెస్టోతో జగన్‌ను సంపూర్ణంగా బలపర్చాలని నిర్ణయించుకున్నారు. ‘జగన్ మేనిఫెస్టో చాలా బాగుంది. రైతులకు మంచి చేసేలా ఉంది. ఆయన చెప్పినవి అమలు చేస్తారన్న నమ్మకం ఉంది. అందుకే ఈసారి జగన్‌కు ఓటేయాలని భావిస్తున్నాం’అని గన్నవరానికి చెందిన నాగమల్లేశ్వరరావు అనే రైతు చెప్పారు.
వైఎస్సార్‌సీపీ సభలకు జన నీరాజనం
ఎన్నికల ఫలితాలకు ముందస్తు సంకేతంగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార సభలకు జనం భారీగా పోటెత్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత ‘నేను విన్నాను.. నేనున్నాను’అంటూ.. వైఎస్ జగన్ తనకు ఒక్క అవకాశం ఇవ్వమని కోరడం ప్రజల్ని ఆలోచింపజేసింది. గత 20రోజుల్లో 13జిల్లాల్లో జగన్ నిర్వహించిన 68 సభలకు జనం బ్రహ్మరథం పట్టి తమ మద్దతు ప్రకటించారు. మరోవైపు వైఎస్ విజయమ్మ, షర్మిలమ్మ కూడా ఆయనకు తోడుగా విస్తృతంగా ప్రచారంచేసి ప్రజల మనసు గెలుచుకున్నారు.
‘నా కుమారుడు ఆనాడు సోనియాగాంధీకే భయపడలేదు. కేసులకూ భయపడలేదు. ఇప్పుడు బీజేపీకి భయపడతాడా.. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టండి’అన్న విజయమ్మ ప్రచారం ప్రజల మనసులను సూటిగా తాకింది. ఇక చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగడుతూ షర్మిలమ్మ పేల్చిన పంచ్ డైలాగులు యువతను ఆకట్టుకున్నాయి. ‘సింహంసింగిల్‌గా వస్తుంది.. జగనన్న సింగిల్‌గా వస్తాడు’అంటూ.. ఆమె చేసిన ప్రసంగానికి జనం కేరింతలు కొట్టి ‘బాయ్ బాయ్ బాబు...బాయ్ బాయ్ పప్పు’అంటూ జోష్ నింపారు.
ప్రజాభిప్రాయాన్ని వెల్లడిస్తున్న సర్వేలు
ప్రజల మనోభీష్టాన్ని వెల్లడిస్తూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించనుందని అన్ని జాతీయ సర్వేలు స్పష్టం చేశాయి. కేంద్రంలో హంగ్ పార్లమెంట్ వచ్చే అవకాశాలుండటంతో.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో
దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకంగా మారనుంది. అందుకే జాతీయ చానళ్లు ఏపీతోసహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక ఆసక్తితో పలు సర్వేలు నిర్వహించాయి. ఏపీ ప్రజలు జగన్
నాయకత్వానికి జై కొడుతున్నారని ఆ సర్వేలు వెల్లడించాయి. ఏపీలో వైఎస్సార్‌సీపీకి 45శాతం నుంచి 48శాతం వరకు ఓట్లు సాధించనుందని తేల్చిచెప్పాయి.
కాగా టీడీపీ కేవలం 32 శాతం నుంచి 35 శాతం ఓట్లకే పరిమితం కానుందని వెల్లడించాయి. రాష్ట్రంలోని 25 ఎంపీ నియోజకవర్గాల్లో.. వైఎస్సార్‌సీపీ 18 నుంచి 22 ఎంపీ సీట్లను గెలుచుకోనుందని ఆ సర్వేలు వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ 5 నుంచి 7 సీట్లకు పరిమితం కానుంది. ఇక వైఎస్సార్‌సీపీ ఏకంగా 110 నుంచి 130 వరకు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని జాతీయ సర్వేలన్నీ తేల్చిచెప్పాయి. టీడీపీ 40సీట్లకే పరిమితం కానుందని కూడా స్పష్టం చేశాయి. దాంతో చరిత్రను తిరగరాస్తూ.. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ‘మంచికోసమే మార్పు’అని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ‘జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం’అని తేల్చి చెబుతున్నారు!!
వివిధ జాతీయ టీవీ చానళ్ల సర్వే వివరాలివీ.. (ఎంపీ స్థానాలు) వైఎస్సార్‌సీపీ సీట్లు
టైమ్స్‌నౌ–వీఎంఆర్ : 20 (43.70%)
ఇండియాటీవీ–సీఎన్‌ఎక్స్ : 20
రిపబ్లిక్ టీవీ–సీఓటర్ : 19 41.3%
సీపీఎస్ : 21
ఎన్‌డీటీవీ : 21
సర్వే సంస్థ | టీడీపీ సీట్లు (ఓట్ల శాతం) సీట్లు | జనసేన |
టైమ్స్‌నౌ–వీఎంఆర్ | 5 (35.10%) | 0 |
ఇండియాటీవీ–సీఎన్‌ఎక్స్ | 5 | 0 |
రిపబ్లిక్ టీవీ–సీఓటర్ | 6 (33.1 %) | 0 |
సీపీఎస్ | 4 | 0 |
ఎన్‌డీటీవీ | 4 | 0 |
Comments
Please login to add a commentAdd a comment