వైఎస్సార్‌ మేలు మరువలేం.. | Chief Minister YS Rajasekhara Reddy has been Making Reservation for Muslim Welfare | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ మేలు మరువలేం..

Published Tue, Apr 2 2019 7:55 AM | Last Updated on Tue, Apr 2 2019 12:51 PM

Chief Minister YS Rajasekhara Reddy has been Making  Reservation for Muslim Welfare - Sakshi

సాక్షి, అమరావతి : తాతల నాటి ఆస్తులుండవు. నాన్న కూడబెట్టిన సంపద ఉండదు. స్కూల్‌ ఫీజు కడదామంటే డబ్బులుండవు. చదువుకుందామనే ఆసక్తి ఉన్నా.. కుటుంబ పరిస్థితుల రీత్యా మధ్యలోనే చదువు మాని ఏదో పని వెతుక్కోవాలి. దశాబ్దంన్నర క్రితం వరకు ముస్లింల పరిస్థితి ఇది. దివంగతముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారి సంక్షేమం కోసం రిజర్వేషన్లు కల్పించడం వరంగా మారింది. వారిని ‘బీసీ–ఈ’గా గుర్తించారు. ఆ మేరకు జీవో ఇచ్చి వారి జీవితాల్లో శాశ్వతంగా వెలుగులు నింపారు. ఫలితంగా ముస్లింలకు సమాజంలో గౌరవం పెరిగింది. రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని వేలాది మంది ఉద్యోగాలు పొందారు. ధనికులకే పరిమితమైన వైద్య విద్యలో ఉచితంగా సీట్లు పొందారు. డాక్టర్లుగా స్థిరపడ్డారు.

‘హమ్‌ గరీబ్‌ లోగ్‌ హై. హమారే బచ్చోం కో డాక్టర్‌ బన్‌నేకి ఖాయిష్‌ హై. మగర్‌ ఉన్‌కే పడాయి కేలియే హమారే పాస్‌ హైసియత్‌ నహీ. ఇస్‌లియే పడానా బహుత్‌ ముష్కిల్‌ థా. జబ్‌ తక్‌ కే ఆప్‌ హమారే బచ్చోంకే లియే రిజర్వేషన్‌ నహీ రహాథా. ఆప్‌ హమారీ గరీబీ హఠానే కేలియే 4 పర్సెంట్‌ రిజర్వేషన్‌ దియే. ఉసీ దిన్‌సే హమారే బచ్చోంకీ జిందగీకో రోష్మీ ఆయి. తుమ్‌నే హమ్‌కో రోజీ నహీ బల్‌కే జిందగీ దియే. బచ్చే ఆప్‌ జైసే డాక్టర్స్‌ బనే. క్యా హమ్‌ ఆప్‌కా షుకర్‌ గుజార్‌ నహీ కర్‌సక్తే.. జీ హా జరూర్‌.. పూరే ముసల్మాన్‌ జిందగీ భర్‌ ఆప్‌ పర్‌ ఔర్‌ ఆప్‌కే ఘర్‌ వాలో పర్‌ బేషక్‌ షుకర్‌ గుజార్‌ దిల్‌సే హై. జహాభీ హో ఆప్‌కో అల్లాహ్‌ అచ్ఛా రఖే. షుక్రియా వైఎస్సార్‌ సాబ్‌.’

తెలుగులో ఇదీ అర్థం
మేం పేదవాళ్లం. మా పిల్లలకు డాక్టర్‌ అవ్వాలని కోరిక. కానీ వాళ్లను చదివించేంత ఆర్థిక స్థోమత మాకు లేదు. అందుకే చదివించడం చాలా కష్టమయ్యేది. మీరు మా పిల్లలకు రిజర్వేషన్‌ ఇవ్వనంత కాలం చాలా ఇబ్బందులు ఉండేవి. మా పేదరికాన్ని తొలగించేందుకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ రోజు నుంచే మా పిల్లల జీవితాలకు వెలుగు వచ్చింది. మీరు మాకు ఇచ్చింది ఉపాధి కాదు.. జీవితాన్ని. మా పిల్లలు కూడా మీలాగే డాక్టర్లు అవుతున్నారు. అలాంటప్పుడు మీకు రుణపడి ఉండలేమా? తప్పకుండా ఉంటాం. మేమే కాదు. ముస్లిం సమాజమంతా మీ పట్ల, మీ కుటుంబ
సభ్యుల పట్ల జీవిత కాలం కృతజ్ఞతతో ఉంటాం. మీరు ఎక్కడున్నా.. అల్లాహ్‌ మీ పట్ల దయ చూపాలి. థాంక్యూ వైఎస్సార్‌ గారూ.. అంటూ బీసీ–ఈ ద్వారా 4 శాతం రిజర్వేషన్‌తో ఎంబీబీఎస్, పీజీలు చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెబుతున్నారు. మహానేత వైఎస్సార్‌ రుణం తీర్చుకోలేనిదని అంటున్నారు.

వైద్యులుగా వేలాది మంది
బీసీ–ఈ రిజర్వేషన్ల కింద ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లు పొందిన వేలాది మంది ముస్లిం యువతీ, యువకులు వైద్యులుగా మారారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న వైద్య కళాశాలల్లో సుమారు 2 వేల మంది ముస్లింలు బీసీ–ఈ కోటా కింద సీట్లు సంపాదించారు. మరోవైపు రాష్ట్రంలో 14 డెంటల్‌ కళాశాలలు ఉండగా.. వాటిలో 1,240 సీట్లు ఉన్నాయి. ఏటా సుమారు 50 మంది ముస్లింలు ఈ రిజర్వేషన్‌ కింద సీట్లు పొందుతున్నారు. ఇక బీఏఎంఎస్‌తోపాటు బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, ఫార్మా, నర్సింగ్, నేచురోపతి, యోగా, నూట్రీషియన్, ఫిజియోథెరఫీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్, రేడియాలజీ, ఎక్స్‌రే, పారా మెడికల్‌ కోర్సుల్లోనూ రిజర్వేషన్లతో సీట్లు పొంది వైద్య రంగంలో రాణిస్తున్న ముస్లింలు వేలల్లో ఉంటున్నారు. సాంకేతిక విద్యను అందిపుచ్చుకుని ఇంజినీర్లుగా మారిన వారూ భారీగానే ఉన్నారు.

వైఎస్సార్‌ మేలు మరువలేం

షగుఫ్తా తజీన్‌కు బీసీ–ఈ కోటాలో సీటు కేటాయిస్తూ ఎన్టీఆర్‌ వర్సిటీ పంపించిన అలాట్‌మెంట్‌ లెటర్‌ 
నేను డాక్టర్‌ కావాలన్నది అమ్మానాన్నల ఆకాంక్ష. కష్టపడి చదివినా పోటీ అధికంగా ఉండటంతో 2013–ఎంసెట్‌లో 4,046 ర్యాంకు వచ్చింది. ఎంబీబీఎస్‌ సీటు రాదేమోనని బాగా ఆందోళన చెందాను. మాది మధ్య తరగతి కుటుంబం. పేమెంట్‌ సీటు తీసుకునేందుకు డబ్బుల్లేవు. ఈ తరుణంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన రిజర్వేషన్‌ వరమైంది. కడప ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో నాకు ఉచిత సీటు వచ్చింది. ఎంబీ బీఎస్‌ పూర్తిచేసి ఈనెల 26న గ్రాడ్యుయేషన్‌ డేలో గోల్డ్‌ మెడల్‌ అందుకున్నా. వైఎస్సార్‌ మేలు మరవలేను.
– డాక్టర్‌ షేక్‌ షగుఫ్తా తజీన్, కర్నూలు

మా ఇంట్లో ముగ్గురూ డాక్టర్లే
నా పేరు షేక్‌ కుర్షిద్‌. మాది కర్నూలు నగరం కొత్తపేట. మాకు ముగ్గురూ ఆడపిల్లలే. కొడుకులు లేరు. నా భర్త సమీర్‌ కొన్నాళ్లు ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేశారు. అనారోగ్య కారణాలతో ఉద్యోగం మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మా ముగ్గురు పిల్లలు డాక్టర్లు కావాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్‌లో వైఎస్సార్‌ ఇచ్చిన స్కాలర్‌షిప్, ఆ తరువాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో లబ్ధి చేకూరింది. పిల్లలు కష్టపడి చదివి.. ఎంసెట్‌లో ప్రతిభ కనబర్చారు. సీటు వస్తుందో రాదో అనే ఆందోళన ఉన్నా.. రిజర్వేషన్‌ ఉందనే భరోసా ఏర్పడింది. 2010లో పెద్దమ్మాయి షేక్‌ జేబా అక్తర్, 2011లో షేక్‌ సమీర, 2012లో షేక్‌ ఆస్మా కౌసర్‌ ఎంబీబీఎస్‌ సీట్లు సంపాదించారు. పెద్దమ్మాయి పీజీ చేసింది. మిగిలిన ఇద్దరూ కూడా పీజీ చేస్తున్నారు. మహానేత చేసిన సహాయం ఎప్పటికీ మరువలేం. ఆయన ఆశయాలను కొనసాగించే నాయకుడు రాష్ట్రానికి సీఎం కావాలి. అప్పుడే ముస్లింలు బాగుపడతారు. 

 హామీ ఇవ్వకుండానే అమలు
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు వైఎస్‌ ఎలాంటి హామీ ఇవ్వలేదు. కానీ.. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా చూసిన మహానేత వారి శాశ్వత అభివృద్ధికి బాటలు వేశారు. వారిని బీసీలుగా గుర్తించి రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. సుప్రీంకోర్టులో ముస్లింల వెనుకబాటుతనాన్ని వివరించి.. రిజర్వేషన్లు సాధించి అమల్లోకి తెచ్చారు. నాలుగు శాతం రిజర్వేషన్లను 15 ముస్లిం ఉప కులాలకు వర్తింపజేశారు. అందులో ముఖ్యంగా అచ్చుకట్టల వాండ్లు, అత్తర్‌ సాయిబులు, ధోబీ ముస్లిం, ఫకీర్, గారడీ ముస్లిం, గోసంగి ముస్లిం, గుడ్డి ఎలుగువాళ్లు, హజామ్, నాయీ ముస్లిం, లబ్బి, పకీర్ల, ఖురేషీ, షేక్, సిద్ది, తురక కాశ, అగ్రవర్ణం కాని ఇతర ఉప కులాలను బీసీ–ఈ జాబితాలో చేర్చి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు.

వైఎస్‌ స్ఫూర్తితో సేవలందిస్తా..
మా నాన్న మస్తాన్‌ వవీ సిమెంట్‌ వ్యాపారం చేస్తుంటారు. పాఠశాల విద్య చదువుతున్నప్పుడే డాక్టర్‌ కావాలనుకున్నా. కానీ.. సీటు రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంసెట్‌లో 1,479 ర్యాంక్‌ వచ్చింది. బీసీ–ఈ రిజర్వేషన్‌ మూలంగా నేను డాక్టరయ్యాను. రిజర్వేషన్‌ కల్పించిన వైఎస్సార్‌ కూడా రాజకీయాల్లోకి రాకముందు డాక్టరే. ఆయన స్ఫూర్తితో నేనూ వైద్యుడిగా సేవలందిస్తా.
– డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ అక్రమ్, వేంపల్లె, వైఎస్సార్‌ కడప

ఆ ధైర్యంతోనే పీజీకి సిద్ధమయ్యా
జనరల్‌ మెడిసిల్‌ లేదా పీడియాట్రిక్‌ పూర్తిచేసి వైద్య సేవలందించాలనేది నా కోరిక. ఎంసెట్‌లో 1,446 ర్యాంకు రావడంతో బీసీ–ఈ కోటాలో నాకు మెడిసిన్‌ సీటు వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ పూర్తి చేశాను. రిజర్వేషన్‌ ఉందనే ధైర్యంతో పీజీకి సన్నద్ధం అవుతున్నా. కష్టపడి చదువుతా. బీసీ–ఈ రిజర్వేషన్‌ మాలాంటి వాళ్లకు గొప్ప వరం.
– డాక్టర్‌ ఎండి. ఫర్హీన్‌ తబస్సుమ్, ఖడక్‌పురా, కర్నూలు

రిజర్వేషన్‌తో డాక్టర్‌ అయ్యా..
మా నాన్న టీచర్‌. సామాన్యులు ఎంబీబీఎస్‌ చేయాలంటే మామూలు విషయం కాదు. స్కూలుకు వెళ్లే రోజుల్లోనే డాక్టర్‌ కావాలని నిర్ణయించుకున్నా. ఎంసెట్‌లో 1,357 ర్యాంకు వచ్చింది. ప్రభుత్వ కళాశాలలో సీటు రావాలన్న నా కోరికను బీసీ–ఈ రిజర్వేషన్‌ తీర్చింది. రిజర్వేషన్‌ సౌకర్యంతో సీటు పొంది డాక్టర్‌ అయ్యాను.
–  డాక్టర్‌ ఎం.సుమేర, నంద్యాల, కర్నూలు జిల్లా

పీజీ వరకు ఉచిత విద్య 

మాది కర్నూలు జిల్లా రేగడి గూడూరు. నా కొడుకు మొహమ్మద్‌ రఫీకి డాక్టర్‌ అవ్వాలనే కోరిక. పేదరికం వల్ల టెన్త్‌ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాం. ఎలాగోల ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియేట్‌ చేర్పించాం. నా భర్త మహబూబ్‌ బాషా ప్రైవేటు టైపిస్టుగా పని చేసేవారు. రఫీ ఇంటర్‌ చదువుతుండగా ఆయన మరణించారు. దీంతో పిల్లల చదువుపై నాకు బాగా ఆందోళన ఉండేది. మా అమ్మానాన్న వద్ద ఉండి వాళ్లను చదివించుకున్నా. 2008లో ఎంసెట్‌ రాశాడు. 1,800 ర్యాంకు వచ్చింది. సీటు విషయంలో బెంగఉన్నా ‘బీసీ–ఈ’ రిజర్వేషన్‌తో కర్నూలు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు ఉచితంగా వచ్చింది.

అప్పటివరకు తెలియదు.. మా పిల్లల భవిష్యత్‌ కోసం వైఎస్సార్‌ రిజర్వేషన్లు ఇచ్చారని. తరువాత పీజీ చేస్తా అన్నాడు. ఫీజులు ఎంత అవుతాయంటే.. రిజర్వేషన్‌ ఉంది, బాగా ప్రిపేర్‌ అవుతాను అన్నాడు. అల్లా దయ, వైఎస్సార్‌ ఇచ్చిన రిజర్వేషన్‌తో 2017లో పీజీ సీటు ఉచితంగా వచ్చింది. ఇప్పుడు కర్నూలు మెడికల్‌ కళాశాలలో పీజీ జనరల్‌ మెడిసిన్‌ (ఎండీ) చేస్తున్నాడు. ఇదంతా రాజన్న చలువే. ఆయన పెట్టిన రిజర్వేషన్‌ లేకపోతే నా కొడుకు డాక్టర్‌ అయ్యేవాడు కాదు. నా తమ్ముడు ఎస్‌.షేక్షావలికి డాక్టర్‌ అవ్వాలని ఆశ ఉండేది. 2005కు ముందు రిజర్వేషన్‌ లేని కారణంగా ఓసీ అని సీటు రాలేదు. చివరకు డెంటల్‌ చేశాడు. వైఎస్సార్‌కు కృతజ్ఞతలు.

 పీజీలోనూ కోటా
రిజర్వేషన్లను పీజీలోనూ వర్తింపజేయడంతో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, గైనకాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ వంటి విభాగాల్లోనూ ముస్లింలు సీట్లు పొందుతున్నారు. కోర్సులు పూర్తిచేసి స్పెషలైజేషన్, ఉన్నత డాక్టర్లుగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో 24 పీజీ కాలేజీల్లో ఏటా సుమారు 50 మంది పీజీ చేసి అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సర్జన్లు, మెడికల్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. మెడికల్‌ కాలేజీల్లో లెక్చరర్లుగానూ సేవలందిస్తున్నారు. ఇక ఏపీపీఎస్సీ, పోలీస్‌ సెలక్షన్‌ బోర్డు, డీఎస్సీ లతోపాటు గ్రూప్స్, ఎస్‌ఐ, పోలీస్, టీచర్‌ ఉద్యోగాల భర్తీలోనూ బీసీ–ఈ అమలవుతోంది. ఈ కోటాలో ఉద్యోగాలు పొందిన ముస్లింలు వేలాది మంది ఉన్నారు. అంతేకాదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి రిజర్వేషన్‌ వర్తించడంతో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అయిన వాళ్లూ ఉన్నారు. 

కల నెరవేరబోతోంది
ఎంసెట్‌లో నాకు 1,500 ర్యాంకు వచ్చింది. ప్రభుత్వ కళాశాలలో చదివితే పరిజ్ఞానం పెరుగుతుందని ఆశించా. వైఎస్సార్‌ ఇచ్చిన వరం బీసీ–ఈ రిజర్వేషన్‌ వల్ల కౌన్సెలింగ్‌లో సీటు వచ్చింది. ఇప్పుడు ఫైనలియర్‌ చదువుతున్నా. త్వరలో మెడిసిన్‌ పూర్తయితే.. డాక్టర్‌ కావాలనే నా కల నెరవేరుతుంది. మా అన్న కూడా డాక్టరే. ఇద్దరం పీజీ చేసి వైద్యులుగా స్థిరపడతాం. – డాక్టర్‌ కె.మోహ్సిన్, అనంతపురం

కోటి రూపాయల సీటు ఉచితంగా..

బి.అశ్ఫాఖ్‌ అహ్మద్, పీజీ జనరల్‌ సర్జన్‌ (ఎంఎస్‌) ఫైనలియర్, తల్లిదండ్రులు హసీనాభాను, జిలానీ, వెలుగోడు, కర్నూలు జిల్లా
‘బీసీ–ఈ’ రిజర్వేషన్‌ సౌకర్యం లేకపోతే మా కొడుకు బి.అశ్ఫాఖ్‌ అహ్మద్‌ డాక్టర్‌ అయ్యేవాడు కాదు. మాది సామాన్య కుటుంబం. నేను ఆర్టీసీ డ్రైవర్‌గా పదవీ విరమణ పొందాను. నలుగురు పిల్లలతో కుటుంబాన్ని పోషించుకుంటూ రావడమే కష్టం. అలాంటిది మెడిసిన్‌ సీటు కోసం డొనేషన్లు, ఫీజుల కోసం రూ.లక్షలు ఖర్చు చేయడం అసాధ్యం. అప్పట్లో వైఎస్సార్‌ ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చారని తెలిసి చాలా సంతోషపడ్డాను. మా అబ్బాయికి ఎంసెట్‌లో 2,200 ర్యాంకు వచ్చింది. కౌన్సెలింగ్‌లో బీసీ–ఈ కోటా కింద అనంతపురంలో సీటు వచ్చింది. అలాట్‌మెంట్‌ తరువాత కోర్టులో కేసు ఉందని.. సీటు పెండింగ్‌లో పెట్టారు. వీటిపై వైఎస్సార్‌ పోరాడి కోర్టులోనూ విజయం సాధించారు. దీంతో రెండో కౌన్సెలింగ్‌లో కర్నూలు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సీటు వచ్చింది. రూ. కోటి వరకు ధర పలికే సీటు ఉచితంగా రావడంతో మా ఇంట్లో ఆనందాలకు హద్దు లేదు.  2017లో పీజీ సెట్‌లో 195 ర్యాంకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా బీసీ–ఈ కింద పీజీ సీటు ఉచితంగా వచ్చింది. కర్నూలు మెడికల్‌ కాలేజీలో పీజీ జనరల్‌ సర్జన్‌ (ఎంఎస్‌) ఫైనలియర్‌ చేస్తున్నాడు. చిన్న కొడుకుక్కి బీసీ–ఈ కిందనే అగ్రికల్చర్‌ బీఎస్సీ సీటు వచ్చింది. కానీ 2005కు ముందు రిజర్వేషన్‌ లేక మా పెద్దబ్బాయి ఇంటర్‌తో చదువు ఆపేశాడు. రిజర్వేషన్లు కల్పించిన రాజన్న రుణం తీర్చుకోలేం.

 రిజర్వేషన్ల ప్రదాత
ముస్లింల వెనుకబాటుతనాన్ని చూసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారికి రిజర్వేషన్లు వర్తింపచేశారు. బీసీ–ఈ జాబితాలో చేర్చి విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ 2004–05 ఆర్థిక సంవత్సరంలో ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది వ్యతిరేకించినా వెనకడుగు వేయకుండా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి.. 2007 జూలై 7న జీవో నంబర్‌ 23, బీసీడబ్ల్యూ(సీ2) జారీ చేశారు. ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొందరు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఫలితంగా ఆర్డినెన్స్‌ను నిలుపుదల చేస్తూ ఆప్పట్లో ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిజర్వేషన్లు తాత్కాలికంగా రద్దయ్యాయి. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడంతో రిజర్వేషన్ల అమలుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, రాజ్యాంగ సూచిక ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని ఆదేశించింది. దీంతో ముస్లింలకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను 4 శాతానికి కుదించి వైఎస్‌ అమల్లోకి తెచ్చారు.

74 వేల మందికి ఇంజినీరింగ్‌ విద్య 
వైఎస్సార్‌ ఇచ్చిన రిజర్వేషన్‌ల వల్ల ఉమ్మడి రాష్ట్రంలో 58,081 మంది ఇంజినీరింగ్‌ విద్య పూర్తిచేయగా.. విభజన తర్వాత 16,358 మంది పూర్తిచేసి జీవితంలో స్థిరపడ్డారు. ఇప్పటి వరకు మొత్తం 74,439 మంది ముస్లిం మైనార్టీలు ఈ రిజర్వేషన్ల వల్ల లబ్ధిపొందారు. 2008–09 విద్యా సంవత్సరంలో 7,096 మంది, 2009–10లో 7,702 మంది, 2010–11లో 7,809 మంది, 2011–12లో 8,248 మంది, 2012–13లో 9,109 మంది, 2013–14లో 9,023మంది, 2014–15లో 9,094 మంది, 2015–16లో 4,438 మంది, 2016–17లో 4,572 మంది, 2017–18లో 3,764 మంది, 2018–19లో 3,584 మంది ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యను పూర్తిచేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement