మాకు ఎవరిపైనా కక్ష లేదు: వైఎస్‌ జగన్ | Daddy(YS Rajashekara Reddy) Worked Hard For The People : YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రిని చేస్తామన్నారు... సీఎంనూ చేస్తామన్నారు

Published Sat, Apr 6 2019 7:40 AM | Last Updated on Sat, Apr 6 2019 4:05 PM

Daddy(YS Rajashekara Reddy) Worked Hard For The People : YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి : ‘నాన్న ప్రజల కోసం నిరంతరం తపించారు. ఆయనలా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి. అదే నా ఆశ, ఆకాంక్ష. అందుకే ఇన్ని అవరోధాలు, కుట్రలను ఎదిరిస్తూ రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నా. ఇచ్చిన మాటకు కట్టుబడాలని నిర్ణయించుకున్నందుకు ఎన్నో వేధింపులకు గురయ్యాం.   ఇప్పుడు అంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి. మా రాష్ట్రం సమస్యల్లో ఉంది. ప్రజలకు మేలు చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే నాకు అన్నింటికంటే ముఖ్యం.

ఈ ఎన్నికలు చంద్రబాబు చేసిన మోసానికీ, భవిత పట్ల ప్రజల ఆశలకు మధ్య పోరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికే కేంద్రంలో మద్దతిస్తాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విస్పష్ట్టంగా పేర్కొన్నారు. ప్రముఖ ఇంగ్లిష్‌ న్యూస్‌ ఛానల్‌ ‘టైమ్స్‌ నౌ’ మేనేజింగ్‌ ఎడిటర్‌ నావికా కుమార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్‌ జగన్‌ ప్రస్తుత ఎన్నికలు, తన రాజకీయ లక్ష్యాలను ఇలా వివరించారు.

నేను సీఎం కావాలని కోరుకుంటోంది నా బాధలు తీరాలని కాదు. నాకు మా నాన్న లెగసీ ఉంది. ప్రజలు మా నాన్నను గొప్ప ముఖ్యమంత్రిగా చూశారు. నేనూ నాన్నను చూశాను. నాన్న స్ఫూర్తితో నేను ఆయనకంటే మెరుగైన పాలన అందించాలనుకుంటున్నాను. నాన్నలా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి. నేను మరణించిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో జీవించాలి. రాజకీయాల్లోకి వచ్చినందుకు, రాజకీయాల్లో ఉంటున్నందుకు అదే నా లక్ష్యం.

ఆ అవకాశం ఇవ్వలేదు

మా నాన్న చనిపోయిన ప్రదేశంలో నేను మాట ఇచ్చాను. కానీ ఆ మాటను నిలుపుకొనే అవకాశాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాకు ఇవ్వలేదు. కారణం కూడా నాకు తెలీదు. ఆ తరువాత సైతం నేను ఆరేడు నెలలు 
కాంగ్రెస్‌లోనే కొనసాగాను. సోనియాగాంధీని మూడుసార్లు కలిశాను. అహ్మద్‌ పటేల్‌ను ఆరేడుసార్లు కలిశాను. అందర్నీ కలుస్తూ నేను ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వచ్చాను. కానీ వారు అనుమతి ఇవ్వలేదు. ఎన్నిసార్లు వెళ్లి అనుమతి కోరినప్పటికీ వాయిదా వెయ్యి... వాయిదా వెయ్యి అంటూ చెబుతూ వచ్చారు.

హోదాపై మోదీ మోసం చేశారు
మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఈ ఐదేళ్లలో నరేంద్ర మోదీ ఆ పని చేయలేదు. ప్రత్యేక హోదా హామీని అనాడు పార్లమెంటులో బీజేపీ సమర్ధించింది. తమ మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని 2014 తిరుపతి ఎన్నికల సభలో మోదీ స్వయంగా హామీ ఇచ్చారు. కానీ ఈ ఐదేళ్లలో మోదీ మాత్రం మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు. ఆ విధంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మా రాష్ట్రానికి అన్యాయం చేశాయి. అందుకే ఏపీ ప్రజలు ఆ రెండుపార్టీలను ఏమాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. 

ఏపీలో జాతీయ పార్టీల ప్రభావం లేదు
ఏపీకి సంబంధించినంత వరకు మోదీ ప్రభావం పెద్దగా ఉండదు. కాంగ్రెస్‌ ప్రభావం అస్సలు ఉండదు. ఎందుకంటే మా ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్‌  రాష్ట్రాన్ని విభజించింది. ప్రత్యేక 
హోదా హామీని ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరచకుండా మరో అన్యాయం కూడా చేసింది. కనీసం ఆ హామీని విభజన చట్టంలో చేర్చినా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు మాకు అవకాశం ఉండేది. ఆ విధంగా కాంగ్రెస్‌ మా రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది.

2014కు భిన్నమైన పరిస్థితి..

ప్రజల్లో ఉండటం నాకు కొత్త కాదు. 2009 నుంచి ప్రజల్లోనే ఉంటున్నా.  14నెలలపాటు 3,648కి.మీ. పాదయాత్ర చేశాను. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. 2014 ఎన్నికలకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మాకు మధ్య ఓట్ల శాతంలో వ్యత్యాసం చాలా తక్కువ. మాకు 44.50 శాతం ఓట్లు వస్తే టీడీపీకి 45.50 శాతం ఓట్లు వచ్చాయి. అప్పుడు టీడీపీ వైపు అందరూ ఉన్నారు.

అప్పట్లో నరేంద్రమోదీ సానుకూల ప్రభావం ఉంది. పవన్‌ కల్యాణ్‌ వారితో ఉన్నారు. ముఖ్యంగా అప్పుడు చంద్రబాబు మీద ప్రభుత్వ వ్యతిరేకత అన్నది లేదు. ఎందుకంటే అప్పటికి ఆయన కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. దానికితోడు చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించారు. ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పారో గుర్తించారు.

ఆయన్ని ఈసారి నమ్మే పరిస్థితిలో లేరు. చంద్రబాబు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. మోదీ ప్రభావం కూడా ఇప్పుడు లేదు. కాబట్టి 2014 ఎన్నికలకు ఫలితాలకు ఈసారి పూర్తి భిన్నమైన ఫలితాలు వస్తాయి. 2014లో మా రెండు పార్టీల మధ్య 1 శాతం ఓట్లు మాత్రమే తేడా ఉంది. అప్పుడు అంతా చంద్రబాబుకు అనుకూలంగా జరిగితేనే టీడీపీకి ఆ మాత్రం ఓట్ల శాతం వచ్చింది. ఈసారి అంతా ఆయనకు వ్యతిరేకంగా ఉంది. కాబట్టి టీడీపీకి వచ్చే ఓట్ల శాతం కంటే మాకు వచ్చే ఓట్ల శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ మోసానికి, ప్రజల ఆకాంక్షలకు మధ్య పోరు జరుగుతోంది. 

నాన్న స్ఫూర్తితోఇచ్చిన మాటకు కట్టుబడ్డాను

నేను తొలిసారి 2009లో రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచాను. మరో 100 రోజులకే మా నాన్న మాకు దూరమయ్యారు. ఆ తరువాత పదిహేను ఇరవై రోజులకు మా నాన్న హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన కొండ ప్రాంతానికి నేను వెళ్లాను. నాన్న హఠాన్మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800మంది అభిమానులు మరణించారని ఆ సమయంలో నాకు చెప్పారు. ఆ విషయం నా మనసులో మెదులుతూనే ఉంది. కొండ దిగిన తరువాత అక్కడ నాన్న సంతాప సభ నిర్వహించాం.

నాన్న మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అందరు అభిమానుల ఇళ్లకు వస్తానని, ఆ కుటుంబాలను పరామర్శిస్తానని ఆ సభలో నేను ప్రకటించాను. అది ఓ భావోద్వేగమైన అంశం. అలాంటి ప్రకటన చేయడానికి ఎవరి అనుమతో తీసుకోవాలని నాకు తెలీదు. చనిపోయిన నాన్న అభిమానులు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. నేను విమానంలో వెళ్లలేను. కారులోనే అందరి ఇళ్లకు వెళ్లాలి.

అలా నేను వెళ్తున్నప్పుడు అన్ని గ్రామాల్లోనూ ప్రజలు నన్ను ఆపేవారు. అక్కడ నాన్న విగ్రహం ఉండేది. నేను ఆ విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించి మరీ వెళ్లేవాడిని. ఇలా ప్రతి ఊరిలోనూ జరిగేది. గాంధీజీ పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో ఎంతో అభిమానం ఉంటుంది. ఏపీకి సంబంధించినంత వరకు మా నాన్న కూడా ప్రజలకు అంతగా అభిమానపాత్రుడు. నాన్న అంతటి మహోన్నత వ్యక్తి. ఇది కాంగ్రెస్‌ అధిష్టానానికి నచ్చలేదు.

అబద్ధపు హామీలతో ఏమార్చిన చంద్రబాబు
2014లో చంద్రబాబు 600కుపైగా అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చారు. 2014 నాటికి రాష్ట్రంలో రూ.87, 612 కోట్లు వ్యవసాయ రుణాలు ఉన్నాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ æ(ఎస్‌ఎల్‌బీసీ) నివేదికలు ఇచ్చాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ బడ్జెట్‌తో అంతటి రుణాన్ని ఎలా మాఫీ  చేయగలదు!? అది తెలిసీ చంద్రబాబు ఆ హామీ ఇచ్చారు. ఆ మొత్తం రుణాలు మాఫీ చేస్తానని ఆయన తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు.

రూ.14,200 కోట్ల డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని మరో హామీ ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. ఇంటికో జాబ్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మరో అబద్ధమాడారు. 60 నెలల ఆయన పాలనలో నెలకు రూ.2 వేలు చొప్పున ఇంటికి రూ.1.20 లక్షలు అప్పు పడ్డారు.  ఆయన ఇలాంటివి  600 పైగా హామీలతో మ్యానిఫెస్టో రూపొందించారు.

ఆ హామీలన్నీ ఉల్లంఘించారు. వాటిలో కనీసం 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మీరు టీడీపీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తే 2014 ఎన్నికల మ్యానిఫెస్టో కనిపించదు. ఆ మ్యానిఫెస్టోను తొలగించేశారు. ప్రజలు ఇప్పుడా మ్యానిఫెస్టోను చూస్తే చంద్రబాబును నిజంగా కొడతారేమో కూడా. 

ఇక్కడ జాతీయ పార్టీల ప్రభావం ఉండదు

దేశం మొత్తం మీద మోదీ ప్రభావం ఇంకా కొంత ఉండొచ్చు. దేశానికి సంబంధించినంత వరకు మోదీ నిబద్ధతను చూపారని చెప్పగలను. పుల్వామా ఘటన తరువాత మోదీ చూపిన నాయకత్వ పటిమతో దేశవ్యాప్తంగా ఆయన రేటింగ్‌ 2014 ఎన్నికలకు సమానంగా గానీ, కొంత అటుఇటుగా ఉండొచ్చు. కానీ ఏపీకి వచ్చేసరికి మోదీ, కాంగ్రెస్‌ ఇద్దరూ మోసం చేశారని కచ్చితంగా చెబుతాను.

ఆ విషయాన్నినేను మళ్లీ మళ్లీ మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు ఇచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి మద్దతు ఇస్తారని ఆయన వాగ్దానం చేశారు.

మా రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు, తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు మొత్తం 42 మంది ఎంపీల మద్దతుతో ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తే కేంద్రంలో ఎవరు ఉన్నా సరే ఇవ్వాల్సిందే. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ప్రత్యేక హోదాపై మా డిమాండ్‌కు తలొగ్గాల్సిందే.

ప్రత్యేక హోదాయే మా జాతీయ విధానం
ప్రత్యేక హోదా ఎవరిస్తే వారితోనే ఉంటాము. జాతీయ పార్టీలు చెప్పిన మాటలు వినివిని మా ప్రజలు అలసిపోయారు, మోసపోయారు. వారి మాటలు ఏమాత్రం వినే పరిస్థితిలో లేరు. నేను జాతీయ పార్టీలకు చెబుతోంది ఒక్కటే.. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ సంతకం చేయండి... మా మద్దతు తీసుకోండి అంటున్నా. మా రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్రత్యేక హోదా అంశమే అన్ని విధానాల కంటే మాకు ముఖ్యం.

ఈ రోజు మా పిల్లలు చదువు పూర్తిచేసి ఉద్యోగాలకు ఎక్కడికి వెళ్లాలో తెలీడం లేదు. హైదరాబాద్‌ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి 60 ఏళ్లు పట్టింది. బెంగళూరు, చెన్నై కూడా అదే విధంగా 60 ఏళ్లలో ఇంతగా అభివృద్ధి చెందాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించడగానికి మేం ఏం చేయగలం? హోటల్స్‌ గాని, ఆసుపత్రులు గాని, ఐటీ గాని మరే పరిశ్రమలు గాని మేం ఎలా నెలకొల్పగలం? పరిశ్రమలు పెట్టేవారికి ప్రత్యేక రాయితీలు ఇస్తేనే ఆకర్షించగలం.

100 శాతం ఆదాయ పన్ను, 100 శాతం జీఎస్టీ మినహాయింపు వంటి రాయితీలు  ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలే ఇవ్వగలవు. అలా చేస్తేనే పారిశ్రామికవేత్తలను ఆకర్షించి మా రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పగలం. అప్పుడే మా యువతకు ఉద్యోగాలు వస్తాయి. బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరుతున్నాయి కదా అని కేంద్రం చెప్పడం ఏమాత్రం  సరికాదు. మా రాష్ట్రాన్ని విభజించే సమయంలో మీరు చెబుతున్న బిహార్, ఒడిశా మొదలైన రాష్ట్రాలు ఉన్నాయి.

కానీ మాకు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ముందస్తు హామీ ఇచ్చి మరీ మా రాష్ట్రాన్ని విభజించారు. ఎందుకంటే రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కోరుతూ విడిపోయింది. ఆ అన్యాయానికి పరిహారంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఒక్కటై పార్లమెంటులో హామీ ఇచ్చాయి. ఆ రెండు పార్టీల్లోనూ మీరు చెబుతున్న బిహార్, ఒడిశా ఇతర రాష్ట్రాల ఎంపీలు ఉన్నారు.

నాడు పార్లమెంటులో ఉన్న ఇతర పార్టీలు కూడా విభజనకు మద్దతు తెలుపుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని సమర్ధించాయి కూడా. అలా పార్లమెంటులో ఉన్న అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనే ముందస్తు హామీతోనే రాష్ట్రాన్ని విభజించాయి. కానీ విభజన అనంతరం మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు. పార్లమెంటు ఇచ్చిన హామీ అమలు కాకపోతే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది !?

కేంద్రమంత్రిని చేస్తామన్నారు... సీఎంనూ చేస్తామన్నారు
నాన్న మరణం తరువాత అమ్మ, చెల్లితో సహా సోనియా గాంధీని కలిశాము. అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలని కోరాం. కానీ ఆమె సమ్మతించలేదు. నన్ను కేంద్ర మంతిని చేస్తాను. తరువాత సీఎంను చేస్తాను అని చెబుతూ... ఇప్పుడు మాత్రం చనిపోయిన అభిమానుల ఇళ్లకు వెళ్లొద్దని చెప్పారు. చనిపోయిన అభిమానుల కుటుంబ సభ్యులు అందర్నీ ఒకచోటకు పిలిచి ఏం సాయం చేయాలో చేయండి అని చెప్పారు.

అప్పుడు నేను వారికి చెప్పాను... అభిమానుల కుటుంబాలు తమకు సాయం చేయమని నన్నేమీ అడగలేదు. నా మనసుకు అనిపించి నేను వారి ఇళ్లకు వస్తానని మాట ఇచ్చాను. అలా ఇచ్చిన మాట ఇంతటి పరిణామానికి దారితీస్తుందని నాకు తెలీదు. దాంతో ఇంటికి వచ్చి అమ్మ, చెల్లి, నా భార్యతో చర్చించాను. అధిష్టానం మాట వింటే కేంద్ర మంత్రిని కావచ్చు. తరువాత సీఎం కూడా కావచ్చు. కానీ నాన్న చనిపోయిన ప్రదేశంలో ఇచ్చిన మాటను తప్పినవాడిని అవుతాను.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని మా నాన్నకు పేరుంది. అంతటి గొప్ప వ్యక్తి కొడుకుగా ఆయన చనిపోయిన ప్రదేశంలో ఇచ్చిన మాటకు నేను కట్టుబడలేకపోతే ఇక ఎందుకు అనుకున్నాను. అందుకే నేను నా మాటకు కట్టుబడ్డాను. చనిపోయిన నాన్న అభిమానుల ఇళ్లకు వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. అమ్మ, చెల్లి, నా భార్య అంతా నాకు మద్దతుగా నిలిచారు. సీఎం పదవికో, కేంద్రమంతి పదవికో, రాజకీయాలకో సంబంధించిన విషయం కాదు.

ఇది కేవలం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సంబంధించిన అంశమే. అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశాం. వెంటనే స్పీకర్‌ ఫోన్‌ ద్వారా నిర్ధారించుకుని రాజీనామా ఆమోదించారు.  కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారితో మేం విభేదించాం. మాతో ఎవ్వరూ లేరు. అయినా సరే మేం పార్టీకి రాజీనామా చేశాం. దాంతో ఉప ఎన్నికలు వచ్చాయి. మాకు పార్టీ లేదు. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లే.

14 రోజుల ప్రచారంలో మా ఎన్నికల గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లడానికే సరిపోయింది. మరోవైపు మొత్తం రాష్ట్ర మంత్రివర్గమంతా అక్కడే మకాం వేసింది. మా కుటుంబాన్ని చీల్చారు. ఏం చేయకూడదో కాంగ్రెస్‌ పార్టీ అన్నీ చేసింది. అయినప్పటికీ భగవంతుడు, ప్రజలు మాతో ఉన్నారు. నేను 5.45 లక్షల ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచాను. 14వ లోక్‌సభలో అదే అత్యధిక మెజార్టీ. 

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు
మాకు ఇంతటి ప్రజాదారణ రావడం చూసి కాంగ్రెస్, టీడీపీ సహించలేకపోయాయి. దాంతో కుట్రలు మొదలయ్యాయి. టీడీపీ, కాంగ్రెస్‌ ఒక్కటయ్యాయి. నాకు వ్యతిరేకంగా పిటీషన్లు వేశాయి. నా కేసులో పిటీషన్లు ఎవరో తెలుసా... టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులే పిటీషనర్లు. అప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు కలిసి నాకు వ్యతిరేకంగా పిటీషన్‌ వేశారు. అదీ మా నాన్న చనిపోయిన తరువాత, నేను కాంగ్రెస్‌ను వీడిని తరువాత కేసలు వేశారు.

నేను రాజకీయ శక్తిగా గుర్తింపు పొందడంతో సహించలేక కక్షపూరితంగా కుట్రలు చేసి కేసులు వేశారు. టీడీపీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతిచ్చింది కూడా. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు పెంచినందుకు నిరసగాన మేము అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం  ప్రవేశపెట్టాం. అప్పుడు టీడీపీ తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి మరీ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కాపాడింది కూడా. అంతగా ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి.

ఈ రోజు కాంగ్రెస్, టీడీపీ కేంద్రం అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీళ్లు ఇప్పుడు ప్రజాస్వామం గురించి మాట్లాడతారు. కానీ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అహంకారంతో, నిరంకుశత్వంతో వ్యవహరిస్తారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అందరికీ తెలిసిందే. 

రాహుల్‌ గాంధీ చెప్పిన పథకం సక్రమంగా రూపొందించలేదు

రాహుల్‌గాంధీ చెప్పిన కనీస ఆదాయ పథకంగానీ రైతు రుణమాఫీ పథకం గానీ మంచి పథకాలే. అందులో సందేహం లేదు. కానీ వాటిని అమలు చేసే నిబద్ధత ఉండాలి. ఈ కనీస ఆదాయ పథకం పథకం గురించి చెబుతాను... ఆ పథకం కింద నెలకు రూ.12 వేలు కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు సహాయం చేస్తామంటున్నారు. అలాంటి కుటుంబాలకు నెలకు గరిష్టంగా రూ.6 వేలు ఇస్తామంటున్నారు. కానీ ఆ పథకాన్ని అమలు చేసేందుకు రూపొందించిన విధానం సరిగా లేదు.

ఈ పథకం దేశంలో 20 శాతం జనాభాకు వర్తిస్తుందని అంటే దేశంలో 5 కోట్ల కుటుంబాలకు చెందిన 25 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని రాహుల్‌ చెప్పారు. అలా ఆ పథకం కింద చెబుతున్న గణాంకాలే తప్పుగా ఉన్నాయి. మా రాష్ట్రానే ఉదాహరణగా తీసుకుంటే.. ఏపీలో 80 శాతం కుటుంబాలు నెలకు రూ.12వేలు కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నాయి.  మా రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వాటిలో దారిద్య్ర రేఖ(బీపీఎల్‌)కు దిగువన ఉన్న 1.40 కోట్ల కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డులున్నాయి.

ఒక్కో కుటుంబానికి సగటున ముగ్గురు సభ్యులు ఉన్నారనుకున్నా 4.20 కోట్ల మంది పేదలు ఉన్నట్లు. అంటే 80 శాతం మంది పేదలే. కానీ రాహుల్‌గాంధీ తమ పథకం 20 శాతం మందికే వర్తిస్తుందని చెబుతున్నారు. మరి ఆ పథకం పేదలు అందరికి ఎలా మేలు చేస్తుంది? ఏదో చేయాలి అన్నట్టుగా కాకుండా పేదలు అందిరికీ లబ్ధి చేకూరేలా సాచ్యురేషన్‌ విధానంలో చేయాలి.

వైస్సార్‌సీపీ స్వీప్‌ చేస్తుంది
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేస్తుందని జాతీయ చానళ్ల సర్వేలే చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉంది. సర్వేలు చెబుతున్న ప్రకారమే  మేము అత్యధిక స్థానాలు గెలుచుకుంటాం. మా డిమాండ్‌ ప్రత్యేక హోదా. ఎవరు ప్రత్యేక హోదాకు సంతకం చేస్తే వారికి మద్దతిస్తాం.

అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారు
ఇచ్చిన మాటకు కట్టుబడినందుకే అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఏదైనా తప్పు చేసి జైలుకు వెళ్తే ఎవరూ పెద్దగా బాధపడరు. కానీ మా నాన్న సీఎంగా ఉన్నప్పుడు నేను ఎంపీనీ కాను, ఎమ్మెల్యేనూ కాను. నేను ఎప్పుడూ సెక్రటేరియట్‌కు కూడా వెళ్లలేదు. ఏ మంత్రితో మాట్లాడనూ లేదు. నాకు ఏ మంత్రీ తెలీదు కూడా. ఏ ఐఏఎస్‌ అధికారితోనూ మాట్లాడలేదు. నాకు ఏ ఐఏఎస్‌ అధికారి తెలీదు కూడా. నేను హైదరాబాద్‌లో కూడా లేను. నా పిల్లలతో సహా బెంగళూరులో ఉంటూ నా వ్యాపారాలు చూసుకునేవాడిని. మా నాన్న సీఎం కావడానికి ముందే కర్ణాటకలో నాకు 40 మెగావాట్ల హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఉంది. అప్పుడు నేను రాజకీయ నాయకుడిని కూడా కాదు. కేవలం ఒకరితో రాజకీయంగా విభేదించినందునే నాపై అక్రమ కేసులు పెట్టారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక్కటై పిటీషనర్లుగా కేసులు వేశారు. నన్ను లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా వేధించారు. 

కుటుంబం తీవ్ర సంఘర్షణకు గురైంది
నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు. దోషిగా రుజువు కానంతవరకు గరిష్టంగా 3 నెలల్లో బెయిల్‌ ఇవ్వాలని చట్టం చెబుతోంది. అది ప్రజాస్వామిక హక్కు. కానీ నాకు బెయిల్‌ నిరాకరించారు. 16 నెలలు అక్రమంగా జైల్లో నిర్బంధించారు. మా కుటుంబం ఎంతో వేదనకు గురైంది. మా పిల్లలు మా నాన్నను గొప్ప ప్రజానాయకుడిగా, గొప్ప సీఎంగా చూశారు. నన్ను సీఎం కుమారుడిగా చూశారు. కానీ వాళ్లే నేను అన్యాయంగా జైలుకు వెళ్లడం కూడా చూడాల్సివచ్చింది.  

వారు స్కూల్‌కు వెళ్లేవారు. ఎంతో ఇబ్బందిపడేవారు. ఈ పరిణామాలన్నీ మా కుటుంబాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేశాయి. ఆ సమయంలో నేను ఎంతో బాధపడ్డాను. కానీ నేను భగవంతుడిని నమ్మాను. మానసిక శాంతి ఇమ్మని దేవుడిని కోరేవాడిని. నేను మనసులో ఏమీ ఉంచుకోను. అంతా దేవుడికే విడిచిపెడతాను. 

మాకు ఎవరిపైనా కక్ష లేదు
నేను మా కుటుంబం ఎన్నో వేధింపులకు గురయ్యాం. అవి బాధించాయి. కానీ ఇప్పుడవి మా మనసులో లేవు. కానీ అంతకన్నా బాధపడాల్సిన పెద్ద విషయాలు ఉన్నాయి. మా ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు.  రాష్ట్రం సమస్యల్లో ఉంది. ప్రజల్ని ఆదుకోవడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే అన్నింటికంటే ముఖ్యం. మాకు ఎవరి మీదా పగగానీ కక్షగానీ లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement